విద్యార్థుల్లో కొత్త చైతన్యం: అనంత కలెక్టర్ గంధం చంద్రుడు మీదే ఇపుడు చర్చంతా…

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేసిన అనంత కలెక్టర్ గంధం చంద్రుడు
Dream big అనేది నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ సందేశం. కలలు కనండి, పెద్ద పెద్ద కలు కనండనే ఆయన రాష్రపతిగా ఉన్నపుడు విద్యార్థులకిచ్చిన సందేశం. కలలు కన్నపుడే కాళ్లు గమ్యం వైపు అడుగేస్తాయి. దారిపొడుగునా ఎన్నో చిత్రవిచిత్రాలు ఎదురవుతాయి. మరి, కలలు కనడం ఎలా? దానికో బటన్ ఉండదు కదా. కలలు ఎలా కనాలో అనంతపురం జిల్లా విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు తొలిసారిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  చూపించాడు. ‘ఒక్క రోజు అధికారి’ అనే పేరుతో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నాడు  ఆయన బాలికలను బంగార కలలకు ప్రపచంలోకి తీసుకెళ్లారు. ఇపుడు ప్రతిఇంటా ఆయనే చర్చనీయాంశమయ్యారు. దాని మీద ప్రత్యేక కథనం.
(చందమూరి నరసింహారెడ్డి)
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ పేరుతో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి ఆదివారం చేసిన ఒకరోజు అధికారులు కార్యక్రమం పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారి ఆలోచన దృక్పథం అధ్బుతమైనదని ఫలితాలు దీర్ఘకాలంలో కన్పిస్తాయని మేథావి వర్గాలు చెబుతున్నాయి. పసితనంలో పిల్లల హృదయాలలో ముద్ర పడ్డ విషయాలు ఎంతో ప్రభావితం చేస్తాయని ,వారిలో పట్టుదలను , ఆసక్తిని, ఏదో సాధించాలనే తపనను వెతికి తీస్తాయని మానసిక విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో పలువురు ఉన్నత స్థాయి అధికారులను పలు సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు తమ అనుభవాలను చెబుతూ వారు గతంలో ఉన్నత స్థాయి అధికారులను చూసి వారి మాటలను విని స్పూర్తి ని పొంది తాము ఉన్నత శిఖరాలకు చేరుకున్నట్లు చెబుతారు.అలాంటిది నేడు ఏకంగా కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా జిల్లాస్థాయి అధికారులు గా గెజిటెడ్ ఆఫీసర్ గా ఒకరోజు పూర్తిస్థాయిలో అధికారికంగా విధులు నిర్వహించేలా చేయడంవల్ల ఆ విద్యార్థులలో ఓ స్ఫూర్తి కలిగిస్తుంది.
ఉత్సాహం ,పట్టుదల పెంపొందిస్తుంది. వారిని ఉత్సాహవంతులుగా తీర్చిదిద్దడానికి ఓ ప్రణాళికను కలెక్టర్ రూపొందించుకున్నారు. వారిని జీవితంలో ఓ స్థాయికి తీసుకు వెళ్ళేదాకా వారికి మెంటార్ గా వ్యవహరించడానికి ఓ ప్రణాళికను సిద్ధం చేశారు.
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ అనే పేరుతో జిల్లా స్థాయి, డివిజన్, మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి కార్యాలయంలో కూడా ఒక బాలిక ఆ శాఖ యొక్క హెడ్ గా పని చేసేలా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. భవిష్యత్తులో బాలికల కాన్ఫిడెంట్ ని పెంచడానికి, భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఎవరైతే సంబంధిత ఆఫీసర్ గా సెలెక్ట్ అయి ఉన్నారో వారికి లాంగ్ టర్మ్ లో ఒక మెంటార్ గా ఉంటూ వారికి ఆర్థికంగా కావచ్చు, కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు ఇంకా ఇతర సహాయం చేయడానికి కూడా ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు. బాలిక చదువుకునేంతవరకు, ఆ అమ్మాయి జీవితంలో సెటిల్ అయ్యేంతవరకు కూడా కౌన్సెలింగ్, మెంటార్సి ప్ అన్నది అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత పోస్ట్ లో ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గా ఉన్న అమ్మాయి కి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా ఉన్న అమ్మాయికి జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ గా ఉన్న అమ్మాయికి డిఆర్వో,ఇలా ఏ అధికారిగా వ్యవహరించారో ఆ అధికారి ఆ అమ్మాయి కి మెంటార్షిప్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసేలా ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు.
బాలికలు, మహిళలు ప్రతి రంగంలోనూ సమాజంలో అందరికీ సమానంగా ఉండాలన్నది జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆశయం.
అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒకరోజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలిక ఎం.శ్రావణి మాట్లాడుతూ మా నాన్న పాములేటి ఒక రైతని, మా అమ్మ రత్నమ్మ కూలి పని చేస్తుందని, ఒకరోజు జిల్లా కలెక్టర్ గా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపింది.
రోడ్లు, భద్రత గురించి, బాలికల హక్కులు, వారి చదువులు, వారికి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో జంతువుల పరిరక్షణ చేపట్టాలని, మున్సిపాలిటీ తోపుడుబండ్ల ను సరిగ్గా అమలు చేయాలని తెలియజేసింది.
రోడ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించాలని, ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి నష్టపరిహారం అందజేసేందుకు కృషి చేస్తానని తెలిపింది. ఒకరోజు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
కేజీబీవీ పాఠశాలలు పేద పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయని, ఇంకా మరిన్ని కట్టించాలని, డ్రాప్ అవుట్ పిల్లలను అందులో చేర్పించాలని, వారికి ఎటువంటి సమస్య లేకుండా వారిని చూసుకోవాలని సూచించింది.
సమాజంలో ప్రతి రంగంలోనూ బాలికలు, మహిళలు సమానంగా ఉండాలని, అడ్మినిస్ట్రేషన్లో, రాజకీయాల్లో, కార్పొరేట్ రంగంలో, సైంటిస్టులు ఇలా అన్ని రంగాల్లో జనాభాకు తగినట్టుగా మహిళలు , బాలికలు కూడా సమానంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.
పలు ఫైల్ లపై సంతకాలు చేసిన ఒక రోజు జిల్లా అధికారుల ఆదేశాలను అధికారికంగా అమలు అయ్యేలా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు .
ఒక రోజు జాయింట్ కలెక్టర్ ( రైతు భరోసా కేంద్రాలు మరియు రెవిన్యూ) గా బాధ్యతలు స్వీకరించిన బి.మధుశ్రీ కళ్యాణదుర్గం గ్రామం మరియు మండలానికి చెందిన శ్రీమతి సరోజమ్మ, భర్త లక్ష్మీనారాయణ లు సర్వే నంబర్ 372, 2 ఏ 1, 1 బి లో గల 1.97 ఎకరాల తమ భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారని అందుకు సంబంధించి భూ పరిహారం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న అర్జీ పై కళ్యాణదుర్గం ఆర్ డి ఓ నుండి భూసేకరణ సంబంధించి నివేదిక సమర్పించవలసిందిగా రూపొందించిన ఫైలుపై సంతకం చేసింది.
ఒక రోజు జాయింట్ కలెక్టర్ (గ్రామ వార్డు సచివాలయలు మరియు అభివృద్ధి ) గా బాధ్యతలు స్వీకరించిన సహస్ర పెద్దపప్పూరు మీసేవ కేంద్రంలో నిర్దేశించిన రుసుముల కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందిన ఫైలుపై పెద్దపప్పూరు మీ సేవా కేంద్ర లైసెన్స్ ను రద్దు చేస్తూ రూపొందించిన ఫైలుపై సంతకం చేశారు.
ఒక రోజు జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం)గా ఒక రోజు బాధ్యతలు స్వీకరించిన నేత్రశ్రీ గుంతకల్లు ఏసిఎస్ స్పీన్నింగ్ మిల్ కు సంబంధించి బకాయిలు, జీతాలు చెల్లించాలని ఉద్యోగులు అర్జీ పెట్టుకోగా ఆ ఫైల్ ముందుకు పంపేందుకు అవసరమైన ప్రొసీడింగ్స్ సిద్ధం చేయగా ఆ ఫైల్ పై సంతకం చేశారు. అలాగే డిటీసీపీఓ కార్యాలయంలో సర్వేయర్ ను తొలగించగా, ఇందుకు తనను అన్యాయంగా తొలగించారని సర్వేయర్ గ్రీవెన్స్ లో సర్వేయర్ ఫిర్యాదు చేయగా, సర్వేయర్ ను ఎందుకోసం తొలగించారనే విషయమే ఎంక్వయిరీ చేసే ఫైల్ పై సంతకం చేసింది.
ఒక రోజు జిల్లా రెవెన్యూ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన సమీరా మహిళా ఉద్యోగికి 180 రోజుల పాటు మెటర్నటీ లీవ్ మంజూరు చేసే ఫైలుపై సంతకం చేశారు. అలాగే ఇటీవల నియమించిన గ్రేడ్ -1 , గ్రేడ్-2 విఆర్వో లకు జీతభత్యాల మంజూరుకు సంబంధించి సిఎఫ్ ఎంఎస్ లో డాటా ఎంట్రీ చేసేందుకు రూపొందించిన ఫైలుపై సంతకం చేసింది.
ఒకరోజు కలెక్టరేట్ ఏవో గా బాధ్యతలు స్వీకరించిన పి.నిఖిల అటవీ శాఖకు సంబంధించి పెనుగొండ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్. శ్రీరాములు మరణించగా కారుణ్య నియామకం కింద అతని కుమారుడు ఎన్. వంశీకృష్ణ ను నియమించేందుకు సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై లెటర్ మూవ్ చేసేందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేసింది.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
ఒక రోజు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రావణి ఫస్ట్ రోడ్డులోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం వద్ద రోడ్డుపై ఉన్న గుంతలలో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి గుంతలు పూడ్చి నీటిని తొలగించాలని అధికారులకు, శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఒకటవ రోడ్డులో కాలినడకన నడుస్తూ శారదా మున్సిపల్ గర్ల్స్ హైస్కూలును తనిఖీ చేసి జగనన్న విద్యా కానుక పథకం అమలు పై, పాఠశాల లో నాడు నేడు పనుల పురోగతిపై ఆరా తీశారు. అలాగే ఒకరోజు జె.సి (ఆర్ & ఆర్ బి) బి.మధుశ్రీ అనంతపురం రూరల్ మండలం కొడిమి గ్రామంలో పేదలందరికీ ఇల్లు పథకం కింద మంజూరు చేసే లేఔట్ ను పరిశీలించారు.
భవిష్యత్తులో బాలికల కాన్ఫిడెంట్ ని పెంచడానికి, భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ కార్యక్రమం తప్పక ఉపయోగపడుతుంది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను కలెక్టర్ మరిన్ని చేపట్టి పలువురికి ఆదర్శ వంతులుగా నిలుస్తారని ఆశిద్దాం.

(Pictures source: Gandham Chandrudu IAS Facebook page)

Chandamuri Narasimhareddy
(చందమూరి నరసింహారెడ్డి,సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)