తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 7 జాతీయ ఉత్తమ అవార్డులు
హైదరాబాద్, జూన్ 16ః తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 7 జాతీయ ఉత్తమ అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ హవా కొనసాగింది.
ప్రతి ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రకటించే దీన్ దయాల్ పంచాయత్ సశక్తీ కరణ్ పురస్కారాలలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏడు అవార్డులు దక్కాయి. ఏడు అవార్డులూ జనరల్ కేటగిరీలోనే రావడం విశేషం. జిల్లా, బ్లాక్/మండలం, గ్రామ పంచాయతీల వారీగా ఈ అవార్డులను ప్రకటించారు. కేటగిరీల వారీగా మొదటి కేటగిరీలో నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ గా, రెండో కేటగిరీలో గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ అవార్డు, మూడో కేటగిరీలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డుల పేరుతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సంజీబ్ పత్ జోషీ ఈ అవార్డులను ప్రకటించారు.
ఈ అవార్డులో, జిల్లా విభాగంలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు దక్కింది. బ్లాక్/మండలం విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా)లోని సుల్తానాబాద్ కి అవార్డు వచ్చింది. ఇదే కేటగిరీలో నిజామాబాద్ జిల్లా నందిపేటకు వచ్చింది. గ్రామ పంచాయతీ విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా), శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీకి దక్కింది. ఇదే విభాగంలో మెదక్ జిల్లా (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) చిన్న కోడూరు మండలం గుర్రాల గొండి గ్రామ పంచాయతీకి దక్కింది. ఇదే విభాగంలో కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీకి వచ్చింది. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం (ప్రస్తుతం సిద్దిపేట రూరల్ మండలం)లోని పెద్ద లింగారెడ్డి పల్లె అనే గ్రామ పంచాయతీకి జనరల్ కేటగిరీలో అవార్డు దక్కింది.
ఉత్తమ జిల్లా/మండలం/గ్రామ పంచాయతీలకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు, శుభాకాంక్షలు
జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని 7 జాతీయ ఉత్తమ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రకటించిన మూడు కేటగిరీల్లోనూ అవార్డులు రాగా, అవన్నీ జనరల్ విభాగంలోనే రావడం మన రాష్ట్ర ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఈ అవార్డులు సిఎం కెసిఆర్ దార్శనికతకు, ప్రగతికాముక నిబద్ధతకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు.