నాడు జలదీక్ష చేసిన జగన్ నేడెందుకు మౌనం?

-టి లక్ష్మీ నారాయణ

 

1. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు రక్షణ కరవుయ్యింది. ప్రమాదం ముంచుకొస్తున్నది. 2016లో ప్రతిపక్ష నాయకుడుగా కర్నూలులో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా జలదీక్ష చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకో నోరు తెరవడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాక కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. నేడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన పంపు బటనొక్కి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఆ అక్రమ ప్రాజెక్టుపై నేడు నోటికి తాళం వేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరిరక్షిస్తుందన్న ప్రశ్న ముందుకొచ్చింది.

2. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. రానున్న ఎన్నికల పూర్వరంగంలో మొదటి దశలో నిర్మించిన మొదటి పంపింగ్ స్టేషన్ ను కేసీఆర్ ప్రారంభించారు.

3. ఈ పూర్వరంగంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చేసిన ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని మొదట 90 టియంసిల కృష్ణా నది వరద జలాలతో చేపట్టినా, ప్రస్తుతం ప్రాజెక్టును చిన్ననీటిపారుదల పద్దు కింద ఉన్న నికర జలాల వాటాలో మిగులంటూ 45 టియంసిలు, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నుండి కృష్ణా నదికి మళ్లించే గోదావరి నది జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వాటా 45 టియంసిలు కలిపి మొత్తం 90 టియంసిల నికర జలాలను పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు వాళ్ళే ఏకపక్షంగా కేటాయించుకొన్నట్లు వెల్లడించారు. ఆ కేటాయింపును ఖరారు చేయాలని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కోరుతున్నట్లు తెలియజేశారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చినట్లేనని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను హరిస్తున్నది.

4. ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మరియు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014కు లోబడి దక్షిణ తెలంగాణలోని కరవు పీడిత ప్రాంతాలకు నీళ్ళిస్తే సంతోషించే వారిలో నేను మొదటి వరుసలో ఉంటా. కానీ, వాటిని ఉల్లంఘించి, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నది. అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల సమస్య రాజకీయ పార్టీలకు పట్టనేలేదు. అనాథగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పేర్కొన్న తెలుగు గంగ, హంద్రీ నీవా, గాలేరు – నగరి, వెలిగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారయ్యింది.

5. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014,
తొమ్మిదవ భాగం: జలవనరుల నిర్వహణ, అభివృద్ధి: సెక్షన్ 84(1) గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల కార్యకలాపాల పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది. దానికి కేంద్ర జలవనరుల మంత్రి ఛైర్ పర్సన్ గా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యులుగా ఉన్నారు.

సబ్ – సెక్షన్(3) ప్రకారం అపెక్స్ కౌన్సిల్ యొక్క విధులు; 1) గోదావరి నదీ యాజమాన్య బోర్డు మరియు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పనితీరును పర్యవేక్షించడం (2) గోదావరి లేదా కృష్ణా నదీ జలాల ఆధారంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఏవైనా ఉంటే, నదీ యాజమాన్య బోర్డులు, కేంద్ర జలసంఘం ద్వారా మదింపు చేసి, సిఫారసు చేసిన తరువాత, అవసరమైన చోట ప్రణాళిక మరియు ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేయడం.

6. సెక్షన్ 85లో పొందుపరచిన నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు, విధులు క్రింద (8) (డి) ప్రకారం గోదావరి లేదా కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఏదైనా ప్రతిపాదనను అంచనా వేయడం, సాంకేతిక అనుమతులు ఇవ్వడానికి ముందు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునళ్ల తీర్పుల ప్రకారం ఇప్పటికే పూర్తయిన లేదా రాష్ట్ర విభజన నాటికి (అపాయింటెడ్ డేట్) చేపట్టిన ప్రాజెక్టులకు నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం ఉండదని సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

7. పదకొండో షెడ్యూలులోని 7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై తగిన “డిపెండబిలిటీ” ప్రమాణాల ఆధారంగా లభించే జలవనరుల ఆధారంగా “అపెక్స్ కౌన్సిల్” అనుమతి తీసుకోకుండా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి వీల్లేదు. ప్రతిపాదనలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించడానికి ముందు సంబంధిత బోర్డు(కృష్ణా/గోదావరి) ముందుగా పరిశీలనచేసి, సాంకేతికంగా ఆమోదించాలి.

8. ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా, చట్టాన్ని ఉల్లంఘించి, ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకొంటే ఆ రాష్ట్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఆర్థిక మరియు ఇతర జరిమానాలకు గురౌతుంది.

9. ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టం -2014, పదకొండో షెడ్యూలులో ప్రస్తావించిన, నిర్మాణంలో ఉన్న కింది నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలి. 1) హంద్రీ -నీవా, 2) తెలుగు గంగ, (3) గాలేరు – నగిరి, (4) వెలిగొండ, 5) కల్వకుర్తి, (6) నెట్టెంపాడు.

10. శ్రీశైలం జలాశయం యం.డి.డి.ఎల్. 834 అడుగులు. నీటి నిల్వ ఈ స్థాయిలో లేదా దిగువ స్థాయిలో ఉన్నప్పుడు త్రాగు నీటి అవసరాలకు తప్ప మరే అవసరానికి వాడడానికి వీల్లేదని 1996 జూన్ 15న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.యం.ఎస్.నెం.69లో విస్పష్టంగా పేర్కొన్నారు. కానీ, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోలకు నీటి తరలింపు 800 అడుగుల నుండే మొదలవుతుంది.

11. నాగర్ కర్నూలు జిల్లా కోతిగుండు వద్ద కృష్ణా నది నుంచి శ్రీశైలం జలాశయం వెనుక జలాలను అప్రోచ్ కాలువ ద్వారా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలిస్తారు. 2015 జూన్ 10న జీ.ఓ.నెం.105న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిస్తూ జారీ చేసింది. అంటే, రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన ప్రాజెక్టు.

12. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను 2016లో మొదలు పెట్టారు. మొదటి వ్యయ అంచనా రు.35,050 కోట్లు, సవరించిన అంచనాల ప్రకారం వ్యయం రు. 55,086 కోట్లు. ఇప్పటికే రు.26,262 కోట్లు ఖర్చు చేశారట. 3200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న తొమ్మిది పంపుల ద్వారా రోజుకు 2 టియంసిల చొప్పున 60 రోజుల్లో 120 టియంసిల తరలింపు లక్ష్యంగా పెట్టుకొన్నారు. మొత్తం 67.52 టియంసిల నిల్వ సామర్థ్యంతో నార్లాపూర్ వద్ద అంజనగిరి(6.40), ఎదుల వద్ద వీరాంజనేయ(6.55), వట్టెం వద్ద వెంకటాద్రి(16.74), కర్వేన వద్ద కురుమూర్తిరాయ(19), ఉదండాపూర్(16.303), కె.పి.లక్ష్మీదేవిపల్లి(2.80), మొత్తం ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందజేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

(టి. లక్ష్మీనారాయణ,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *