ఆగస్టు 12, 2023 న కర్నూలు IRAP సెమినార్ లో చేసిన ప్రసంగం
-బొజ్జా దశరథ రామి రెడ్డి (అధ్యక్ష్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి)
రాయలసీమలోని అవిభక్త కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 40 శాతం భూభాగం కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో రాయలసీమ జనాభా 30 శాతం.
రాయలసీమకు ప్రకృతి అన్ని వనరులు సమకూర్చింది. అటవీ సంపద, ఖనిజ సంపద, అన్ని పంటలు పండే భూమి, అన్ని పంటలకు అనుకూలమైన వాతావరణంతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు కావలసిన ఉత్తనోత్పత్తి చేయగల మానవ వనరులు (రైతులు, రైతు కూలీలు), గలగల పొంగి పొరిలే కృష్ణా (ఉప నదులు – తుంగభద్రా, వేదవతి, హంద్రీ) మరియు పెన్నా (ఉప నదులు – చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యెరు, జయమంగళి, సగిలేరు, కుందూ) రాయలసీమ స్వంతం. ఈ ప్రకృతి ప్రసాదించిన వనరులతో పాటు అనేక ఆధ్యాత్మిక కేంద్రాలతో, మూడు ప్రధాన నగరాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు మధ్యన ఉండటంతో పర్యాటక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అవకాశాలు రాయలసీమ మెండుగా కలిగి ఉంది.
రాయలసీమ అభివృద్ధికి ప్రకృతి అన్ని వసతులు కల్పించినప్పటికి, వాటిని వినియోగించుకునే మౌళిక వసతుల కల్పించడంలో పాలకులు విఫలం అవ్వడంతో రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. రాయలసీమ అభివృద్ధి పట్ల పాలకపక్ష నిర్లక్ష్యాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షాలు రాయలసీమ పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయి. రాయలసీమ వెనుకబాటుతనంను రూపుమాపాలనే ఒక ఊతపధాన్ని మాట్లాడుతూ, కీలకమైన మౌళిక వసతుల కల్పన పట్ల అంటీముట్టనట్లుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అంతటితో ఆగకుండా కృష్ణా నదికి ఎగువన ఉన్న రాయలసీమ తమ హక్కుగా ఉన్న నీటిని పొందడానికి చేపట్టాల్సిన మౌళిక వసతుల రూపకల్పనను అడగకపోగా, కృష్ణా నది నీటి ప్రవాహ పరిమాణంలో తగ్గుదల లేనప్పటికీ, కృష్ణా నది ఎండిపోయింది కాబట్టి పోలవరం నిర్మిస్తేనే రాయలసీమకు నీళ్ళన్న భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ రాయలసీమకు ద్రోహం చేస్తున్నాయి. ఈ అంశాలపై అవగాహన లేకనో లేదా తమ పదవులను పరిరక్షించుకోవడానికో రాయలసీమ ప్రజా ప్రతినిధులు తమ వాణిని తమ రాజకీయ పార్టీ అధినాయకత్వం దగ్గర వినిపించడం లేదు. అభివృద్ధికి దూరమై సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా వెనుకబడి పరాదీనతకు లోనైన, ఉద్యమ నేపథ్యంలేని రాయలసీమ సమాజం తమ దైనందిన బతుకు తెరువు కార్యక్రమంలో మునిగితేలుతున్నది.
- రాయలసీమ సాగునీటి స్థితి:-
- ప్రాజక్టుల ద్వారా సాగునీటి వసతి కల్పన (Irrigation Potentiality Created)
అ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి వసతి కల్పన – 44%
ఆ. రాయలసీమ వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి వసతి కల్పన – 22 %
- ప్రాజక్టుల ద్వారా సాగునీటి వసతి వినియోగం:- (Irrigation Potentiality Utilised)
అ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి వసతి పొందుతున్న భూమి – 30%
ఆ. రాయలసీమ వ్యవసాయ యోగ్యమైన భూమిలో సాగునీటి వసతి పొందుతున్న భూమి – 9%
- పాలనా వికేంద్రీకరణ: ఉమ్మడి మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతున్నది. శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారం పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని కర్నూలులో, హైకోర్టు గుంటూరులో ఏర్పాటు జరిగింది నాడు. కాని అన్ని ఒక్కటే చోట కేంద్రీకరించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారు నేడు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమలు:
అ. రాయలసీమ ప్రాజెక్టులు – పోలవరం ప్రాజెక్టు:- కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వ నిదులు కేటాయిస్తూ, కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇచ్చే నిధులను కూడా మరల పోలవరానికి ఖర్చు చేస్తున్నారు. దీనితో రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన రాష్ట్ర నిధులతో పూర్తి చేయాల్సిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది.
పోలవరం ప్రాజక్టు ద్వారా ఆదా అయిన కృష్ణా జలాలను రాయలసీమకు కేటాయించే హక్కును రాష్ట్ర విభజన చట్టం కల్పించింది. పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రాజెక్టుగా పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి అయి ఏడు సంవత్సరాలైనా ఆ నీటిని రాయలసీమకు కేటాయించడంలో పాలకులు విపలమ్య్యారు.
ఆ. దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు:- రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపుకు అత్యంత కీలకం. అలాంటి ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయినప్పటికి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నిశబ్దం రాయలసీమ పాలిట శాపంగా మారింది.
ఇ. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం:- కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కృష్ణా నది నిర్వహణకు కీలకమైన కర్నూలులో ఏర్పాటు జరిగితే, రాయలసీమ నీటి హక్కులు పరిరక్షించబడుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నా, రాజకీయ పార్టీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి.
ఈ. ప్రత్యేక ప్యాకేజీ:- ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలతో సమానంగా సామాజికంగా, ఆర్థికంగా రాయలసీమ అభివృద్ధి సాధించడానికి సుమారు 30 వేల కోట్ల రూపాయలతో బుందేల్ కండ్, కోరాపుట్, బోలంగీర్ తరహా ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్ర విభజన చట్టం ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా ఈ అంశాన్ని సాధించడంలో రాజకీయ పార్టీలలో చిత్తశుద్ది లోపించింది.
ఉ. జాతీయ స్థాయి సంస్థలు :- రాష్ట్ర విభజన చట్టం లో ప్రకటించిన AIMS, రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయలసీమలో ఏర్పాటు దిశలో పాలక, ప్రతిపక్షాలు విఫలమయ్యాయి.
- పరిశ్రమలు – ఉద్యోగావకాశాలు:-
ఆ. రాజధాని ప్రాంతం లోని వారికే రాష్ర సచివాలయం ఉద్యోగాలు
ఆ. రాజధాని కేంద్రంగా న్యాయ, విద్యా, వైద్య, సాంస్కృతిక, పర్యాటక, పారిశ్రామిక, ఐ టి కేంద్రాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, కార్పొరేషన్ ల ఏర్పాటు చేసారు. రాజధానికి భూములిచ్చిన జోన్ వారికే పై సంస్థల అన్నింటిలో ఉద్యోగ, ఉపాధి, నివాస స్థలాల కేటాయింపుకు అవకాశాలు కలిగించారు.
ఇ. పారిశ్రామిక రంగ అభివృద్ధికి నీటి మౌళిక వసతుల కల్పన అత్యంత కీలకం. త్రాగడానికే నీటి వసతులు కల్పించలేని రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది సాధ్యం కాదు.
ఈ. పై అంశాలన్నీ రాయలసీమ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉద్యోగావకాశాలు లేకుండా చేసాయి. ఈ విషయాలేవి రాజకీయ పార్టీలకు చర్చనీయాంశాలు కావు.
ఈ నేపథ్యంలో రాయలసీమ అభివృద్ధి రాయలసీమ ప్రజలు చైతన్యంతో పాటు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధితో ముడి పడి ఉందన్న విషయం రాజకీయ పార్టీలు గ్రహించడంపైన ఆధారపడి ఉంది అని మేము భావిస్తున్నాం. ఆ దిశగా రాయలసీమ ప్రజలలో చైతన్యం కల్పించడానికి, రాజకీయ పార్టీలు ప్రజాస్వామికంగా ఆలోచనలు చేయడానికి ఆగష్ట్ 12 – 13, 2023 న కర్నూలు లో IRAP సెమినార్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాము. IRAP సభ్యలను అభినందిస్తున్నాము. IRAP తో పాటు అనేక ప్రజాస్వామిక సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు రాయలసీమ అభివృద్ధితో పాటు అంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడుతాయని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము.