-టి. లక్ష్మీనారాయణ
1960, 1970 దశకాల్లో హైదరాబాదు పాత నగరంలో మతం కార్డును మజ్లిస్, జన సంఘ్, రెండు పార్టీలు వాడుకొని ఉనికి కాపాడుకొంటూ వచ్చాయి.
ఒకనాటి జన సంఘ్ నేటి భారతీయ జనతా పార్టీ (బిజెపి). 1951లో పుట్టిన భారతీయ జన సంఘ్ పార్టీ, ఎమర్జెన్సీ పూర్వరంగంలో 1977లో జనతా పార్టీలో విలీనమై, ద్వంద సభ్యత్వం(జనతా పార్టీ మరియు ఆర్.ఎస్.ఎస్. లో సభ్యత్వం) సమస్యపై రేగిన రగడ పర్యవసానంగా పూర్వాశ్రమంలో జన సంఘ్ కు చెందిన వారంతా జనతా పార్టీని వీడి 1980లో భారతీయ జనతా పార్టీగా కొత్త అవతారం ఎత్తారు.
1998 సాధారణ ఎన్నికల తర్వాత టిడిపి తోడ్పాటుతో అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి అయ్యారు. కొంత కాలానికి ఏఐడియంకె మద్దతు ఉపసంహరించుకోడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపితో కలిసి పోటీ చేసి, బిజెపి ఏడు స్థానాల్లో గెలిచి, బలం పుంజుకున్నదన్న ఒక భావన కలిగించింది. ఆ ఎన్నికల్లో 29 లోక్ సభ స్థానాల్లో గెలుపొందిన టిడిపి తోడ్పాటుతో మళ్ళీ అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి అయి 2004 వరకు ఉన్నారు.
2008లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది, దక్షిణాదిన ఒక రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, మూడేళ్ల తర్వాత నిష్క్రమించింది.
తెలంగాణాలో పాగా వేయాలని నిన్న మొన్నటి వరకు ఉవ్విళ్ళూరుతూ వచ్చింది. కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ (టీఆర్ఎస్)కు చెందిన మాజీ మంత్రులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, ఇతర నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించి, తమ బలం పెరిగిపోయిందన్న భ్రమలను ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేసింది. ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావును అమిత్ షా ఇంటికెళ్ళి మరీ కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ ను విమానాశ్రయానికి పిలిపించుకొని కలిశారు. భీమవరంలో మోడీ చిరంజీవిని కౌగలించుకున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని, ఆయనతో రాజీనామా చేయించి, మునుగొడులో ఉపఎన్నికలు తెచ్చి, వందల కోట్లు ఖర్చు చేసి, గెలవడం ద్వారా ఇదిగో అధికారంలోకి రాబోతున్నామన్న సంకేతాన్ని ఇవ్వాలనుకొని చతికిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకొని ఢీలా పడిపోయారు. బిజెపి శ్రేణులను నిరాశా నిస్పృహలు ఆవహించాయి.
తెలంగాణలో కాంగ్రెస్ జవసత్వాలను కూడగట్టుకొని ఊహించని రీతిలో బలం పుంజుకున్నది. కేసీఆర్ ను “ఢీ” కొట్టేది మేమేనన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కలిగించింది. దాంతో బిజెపి, బి.ఆర్.ఎస్. పార్టీల నుండి కాంగ్రెస్ వైపు వలసలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయి కండువా పక్కన పడేసి, మళ్ళీ కాంగ్రెస్ కండువా వేసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు మోడీ ప్రభుత్వం చేసిన దగా, దానికి తోడు చంద్రబాబు అరెస్టు ఉదంతం బిజెపి పట్ల ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత కనపడుతున్నది. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల రసవత్తర మలుపులు తిరిగాయి.
బిజెపి అధికారంలోకి రాలేమన్న నిర్ధారణకు వచ్చేసింది. కేంద్రంలో తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా నివారించడానికి కేసీఆర్ తో లోపాయకారి ఒప్పందం చేసుకొని, లాలూచీ కుస్తీ చేస్తున్నదన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ అపవాదు నుండి బయటపడి, “కింగ్” కాలేకపోయినా “కింగ్ మేకర్” అయ్యి, కేసీఆర్ ను తమ పంచనపడి ఉండేలా చేసుకోవాలన్న ప్రయత్నాల్లో బిజెపి తలమునకలై ఉన్నట్లు కనబడుతున్నది. అందులో భాగంగానే బిజెపి అధ్యక్షులు నడ్డా స్వయంగా రామోజీరావును, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, వాళ్ళ ఇళ్లకెళ్ళి మరీ కలిశారు. పవన్ కళ్యాణ్ ను వదిలిపెట్టకుండా తమతో అట్టిపెట్టుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్ని ప్రయాసలు పడ్డా ఫలితం దక్కుతుందో! లేదో! చూడాలి.
(టి. లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)