రాజకీయ లబ్ది కోసం రాయలసీమ హక్కులను తాకట్టు పెడతారా?

 

రాజకీయ లబ్ది కోసం రాయలసీమ సాగునీటి హక్కులను తాకట్టు పెట్టొద్దు : బొజ్జా దశరథరామిరెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లో పాలక, ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు రాయలసీమ హక్కులను తమ రాజకీయ లబ్ది కోసం తాకట్టుపెట్తున్నాయన్న భావన రాయలసీమ సమాజంలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి‌ అధ్యక్షులు బొజ్జా‌ దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గురువారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ..

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలను పాలకుల ముందుంచుతున్నామని ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ అనుమతించిదని పరిగణలోనికి తీసుకుంటున్నామన్న షరతులతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఈ చట్టం ప్రకారం పోలవరంలో ఆదా అయ్యే 45 టిఎంసి ల కృష్ణా జలాలు రాయలసీమ హక్కు అని, అంటే రాయలసీమ లో మిగులు జలాల మీద నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులకు నికరజలాలు పొందే హక్కు వుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండే ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాల ద్వారా పాలకులను డిమాండ్ చేసినప్పటికీ పాలక ప్రతిపక్ష పార్టీలకు ఈ అంశమే పట్టలేదని‌ ఆయన విమర్శించారు.

పోలవరం తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ నిర్మాణం ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసి, ఆదా అయిన కృష్ణా జలాలను రాయలసీమకు కేటాయింపులు చేస్తామని 2016 మార్చి 29 న నాటి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ప్రాజెక్టును సంవత్సర కాలంలో పూర్తి చేసారు, కాని ఆదా అయిన నీటిని రాయలసీమకు కేటాయింపులు చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

పోలవరం ద్వారా ఆదా అయిన నీటిని రాయలసీమకు హక్కుగా కేటాయింపులు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలను రాయలసీమ ప్రజా సంఘాలతో కలిసి నిర్వహించిందనీ, కానీ గత పాలకులు కాని, ప్రస్తుత పాలకులు కాని స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పోలవరం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలు తమ హక్కుగా, ఆ ప్రభుత్వమే జీ వో విడుదల చేసుకొని, ఆ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయింపులు చేసామని నివేదిక రూపొందించి కేంద్రం జలవనరుల శాఖ అనుమతులకు కోసం దరఖాస్తు చేసిందని ఆయన వివరించారు.

ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ – 2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) ముందుంచిందని అన్నారు. ఈ విషయం ట్రిబ్యునల్ విధి విధానాల పరిధిలోని అంశం కాదు, సరైన వేదికపై ఈ అంశాన్ని తేల్చుకోవలసిందిగా ట్రిబ్యునల్ తీర్పునియ్యడాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పాలకులు సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోకుండా రాయలసీమకు ద్రోహం చేస్తున్నారన్న భావన రాయలసీమ సమాజంలో ఉందని తెలిపారు.

మనకు రాష్ట్ర విభజన చట్టం హక్కుగా కల్పించిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు హక్కుగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా, తమ రాజకీయ లబ్ది కోసం ఆ నీరు తెలంగాణ కేటాయింపులు చేసుకొని హక్కుగా పొందడానికి పాలక, ప్రతి పక్షాలు పరోక్షంగా సహకరిస్తున్నాయన్న భావన రాయలసీమ సమాజంలో బలంగా వ్యాప్తి చెందుతన్నదని అన్నారు. ఈ భావన నుండి రాయలసీమ సమాజం బయటపడటానికి, రాయలసీమ హక్కులను కాపడటానికి తక్షణమే పోలవరం/ పట్టసీమ ద్వారా ఆదా అయిన నీటిని హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు కేటాయించి రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులకు దృవీకరణ చేపట్టాలని దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో సమితి ఉపాద్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, పర్వేజ్, రామిరెడ్డి, షణ్ముఖరావు, పట్నం రాముడు, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *