తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో సబ్బెల్ల శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తిది ఆత్మహత్య అని, అతని కిడ్నాప్ ఒక ఫేక్ న్యూస్ అని జగ్గంపేట వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే జ్వోతుల చంటిబాబు వ్యాఖ్యానించారు.
శ్రీనివాస రెడ్డి ఆ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్నసబ్బెల్ల పుష్పవతి భర్త. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం నాడు ఆయనను ఎవరో కిడ్నాప్ చేశారు. చేతులను కట్టేసి ఆయనను గోవిందాపురం సమీపంలోని అడవిలో వదిలేశారు. ఈ విషయం గమనించిన పశువుల కాపరి ఒకరు పోలీసులకు ఈ సమాచారం అందించారు. ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. తర్వాత పుష్పవతి నామినేషన్ వేశారు. తనని ఆదివారం తెల్లవారుజామున ఎవరో కిడ్నాప్ చేశారని శ్రీనివాస రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, సోమవారం రాత్రి ఆయన తన తోటలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి ఉండటం చూశారు. దీనిని విచారించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అడ్నాన్ నయీమ్ ఆస్మి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటుచేశారు.
శ్రీనివాస రెడ్డి చనిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదట ఈ గ్రామం సందర్శించారు.తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ గ్రామం సందర్శించారు.
దీనిని వైసిసి నేతలు తప్పుపడుతున్నారు. ఈ రోజు నారా లోకేష్ పర్యటన మీద జ్యోతుల చంటి బాబు స్పందిస్తూ విలేకరులతో మాట్లాడారు.
శ్రీనివాస రెడ్డి కిడ్నాప్ నాటకం అడారు. అది ఫెయిలైంది. అందువలన అవమానం పాలై ఆత్మహత్య చేసుకొంటే దానిని రాజకీయం చేయడం విచారకరమని చంటి బాబు అన్నారు.
చంటిబాబు ప్రెస్ మీట్ పాయింట్స్..
1. గొల్లలగుంట వచ్చి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. భూ వివాదానికి సంబంధించి జరిగిన ఘటనను, పంచాయితీ ఎన్నికలకు ముడిపెడుతూ.. దానిని టీడీపీ ఒక రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. ఈ ఘటన పై విచారణ జరపాలి అని మేం కూడా కోరుతున్నాం.
2. తెలుగుదేశం హయాంలో పనిచేసిన పోలీస్ ఉద్యోగులే ఇప్పుడు కూడా పని చేస్తున్నారు. ఏ ఘటన జరిగినా, ఎక్కడ ఏ కారణంతో ఎవరు చనిపోయినా దానిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం రాజకీయం చేయటం టీడీపీకే చెల్లింది. సమాజంలో అన్ని వ్యవస్థలను తెలుగుదేశం భ్రష్టుపట్టించింది.
3. చంద్రబాబుతో తాను కూడా గతంలో పనిచేశాను కాబట్టి ఆయన కుట్రల గురించి నాకు బాగా తెలుసు. రాజకీయ అవసరానికి తనను వాడుకుని, ఆ తర్వాత ఇబ్బంది పెడితే జగన్ మోహన్ రెడ్డిగారు నన్ను ఆదరించి, రాజకీయంగా అవకాశాలు కల్పించారు.
4. లోకేష్ నిన్న గొల్లలగుంట వచ్చి.. తన పార్టీ కార్యకర్త గ్రామంలో గొడవల కారణంగా మరణిస్తే.. దానికి సానుభూతి వ్యక్తం చేయాలి గాని, అది చేయకుండా అనవసర రాజకీయ ప్రేలాపనలు చేయడం తగదు.
5. వై.యస్.ఆర్.కాంగ్రెస్ మద్దతు దారుల గెలుపును అడ్డుకోవడానికే టీడీపీ శవ రాజకీయం చేసి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తుంది. టీడీపీ జిమ్మిక్కులు, డ్రామాలన్నీ ప్రజలకు తెలుసు.
6. ఈ రోజు పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరచడానికి అభ్యర్థులే కరువవ్వడంత ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.
7. నారా లోకేష్ బుద్ధీ, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడ రాజకీయం చేయాలో తెలియక శవరాజకీయం చేస్తున్నారు.
8. లోకేష్ రాజ్యాంగం గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గతంలో వైయస్ఆర్సీపీ నుండి 23మంది ఎమ్మెల్యే లను తీసుకుపోయి, వారిలో నలుగురిని మంత్రులను చేయడం మరి టి.డి.పి. రాజ్యాంగమా..?