జేసుదాసు సినిమాల్లోకి ఎలా వచ్చారంటే…

– ప్రఖ్యాత నటుడు  కాకరాలతో సినిమా ముచ్చట్లు

రాఘవశర్మ

“జేసు దాస్ వంటి గొప్ప గాయకుడిని సినిమారంగానికి పరిచయం చేసిన వ్యక్తి ఎం.బి. శ్రీనివాసన్.
నేపథ్య గాయకుల్లో జేసుదాస్ ది ఒక విశిష్టమైన, ప్రత్యేకమైన గాత్రం.” అంటారు ప్రముఖ సినీ, రంగస్థల నటులు కాకరాల.

వైద్యం కోసం తిరుపతి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయన సినిమా రంగం గురించి కొన్ని కొత్త విషయాలు ముచ్చటించారు.

ఆ ముచ్చట్లు వారి మాటల్లోనే విందాం.

“ఎం.బి.శ్రీనివాసన్ వస్తుతహా సంగీత దర్శకుడు. సినిమా ఆర్టిస్టుల ఫెడరేషన్ పని చూస్తూనే ‘మెడ్రాస్ మ్యూజికల్ క్వైర్’ అనే సంస్థను స్థాపించారు. తనదైన పద్ధతిలో సంగీతం పైన ఒక ప్రయోగం చేశారు. ఎక్కడా ఆర్కెస్ట్రా లేకుండా పాట, బీజియంస్ అన్నీ కూడా శ్రుతిలయలతో, మానవ గాత్రాలతోటే ఆయన ప్రయోగం సాగుతుంది.
ప్రయోగంలోకి వెళ్ళే ముందు కొంత పరిచయం చేసుకోవాలి.

ఆయన ‘అగ్రహారత్తిల్ కళిద ‘ అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆయన ప్రయోగంలోకి వెళితే, తన ఇంట్లోనే ఈ నూతన ప్రయోగానికి ప్రయత్నాలు చేశారు.

ఒక పదిమంది సంగీతం తెలిసిన స్త్రీ పురుషులను ఎన్నుకుని, వాళ్ళకు తన ప్రయోగ లక్ష్యాన్ని వివరంగా చెప్పి, వారందరినీ ఆ ప్రయత్నానికి సంసిద్ధం చేశారు.
ఒక పదిమందికి దాన్ని క్షుణ్ణంగా నేర్పారు.
ఆ పదిమందిని టీచర్లుగా తయారు చేశారు.
ఆ టీచర్లను మద్రాసు మహానగరంలో ఉన్న అన్ని ప్రాంతాల పాఠశాలలకు పంపించి, వారి ద్వారా ఆ ప్రయోగాలను విస్తృతం చేశారు.
దాంతో అన్ని పాఠశాలల్లోనూ ఈ పద్ధతిలో ప్రయోగానికి ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా ప్రావీణ్యం సంపాదించారు.

అంతిమంగా ప్రెసిడెన్సీ కాలేజి పెద్ద ఆవరణలో ఈ ప్రయోగాన్ని ప్రజల ముందుంచారు.
ఆ విధంగా అది అద్భుత ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయింది.

ఎం.బి. శ్రీనివాసన్ గారు కైలాసనాథ న్ కడ్జూ గారికి అల్లుడవుతారు. ఎం.బి. శ్రీనివాసన్ దంపతులు ఒక విధంగా ఈ ప్రయోగానికి కర్తలు.

గాయకుడు జేసుదాసు

శ్రుతి,లయ, స్త్రీ పురుష గాత్రాలు తప్ప ఏ ఒక్క జంతర్ గాత్రానికి అవకాశం లేకపోవడమే దీని ప్రత్యేకత.
ఈ ప్రత్యేకతే సింపుల్ అండ్ బెస్ట్ గా అలరించింది.
జంతర్ గాత్రాల గందరగోళం లేకుండా, సులువుగా సూటిగా, నిరాడంబరంగా సాగే ఈ ప్రయోగం విశిష్టంగా, వినూత్నంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

ఇలాంటి సృజనాత్మక ప్రక్రియల్ని సృష్టిస్తూనే ఆయన సాటి మిత్రుల్ని కలుపుకుని పెడరేషన్ ద్వారా దక్షిణాదినంతా ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఉత్తరాదిన కలకత్తా, ముంబయిని కలుపుకుని ఆలిండియా కాన్ఫెడరేషన్ కు అంకురార్పణ చేయడంలో తన దైన ప్రయత్నం చేశారు.” అని సినిమా ప్రపంచానికి తప్ప, బైటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎం.బి. శ్రీనివాసన్ గురించి వివరించారు.

“బాపు గారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
వారి సినిమాలన్నిటిలో నటించాను.
బాపు గారు నిడుమోలు జగన్నాథ గారికి స్వయానా మేనల్లుడు.

ఆ విధంగా బాపు రమణలకు నేను సన్నిహితమయ్యాను.
వారు చేసిన ప్రయత్నాల్లో నన్ను ఒదిలిపెట్టకుండా చిన్నో, పెద్దో అవకాశాలు ఇచ్చింది వారే.
ఆ విధంగా డాక్టర్ రాజారావుగారి తరువాత నేను కృతజ్ఞుడనై ఉన్నది వారిద్దరికే.

బాపు గారి తరువాత నన్ను తన ఆధీనంలోకి తీసుకుని నాకు సినిమాల్లో ప్రత్యేకమైన అవకాశాలు ఇప్పించింది తాపీ ధర్మారావుగారి పుత్రుడు, దర్శకుడు తాపీ చాణక్య.
తరువాత సినిమారంగ స్వభావాన్ని చెప్పి, సినిమాలకు మార్గదర్శకత్వం చెప్పింది కూడా తాపీ చాణక్య గారే.
రాముడు-భీముడు, కానిస్టేబుల్ కూతురు మొదలైన చిత్రాల్లో తాపీ చాణక్య గారి దర్శకత్వంలో నటించాను.
చాణక్య గారిమార్గదర్శకత్వం కొనసాగుతుండగానే ఆయన గురువైన బి.ఏ. సుబ్బారావు గారి సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి. ఆ సందర్భంలో విజయ విలాసం మీద తాతాజీ రాసిన హృదయ్యోల్లాస వ్యాఖ్యానం నన్నెంతో ప్రభావితం చేసింది.
గ్రాంధిక వాదైన తాతాజీని ఈ హృదయోల్లాస వ్యాఖ్యానం వ్యావహారిక భాషావాదిగా చేసిందని నాకనిపిస్తూ ఉంటుంది.” అని బాపుతో, తాపీ తాతాజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.

“నన్ను విడిచిపెట్టకుండా ఇప్పటి దాకా సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నది నా మిత్రుడు, నిర్మాత, దర్శకుడు సివి రెడ్డి గారే. ఎనభై ఐదేళ్ళ ఈ వయసులో కూడా నాకు తగిన పాత్రలు ఇస్తున్నారు. ఇప్పటికీ ఆయన తీస్తున్న పేరు నిర్ధారించని సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది.
ఆసినిమాలో కథానాయిక సీత తాతగా నేను నటిస్తున్నాను.

సాలూరి రాజేశ్వరావుగారి మనుమడు, సాలూరి కోటిగారి కుమారుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
బాపు గారి తరువాత సివి రెడ్డిగారు తీసే అన్ని సినిమాల్లోనూ నేను నటించాను.
దాదాపు అయిదున్నర దశాబ్దాల క్రితం నేను, సివి రెడ్డి గారు ప్రత్యేగాత్మ గారి సినిమాలో నటించడంతో నాకు సివి రెడ్డి గారితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం స్నేహంగా మారి ఇప్పటికీ కొనసాగుతోంది.
రాజబాబు, నేను డాక్టర్ గరికపాటి రాజారావు గారికి శిష్యులుగా ఉన్న రోజుల్లో, రాజబాబు తన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులకు సన్మానం చేసేవారు.

నేను వారిని పరిచయం చేసే వాడిని.
ఆ సమయంలో ఒకసారి సావిత్రి గారు కూడా వచ్చారు.
సినిమా రంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరని సావిత్రి గారిని అడిగాను.
‘ఇంకెవరు జి.వరలక్ష్మిగారే’ అని సావిత్రిగారు చెప్పారు.అలా అనగానే నాకు ‘పెళ్ళిచేసి చూడు’ సినిమా జ్ఞాపకం వచ్చింది. ఆ సినిమాలో వరలక్ష్మి, సావిత్రి వదినా మరదళ్ళుగా నటించారు. ‘సాముదాయకపు, వలపు పంఫిణికి నమస్తే నమస్తే’ అన్న పాట మేఘాల్లో ఉన్నట్టు తీశారు. అది వెంటనే నాకు గుర్తుకు వచ్చింది.
ప్రధాన పాత్ర వరలక్ష్మి, ఆమె మరదలుగా సావిత్రికి చిన్న వేషం ఇచ్చారు.

వాణిశ్రీ, కాంచన వంటి వారందరికి ప్రిపరేషన్ చేయాల్సిన అవకాశాలు నాకు వచ్చాయి. నేను చేశాను.
రత్నకుమారి వాణిశ్రీ కావడం నా కళ్ళ ముందే జరిగిన పరిణామం.

వారితో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండే వాణ్ణి.
అవకాశం ఇచ్చారు కదా అని నా సొంతానికి ఉపయోగించుకోవడానికి నేను ప్రయత్నించలేదు.
నాకు చేతకాదు.

వీరందరితోటి గౌరవ ప్రదమైన సాన్నిహిత్యం ఈనాటికీ కొనసాగుతోంది.” అంటూ అరుదైన విషయాలతో ఇలా ముగించారు.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్,  తిరుపతి. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *