విపక్ష నేత చంద్రబాబు గారి నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ అధికారులు వారిని తిరుపతి విమానాశ్రయంలో అడ్డుకోవడానికి రాయలసీమ విద్యావంతుల వేదిక అభ్యంతరం తెలిపింది. ‘ఎన్నికల సమయంలో నిరసనలకు అనుమతి సాధారణంగా ఇవ్వరు. ముఖ్యంగా చిత్తూరు గాంధీ విగ్రహం ప్రాంతంలో ఏ కార్యక్రమం కూడా సాధ్యం కాదు. తిరుపతిలో ఇబ్బంది లేని చోట ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి షరతులతో కూడిన అనుమతి ఇచ్చి ఉండాల్సిన అవసరం ఉండింది. సాదారణ నిబంధనలు చూపి అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అనక తప్పదు,’ అని వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయ తప్పిదం కూడా
‘చంద్రబాబు తిరుపతి పర్యటన ముఖ్య ఉద్దేశ్యం నిరసన వ్యక్తం చేయడం. అధికారులు అనుమతి ఇచ్చి ఉంటే వారి నిరసన ప్రదర్శన చంద్రబాబు మాట్లాడినంత వరకే పరిమితం అయ్యేది. దానికి సమాధానం కూడా ప్రభుత్వం చెప్పి ఉండవచ్చు. అడ్డుకోవడం వల్ల ఉదయం నుంచి బాబు గారి చుట్టే మొత్తం వ్యవహారం నడుస్తుంది. 30 నిమిషాల చంద్రబాబు గారి నిరసన అధికారులు అనుమతి నిరాకరించి అడ్డుకోవడం ద్వారా రోజంతా నిరసన చుట్టే చర్చ నడవడానికి ఆస్కారం కల్పించినట్లు అయినది,’ అని ఆయన ప్రభుత్వానిది రాజకీయ తప్పిదమని కూడ వ్యాఖ్యానించారు.