ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కోడలి మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కన్నా కోడలు సుహారిక మే 28 న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా… ఆమె భర్త కన్నా ఫణింద్ర సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో చెప్పిన విషయాలు విచారణలో కీలక ట్విస్ట్ గా మారనున్నట్టు తెలుస్తోంది.
మే 28 న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక ఒక్కసారిగా కుప్పకూలింది. హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం సజ్జనార్ ను కలిసిన కన్నా ఫణింద్ర తన భార్య మృతి కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.
“నా భార్య మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి” అంటూ సుహారిక భర్త ఫణింద్ర ఫిర్యాదు చేసారు. తన అత్తమామలు నిజాలు దాచి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. సుహారిక చనిపోయిన రోజు ఏం జరిగిందని ప్రశ్నిస్తే “నీకు అవసరమా?” అన్నారని తెలిపారు. సుహారిక మొదట సీబీఐటీ వద్ద చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఏఐజీ హాస్పిటల్ కి దగ్గర్లోని బాంబో హిల్స్ వద్ద చనిపోయిందని చెప్పారన్నారు.
తన భార్య మారథాన్ రన్నర్ అని ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు. కానీ ఆమె చనిపోయిన రోజు పార్టీలో పాల్గొన్నట్టు అంతటా ప్రచారం చేసారని చెప్పారు. అదే రోజు పార్టీకి అటెండ్ అయిన మరో నలుగురు వ్యక్తులు తప్పించుకు తిరుగుతున్నారని… వారిని విచారిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఫిర్యాదులో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఐతే తనకు, తోడల్లుడికి కొన్ని ఆర్ధిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. వాటి పరిష్కారానికే ఆమెను తన స్నేహితురాలి ఇంటికి పిలిపించినట్టు తెలియజేసారు. కానీ అదే రోజు ఆమె మరణించడం పలు అనుమానాలకు తావిస్తోందని… దీనిపై విచారణ జరిపి పూర్తి నిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిందిగా సజ్జనార్ ను ఫణింద్ర కోరారు.