(సేకరణ :–చందమూరి నరసింహారెడ్డి, 9440683219)
అఖిల భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుయిన తొలి తెలుగు వాడు పనప్కాకం అనంతాచార్యులు. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. 1891లో నాగపూర్ లో జరిగిన ఏడవ కాంగ్రెస్ మహాసభలో ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు , తెలుగు వారు వీరు. అప్పటికే ఆయన మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. (1893 నుంచి 1901 దాకా ఆయన నాలుగు సార్లు ఈ కౌన్సిల్ సభ్యుడయ్యారు.) నిజానికి కాంగ్రెస్ ఆశయాలేమిటీ వ్యక్తీకరించిందాయనే 1885లొ బొంబాయిలో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న72 మంది ప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. అపుడు కాంగ్రెస్ ఆశయాలు లక్ష్యాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు.
పనప్పాకం అనంతాచార్యులు చిత్తూరు జిల్లా కడమంచి గ్రామంలో 1843 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసాచార్యులు. వీరు చిత్తూరు జిల్లా కోర్టులో ఉద్యోగం చేశారు. తండ్రి మరణానంతరం ఆతని మిత్రుడైన సి. వి. రంగనాథ శాస్త్రులు సహాయం తో 1863 లో మెట్రిక్యులేషన్, 1865లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎఫ్.ఎ చదివారు.
తర్వాత మద్రాసు పచ్చియప్పా పాఠశాలలో ఉపాధ్యాయునిగా 1869 వరకు పనిచేశారు. ప్రైవేటుగా చదివి 1869లో బి.ఎల్ పరీక్షలో ఉత్తీర్ణులైయ్యారు.
మద్రాసు హైకోర్టు న్యాయవాదుల్లో అగ్రగణ్యులైన ఒకరైన కావలి వెంకటపతిరావు వద్ద అప్రెంటిస్ గా పనిచేశారు.
1870లో న్యాయవాది గా అనుమతిని పొంది కావలి వెంకటపతిరావుగారి జూనియర్ గా కేసులు చేయటం ప్రారంభించారు.
కొద్దిరోజులలోనే వీరికి ప్రతిపక్షంగా బారిస్టర్ హెచ్.డి.మైనీ అనుపేరుగడించిన న్యాయవాది తో భేటి పడి ఒక కేసులో వాదన చేయటం ఆ వాదనను హైకోర్టు ప్రధానన్యాయమూర్తి స్వయముగా ప్రశంసించారు. ఇది వీరి న్యాయవాదవృత్తిలో ఒక మైలు రాయి.
అప్పటినుండి వీరి సీనియర్ కావలి వెంకటపతి వీరిని జూనియర్ గా కాక తన భాగస్వామి గా స్వీకరించటం జరిగింది. అప్పటిలోనున్న అగ్రశ్రేణి న్యాయవాదులైన భాష్యం అయ్యంగార్, సర్ సుబ్రమణ్య అయర్ కోవకి చేరుకోవడం జరిగింది. హైకోర్టు న్యాయవాదులలో అగ్రగణ్యులయ్యారు.
వీరు 1889లో మద్రాసు న్యాయవాదుల సంఘాన్ని స్థాపించారు.న్యాయ విచారణ పద్దతులు, న్యాయవాదుల స్థితిగతుల మెరుగుదల కోసం చక్కని గ్రంధాలు పనప్పాకం అనంతాచార్యులురచించారు.
ఆరోజులలోని ఇండియన్ పీనల్ కోడ్ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని నిషేధం లోని లోటుపాటులను వీరు తీవ్రంగా విమర్శించి ఖండించారు. అప్పటి ప్రభుత్వము ఆయా శాసనములను సవరించుటకు లండను ఇంపీర్యల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
ఇందులో ఇద్దరే ఇద్దరు భారతీయ (నేటివ్) సభ్యులు.
వీరొకరు, దర్భాంగ మహారాజ మరొక సభ్యులుగా నియమించారు.
మిగతావారందరు ఆంగ్లేయదొరలగుట వారి అధిక సంఖ్యతో వీరి ప్రతిపాదనలు తిరస్కరించటం వీరు తీవ్రంగా డిసెంట్ ప్రకటించారు.
1895 నుండి 8 సంవత్సరాలు సభ్యలుగా వుండి భారతీయుల దీనస్థితిగతులను వైస్రాయి సమక్షంలో ధైర్యముగా వెల్లడించేవారు.
నిర్మొహమాటంగా అన్యాయమును ఖండించగల ధైర్యసాహసి. అందుకు తార్కాణం. 1881-1886 మధ్యకాలంలో మద్రాసు గవర్నరుగా నుండి భారతీయలపై పక్షపాతముగా అతి కఠినంగా వ్యవహరించిన
గ్రాంటు దొర వీడ్కోలుకు ప్రభు భక్తులు సంసిధ్దులగుతుండగా అనంతాచార్యులుగారొక బహిరంగసభలో నిర్మొహమాటంగా ఆప్రతిపాదనను తిర్కరించి ప్రసంగించటంతో ఆ వీడ్కోలు సన్నాహం ఆపటం జరిగింది.
భారత దేశంలో జాతీయ భావాలతో ఏర్పడిన తొలి సంఘం మద్రాస్ మహాజన సభ (MMS). పి. రంగయ్య దీనికి అద్యక్షుడయిన అనంతాచార్యులు కార్యదర్శిగా పనిచేశారు. ఇది మే 16,1884న ఏర్పడింది.
భారత దేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలను భారతదేశంలో నిర్వహించాలని, ఇంగ్లండ్ మిలిటరీ ఖర్చులకు భారత దేశం నుంచే వచ్చెే రెవిన్యూ నుంచి ఎక్కువ నిధులు కేటాయించడం నిలిపివేయాలని,లండన్ లోని కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయాలని ఎం ఎం ఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది.
1885 డిసెంబర్ 28 – 30ల మధ్య బొంబాయిలోని
సర్ గోకుల్ తేజ్ పాల్ సంస్కృతి కళాశాలలో మొదటి సమావేశం జరిగింది. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి 4గురు హాజరయ్యారు. పి.ఆనందాచార్యులు, కేశపిళ్ళై,పి.రంగయ్యనాయడు, సుబ్రమణ్య అయ్యర్. ఈ సమావేశానికి డబ్ల్యూ. సి. బెనర్జీ అధ్యక్షత వహించారు. దీనికి భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు సూచించింది దాదాభాయి నౌరోజి.
వీరు కాంగ్రెసు కార్యనిర్వహక సంఘంలో సభ్యులుగాను, అలహాబాదు కాంగ్రెసు కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యారు.
1878 లో స్దాపించబడ్డ హిందూ మహాజన సభలో సభ్యులు వీరు సభ్యులు. తిరునల్వేలి లిటరరీ సదస్సులోకూడా ప్రముఖ సభ్యులు.
సర్ టి మాధవరావు, మరియూ దివాన్ బహదూర్ ఆర్ రఘునాధ రావు గారు నిర్వహించిన ‘ది మద్రాస్ నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ ’ అనే ఇంగ్లీషు పత్రికలో అనంతాచార్లుగారు వ్యాసాలు రాశారు. ఆ పత్రిక కొన్నాళకు ఆగిపోయినతరువాత దాని స్ధానంలో ‘మద్రాసీ’ అను తెలుగు పత్రికలో వ్యాసాలు రాశారు.
1878 లో స్దాపించ బడ్డ ‘ది హిందూ’ పత్రిక లో అనేక వ్యాసాలు రాశారు. అనేక బహిరంగ సభలలో ఉపన్యాసాలిచ్చారు.
1882 లో “How to reform the Courts” అను గ్రంథమును 1883లో“The Legal Profession, how to reform it” అను గ్రంథముప్రచురించారు. న్యాయవాదిగా చేసిన కేసులలో వారి వాదనలు Indian Law Report లో తరచు ప్రచురించెవారు .
1890-1899 మధ్యన వారు ‘వైజయంతి’ అను తెలుగు పత్రిక కు సంపాదకులు గా ఉండి నడిపించారు.
ఆ పత్రికలో కొక్కొండ వెంకటరత్నం రచించిన మహాశ్వేత అను నవలను ప్రకటించారు. శబ్దరత్నాకరం రచించిన బహుజనపల్లి సీతారామాచార్యులు కూడా వైజయంతి పత్రికలో వ్యాసాలు వ్రాసేవారు. అనంతాచార్లుగారు మంజువాణీవిజయము అనే నాటకమును రచించి తన పత్రిక వైజయంతిలో ప్రచురించారు. ఆ వైజయంతి పత్రికలో అనేక గొప్ప గొప్ప పూర్వప్రబంధములను ప్రచురించారు అందులో ఎర్రాప్రగడ విరచితమైన నృసింహపురాణము , మాడభూషి వెంకటనరసిహాచారి గారు రచించిన పల్లవీపల్లవోల్లాసమం శకుంతలా పరిణయము (కృష్ణకవిరచించిన) మొదలగునవి ప్రచురించారు.
‘పీపుల్స్ మాగజైన్’ అను మాసపత్రిక కు సంపాదకుడు.
అనంతాచారి గారి చరమదశలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు స్నేహితులైనారు.
1896లో భారతీయ శాసనసభకు చెన్నై నుండి ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఆ సభలో నిర్భయంగా ప్రజల హక్కులను పరిరక్షించుటలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి 1903లో రాజీనామా చేశారు.
ఈయన ప్రతిభకు మెచ్చి 1887లో ఆనాటి ప్రభుత్వం రాజబహుదూర్ బిరుదు ప్రదానంతో సత్కరించారు. ఆంధ్ర భాషా సారస్వత పోషకుడిగా కీర్తి గడించడమే కాకుండా ‘ పద్యావినోద’ అనే బిరుదుతో ఆనాటి సాంస్కృతిక సమాజాలు సత్కరించి గౌరవించాయి. కడుపేదరికం నుండి తన మేధాసంపత్తితో కృషి, పట్టుదలతో అత్యంత ఉన్నత పదవులు అలంకరించారు.
పనప్పాకం అనంతాచార్యులు 1907 నవంబర్28 దివంగతులైనారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఫోన్ 9440683219)