తాడిపత్రి : కరోనా మనుషుల్ని ఎన్నిరకాల చంపుతుందో చెప్పలేం. కరోనా సోకి చనిపోవడం ఒక్క పార్శ్వం మాత్రమే. కరోనా వల్ల ప్రయివేటు ఆసుత్రులు మూతపడి వైద్యం అందక చనిపోయే వాళ్లెందరో. ఈ లెక్కలెప్పటికీ బయటకు రావు. ఇలా వైద్యం అందక అనంతపురం జిల్లాకు చెందిన ఒకదాత ఈ ఉదయం కన్ను మూశారు. ఆయన పేరు కొట్రా చిదంబరయ్య.మురళీ కృష్ణ కాటన్ మిల్స్ అధినేత.
ఇది ఈ తరానికి పరిచయం లేని పేరు. పాతతరానికి బాగా గుర్తున్న పేరు.
దాదాపు నలబై సంవత్సరాల క్రితమే అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రజలకు ఆయన మహోపకారం చేశారు. ఆ ఉపకారం ఏమనుకుంటున్నారా…. ఆరోజుల్లో తాడిపత్రి లో డిగ్రీ కాలేజ్ రావడానికి లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.
ఈ విషయాన్ని తాడిపత్రి పెద్దలు మురళీ కృష్ణ కాటన్ మిల్ అధినేత కొట్రా చిదంబరయ్య కు తెలియజేశారు. తాడిపత్రి ప్రజలకు ఉన్నత విద్య అందించడం కన్నా తానేమి చేయగలనని పెద్దలతో లక్ష రుపాయలు తన కంపెనీ తరుపున ఇచ్చేందుకు సంసిద్ధులు అయ్యారు.
కూరగాయల సత్య నారాయణ, కొట్రా చిదంబరయ్యలు కలసి నటరాజా అండ్ మురళీ కాటన్ మిల్ తరుపున డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం లక్ష రుపాయల విరాళం అందజేశారు.
ఇప్పటి విలువతో పోలిస్తే దాదాపు రెండు కోట్ల పైమాటే. ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నటరాజా అండ్ మురళీ కాటన్ మిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గానే పిలవబడుతోంది.
దాదాపు నలబై ఏళ్ళుగా ప్రతి ట్రాన్స్ఫ ర్ సర్టిఫికేట్ (టీసీ) మీద వీరి కంపెనీ పేరే ఉంటుంది. ఈ టిసి తీసుకుంటున్నవిద్యార్థులెవరికీ ఈ విషయం తెలియకపోవచ్చు.
అలాంటి మహోన్నత వ్యక్తికి విష జ్వరం వస్తే చికిత్స దొరకలేదు. ఆయన తనయుడు అనంతపురం, తాడిపత్రి లోని అన్ని ఆస్పత్రులలో చికిత్స చేయించడం కోసం ప్రయత్నించారు.
అయితే ఎవరూ చేర్చుకోకపోవడంతో చివరకు తన మిత్రుడికి సంబంధించిన అనంతపురం లోని క్రాంతి హాస్పిటల్ నందు అడ్మిట్ చేయిగలిగారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చికిత్స చేసే లోపే తుది శ్వాస విడిచారు.
కొట్రా చిదంబరంయ్య స్వగ్రామం తాడిపత్రి మండలం ఊరిచింతల. ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా జీవితం గడిపిన కొట్రా చిదంబయ్య మృతి తాడిపత్రి ప్రజలకు తీరని లోటు. ఆయన అప్పట్లోనే డిగ్రీ చదవడంతో తాడిపత్రి ప్రజలందరూ డిగ్రీ చదవాలనే బలమైన సంకల్పంతోనే కాలేజ్ ఏర్పాటుకు భూరి విరాళం అందజేశారని తాడిపత్రి పెద్దలు కొనియాడారు.
ఇప్పటికీ బెన్నీ కంపెనీని కొనుగోలు చేసి నష్టాలు వస్తున్నా రైతు, కార్మిక పక్షపాతిగా కొనసాగుతున్న కొట్రా చిదంబయ్య మరణం తాడిపత్రి ప్రజలకు చేదు వార్తే.కరోనా పరిస్థితి కారణంగా ఆయన అంతక్రియలు బుధవారం తాడిపత్రి లోని స్మశానవాటికలో నిరాడంబరంగా జరిగాయి.