జూలై 26, రిజర్వేషన్‌ డే : భారత జాతి ప్రజాస్వామీకరణలో బిసి వర్గాలు

(ప్రొ.ఎస్‌.సింహాద్రి)
భారత దేశంలో వెనుకబడిన వర్గాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతూనే వస్తున్నారు. డెబ్బై ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో మెజార్టీ జనాభా గల బీసీల జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం రాజకీయ, విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా కోసం బీసీలు పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వెనుకబడిన వర్గాల పోరాటం 1990 లో జాతీయ ఎజెండాగా మారింది. వాస్తవానికి యావత్ ఇరవయ్యవ శతాబ్దపు వెనకబడిన తరగతుల ఉద్యమాలకు బీపీ మండల్ విప్లవం దిక్సూచిగా నిలిచింది.
19వ శతాబ్దంలో మహాత్మా జోతిరావు ఫూలే ఉద్యమం ద్వారా సామాజిక వర్గాల ప్రాతినిథ్యానికి పునాది వేశారు. ప్రభుత్వ సంస్థలలో ‘సూద్ర అతిసూద్రుల’ కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ  1882 లో  ఫూలే హంటర్ కమిషన్‌కు వినతి పత్రం ఇచ్చారు. అయితే అంతకు ముందే కొంతమంది బ్రిటిష్ అధికారులు పాలనలో అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని భావించారు. ప్రభుత్వం కేవలం ఒక సమాజికం దృష్టితో చూడకూడదని వారు అభిప్రాయపడ్డారు. ఇతర కులాలనూ ప్రభుత్వంలో చేర్చవలసిన అవసరం ఉందని సూచనలు చేశారు.
ఫూలే సత్య శోదక్ ఉద్యమం, ప్రార్థనా సమాజ్, స్వాతంత్ర్య ఉద్యమం మరియు బ్రిటిష్ ప్రజాస్వామ్యం ద్వారా ప్రభావితమైన కొల్హాపూర్ రాజు షాహు మహారాజ్ ‘బ్రాహ్మణేతరులకు 50% రిజర్వేషన్ల’ విధానాన్ని ప్రారంభించారు. 1902 జూలై 26న రిజర్వేషన్‌ల అమలుకు ఆదేశాలు జారీ చేశారు. పరిపాలన మొత్తం కేవలం బ్రాహ్మణుల చేతుల్లోనే ఉన్నట్టు ఆయన గుర్తించాడు. ప్రభుత్వ, రాజ్యాంగ వ్యవస్థలకు దూరం చేయబడిన అనేక కులాలు, వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రజాస్వామికీకరణకు నాందిపలికాడు.
వెనుకబడిన తరగతులకు సాహు కల్పించిన రిజర్వేషన్ ఉన్నత వర్గాల గుత్తాధిపత్యానికి సవాల్ గా మారింది.  ఇటువంటి రిజర్వేషన్ విధానాలు కులాల ప్రజాస్వామ్య ఆకాంక్షలను ప్రోత్సహిస్తాయని పూజారి వర్గం భావించింది. ఈ స్ఫూర్తిని బ్రిటీష్ పాలిత ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తారని, అది వారి సామాజిక ఆధిపత్యానికి సవాల్ గా మారుతుందని అభిప్రాయపడ్డారు. అందువల్ల బ్రాహ్మణేతర రిజర్వేషన్లను మహారాష్ట్ర అంతటా ముక్త కంఠంతో వ్యతిరేకించారు.
భారత జాతీయోధ్యమ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన బాలగంగాధర్ తిలక్ సాహు రిజర్వేషన్ ల వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. పరిపాలనలో కుంబిలు ఏమి చేస్తారని వాదించారు? అక్కడికి వచ్చి దున్నుతారా? లేదా షింపీలు ఏమి చేస్తారు?  ప్రభుత్వ సంస్థలలో కూర్చుని బట్టలు కుడుతారా? అని అవమానకరంగా హేళన చేస్తూ తిలక్ రిజర్వేషన్ లను వ్యతిరేకించారు.

షాహు మహరాజ్ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా పాపం చేశారని కొల్హాపూర్ రాష్ట్రంలోని బ్రాహ్మణులు వాదించారు. అంతేకాదు సాహు మహరాజ్ పాపం చేయడం వల్లే అతని తల్లి చనిపోయిందంటూ ప్రచారం చేశారు. అయితే షాహు మహరాజ్‌ వారి ఒత్తిడికి లోనుకాలేదు. మరో అడుగు ముందుకేసి, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ల అమలు తీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
వ్యాపారం, పరిశ్రమలలో బ్రాహ్మణేతరులను ప్రోత్సహించడానికి సాహు తన వంతు ప్రయత్నం చేశాడు.  వ్యాపార, పరిశ్రమ రంగాల్లోకి ప్రవేశించడం ద్వారా ప్రజలు అభివృద్ధి చెంది, మంచి వృద్ధిలోకి వస్తారని సాహు స్వయంగా ప్రచారం చేశారు. తన వాదనను రుజువు చేయడానికి ఆంగ్ల ప్రజల అభివృద్ధి పథాన్ని వివరించారు. ఆ విధంగా సాహు మహరాజ్‌ దృష్టి కేవలం సమాజాన్ని ప్రజాస్వామీకరించడమే కాకుండా, ఆదాయం లేని కుల వృత్తుల నుంచి  బయటపడటం ద్వారా ప్రజలను ఆధునీకరణవైపు నడిపించింది.
షాహు నుండి నేటి వరకు ఉన్నత వర్గాలు రిజర్వేషన్లను వ్యతిరేకించడంలో కఠినంగా వ్యవహరించాయి. సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు, వారి నాయకత్వంలో నడిచే ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ లను వ్యతిరేకించాయి. రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా రాయడమేగాకుండా, అభూత కల్పనలను, అప్రజాస్వామిక వాదనలను ప్రధాన స్రవంతి టీవీ, దిన పత్రికల మాధ్యమం ద్వారా ప్రచారం చేశారు. ఆరోజు నుంచి నేటి వరకు సమాజంలోని ఉన్నతవర్గాలు సనాతన మనస్తత్వాన్నే కొనసాగిస్తున్నారు.
2015 లో బీహార్ ఎన్నికల సందర్భంగా..ఎవరిని బలి చేసి ఈ రిజర్వేషన్ లను కొనసాగిస్తున్నారో చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. దానికి లాలు ప్రసాద్ యాదవ్ సమాధానం ఇస్తూ.. ఉన్నత, వెనకబడిన వర్గాల మధ్య పోరాటం జరగాలని, మండల్ రాజ్-2 ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
(ప్రొ.ఎస్.సింహాద్రి,రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్ వాదీ పార్టీ,
తెలంగాణ రాష్ట్రం,సెల్ నెం: 9490568899, వాట్సాప్:8688943120)