మైసూరు దసరా స్పెషల్: గజరాజులకు పండగ శిక్షణ ఎంత కష్టమంటే…

(బి వెంకటేశ్వర మూర్తి)
బెంగుళూరు: పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు ఏనుగులన్నింటిలోనూ మైసూరు దసరా ఏనుగులు విశిష్టమైనవి. వాటిల్లో జంబూ సవారీలో చాముండేశ్వరీ దేవి అంబారీతో ఠీవిగా సాగే  గజరాజు రారాజుతో సమానమే.
విజయదశమి పర్వదినాన చాముండేశ్వరీ అమ్మవారికి మహారాజా వారి పూజలయ్యాక, అంబారీని వీపున మోస్తూ చెవులు చిల్లులు పడే భేరీ భాంకారాల మధ్య ఇసుమంతైనా రాజసం తగ్గకుండా పెళ్లి నడకలు నడవటం అన్ని ఏనుగులకూ సాధ్యమయ్యే పని కాదు. ఏనుగై పుట్టినంత మాత్రాన ఆ అదృష్టం అన్నిటికీ అబ్బేదీ కాదు.

దాదాపు 750 కిలోల బరువైన బంగారు అంబారీ (హౌదా)ని మూపున దాల్చి రాజప్రాసాదం నుంచి బన్ని మంటపం దాకా దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం ఊరేగడం సాధారణమైన సంగతా?.
మైసూరు, కొడగు జిల్లాల్లోని వందలాది గజరాజుల్లో కొన్నింటిని ఎంపిక చేసి, దాదాపు నెల రోజులు ముందే మైసూరు నగరానికి రప్పించి, సుష్టుగా మేపి మరింత శరీర పాటవం సంతరించి, యమనియమాలతో కఠోరమైన శిక్షణతో జంబూ సవారీకి సిద్ధం చేస్తారు.
మైసూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని వీరనహొసళ్లికి ఏనుగుల మొదటి బృందం వేంచేసినప్పుడు స్థానిక ప్రజలూ, దసరా నిర్వహణాధికారులూ, మంత్రులూ బాజా భజంత్రీలతో స్వాగతం పలకడంతో దసరా `గజపయన’ ప్రారంభమవుతుది.

అక్కడి నుంచి మైసూరులోని అరణ్యభవనం చేరుకుని రెండు మూడు రోజులు సేద తీరాక దసరా ఏనుగులు రాజప్రాసాదంలోని తమ విడిదికి చేరుకుంటాయి.
ఆ పైన దాదాపు నెల రోజుల పాటు వాటికి దేహదారుఢ్య శిక్షణ, మనుషుల మధ్య పొందికగా ఉండటం, చిత్రవిచిత్రమైన తీవ్ర ధ్వనులు విన్నా రంగురంగుల విద్యుద్దీపకాంతులు కళ్లలోకి పడినా సంయమనం కోల్పోకుండా సహనంతో ఉండటం లాంటి విభిన్న అంశాలపై తరిఫీదు ఇస్తారు. ఊరేగింపు రిహార్సల్స్ కూడా చేయిస్తారు.
మిగత అన్ని ఏనుగుల కంటే అత్యంత కఠినమైన, ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించే అంబారీ ఏనుగు అర్జునపై శిక్షకులు మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. అమ్మవారి అంబారీ మోసే ఏనుగు కాబట్టి, ఊరేగింపు మైసూరు రాజ వంశీకుల, మొత్తం కన్నడిగుల సెంటిమెంట్లతో ముడిపడిన అంశమైనందున సాంతం అనుకున్న విధంగా జరిగితీరాలే తప్ప ఇసుమంతైనా తేడా రావడానికి వీల్లేదు.
ఏనుగు మెడ మీద కూర్చుని పొందికగా నడిపించే ప్రధాన శిక్షకుడిని మావుత (మావటి తెలుగు), అతని సహాయకుడిని కవాడి అని పిలుస్తారు.
14 దసరా ఏనుగుల తిండీతిప్పలు, ఇతర అవసరాల కోసం మొత్తం రూ. 25 లక్షలు ఖర్చవుతుంది.
అడవిలో ఉన్నప్పుడు ఒక్కో ఏనుగు దాదాపు 400 కిలోల ఆహారం తింటుంటుంది. ఇక్కడ దసరా డ్యూటీకి వచ్చాక వాటికి మరింత శక్తివంతమైన ఆహారాన్నిచ్చి బరువు కాస్త పెరిగేలా చూస్తారు.

గతేడాది అర్జున బరువు 5650 కిలోలు కాగా ఈసారి రాజప్రాసాదానికి వచ్చిన కొత్తలో అతడి బరువు 5800 కిలోలు. అన్నట్టు దసరా ఏనుగుల బరువు తూచడం కూడా సంప్రదాయ హక్కేనేమో అనిపిస్తున్నది.
గత 26ఏళ్లుగా ధన్వంతరి రోడ్డులోని శ్రీ సాయిశ్రీరామ్ అండ్ కో వారి ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ లోనే ఏనుగుల బరువు చూస్తున్నారు.
రోజుకు ఒక్కో ఏనుగుకు 450 నుంచి 650 కిలోల వరకు వాటి కెపాసిటిని బట్టి మద్ది/రావి ఆకులు ఇస్తారు. మరింత బలం కోసం ఉడికించిన ఉద్దిపప్పు, పెసలు, బియ్యం, గోధుమలు, ఉల్లిపాయలు కలిపి 15-20 కిలోల పెద్ద పెద్ద ముద్దలు చేసి తినిపిస్తారు.
ఇంకా బీట్రూట్, ముల్లంగి, క్యారట్, దోసకాయలు కూడా ఉడికించి వడ్డిస్తారు. రాజప్రాసాద ప్రాంగణంలో ఓ పెద్ద షెడ్డు వేసి ఏనుగుల వంటశాల ఏర్పాటు చేస్తారు.
అటవీ శాఖ ఉన్నతాధికారులూ, పశు వైద్య నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో గజరాజుల మృష్టాన్నభోజనం రోజూ భారీ ఎత్తున తయారవుతుంటుంది.
దసరా కోసం సరదాగా మైసూరు వచ్చి కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర పోతామంటే కుదరుదు గాక కుదరదు. ఊరేగింపు రిహార్సల్ ని తాలీము అంటారు. బాగా తిని కండలు పెంచుకునే ఏనుగులు రోజూ అయిదు ప్లస్ ఐదు కిలోమీటర్లు భారీగా బరువులు మోస్తూ తిరగాలి.
అంబారీ ఏనుగు అర్జున, మరో స్టాండ్ బై ఏనుగులకైతే తాలీములో బరువు మరీ ఎక్కువ. చెక్కతో చేసిన 350 కిలోల బరువైన అంబారీని మూపున మోపి, దాంట్లో మరో 300 కిలోల ఇసుక మూటలు (మొత్తం 650 కిలోలు) వేసి చల్ చల్ మంటూ నడిపిస్తారు. క్రమక్రమంగా ఈ బరువును వెయ్యి కిలోల దాకా పెంచుతూ రోజూ తాలీము జరిపిస్తారు.
జంబూ సవారీ కోసం ఎంపిక చేసే ఏనుగులన్నీ మైసూరు, కొడగు, శివమొగ్గ జిల్లాల్లోని వివిధ ఏనుగు శిబిరాల్లోని మచ్చిక చేసిన ఏనుగులే. తమ తమ మావటీల మాటను తుచ తప్పకుండా వింటూ బుద్ధిగా నడుచుకుంటున్న రాముడు మంచి బాలుడు వంటి ఏనుగులే దసరా కవాతుకు ఎంపికవుతాయి.
జంబూ సవారీలో పాల్గొనే ఏనుగులు పన్నెండు కాగా మొత్తం 14 నుంచి 16 ఏనుగుల్ని ఎంపిక చేసి మైసూరుకు తరలిస్తారు.
వాటి గత చరిత్ర, శిబిరాల్లో వాటి ప్రవర్తన, సాటి ఏనుగులతో, మావటీలతో నడుచుకునే తీరు, శారీరక, మానసిక స్థిరత్వం, ప్రత్యేక పరిస్థితుల్లో స్పందించే విధానం, క్రమశిక్షణ వగైరా అంశాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించాక ఎంపిక చేస్తారు.
వీటన్నింటినీ మించి ఇదివరకు జంబూ సవారీలో పాల్గొన్న అనుభవం అదనపు అర్హత అవుతుంది. అంబారీ ఏనుగుగా ఎంపికవ్వాలంటే ముఖవర్చస్సు, చూపుల్లో, నడకలో రాచఠీవి నిర్ణాయిక అంశాలవుతాయి.
కొంతకాలం క్రితం వెలువడిన సుప్రీంకోర్టు రూలింగ్ మేరకు అంబారీ డ్యూటీ ఏనుగులకు 60 ఏళ్లకు రిటైర్ మెంటు అమలు చేస్తున్నారు. కామోద్దిపనతో మదజలం కారుతున్న ఏనుగులను, వాటికి రోషావేశాలు ఎక్కువైనందున జంబూ సవారీకి ఎంపిక చేయరు. అలాగే గర్భంతో ఉన్న ఆడ ఏనుగులను దసరా ఊరేగింపులో బరువైన డ్యూటీలనుంచి మినహాయిస్తారు.
అర్జున వయసు ఇప్పుడు 59 ఏళ్లు కాబట్టి అంబారీ మోసే బాధ్యతకు బహుశ ఇదే ఆఖరి దసరా కావచ్చు. అర్జున 2012 నుంచి అమ్మవారి అంబారీ మోస్తున్నాడు. అంతకు ముందు బలరామ పన్నెండేళ్ల పాటు నిరాఘాటంగా అంబారీ మోసింది.
బలరాముడికి ముందు రికార్డు స్థాయిలో వరసగా 18 ఏళ్ల పాటు అంబారీ మోసిన ద్రోణ కర్ణాటక ప్రజల మనసులు దోచుకున్నది. 1998లో నాగరహొళె అభయారణ్యంలో విద్యుత్ కంచె తీగెల్లో చిక్కుకుని ద్రోణ విద్యుదాఘాతంతో మరణించడం కన్నడిగులను కలచి వేసింది.
అందచందాలు, అణకువ, భీముడి బలం, రాజసం ఉట్టిపడే నడక గల ద్రోణ దసరా వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అన్నింటినీ మించి అదెంతో తెలివైనదని శిక్షకులు, అటవీ శాఖాధికారులు గుర్తు చేసుకుంటుంటారు.
ఊరేగింపులో ఒక్కోసారి ఎప్పుడైనా హౌదా పక్కకు వొరిగితే వీపుభాగం కండరాలను అటూఇటూ సరిచేసుకుంటూ అంతటి బరువైన హౌదాను తనకు తానుగా మళ్లీ మధ్యకు తెచ్చేసుకుని ముందుకు సాగుతుండేదట.
దాదాపు 27 ఏళ్ల పాటు మమేకమై బ్రతికిన మావటీ దొడ్డప్పాజీ ద్రోణ మరణానంతరం మైసూరు దసరా వేడుకలకు రావడం మానేశాడు.
ద్రోణ జ్ఞాపకాలతో కృంగిపోతున్నందున తనను దసరా డ్యూటి నుంచి మినహాయించవలసిందిగా అటవీ శాఖ అధికారులను దొడ్డప్పాజీ వేడుకున్నాడు. మావటీలతో ఏనుగుల అనుబంధానికి ఇదో మచ్చు తునక.
అర్జున తర్వాత అంబారీని భుజానికెత్తుకునే డ్యూటీ కోసం ధనంజయ(36), అభిమన్యు(53), ఈశ్వర్(49) పోటీ పడుతున్నారు. వీళ్లలో పిన్న వయస్కుడూ, అందగాడైన ధనంజయ వైపే అటవీ శాఖాధికారుల మొగ్గు చూపుతున్నారు.