ఈ ఏడాది 2020కి ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా నూరేళ్ల క్రితం 1920లో భారత దేశంలో మొదటి సంఘటిత కార్మిక సంస్థ గా ఏఐటీయూసీ (అక్టోబర్ 31, 1920 ) ఏర్పడింది.
అది నిజానికి భారత స్వాతంత్య్రోద్యమంలో అంతర్భాగంగా ఏర్పడిన కార్మిక సంస్థ. భారత జాతీయ కాంగ్రెస్ వర్గ పోరాట సంస్థ కాదు. అది కేవలం వర్గేతర జాతీయ సంస్థ మాత్రమే. కానీ అది నడిపిస్తున్న స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఏర్పడ్డ ఏఐటీయూసీ మాత్రం “వర్గసంస్థ” కావడం గమనార్హం.
ఒక్కమాటలో చెప్పాలంటే, భారతదేశ స్వాతంత్య్రోద్యమం లో భాగంగా ఏర్పడ్డ మొదటి దేశవ్యాప్త స్వభావం కలిగిన వ్యవస్థీకృత “వర్గసంస్థ” గా ఏఐటీయూసీ ని చెప్పొచ్చు. నాటి అవ్యవస్తీకృత కార్మిక పోరాటాల నుండి ఏర్పడ్డ వ్యవస్తీకృత కార్మిక సంస్థయే ఏఐటీయూసీ.
నూరేళ్ల క్రితం ఏఐటీయూసీ ఆవిర్భవించిన రోజు అది లేవనెత్తిన కోర్కెలకీ, నేటి కార్మిక సంస్థలు లేవనెత్తే కోర్కెలకీ మధ్య సారూప్యత ఉంది. రేపు నవంబర్ 26 సార్వత్రిక సమ్మె డిమాండ్లను ఒకింత లోతుగా విశ్లేషిస్తే, నూరేళ్ల క్రితం నాటి చరిత్ర పునరావృతం ఐనట్లుగా మనకు అర్థమవుతుంది. అదేమిటో చూద్దాం.
1920 లో ఏఐటీయూసీ ఆవిర్భావం నాటికీ కార్మికవర్గం పోరాడి సాధించిన మెరుగైన కార్మిక చట్టాలు లేవు. కొత్తగా కార్మిక చట్టాల సాధన కోసం కార్మిక పోరాటాలను చేపట్టే దశ అది. 2020లో తాజా సార్వత్రిక సమ్మె చేసే నాటికి గత నూరేళ్ల కార్మిక చట్టాలు మరణించాయి. అంటే అవి రద్దు చేయబడ్డాయి.
1920 నాటికి కార్మిక చట్టాలు ఉనికిలోకి రాలేదు. ఆ తర్వాత నూరేళ్ల కాలంలో దశల వారీగా ఉనికిలోకి వచ్చిన ఎన్నో కార్మిక చట్టాలు 2020 నాటికి రద్దు అయ్యాయి. పైకి చూస్తే, 1920 కీ, 2020 కీ మధ్య ఒక పోలిక ఉంది.
అటు 1920 లో కార్మిక చట్టాలు లేవు. ఇటు 2020 లో కూడా కార్మిక చట్టాలు లేవు. నూరేళ్ల తర్వాత మొదటిసారి భారత కార్మిక వర్గానికి తిరిగి కార్మిక చట్టాలు “లేని స్థితి” ఏర్పడింది. అంటే నూరేళ్ల క్రితం పాత స్థితి పునరాృతమైనది. పాత స్థితి పునరాృతమయ్యాక మొదటి సారి జరిగేదే రేపటి నవంబర్ 26 న జరగనున్న సార్వత్రిక సమ్మె!
1920 కీ, 2020 కీ మధ్య ఓ నిర్దిష్ట “ఏక స్థితి” (similar situation) వుందని పైన పేర్కొనడం జరిగింది. అదే విధంగా 1920 కంటే ముందస్తు స్తితికీ, 2020 అనంతర స్థితికీ మధ్య కూడా ఒక పోలిక వుంది. 1920కి ముందుకూడా కుహనా కార్మిక సంక్షేమ చట్టాలు కొన్ని ఉనికిలోకి వచ్చాయి.
1880 వ దశకంలో తెచ్చిన ఫ్యాక్టరీ చట్టం అలాంటిదే. ఐతే అవి ప్రధానం గా కార్మికవర్గ పోరాటాల ఫలితంగా వచ్చినవి కావు. బ్రిటన్ లోని బ్రిటీష్ కాపిటలిస్ట్ వర్గానికీ, బ్రిటిష్ ఇండియా లోని బ్రిటీష్ కాపిటలిస్ట్ వర్గానికీ మధ్య వైరుధ్యాలలో భాగంగా బ్రిటిష్ వలస ప్రభుత్వం తెచ్చిన చట్టాలవి.
ఇంకా చెప్పాలంటే, అప్పటికే పది గంటల పనిదినం అమలు చేయక తప్పని స్థితిలో పడ్డ మాంచెస్టర్ బట్టల మిల్లుల యాజమాన్యాలకూ, ఇంకా 12 గంటల పనిదినం యధేచ్చగా అమలు చేస్తున్న బొంబాయి బట్టల మిల్లుల యాజమాన్యాల కూ మధ్య పోటీ ఫలితంగా తెచ్చిన కుహనా కార్మిక సంక్షేమ చట్టాలవి.
అదే విధంగా మోడీ ప్రభుత్వం ఈ కరోనా కాలంలో రద్దు చేసిన పాత కార్మిక చట్టాల స్థానంలో ఆమోదించిన లేబర్ కోడ్లు కూడా దాదాపు అలాంటి కుహనా చట్టాలే. అంటే 2020 తర్వాత ఉనికిలో వుండబోయే లేబర్ కోడ్లు, 1920 కి ముందు నాటి లేబర్ చట్టాలతో పోల్చ వచ్చును. ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే, 1920 కూ, 2020 కూ మధ్య భారత కార్మికవర్గ స్థితిగతులు ఎలా ఒకే విధంగా వున్నాయో 1920 కంటే ముందు నాటి కార్మికవర్గ స్థితిగతులు, 2020 అనంతర స్థితిగతులు కూడా ఓకే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు.
1920 & 2020 లలోని కార్మికవర్గ స్థితిగతుల మధ్య తులనాత్మక పరిశీలన,విశ్లేషణ, అధ్యయనం చేయకపోతే రేపటి నవంబర్ 26 సార్వత్రిక సమ్మె కి గల చారిత్రిక, రాజకీయ నేపథ్య కారణాల పట్ల మనకి స్పష్టమైన అవగాహన ఏర్పడదు.
సమ్మె డిమాండ్లు ఏమిటో ముఖ్యం కాదు. పాత లేబర్ చట్టాల రద్దు, కొత్త లేబర్ కోడ్లు, ప్రైవేతీకరణ, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు, స్కీమ్ కార్మికులు, DA స్తంభన, నెలకి ₹10 వేల కరోనా పరిహారం వంటి వాటిని ఎన్నైనా నేడు డిమాండ్ చేయొచ్చు. ఐతే వాటికి గల చారిత్రిక, రాజకీయ నేపథ్యం ఏమిటో అంతకంటే ప్రాధాన్యత గలది.
పైన పేర్కొన్న విధంగా నాడు నేడు మధ్య తులనాత్మక పరిశీలన,విశ్లేషణ, అధ్యయనం చేస్తే, 1920 నాటి కంటే, 2020 లో భారత కార్మికవర్గం ఎక్కువ ప్రమాదకర పరిస్తితిలో వుందని అర్థమవుతుంది. అదెలాగో రేపటి తరువాయి భాగంలో తెలుసుకుందాం.
(పి. ప్రసాద్ (పీపీ),అధ్యక్షులు; కే పోలారి ప్రధాన కార్యదర్శి, భారత కార్మిక సంఘాల సమాఖ్య: ఇఫ్టూ)