బాషా ప్రయోక్త రాష్టాలకు బీజం వేసిన ఆంధ్రరాష్ట్ర అవతరణ జరిగిన రోజునే అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలి.
-మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి
నవంబరు 1 న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతున్నది. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయం ఎప్పటికి ప్రశ్నలకు గురి అవుతూనే ఉంటుంది.
భాషా ప్రయోక్త రాష్టాల ఏర్పాటుకు పునాది 1953 అక్టోబర్ 1
1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా , ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ మద్రాసుతో కలిసి ఉన్నది. కోస్తాంధ్ర, రాయలసీమ పెద్దల అంగీకారంతో శ్రీభాగ్ ఒప్పందం షరతుతో మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలని అవగాహనకు వచ్చారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా తొలి భాషాప్రయోక్త రాష్ట్రంగా ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది.
అటు పిమ్మట ఆంధ్రరాష్ట్రం , తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అలా దేశంలో మొదటి భాషా ప్రయోక్త రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1 చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పర్యవసానం దేశంలో అనేక భాషా ప్రయోక్త రాష్టాలు ఏర్పాటుకు దారితీసింది.
అక్టోబర్ 1 రాష్ట్ర అవతరణలో రాయలసీమ ప్రజల త్యాగంతో బాటు సీమ భవితవ్యం ఇమిడి ఉంది.
ప్రారంభంలో మద్రాసు నుండి విడిపోవడానికి రాయలసీమ ప్రాంతం సంసిద్దంగా లేదు. అందుకు కారణం మద్రాసు మహానగరానికి సమీపంలో ఉండటం అప్పటికే విద్య పరంగా , ప్రకాశం – కాటన్ బ్యారేజీల కారణంగా డెల్టాగా మారింది కోస్తాంధ్ర. అలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతంతో వెనుకబడిన రాయలసీమ కలవడం మంచిది కాదన్నది నాటి సీమ ఉద్యమ నేతల అభిమతం. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శ్రీభాగ్ అవగాహన చేసుకున్నారు.
1. సమీపంలో ఉన్న మద్రాసును కోల్పోతున్నందున రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలి.
2. కృష్ణా, తుంగభద్రలపై రాయలసీమ ప్రయోజనాల కనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి.
రాజధానిగా కర్నూలు ఏర్పడినా నీటి ప్రాజెక్టుల విషయంలో నేటికి శ్రీభాగ్ అవగాహన అమలు జరగలేదు. రాజధాని కూడా 3 సంవత్సరాల ముచ్చటగా మిగిలింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నవంబరు 1 కి ప్రాధాన్యత లేదు.
2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. సహాజంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 ను తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. విభజనను వ్యతిరేకించిన ప్రాంతం , చారిత్రకంగా 1953 రాష్ట్ర ఏర్పాటు జరిగిన ప్రాంత కావడం వల్ల జూన్ 2 ని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేము. అదే సమయంలో తెలంగాణ , ఆంధ్రరాష్ట్రం కలయకకు చిహ్నంగా ఉన్న నవంబరు 1 కి రాష్ట్ర విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణంగా ప్రాధాన్యత కోల్పోయింది. అదే సందర్భంలో 1953 అక్టోబరు 1న ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో శ్రీభాగా ఒప్పం అవగాహన , పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఏర్పడిన ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నందున చారిత్రకంగా అక్టోబర్ 1 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది.
రాయలసీమ అంశాలు చర్చకు వస్తుందన్న కారణమే అక్టోబరు 1 న అవతరణకు ఆటంకం అయితే శ్రీభాగ్ ను గౌరవిస్తామన్న వైసీపీ మాటలకు విలువ ఉండదు.
చారిత్రకంగా చూచినా , నైతికంగా ఆలోచించినా అక్టోబర్ 1 ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. పైపెచ్చు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీభాగ్ ను గౌరవిస్తామని అందులో భాగంగానే మూడు రాజధానులని సీమకు న్యాయ రాజధానని ప్రకటించారు. వాస్తవానికి శ్రీభాగ్ ప్రకారం రాయలసీమలో ప్రధాన రాజధాని కార్యాలయం ఏర్పాటు చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వం వెళుతుంది. కనీసం రాష్ట్ర అవతరణను అయినా అక్టోబర్ 1 జరపకుండా అర్థం లేకుండా నవంబర్1 జరుపుకోవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం శ్రీభాగ్ ను గౌరవిస్తామన్న మాటను తానే ఉల్లంగిస్తుంది. అక్టోబర్ 1 ని రాష్ట్ర అవతరణను నిర్వహిస్తే రాయలసీమ అంశాలు చర్చకు రావడమే ఆటంకంగా ఉన్నాయా ? అన్న అనుమానం కలగక మానదు. నాడు చెన్నై నుంచి కోస్తా ప్రాంతంతో విడిపోవడానికి రాయలసీమ ప్రజలు ఆసక్తి చూపనందున రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చిన హామీ పత్రమే శ్రీభాగ్. నేడు అక్టోబర్ 1ని అవతరణ దినోత్సవం జరుపుకుంటే రాజధాని , కృష్ణా , తుంగభద్ర నదుల నీటి లభ్యతలో ప్రధమ ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వాలని అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలేదన్న విషయాలు చర్చకు రావడం , 70 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని కారణంగా రాయలసీమ వెనుకబాటుగా ప్రజల ముందుకు వస్తుంది. అది ఇష్టం లేకనే అక్టోబర్ 1 ని అవతరణ దినోత్సవంగా జరపడానికి ఆశక్తి చూపడంలేదు అన్న అనుమానం కలగకుండా ఉండదు. పరస్పర అంగీకారంతో కలిసిన రెండు ప్రాంతాల మధ్య కుదిరిన అవగాహన ఉల్లంగించడం , చివరకు ఆ అంశాలను చర్చకు కూడా రాకూడదన్న ఆలోచనలు మారనంతకాలం సమైక్య భావన కేవలం మెడిపండులాంటిదే.
(మాకీరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం)