కాంగ్రెస్ పార్టీలో ఒక విచిత్రమయిన కల్చర్ ఉంది. అది కాంగ్రెస్ లో తప్ప మరొక జాతీయ రాజకీయ పార్టీ లో కనిపించదు. అదొక పెద్ద డ్రామా కల్చర్. ఈ కల్చర్ ఏమిటంటే, రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ లో ఉన్న వాళ్లే టాక్ పుట్టిస్తారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల పిసిసిలకు పంపిస్తారు. ఇక దాంతో డ్రామా మొదలవుతుంది.
పిసిసిలన్నీ రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడు కావాలని తీర్మానాలు చేస్తాయి. గాంధీభవన్ నుంచి మండల్ కమిటీ దాకా నాయకులంతా రోజూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడు కావాలంటారు.
ప్రెస్ లో అర్టికల్స్ వస్తాయి. కొంతమంది నేతలు మీటింగ్ లు పెట్టి, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కావడం తప్ప మరొక మార్గం లేదు, దేశం ఆయన్ను పిలుస్తున్నదని పొగుడ్తారు. ఈ మధ్యలో రాహుల్ బర్త్ డే వస్తే విపరీతంగా రక్తదానాలు, రోగులకు పళ్లఫలాల దానాలు చేస్తారు.
ఒకొక్కరే ఢిల్లీకి పరుగు తీస్తారు. స్వయనా రాహుల్ గాంధీని కలుసుకుని మద్దతు తెలిపేందుకు ప్రయత్నిస్తారు. లేదా మరొక సీనియర్ నేతని కలుసుకుని దేశానికి, పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఎంత అవసరమో వినతి పత్రం ఇస్తారు.
న్యూఢిల్లీ 24, అక్బర్ రోడ్ బయట ఉన్న టివిల వాళ్లకి ఈ విషయం చెబుతారు. వర్కింగ్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి మద్దతు పెరిగింది అని చెబుతూ వస్తారు.
ఇదంతా పెద్ద డ్రామా కాకపోతే ఏంటి? పార్టీ యే వాళ్ల సొంతం? రాహుల్ అధ్యక్షుడిని చేస్తే కాదనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అయినా సరే ప్రతిసారి ఇదే నాటకం ఆడతారు?
నిన్న టిఆర్ ఎస్ లో ఇదే జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కెసిఆర్ సొంత పార్టీ. ఆయన అనుకుంటే ఉంటుంది, మూసేస్తే పోతుంది. ఆయన ఎవరనుకుంటే వాళ్లు మంత్రులవుతారు, చెయిర్మన్లు అవుతారు, రాజ్యసభ సభ్యులవుతారు. అడ్వయిజర్లు అవుతారు. ఆయనకు నచ్చకపోతే, డాక్టర్ రాజయ్య, డి.శ్రీనివాస్ లాగా అడ్రస్ లేకుండా మాయమై పోతారు. ఆయన రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. దీనిని కాదని ఎవరైనా ఉండ గలరా?
కెసిఆర్ ఎవరనుకుంటే వారే ముఖ్యమంత్రి. దానికి మంత్రుల మద్దతు, శాసన సభ్యుల మద్దతు అవసరం లేదు. వాళ్ల సలహా తీసుకుని కెసిఆర్ నిర్ణయాలు తీసుకుంటారా?
ఇది తెలిసినా నిన్నంతా టిఆర్ ఎస్ లో డ్రామా మొదలుపెట్టారు. కాంగ్రెస్ కల్చర్ కుట్టినట్లు, కెటిఆర్ కు మద్దతుగా ఈ డ్రామా యమ రక్తి కట్టింది. మీడియా, సోషల్ మీడియా రాక్ డ్యాన్స్ చేసింది. కెటిఆర్ ఎపుడు ముఖ్యమంత్రి అవుతారు, ఎందుకవుతారు, ఏ ఘడియ బాగుంటుంది, తర్వాత కెసిఆర్ ఏంచేస్తారు ఇలా మీడియా పండితులు ఈ విషయాన్ని అన్ని కోణాల నుంచి తెగ విశ్లేషించి జాతికి జ్ఞానం ప్రసాదించారు.
డిప్యూటీ స్పీకర్ పద్మరావు పూనకం వచ్చినట్లు కెటిఆర్ ముఖ్యమంత్రి అని మాట్లాడారు. ఈ సభలో కెటిఆర్ కూడా ఉన్నారు. ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ‘ముఖ్యమంత్రి కెటిఆర్ ’ కు రైల్వే కార్మికులు తరఫున అంటూ పద్మారావు అభినందనలు కూడా చెప్పారు.
గత రెండు రోజులో టిఆర్ ఎస్ లో ‘కాంగ్రెస్ డ్రామా’ జోరుగా నడిచింది. అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా కెటిఆర్ ముఖ్యమంత్రి అని ప్రకటించడం మొదలుపెట్టారు.
తామంతా ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేదు గాని, ముఖ్యమంత్రి బాధ్యతలను కెటిఆర్ నిర్వహిస్తూ బేషుగ్గా ముందుకు దూసుకు పోతున్నాడని పొగిడారు. అసలు బంగారు ‘తెలంగాణ ఆలోచన’ కెసిఆర్, అమలు చేస్తున్నది కెటిఆర్ అని కొత్త సత్యం ఆవిష్కరించారు. మంత్రులు గుంగల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి… ఇలా ఒకరేమిటి అంతా కెటిఆర్ కు సిఎం అయ్యేందుకు అన్ని అర్హతలున్నాయని అన్నారు.
దీనితో చాలా మంది మంత్రులు, సీనియర్ నాయకులు ఇబ్బందులు పడ్తున్నట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే, అందరు పొగుడుతున్నపుడు, అవసరం లేకపోయినా, తామూ పొగడాలి. ఆ పనే చేశారు.
పార్టీలో కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ లో సంపూర్ణ మద్దతు ఉందని చెప్పడానికే ఇదంతా అని కొందరన్నారు… పార్టీలో కెటిఆర్ కు మద్దతు లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందా? కెటిఆర్ ను వ్యతిరేకించే మొనగాళ్లున్నారా? అంత టాలెంటు ఉన్న వాళ్లున్నారా?
ఇది టిపికల్ కాంగ్రెస్ డ్రామా!