(CS Saleem Basha)
క్రికెట్ లో ఎలాగైతే వింతలు విశేషాలు ఉన్నాయో అలాగే మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కొంతమంది దిగ్గజ ప్లేయర్ లు కూడా వాటిని నమ్ముతారు అంటే మనకు నమ్మబుద్ధి కాదు. క్రికెట్ చరిత్ర లో మూఢనమ్మకాలకు సంబంధించి చాలా ఉదాహరణలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత గొప్ప ప్లేయర్లు ఎలా మూఢనమ్మకాలను విశ్వసిస్తారు అని. తమాషా ఏంటంటే చాలామంది అలా చేయడం వల్ల బాగా ఆడుతున్నాము అని భావించడం! ఆ మూఢనమ్మకాలు ఏంటో చూద్దాం.
* భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ బ్యాటింగ్ కి వెళ్లేముందు ఎప్పుడు కూడా అతని ప్యాడ్స్ లోపల ఒక ఎర్రటి బట్ట కట్టుకునేవాడు. ఇంకా ఎడమకాలి ప్యాడ్ మొదట కట్టుకునే వాడు. అంతేకాకుండా 2011 ప్రపంచకప్ కు ముందు తనకు కలిసి వచ్చిన బ్యాట్ ను రిపేర్ చేయించుకొని మరీ ప్రపంచ కప్ లో ఆడాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ వెళ్ళినప్పుడు మొదటి బంతిని ఆడడానికి ఇష్టపడేవాడు కాదు! ( సెహ్వాగ్ బలవంతం మీద ఒకసారి మొదటి బంతిని ఆడాడు)
* వెస్టిండీస్ కు చెందిన ఆల్ రౌండర్ “Frank Worrel” ఎప్పుడూ తను మొదటి సెంచరీ చేసినప్పుడు (చిరిగి చిల్లులు పడినా సరే) ధరించిన సాక్సులే ధరించేవాడు.
* స్టీవ్ వా, మొహిందర్ అమర్నాథ్ ఇద్దరూ గొడవలు పడటం లో ఎవరికి వారే సాటి. అయితే వీరిద్దరిలో ఇంకొక కామన్ విషయం ఏంటంటే ఇద్దరికీ తమ ప్యాంటు లో ఎర్ర రంగు రుమాలు పెట్టుకోవడం అలవాటు.
*సౌరవ్ గంగూలీ తను బ్యాటింగ్ చేసే రోజు షేవింగ్ చేసుకోడు. అలాగే ఎల్లప్పుడూ తన జేబులో తన గురువు ఫోటో పెట్టుకుంటాడు. అలాగే రకరకాల మాలలు, రింగులు ధరించే వాడు.
*సునీల్ గవాస్కర్ కీ ఒక ఖరీదైన మూఢ నమ్మకం ఉండేది. బ్యాటింగ్ కి వెళ్లేముందు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త వస్తువు కొని వేసుకోవటం అలవాటు. అది చొక్కా కావచ్చు,రుమాలు కావచ్చు, లేక గ్లౌస్లు కావచ్చు.
*ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎల్లప్పుడూ తన లెఫ్ట్ ప్యాడ్, లెఫ్ట్ గ్లౌస్ నే ధరించేవాడు అలాగే గ్రౌండ్ లోకి ప్రవేశించే ముందు ఎడమ కాలు పెట్టడం అలవాటు.
*ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జ్యోతిష్కుడి సలహా మేరకు తన పేరు లో ఒక “K” అక్షరం అదనంగా చేర్చుకున్నాడు.
*1982-83 బార్బడోస్ టెస్ట్ మ్యాచ్‌లో మాల్కం మార్షల్ వేసిన బౌన్సర్ కి మోహిందర్ అమర్నాథ్ మొహం పగిలి చొక్కా మొత్తం రక్తంతో నిండిపోయింది. అయితే విచిత్రంగా అమర్నాథ్ మరుసటి రోజు సెంటి’మెంటల్” గా మళ్లీ అదే చొక్కా వేసుకొని 91 పరుగులు సాధించాడు.
*యువరాజ్ సింగ్ తన పుట్టిన రోజైనా 12 తేదీని తన లక్కీనంబర్ గా భావిస్తాడు. తన జెర్సీ పై 12 నంబర్ ఉండేలా చూసుకుంటాడు. అలాగే తన ఎడమ చేతికి ఒక నల్లటి దారాన్ని ధరిస్తాడు.
* భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ప్రతి ముఖ్యమైన మ్యాచ్ లో పసుపు రంగు రుమాలు జేబులో పెట్టుకునేవాడు.
*విధ్వంసకర బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకప్పుడు 44వ నెంబరు జెర్సీ ధరించేవాడు. అయితే అది తనకు అంత అదృష్టం కలిగించలేదని జ్యోతిష్కుడి సలహా తీసుకుని, నంబర్ లేని జెర్సీ ధరించేవాడు.
*కెప్టెన్ కూల్ ధోనీ 7 నెంబర్ జెర్సీ భరిస్తాడు. తన పుట్టినరోజు కూడా 7 జూలై కావడంతో అది తన లక్కీనంబర్ గా భావిస్తాడు.
*మహమ్మద్ అజారుద్దీన్ ఎప్పుడు బ్యాటింగ్ కు దిగినా నల్ల తావీజు బయట పెట్టి ఆడటం మొదలు పెడతాడు.
* రాహుల్ ద్రవిడ్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ కి వెళ్లేముందు కుడి ప్యాడ్ ధరించడం అలవాటు. అలాగే అతను ఎప్పుడూ కూడా సిరీస్ కు వెళ్లేముందు బ్యాట్ మార్చేవాడు కాదు.
*ఆస్ట్రేలియన్ ప్లేయర్ మైకేల్ క్లార్క్ బ్యాటింగ్ కు వెళ్లేముందు లౌడ్ మ్యూజిక్ వినడం అలవాటు. అది తనకి అదృష్టంతో పాటు ఏకాగ్రత కూడా ఇస్తుందని అతను చెప్పేవాడు.
(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)