తెలంగాణ పల్లె ప్రగతి సిబ్బంది (TRIGP) బలవంతపు బదిలీ లు ఆపాలని సెర్ప్ జేఏసీ డిమాండ్ చేసింది. లేనిచో TRIGP సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి 33జిల్లాలో13న ధర్నాలు చేపడతామని హెచ్చరించింది. వివరాలు కింద ఉన్నాయి.
తెలంగాణ పల్లె ప్రగతి పేరుతో స్వయంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన టి ఆర్ ఐ జి పి కార్యక్రమం లో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులను ఒప్పందానికి విరుద్ధంగా ఏడు నెలల ముందే ప్రాజెక్టును రద్దు చేసి బలవంతంగా బదిలీ చేయడానికి అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉద్యోగుల సంఘం నాయకులు నర్సయ్య, గంగాధర్, సుభాష్ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.
ఒప్పందం ప్రకారం మార్చి 2020 వరకు తెలంగాణ పల్లె ప్రగతి TRIGP కార్యక్రమం కొనసాగాల్సి ఉండగా గత నెలలోనే ఈ కార్యక్రమం రద్దు అయినట్లుగా అధికారులు ఆదేశాలు జారీ చేసి అలవెన్సు నిలిపివేశారని తెలిపారు.
ఇందులో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న 205 మంది సిబ్బందిని బలవంతంగా బదిలీ చేయాలని చూస్తున్నారని వెంటనే ఈ బదిలీ నిలిపివేయాలని జేఏసీ నేతలు ప్రకటన లో పేర్కొన్నారు
నిబంధనల ప్రకారం TRIGP ప్రాజెక్టులోకి డిప్యుటేషన్ పై వెళ్లేముందు సంబంధిత సెర్ప్ సిబ్బంది పని చేసినటువంటి పాత స్థానాలను ఇపుడు ఖాళీగా చూపాల్సింది పోయి ఇప్పుడు ఆ పోస్టులు లేవని చెబుతూ బలవంతంగా జిల్లా, జోన్ దాటి బదిలీలు చేయడానికి ఉత్తర్వులను అధికారులు జారీ చేసినట్లు వారు ఆరోపించారు.
బదిలీలు కోరుకున్న వారికి చేయాలని మిగతా వారికి ఏప్రిల్ నెలలో వేసవి సెలవుల్లో జరిగే జనరల్ కౌన్సిలింగ్ లో అందరికీ బదిలీలు చేయాలని మంత్రిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, సీఈఓ ను పలుమార్లు కోరామని వివరించారు. కానీ కేవలం ఏడు నెలలు వేచి చూడకుండా ఇప్పుడు బలవంతంగా బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అధికారులు 16వ తేదీన ఈ బలవంతం బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు 13వ తేదీన ఈ బదిలీ నిలిపివేయాలని కోరుతూ సెర్ప్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంపూర్ణ సహకారం ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ అధికారులు మాత్రం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ ఈ బలవంతపు బదిలీలకు తెర లేపారని ఉద్యోగులు ఆరోపించారు.
వెంటనే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని ఉద్యోగుల బలవంతపు బదిలీల నిలిపివేయాలని, కేవలం ఆప్షన్ ఇచ్చిన వారిని మాత్రమే బదిలీ చేయాలని ఉద్యోగుల జెఏసి నాయకులు విజ్ఞప్తి చేశారు.
లేదా మంగళవారం 13న హైదరాబాద్ లోని సెర్ప్ ప్రధాన కార్యాలయం ముందు పల్లె ప్రగతి ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కేవలం అధికారుల మొండి వైఖరి కి మాత్రమే వ్యతిరేకంగా 33 జిల్లా OB లు, రాష్ట్ర OB పల్లె ప్రగతి సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు.