కాంగ్రెస్ మాజీ ఎంపి చిరంజీవి, జనసేన నేత పవన్‌కల్యాణ్‌ల పై తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్, చిరంజీవి 2019 ఎన్నికల్లో కలిసి పని చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యం తెలుగుదేశం పార్టీ ఇద్దరిని కట్టగట్టి విమర్శించడం మొదలు పెట్టింది. సమాధానం చెప్పాలని అనేక ఇబ్బందికరమయిన ప్రశ్నలను రోజూ సంధిస్తూ ఉంది. ఈ రోజు ఎంపి కేశినేని ఈ దాడికి పూనుకున్నారు.
బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… చిరంజీవిది పోస్ట్‌పెయిడ్ పార్టీ.., పవన్‌ది ప్రీపెయిడ్ పార్టీ అన్నారు.
విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్‌కల్యాణ్ ఇపుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీకి పోయే కాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని అన్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు. అలాగే సభను ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత స్పీకర్దేనని నాని అన్నారు. అవిశ్వాసంపై చర్చించాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని ఎంపీ అన్నారు.
‘‘అన్న చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రవిభజన జరిగింది. కుటుంబం లో అన్నని ప్రశ్నించలేని వాడు బయట ప్రపంచంలో ఎవరినైనా ఎలా ప్రశ్నిస్తాడు? అన్ననే చొక్కా పట్టుకొని అడిగితే, ఈ పరిస్థితి వచ్చేది కాదు,’’ అని ఆయన అన్నారు.