ఆంధ్రలో ఆస్తి పన్నులు పెంచబోతుండటం పట్ల తిరుపతికి చెందిన యాక్టివిస్తు నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన విరమించుకోవాలని, ఆస్తి పన్నుపెంచేందుకు జారీ చేసిన జీవోని ఉపసంహరించుకోవాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నారు. కొత్త ఆస్తి పన్ను ఎలా నిర్ణయిస్తున్నారో నవీన్ వివరిస్తున్నారు:
1) ఆస్తి పన్నుకు సంబంధించి 24-11-2020 న జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 198 విడుదల చేశారు. దీని ప్రకారం ఆస్తుల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించిన భవనాల, స్థలము “మూలధన విలువల”(Capital Value) ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తారు. ఇది రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండ కానుంది.
2) ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు సంవత్సర బాడుగ ఆదాయాన్ని,ప్లింత్ ఏరియా ని బట్టి ఆస్తిపన్ను నిర్ణయించడం జరిగేది. అలాంటిది ఎన్నడూ లేని విధంగా సబ్ రిజిస్ట్రార్ వ్యాల్యూ ప్రకారం ఆస్తిపన్ను నిర్ణయించడం సబబు కాాదు.ఎందుకంటే, అధికారంలో ఏప్రభుత్వం ఉన్నా ప్రతి సంవత్సరం భూముల విలువ రిజిస్ట్రేషన్ వాల్యు పెంచుతూ పోతుంది. అలా పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరుగుతుంది. ప్రజలపై పెద్ద మొత్తంలో భారం పడుతుంది!
3) భారత దేశంలో (కర్ణాటక రాష్ట్రం తప్ప) ఇలాంటి పన్నుల విధానం ఏ రాష్ట్రంలో లేదు!
4) ఆంధ్రప్రదేశ్ లో గత రెండు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “నోట్ల రద్దు” “జిఎస్టి”నుంచి అన్ని వర్గాల ప్రజలు కోలుకోకముందే కరోనా వైరస్ రావడంతో ప్రజల పరిస్థితి “మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు” అయింది!
5) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో”ఉచిత పథకాల” కోసం అన్ని వర్గాల ప్రజలపై నూతన పన్ను విధానం విధించడం అనాలోచిత నిర్ణయం!
6) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 ఏప్రిల్ నుంచి నూతన ఆస్తి పన్ను నోటీసులు జారీ చేస్తే ప్రజలు “ఆస్తులు అమ్మి” పన్నులు చెల్లించాల్సి వస్తుంది!
7) రాష్ట్ర ప్రభుత్వం,మున్సిపల్ శాఖ మంత్రి,అధికార పార్టీ నాయకులు నూతన పన్నుల విధానాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర ప్రజల తరఫున”హైకోర్టును” ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాను!
నూతన ఆస్తి పన్ను విధానానికి వ్యతిరేకంగా నగర ప్రజల ప్రజాసంఘాల సహకారంతో త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తాం! రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు ఈ వీడియో ను సోషల్ మీడియా ద్వారా మీ అన్ని గ్రూప్ సభులకు షేర్ చేయండి.
(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్)