పాటకు మారు పేరు గద్దర్ మృతి

విప్లవ గాయకుడు గద్దర్ మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మృతి చెందినట్లు ఆసుప్రతి ఒక బులెటీన్ విడుదల చేసింది.   ఆయన వయసు 77 సంవత్సరాలు.  గద్దర్ తో ప్రముఖ జర్నలిస్టు ఆలూరు రాఘవశర్మ చాలా కాలం కిందట  చేసిన ఇంటర్య్యూను ఇపుడు అందిస్తున్నాం.

 

 

గద్దర్ తో రాఘవశర్మ ఇంటర్వ్యూ

‘మల్లొచ్చిండే మాయదారి ఎంటోడు’
గద్దర్.. పాటకు పర్యాయపదం, మాటకు జన పదం.
ఆయన్ని కదిలిస్తే పాట ప్రవహిస్తుంది.
అది అలలపై తేలాడుతుంది.
జనం నాడి చెబుతుంది.
తెలంగాణా అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది.
గద్దర్ పాట మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
గుండె బరువెక్కించి, అవేశం తెప్పిస్తుంది.
మంటలు పుట్టిస్తుంది.
వీస్తున్న గాలై కాస్త ఓదారుస్తుంది.
సికింద్రాబాద్ లోని ఆయనింటికి వెళ్ళి కదిలిస్తే, ఆయన ఇంటి అవరణలో అరుగుపైన కూర్చోవడంతో మాటలు ఇలా నడిచాయి, పాటలు ఇలా ప్రవహించాయి.
ఆ మాటల నడక, పాటల ప్రవాహం ‘వర్తమానం’ దినపత్రికలో 1995 జులై 5వ తేదీ బుధవారం సంచికలో ఇలా దర్శనమిచ్చాయి.

‘మల్లొచ్చిండే మాయదారి ఎంటోడు’
‘ఇంటివా పోశన్నా, ఇంటివా రామన్నా’ అంటూ గద్దర్ గొంతు ముందుగానే హెచ్చరించింది. రాష్ట్ర శాసన సభకు 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దీశాధీశుడు తిరిగి అధికారం చేపట్టబోతున్నారని గద్దర్ ముందుగానే పసిగట్టారు.
ఆయన అన్నట్టుగానే జరిగింది.
తరువాత ఏమైందంటే..
‘నక్సలైట్ అన్నలకు లాలసలామ్ అన్నడు
ఎన్ కౌంటర్ గిన్ కౌంటర్ నహీ జాన్తనన్నడు.
ఇంటికి రమ్మన్నాడు ఇందుఇస్తనన్నడు’ అంతమటుకు బాగానే ఉన్నది, ఆ తరువాత?
‘బ్యాను ఎత్తేసి బ్యాండు వాయించినడు
వలిగొండల పసిపిల్లల బలిఇచ్చి
రక్తం బొట్టెట్టుకుని లండన్ విమానమెక్కె
మల్లొచ్చిండె మాయదారి ఎంటోడు’
పీపుల్స్ వార్ పై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించి, అది అమలులోకి వచ్చేసరికల్లా వరిగొండలో ముగ్గురిని ఎన్ కౌంటర్ పేర హత్య చేశారని గద్దర్ ఆరోపించారు.
ప్రజల మాటల్లో, వారి పాటల్లో చెప్పిన ఈ నిజంపై చర్చ జరగాలన్నారు.
ఎన్టీఆర్ పరిపాలనపై ఎటువంటి భ్రమలు అవసరం లేదని గద్దర్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొట్టమొదట సారి ఓడించి 1984లో అధికారం చేపట్టిన ఎన్.టి. రామారావుపై ఆనాడే గద్దర్ ఇలా అన్నారు.
‘అన్నా వచ్చిండో రామన్నా వచ్చిండో
రామరాజ్యం తెస్తనాని
రంకెలు వేసి దుంకుతుండు
నక్సలైట్లు దేశభక్తులని
లాల్ సలాం అన్నడు.
నక్సలైట్లు నాతో కలిస్తే
ఢిల్లీ కోటనే పట్టుతనన్నడు గద్దెనెక్కిన మరుసటిరోజె
యుద్ధాన్నే ప్రకటించినాడు
అన్న హరిభూషణ్ను చంపి
సన్యాసం బుచ్చుకున్నడే’
అలాగే ఎన్.టి.రామారావు ప్రభుత్వం 1989 ఎన్నికల్లో ఘోరపరాజయం చెందినప్పుడు కూడా గద్దర్ ఇలా రాశారు.
‘ ఇంటివా పోశన్న
ఎంటోడు పోయిండంట
ఇంటివా పోశన్న
కూలినాలి ఉసురుతగిలి
ఎంటోడు పోయిండంట
ఇంటివా పోశన్న
ముసలోల్ల పెన్షనని
ముద్దరేసుకొండు
తెలుగు ముక్క తెలుగు తొక్కని
తోలంతా నలిపినాడు.
జోగుడు బాగుడు.. ఇద్దరు కలిసి
జోలెనింపు కొండ్రని
ఇంటివా పోశన్న
ఎంటోడు పోయిండంట
ఇంటివా పోశన్న’ అంటూనే ‘నరోరో నారన్న, నారారా, నారారో నారన్న’ అంటూ శ్రుతి కోసం మధ్యలో కూనిరాగం తీస్తారు.
పీపుల్స్ వార్ ఉద్యమంపై తీవ్రనిర్బంధాన్ని ఎన్.టి. రామారావు ప్రభుత్వం
అమలు చేస్తున్నప్పుడు..
‘పోతవురో రామన్న
పేదోల్ల ఉసురు తగిలి పోతవురో రామన్న
మా బిడ్డల ఉసురు తగిలి
పసిగుడ్డుల ఉసురు తగిలి
పోతవురో రామన్న’ అంటూ గద్దర్ పెట్టిన శాపనార్థాలకి నిజంగానే ఎన్టీరామారావు 1989లో అధికారం పోగొట్టుకున్నారు.
‘కూలి పెంచుమని అన్నదే పాపం
కుత్కెమీద కత్తిబల్లెం పెట్టినప్

దొరగాని పనులు బందు బెట్టినవ్
పాడుబడ్డ బంజరు భూమిలో నాగలిపట్టి నాటులు వేసితె
కూలి రైతుల నెత్తురు నీవు
కుత్కెల దాకా తాగినావు’ అంటూ తెలంగాణాలోని రైతు కూలీల దుస్థితి గురించి 1987లో ఈ పాట రాశారు.
ఎన్.టి. రామారావు పతనం 1987 నుంచి మొదలైందని గద్దర్ అన్నారు.
అప్పటి నుంచి నక్సలైట్లను ఎన్ కౌంటర్ పేర పట్టుకుని కాల్చి చంపుతుంటే, పంచనామాలు, పంచాయితీలు, పౌరహక్కుల నిజనిర్ధారణ కమిటీలు, కోర్టులు, కేసులు విచారణలు వంటి తలకాయ నొప్పులు దేనికని ఏకంగా మనుషుల్ని అదృశ్యం చేయడం మొదలైందని వివరించారు.
‘ఎన్టీఆర్ ఏమిటో తెలుసుకోవాలి.
అతని రాజకీయాలు ఏమిటో తెలుసుకోవాలి.
అతని రాజకీయ పునాది ఏమిటో తెలుసుకోవాలి.
అతని వర్గస్వభావమేమిలో తెలుసుకోవాలి.
ఏడు సంవత్సరాల పాలనలో ఎన్టీఆర్ నక్సలైట్ల పట్ల, ప్రజలపట్ల, విప్లవకారుల పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవాలి’ అని గద్దర్ అంటారు.
సినిమా జీవితానికి, నిజజీవితానికి ఆచరణలో తేడా గమనించాలని కోరారు.
‘ప్రజలంతా హౌలగాళ్ళని ఎన్టీఆర్ అనుకుంటుండు’ అని వ్యాఖ్యానించారు.
‘గాంధీ ఉన్నడు. స్టడీ చేయాలె. లండన్ పోయిండు. తన్నులు తిన్నడు. సంగం బెట్టిండు. భారత దేశం వచ్చిండు. పాయింట్ వదిలేసిండు. గోచి కట్టిండు. ఒంటిపూట తిండి తింటనన్నడు. తాతా బిర్లాల ఇంట బాగున్నడు. మళ్లాశ్రమంలో గూకున్నడు. భగత్ సింగ్ను ఉరితీస్తుంటే ఊకున్నడు. సొతంత్రం తెస్తనన్నడు. అధికారమంతా తాత బిర్లాల చేతిలో బెట్టిండు. దరిద్రానికి, మత కొట్లాటలకు గదే కారణం. ఎవడైతే హిందూ మతం హిందూ మతం అన్నదో వాడే గాంధీని చంపేసిండు. ఇది ఒక రాజకీయ నాయకుని జీవితం’ అంటూ తనదైన బాణిలో వివరించారు.
‘వేషం మార్చకు రామన్న
నువు మోసం చేయకు భీమన్న
సినిమా డైలాగులతోటి
సిందులేయకు మాయన్న’ అంటూ ఎన్టీరామారావును గద్దర్ హెచ్చరించారు.
రాజకీయ నాయకుడైనప్పుడు రాజకీయ నాయకుడుగానే మాట్లాడాలి కానీ, సినిమా డైలాగులు వాడకూడదని హితోక్తి చెప్పారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళైనా నటన చేస్తున్నాడన్నది గద్దర్ ఆరోపణ.
ఎవరైనా వ్యాసం రాసిస్తే బట్టీ పట్టి ఉపన్యాసం చదువుతారని, మధ్యలో చప్పట్లు కొట్టాల్సిన చోట వ్యాసకర్త ‘చప్పట్లు’ అని రాస్తాడని, అక్కడ చప్పట్ల కోసం ఎన్టీఆర్ ఉపన్యాసాన్ని కాసేపు అపుతారని గద్దర్ ఎగతాళి చేశారు.
అసలైన నిర్బంధం రైతుపైన ఏ విధంగా ఉంటుందో గద్దర్ పాట వివరిస్తుంది.
‘పొట్టకు వచ్చిన పచ్చని చేలు
పనులను దింపే మేపిచ్చావు మంటను పెట్టి మసిచేశావు
పచ్చని నేను పాపం తగిలి పుచ్చిపోతవు కొడుకో”
నిషేధం ఎవరిమీదుంది?
పొలాలు దున్నే నాగళ్ళమీదా?
పంట మొక్కల పైనా? అని ప్రశ్నిస్తారు.
ఎన్.టి.రామారావు రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేస్తే ఇలా ఉంటుందని వివరిస్తారు. ధర్మమంటే తెలియనోడు
దానమంటే తెలియనోడు
సెట్టింగులు డ్రస్సులన్ని
సెట్టింగే జేసినోడు
నాచారం గండిపేట
నమిలి నమిలి మింగినాడు’
‘సిపిఐ, సిపిఎం నాయకులు (కార్యకర్తలననడం లేదు) ఎన్టీరామారావు తోకపట్టుకుని పోయినోళ్ళే కదా!
సీట్లకోసం బిచ్చమడుగుతున్నరు.
సీట్ల బిచ్చగాళ్ళు.
మొన్న ఎన్నికల్లో వీళ్ళ మొగం చూసి ఓట్లేసిననుకున్నరా?
నా కొడుకులంత ఎర్రజెండను తీసుకెళ్ళి ఏట్లో పారేసిండ్రు’ అంటూనే..
‘ఎర్రచొక్కేసుకుని ఎర్రజెండెత్తుకుంటె
ఎరుపెట్లవుతవురో నీ గుండెంత నలుపైతే’ అని గద్దర్ పాడారు.
పీపుల్స్ వార్ పై నిషేధం ఎత్తివేసిన మహానుభావుడిగా ఎన్.టి. రామారావును సిపిఐ, సిపిఎం కీర్తిస్తున్నాయని పేర్కొంటూ వీరి మాయలో పడే మధ్యతరగతి ప్రజానీకం మోసపోకూడదని హెచ్చరిస్తున్నారు.
పీపుల్స్ వార్ పై మూడు నెలలపాటు నిషేధం ఎత్తివేస్తూ విధించిన విషయం గురించి మాట్లాడుతూ, ‘మరి పోలీసోళ్ళు భూస్వాములు ఎన్నికలప్పుడు ఆయుధాలెందుకు ధరిస్తున్నారు?
అద్వాని గాని, పి.వి. గాని, జనార్ధన్ రెడ్డి గాడు గానీ పైసలెందుకు వసూలు చేస్తున్నరు?
దాని గురించి ఏంది? అని ప్రశ్నిస్తారు.
‘వార్’ పై నిషేధం మూడు నెలలపాటే ఎత్తేస్తామనడం వల్ల ఎన్టీఆర్ నిజాయితీని శంకిస్తున్నాను అని కచ్చితంగా తెగేసి చెప్పారు.
‘క్రమశిక్షణ పేరు మీద కాకి నిక్కరేసినోడు
ఇన్కంటాక్స్ ఎగదొబ్బి సన్యాసం పుచ్చుకుండు
సంపదపంత అల్లుళ్ళకు బిడ్డలకు సగబెట్టి
నా దగ్గర ఏముందని బుడ్డగోసి బూడిదంటు
సన్యాసం వదిలేసి సంసారి పిల్లనండు
మల్లొచ్చిండే మాయదారి ఎన్టోడు’ అంటూ మళ్ళీ పాటలోనే చెప్పారు.
పీపుల్స్ వార్ పై ఉన్న నిషేధాన్ని ఎన్టీరామారావు ఎత్తివేయలేదని, ప్రజా ఉద్యమాలే ఎత్తివేయించాయని గద్దర్ అంటారు.
నిషేధం ఎత్తివేయలేకపోతే ఎన్టీఆర్కు చీకటి మిగులుతుందని అన్నారు.
కల్లోలిత ప్రాంతాలను ప్రకటించిన చెన్నారెడ్డి వాటిని ఎత్తివేయవలసి వచ్చిందని పోలిక చూపించారు.
‘ఒక్కొక్క సారి శత్రువే దిగి వచ్చి చర్చలకు రమ్మంటాడు.
తరువాత మోసం చేస్తాడు.
సాయుధపోరాటం చేసేవాడు ప్రాణం ఇవ్వడానికి తుపాకీ పట్టుకున్నాడు.
ప్రాణం కాపాడుకోవడానికి తుపాకీ పట్టుకున్నాడు.
జీవరాసులు మనుగడకోసం పోరాడి నిలబడతాయి.
అలాగే విప్లవకారులు కూడా.
అందుకే సాయుధపోరాటం చేసేవారు గెలుస్తారు’ అంటూ గద్దర్ ఆయుధాలు పట్టుకొని అడవుల్లో పోరాడే ‘వార్’ దళాలను సమర్థిస్తారు.
‘పీపుల్స్ వారై పై నిషేధం ఎత్తివేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ఎన్టీఆర్కు పంచాయతీ ఎన్నికలు వచ్చిపడ్డాయి.
పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి.
అలాగే కుటుంబ సబ్యులు కూడా వత్తిడి తెచ్చాయి.
ప్రజాస్వామ్య వాదులు పెద్ద సంఖ్యలో ఏకమయ్యే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వం ఎంతో నిర్బంధాన్ని ప్రయోగించినా పాతికేళ్ళ క్రితం పట్టుకొన్న తుపాకీని కింద పెట్టించలేకపోయారు’ అంటూ నిషేధం ఎత్తివేతకు దారి తీసిన పరిస్థితులను గద్దర్ వివరించారు.

‘ఎవడైతేనేం ఒక్కొక్కడూ మహా హంతకుడు’ అని శ్రీశ్రీ బాగా చెప్పిండు.
ఎన్ కౌంటర్లను మొదలు పెట్టిన మహానుభావుడు వెంగళరావు.
జనార్ధనరెడ్డి అయినా, విజయభాస్కర్రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా, ఎవరైతేనేం ఒక్కొక్కడూ మహా హంతకులు.
వెంగళరావు వారసులు”
“అన్నలను అడవిలో పట్టుకుని చెట్లకు కట్టేసి కాల్చిచంపేశారు.
ఎన్టీరామారావు వచ్చాక ఎక్కడంటే అక్కడ ఎన్కౌంటర్లు.
వ్యాస్ నాయకత్వంలో గ్రేహౌండ్స్ పెట్టారు.
వాడు కాస్తా ఉసురు కొట్టి పో యిండు.
జనార్ధన్ రెడ్డి ఉదయం విలేకరి గులాం రసూల్ను చంపించాడు.
విజయభాస్కర్ రెడ్డి పులి అంజయ్యను చంపించాడు.
ఎన్టీరామారావు పీపుల్స్ వార్ రీజనల్ సెక్రెటరీ మహేష్ అన్న కళ్ళు పీకేయించాడు.”
“ఎన్టీఆర్ స్వభావం ఏమిటి? మంచోడనిచెప్పడానికి కొలిచే బాట్లేమైనా ఉన్నయా? ఆచరణలో తేల్తాయి.
‘ఏ దిల్కి బాత్ హై’
నిషేధం విధించకముందు, నిషేధం విధించాక ఉన్న నిర్బంధాలలో తేడా పెద్దగా లేదని అంటారు.
ఎన్టీ రామారావు పరిపాలన అంతా నిషేధమేనంటారు.
నిషేధం పెట్టకుండానే నిషేధం అమలు చేశారని చెప్పారు. నిషేధం విధించడమంటే అంతవరకు చేసే న హత్యలు చట్టబద్దమవుతాయని, చంపడానికి లైసెన్స్ వస్తుందని, మరింత ధైర్య మొస్తుందని, నిషేధం ఉంటే పోలీసులు ఏం చేసినా ఎవరికీ జవాబుదారీ కాదని గద్దర్ వివరించారు.
‘జననాట్య మండలిని నిషేధించలేదు.
అయినా ఒక సభలో జననాట్య మండలి పాటలు పెడితే సర్కిల్ ఇన్స్పెక్టరు వచ్చి పాటల క్యాసెట్ తీసుకెళ్ళి పోయిండు.
తరువాత స్టేజి ఎక్కి నేను పాడాను.
పాటల క్యాసెట్ను తీసుకెళ్ళిన ఓ సి.ఐ గారు నా గొంతును తీసుకెళ్ళగలరా అన్నాను.
నిషేధం లేకుండానే నిషేధం ఎలా అమలు జరుగుతుందో తెలిసి పోతోంది’ అని గద్దర్ వివరించారు.
‘కాంగ్రెస్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కు ఓట్లేసి గెలిపించారు.
తుపాకుల కంచెనుంచి తమ పొలాలను, పశువులను, చెట్లను, గాలిని తమ పల్లెను విముక్తి చేసుకోవాలనుకున్నారు.
రాజీనామా చేయమని పి.వి.ని ఎన్టీఆర్ అడిగినట్టే అడిగారు.
తమ బిడ్డల్ని కాల్చిచంపినప్పుడు గెస్ట్ హౌసులను ధ్వంసం చేశారు.
మన మీద దయ ఉండి, ప్రేమ ఉండి నిషేధం ఎత్తివేయలేదు’ అని గద్దర్ అన్నారు.
‘మా పోలీసోల్లకు బ్యాన్ ఉన్నా లేకున్నా మా పని మేం చేస్తమంటరు’ అని గద్దర్ వ్యంగ్యోక్తి విసిరారు.
‘నిషేధం ఎత్తివేయమని అడగడానికి ఎన్టీఆర్ దగ్గరకు వెళితే, లేచి ‘మీరేనా గద్దర్ గారు’ అంటూ ఈ గద్దర్ గాడికి ఈడ షేకండు, అడ వలిగొండలో తుపాకులతో షూటింగు’ అన్నారు. ‘ఎమర్జెన్సీలో నన్ను పోలీసులు సిగరెట్లతో కాల్చిండ్రు’ అని కాలిన మచ్చలున్న చేతులు చూపించారు.
తుపాకులు లేకుండా పరిపాలన చేసే పరిస్థితులు నేడు పాలకులకు లేవన్నారు.
తుపాకులు, పోలీసులు, సైన్యం లేకుండా ఎన్నికలు జరిపించగలరా? అని ప్రశ్నించారు.
‘నా పైన బ్యాన్ లేదు. నన్ను పాడనిస్తరా?
ఉట్టిగ బోతెనే నా బండిని జప్తు చేసిండ్రు.
ప్రజల్లో ఏకమై పాడే అవకాశమే నాకు ఇస్తే ప్రజలు ప్రభుత్వాన్ని దించేస్తరు.
ఛాలెంజ్ చేస్తున్నా’ అన్నారు.
‘నక్సలైట్లు తమ తప్పుల్ని ఒప్పుకుంటున్నారు.
1967 నుంచి ఇప్పటి వరకు తమ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నారు’ అన్నారు.
అర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ల పై నిషేధం అమలు చేసే తీరుగురించి మాట్లాడుతూ, తన వర్గం ఎప్పుడూ తన కన్నును తానే పొడుచుకోదు.
కాకపోతే మూసుకుంటుందని గద్దర్ వ్యాఖ్యానించారు.
ప్రైవేటు హింస అయినా, రాజ్యహింస అయినా, అసలు హింస అనేది పాలకులే చేస్తారని గద్దర్ అంటారు.
ప్రైవేట్ హింసకు ఉదాహరణగా రాయలసీమ ముఠా తగాదాలను గద్దర్ తన పాట ద్వారా ఇలా గుర్తు చేశారు.
‘మట్టిని విడదీసినట్టు
మనుషులను విడదీసి
ముఠాతగాదలల్ల
మనిషిని ముడిసరుకు చేసి
కాళ్ళకు కత్తులు గట్టి
కోళ్ళపందెమాడినట్టు
బాంబుల సంస్కృతిని పెంచే బద్మాషు పాలకులు’
ప్రభుత్వానికి లొగిపోతున్నవారి గురించి, ఆయుధాలను పాలకవర్గాల పాదాల దగ్గర పెట్టి ఉపాధి కోసం యాచించే వారి గురించి గద్దర్ ఇలా అంటారు.
తల వంచుకున్న వంటె
తలను నరికి వేస్తరు
పట్టు వదిలిన వంటె
ప్రాణం పెకిలిస్తరు
వలలో చిక్కిన పులిపిల్లవు నీవు
వదిలిపెడతారనే భ్రమలింకా మానుకో
ఇంటికి విప్లవమునకు
రెంటికి చెడిపోకు
తుపాకుల కెదురునిలువరా
అన్నయా తూటాల మాల తొడగరా’
ఎమర్జెన్సీలో తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు రాసిన పాటని గుర్తు చేశారు.
‘మేం అహింసా వాదులం’ అని గద్దర్ ప్రకటించారు.
‘హింసకు మేం వ్యతిరేకులం’ అన్నారు.
‘ఆవు దూడ చచ్చిపోతే, దూడ శరీరంలో గడ్డిపెట్టి అవును మైమరిపించి పాలు పిండుకోవడం హింస.
వేట పేరుతో ఎగిరే పక్షులను కాల్చి చంపడం హింస.
స్త్రీ వెళుతుంటే కళ్ళలోకి సూటిగా చూసి ఇబ్బంది పెట్టడం హింస.’ అంటూ అసలు హింస ఏఏ రూపాల్లో ఉందో వివరించారు.
” ‘కిడ్నీలు అమ్మబడును. కడుపులో పెరిగే అడ బిడ్డ అయితే చంపబడును’ ఇది హింస కాదా?
కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి భూగర్భ జలాన్నంత కలుషితం చేయడం హింస కాదా?
మాకు రాజ్యమివ్వండి.
దేని మీదా హింస జరగనివ్వం” అని గద్దర్ ప్రకటించారు.
‘నక్సలైట్లు చేతులు నరికిండ్రని ఒకడు మొండి చెయ్యి చూపిస్తడు.
ఊర్లో అందరి చేతులు నరకకుండా నీ చెయ్యే ఎందుకు నరికిండ్రు బే’? అన్నది గద్దర్ ప్రశ్న.
‘అన్నలకు మనమేం చెబుతాం.
అన్నలే మనకు సూచిస్తారు’ అంటూ
‘వీరులార మీకు ఎర్రెర దండాలు
శూరులార మీకు ఎర్రెర్ర దండాలు’ అంటూ గద్దర్ మళ్ళీ గొంతెత్తారు.
‘మానవ సమాజ చరిత్రలో మనుషుల కోసం సర్వస్వం త్యాగం చేసిన కొమ్మలార, కోన లారా, పక్షులార మీకు లాల్ సలాం’
‘మానవ సమాజం కోసమే కాదు మానవ శ్రమను జీవకోటి ప్రాణాలను డాలర్లుగా, రూబుల్స్ గా మార్చుకునే దోపిడీ దొంగలను, నోట్లను ఓట్లుగా మార్చుకునే దొరలను, దొరబాబులను గడగడ వణికించి చిరునవ్వుతో తమ ప్రాణాల్ని ప్రజలకు అర్పించిన… అమర వీరులార మీకు ఎర్రెర్ర దండాలు’ అంటూ గద్దర్ తన పాటలను, మాటలను ఆ పూటకు ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *