నోబెల్ ఫ్రైజ్ గురించిన 13 చిత్ర విచిత్రాలు…
1) ఫిజిక్స్ లో ఇంతవరకు ఒకే ఒక శాస్త్రవేత్తకు రెండు సార్లు నోబెల్ ఫ్రైజ్ వచ్చింది.ఎవరది? బయట ప్రపంచంలో మాత్రం ఈయన పేరు ఎవ్వరికీ తెలియదు. ప్రపంచమంతా ఈ రోజు ఆయన పరిశోధనా ఫలితాలను అనుభవిస్తూ ఉంది. ఈయన లేకుండా ఈ రోజు గ్లోబలైజేషన్ లేదు. మీ కంప్యూటర్ లేదు, మీ స్మార్ట్ ఫోన్ లేదు. ప్రతిఇంటా ఫోటో పెట్టుకుని పూజించ దగ్గ వ్యక్తి ఈయన. ఇన్ ఫర్మేషన్ ఏజ్ ( Information Age) అనేది ఆయన వేసిన పునాది మీద నిలబడి ఉంది. ఆయన పేరు జాన్ బార్డీన్ (John Bardeen). ఎపుడైనా విన్నారా. సెమికండక్టర్ పరికరాన్ని (ట్రాన్సిస్టర్) కనిపెట్టినందుకు ఆయనకు 1956లో ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన బాగా మిత భాషి, చాలా మెల్లిగా మాట్లాడతాడు. ఆ మాట్లాడింది కూడా వినిపించదు. పబ్లిసిటీ కి బాగా దూరం. ఆయన పేరు మనకు తెలియకపోవడానికి ఇవన్నీ కారణాలేమో. ఆయనను ‘ట్రూ జీనియస్’ అంటారు. True Genius:Life and Science of John Bardeen అని ఆయన మీద అద్భుతమయిన పుస్తకం వచ్చింది. బార్డీన్ నోబెల్ ప్రైజ్ స్వీకరించేందుకు స్వీడెన్ వెళ్లాడు. కుటుంబాన్ని తీసుకెళ్లలేదు. సరైన బట్టలూ తీసుకెళ్లలేదు. రెండు మూడు రోజులలా స్వీడెన్ కు తీసుకు వెళ్తే బడిలో పాఠాలు పోతాయని ఇద్దరు కొడుకుల్ని ఇంటిదగ్గిరే ఉండమన్నాడు. దానితో భార్య కూడాఇంటి దగ్గిరే ఉండిపోయింది.చిన్న కొడుకుని తీసుకుని మాత్రం హడావిడిగా వెళ్లాడు. శాస్త్రవేత్తలందరికి నోబెల్ బహుమానం రాదు. వచ్చిన వాళ్లకు చాలా మటుకు జీవితంలో ఒకేసారి వచ్చే సువర్ణావకాశం. ఇలాంటి దానికి ఆయన కుటుంబంతో వెళ్లాలనిపించలేదు. ఆసలు ఆయనే అయిష్టంగా వెళ్లాడట. వెళ్తే తన రీసెర్చ్ పని డిస్బర్బ్ అవుతుందని గొణుక్కుంటూ వెళ్లాడు.
ఆయేడాది డిసెంబర్ 10న స్టాక్ హోం లో ఏర్పాటు చేసిన నోబెల్ బహుమతి ప్రదాన కార్యక్రమంలో భార్యాపిల్లలు లేకుండా వచ్చిన శాస్త్రవేత్త ఆయననొక్కరే.
దానికి తోడు మంచి బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఆయన బట్టలు బాగా దుర్వాసనొస్తున్నాయి. చివరకు ఆయనతో పాటు నోబెల్ ఫ్రైజ్ పంచుకున్న మరొక శాస్త్రవేత్త ఒక తెల్ల కోటు, టై అందించి బార్డీన్ ను ఆదుకున్నారు. తర్వాత విందులో ఆయన ఒంటిరిగా అవార్డు పంక్షన్ కువచ్చిన విషయాన్ని స్వీడెన్ రాజు గుర్తించారు. ఇలాంటి చారిత్రాత్మక ఫంక్షన్ కు ఫ్యామిలీ లేకుండా రావడమేమిటని రాజు గుస్తవ్ 6 (Gustav VI) బార్డీన్ ని చివాట్లు పెట్టారు. అపుడు బార్డీన్ ఏమన్నారో తెలుసా? మళ్లీ వచ్చినపుడు ఫ్యామిలీ తోనే వస్తానన్నాడు. స్వీడెన్ రాజు ఏమనుకున్నాడో తెలియదు గాని,మనకేమనిపిస్తుంది, నోబెల్ బహుమానం పంక్షన్ కు రెండో సారి రావడమేమిటి, మళ్లీ మళ్లీ వచ్చందుకు అదేమన్నా టూరిస్టు హోటలా?
జాన్ బార్డీన్ నిజంగానే రెండో సారి సకుటుంబ సమేతంగా వెళ్లి అవార్డు అందుకున్నారు.
1972లో ఆయన కు మళ్లీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ సారి ఆయన టాపిక్ సూపర్ కండక్టివిటి. నోబెల్ చరిత్రలో రెండుసార్లు బహుమానం అందుకున్న వాళ్లు ముగ్గురు. ఇపుడు బార్డీన్ తోడయ్యారు. ఫిజిక్స్ లోనయితే ఆయన ఒక్కరే. అంతకు ముందు మేరీ క్యూరీ (1903 ఫిజిక్స్ 1911 కెమిస్ట్రీ), లైనస్ పౌలింగ్ ( 1954 కెమిస్ట్రీ,1962 శాంతి )ఎఫ్ శాంగర్ ( కెమిస్ట్రీ 1958,1980) అందుకున్నారు.
నోబెల్ ఫ్రైజ్ చరిత్రలో మాయని మచ్చ… మహాత్మాగాంధీకి శాంతి బహమతి ప్రకటించకపోవడం
2. నోబెల్ బహుమతి అందుకున్న ప్రతి శాస్త్రవేత్త అవార్డుఅందుకుంటూ నోబెల్ లెక్చర్ ఇవ్వాలి. ఈ ఉపన్యాసాన్ని అక్కడిక్కడే దంచేయకూడదు. ఉపన్యాసం కాపీని 24 గంటల ముందు నోబెల్ కమిటీకి సమర్పించాలి. అపుడు దానిని వాళ్లు స్వీడిష్ భాషలోకి తర్జుమా చేస్తారు.
3. ముగ్గరు వ్యక్తులు నోబెల్ ఫ్రైజ్ వచ్చేనాటికి జైలులో ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించే టప్పటికి వాళ్లను ఆదేశాల ప్రభుత్వంలో జైల్లోకి తోసేశాయి. అందులో ఒకరు కార్ల వాన్ ఒసీట్జ్ కీ (Carl von Ossietzky 1935 Germany), ఆవుంగ్ శాన్ సూచీ (మయన్మార్ 1991) లీయ్ షియావ్ బో (చైనా 2010)
Like this story? Share it with a friend!
4. నోబెల్ ఫ్రైజ్ జ్ఞాపిక అపురూపమయిన వస్తువు. అయితే, నోబెల్ ఫ్రైజ్ వచ్చిన వాళ్లంతా దానిని అపురూపంగా దాచుకోలేరు. మ్యూఆన్ న్యూట్రినో (Muon Nutrino ) కనిపెట్టినందుకు 1988లో ఫిజిక్స్ లో లియాన్ లెడర్ మన్ కు నోబెల్ ఫ్రైజ్ వచ్చింది, అయితే తనకు సోకిన నిద్రలేమి మానసిక జబ్బు (Dementia) ముదిరింది. జబ్బు చికిత్స డబ్బు బాగా ఖర్చవుతున్నది. ఈ డబ్బుల కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆయన అవార్డును అమ్ముకోవలసి వచ్చింది. ఆయన అవార్డును $765,000 లకు అమ్ముకున్నాడు. కొన్న వ్యక్తి ఎవరో వెల్లడించలేదు. ‘గాడ్ పార్టికిల్’ (God Particle) అనే మాట తొలిసారి వాడిందాయనే. 1918 అక్టోబర్ లో 96వ యేట ఆయన చనిపోయాడు.
5. అయితే, ఒక రష్యన్ బిలియనీర్ అలీషర్ ఉస్మానోవ్ నోబెల్ ప్రైజొ కటి కొని దాచుకోవాలన్న సరదా కలిగింది. ఒక నోబెల్ అవార్డు మెడల్ వేలానికి ఉందని తెలిసింది.వేలానికి వెళ్లాడు కొనేశాడు. ఆయనకు అమ్మిందెవరో తెలుసా? జీవశాస్త్రపరిశోధనలను కొత్త మలుపు తిప్పిన శాస్త్రవేత్త, డబుల్ హెలిక్స్ డిఎన్ ఎ (DNA) ని కనిపెట్టిన జేమ్స్ వాట్సన్. వాట్సన్ అవార్డును 2014 డిసెంబర్ వేలంలో 4.7 మిలియన్ డాలర్లకు కొన్నాడు,అయితే, పాపమనిపించింది. ఇలా చేయడం సరికాదేమో అనిపించింది. వెంటనే వాపసు ఇచ్చేశాడు. ‘నోబెల్ ఫ్రైజ్ అందిరి దగ్గిర ఉండకూడదు, ఎవరు గెల్చుకున్నారో వాళ్ల దగ్గిర ఉండటమే మంచిద’ని చెప్పి ఉస్మానోవ్ ప్రైజ్ ను వాట్సన్ కు వాపసు ఇచ్చాడు, డబ్బు వెనక్కి తీసుకోలేదు.తానిచ్చిన డబ్బును వాట్సన్ తన రీసెర్చ్ కు ఉపయోగించుకోవచ్చని కూడా చెప్పారు.
వాట్సన్ ప్రైజు ను ఎందుకు అమ్మాలనుకున్నాడు?
వాట్సన్ గొప్ప శాస్త్రవేత్తయే. ఎవరూ కాదనరు. అయితే, మరొకవైపు వాళ్లూ మామూలు మనుషులే. అనేక మూఢనమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. అందుకే ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా వాట్సన్ లో జాత్యహంకార భాావాలున్న వాడు. నల్లవాళ్లు సహజంగానే జ్ఞాన హీనులని ఆయన నమ్మకం. దానిని బహిరంగంగా వ్యక్తీకరించాడు.దీనితో భూకంపం వచ్చింది. సర్వత్రా నిరసన వెల్లువెత్తింది. దీనితో ఆయన ఉద్యోగం పోయింది. శాస్త్రప్రపంచం బహిష్కరించింది. ఆర్థికంగా కష్టాల పాలయ్యాడు. అపుడాయన దానిని వేలం వేశాడు. అయితే, ఆయన చనిపోయాక కుటుంబం 2.7 మిలియన్ డాలర్లకు మెడల్ ను అమ్మేసింది. బతికుండగా నోబెల్ మెడల్ ను వేలానికి పెట్టిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్.
మీకీ పోస్టు నచ్చిందా? అయితే, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి!
6. జర్మన్ శాస్త్రవేత్తలెవరూ నోబెల్ ఫ్రైజ్ తీసుకోవడానికి వీళ్లేదని హిట్లర్ శాసించాడు. దీనితో రిచర్డ్ కున్ (1938 కెమిస్ట్రీ), జెరార్డ్ డోమాక్ ( మెడిసిన్ 1939), ఎడాల్ఫ్ బుటునాచ్ (ఫిజిక్స్ 1939) అవార్డులు అందుకోలేకపోయారు. తర్వాత వాళ్లు అవార్డు డిప్లొమా తీసుకున్నారు గాని, నగదు ముట్టుకోలేదు.
అన్నట్టు మీకీ విషయం తెలుసా; బొరిస్ పాస్టర్నాక్ (1890-1960) అని రష్యాకు చెందిన ప్రఖ్యాత రచయిత ఉన్నారు. ఆయన రష్యన్ కమ్యూనిస్టు వ్యతిరేక రచయిత. Dr Zhivago అనే నవలకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. దీనిని రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యతిరేకించింది.ప్యాస్టర్నాక్ నోబెల్ బహుమతి తిరస్కరించాల్సివచ్చింది. ఇక్కడ మరొక విశేషముంది. ఈ పుస్తకాన్ని రష్యాలో ముద్రించలేదు. దీనికి ఇటలీకి స్మగుల్ చేశారు. అది మొదట ఇటాలియన్ భాషలో అచ్చయింది. నోబెల్ వెబ్ సైట్ లో ఆయన గురించి పరిచయం అలాగే ఉంది.
7. నోబెల్ ఫ్రైజు లు అందుకున్న వారి సగటు వయసు 59 సంవత్సరాలు. 2007లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఫ్రైజ్ అందుకున్నలియోనిడ్ హూర్విక్జ్ అందరికంటే పెద్దవాడు. ఆయన వయసు 90 సంవత్సరాలు. అందరికంటే పిన్నవయస్కు రాలు మలాలా యూసప్జాయ్. పాకిస్తాన్ కు చెందిన మలాలా 17 సంవత్సరాల వయసులోనే 2014లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్నారు.
8. ఆర్థిక శాస్త్రానికి ఇచ్చే నోబెల్ ఫ్రైజ్ అసలు పేరు స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ఫ్రైజ్ (Sveriges Riksbank Prize in Economic Sciences). దీనిని నోబెల్ గౌరవార్థం ఈ బ్యాంకు ఏర్పాటుచేసింది. అయితే, ఈ బహుమతిని కూడా నోబెల్ బహుమతులతో పాటే ఇస్తారు కాబట్టి, నోబెల్ ఫ్రైజ్ అనే పిలుస్తారు.
9. నోబెల్ బహుమతి ఏర్పాటు కావడం అంతసులభంగా ఏం జరగలేదు. 1895లో నవంబర్ లో స్వీడెన్ దేశానికి చెందిన కెమిస్టు ఆల్ ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) మరణానికి ముందు తన ఆస్తిని ఎలా వినియోగించాలో ఒక వీలునామా రాశారు. తన సంపదలో ఎక్కువ భాగాన్ని డిపాజిట్ చేసి శాస్త్రపరిశోధనలకు గాను నోబెల్ బహుమానంగా ఇవ్వాలన్నాడు. అవార్డుల ఎంపికకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వాళ్లు వీలునామాను సవాల్ చేశారు. ఆస్తివివాదం రావడంతో ఆయన ఎంపిక చేసిన కమిటీ కూడా వీలునామా ప్రకారం నోబెల్ బహుమతి పని ప్రారంభించేందుకు అంగీకరించలేదు. ఈ వివాదం ముగిసేందుకు అయిదేళ్లు పట్టింది. అందుకే నోబెల్ బహుమతి అందివ్వడం 1901లో మొదలయింది.
10. నోబెల్ చరిత్రలో ఒకే ఒక శాస్త్రవేత్త ఎవరితో షేర్ చేసుకోకుండా రెండు సార్లునోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన విశ్వవిఖ్యాత రసాయన శాస్త్రవేత్త. లైనస్ పాలింగ్ (Linus Carl Pauling).అయితే, రెండోసారి ఆయనకు శాంతి బహుమతి లభిచింది.అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన నిర్వహించినందుకు శాంతి బహుమతి లభించింది.
11. నోబెల్ బహుమానాన్ని మరణానంతరం ఇవ్వరు. 1970లో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు రెండు సార్లు చనిపోయిన వారికి బహుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఇందులో ఒకటి సాహిత్యానికి (Eric Karlfeldt 1931), రెండోది శాంతి బహుమతి (Dag Hammarskjold 1961). 1970లో ఒక సారి చనిపోయిన వ్యక్తికి బహుమతి ఇవ్వాల్సి వచ్చింది. కారణం, అవార్డు ప్రకటించడానికి మూడు రోజుల ముందు ఆయన చనిపోయాడు. ఈ విషయం అవార్డుల కమిటీకి తెలియదు. ఫలితంగా ప్రకటించిన అవార్డును కమిటి ఉపసంహరించుకోలేకపోయింది. ఇలా అవార్డు పొందిన శాస్త్రవేత్త రాల్ఫ్ స్టెయిన్ మన్ (Ralph Steinman). ఆయనకు మెడిసిన్ఫి-ఫిజియాలజీలో 2011 లో నోబెల్ బహుమతి వచ్చింది. 1996లో ఆర్థిక శాస్త్రనిపుణుడు విలియమ్ విక్రే పేరు ప్రకటించారు. అయితే, అవార్డు అందించే లోపు ఆయన మరణించారు. అందుకే ఆయనకు మరణానంతరం అవార్డు లభించింది.
12. సాధారణంగా ఒక శాస్త్రవేత్త చేసిన పరిశోధనకు నోబెల్ గుర్తింపు రావడానికి అవార్డు సబ్జక్టును బట్టి కనీసం 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క సారి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. 1966లో మెడిసిన్- ఫిజియాలజీలో పేటాన్ రౌజ్ (Peyton Rous)కు నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇది 1910లో ఆయన వైరస్ ల మీద జరిపిన పరిశోధనకు వచ్చిన గుర్తింపు. అంటే పరిశోధన జరిగిన 50 సంవత్సరాలకు ఆయన నోబెల్ బహుమతి వచ్చింది. అయితే, 1957లో ఒక వింత జరిగింది. షెన్ నింగ్ యాంగ్ (Chen Ning Yang), సుంగ్ దావో లీ (Tsung-Dao Lee) అనే ఇద్దరు చైనా శాస్త్రవేత్తలకు ఫిజిక్స్ లో నోబెల్ ఫ్రైజ్ వచ్చింది. వారిద్దరిది పార్టికల్ ఫిజిక్స్ లో కేవలం ఒక యేడాది కిందట 1956లో జరిగిన తాజా పరిశోధన.
13. మీకీ తమాషా తెలుసా? 1939లో ఫాసిజం జోరుగా ఉన్న ఎడాల్ఫ్ హిట్లర్ పేరును నోబెల్ శాంతి బహమతికి ప్రతిపాదించారు. స్వీడిస్ పార్లమెంటు సభ్యుడు ఇ.జి.సి బ్రాంట్ ఆయన పేరుప్రతిపాదించారు. బ్రాంట్ ఇంగ్లండు మీద కోపంతో హిట్లర్ పేరును ప్రతిపాదించారు. నిజానికి బ్రాంట్ కరుడుగట్టిన ఫాసిస్టు వ్యతిరేకి. అయినా సరే, హిట్లర్ పేరు ప్రతిపాదించాడు బ్రిటిష్ ప్రధాని నెవిల్ ఛేంబర్లిన్ మీద కోపంతో ఆయన హిట్లర్ పేరు తీసుకువచ్చారు. ఆ యేడాది చాలామంది స్వీడిస్ పార్లమెంటు సభ్యులు ఛేంబర్లిన్ పేరు ప్రతిపాదిండంతో ఆయన ఆగ్రహం వచ్చింది. దీనితో మండిన బ్రాంట్ హిట్లర్ పేరు ఎందుకు ప్రతిపాదించకూడదని జర్మనీ చాన్స్ లర్ పేరు ప్రతిపాదించారు. 1939 ఫిబ్రవరి 1 తేదీన బ్రాంట్ తన ప్రతిపాదనను విరమించుకున్నాడు.
Like this story? Share it with a friend!