-టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించడానికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషిని ప్రజలకు వివరించడానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టడానికి, క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా, నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చకు తెరలేపినందుకు మీకు అభినందనలు.
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సందర్శన సందర్భంగా “పవర్ పాయింట్ ప్రజెంటేషన్” అనంతరం ఒక రైతు ప్రతినిథి, ఒక విలేకరి లేవనెత్తిన సిద్ధేశ్వరం ఆనకట్ట, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తీగెలు వంతెనను “బ్రిడ్జ్ కం రోర్డ్”గా నిర్మించాలన్న డిమాండు, అలాగే గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణం, వగైరా అంశాలపై మీరు సానుకూలంగా స్పందించడం సంతోషం.
గాలేరు – నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి అనుసంధాన పథకంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా రు.650 కోట్లు కట్టబెట్టిందని మీరు ఆరోపించారు. మీరు చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారు బాధ్యతతో స్పందించాలి.
ఈ నేపథ్యంలో ఈ పథకం యొక్క పూర్వాపరాలను మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురాదలిచాను. విద్యార్థి దశ నుంచి మీతో ఉన్న పరిచయం కొద్దీ సద్విమర్శ కూడా చేస్తున్నాను. మీకు రుచిస్తుందో! లేదో! నాకు తెలియదు. అయినా, నాకున్న స్వభావం రీత్యా విమర్శ చేస్తాను. మన్నించండి. వీలైతే స్వీకరించండి. ఇదే రామచంద్రారెడ్డిగారికి కూడా వర్తిస్తుంది.
ఎన్టీఆర్ ప్రభుత్వం కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా గాలేరు – నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను రూపకల్పన చేసిందన్న విషయం అందరికీ విధితమే. నాడు శ్రీరామకృష్ణయ్య ఆధ్వర్యంలో అధ్యయనం చేసి, నివేదికలను తయారు చేసి, కేంద్ర జల సంఘానికి పంపారు. మిగులు జలాల ఆధారంగా నిర్మించబడే ప్రాజెక్టులకు సిడబ్ల్యూసి అనుమతివ్వదని అందరికీ తెలుసు. కానీ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు మిగులు జలాలను వాడుకొనే స్వేఛ్చ ఆంధ్రప్రదేశ్ కు దఖలు పరచడం జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్టులను నిర్మించుకొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం సిడబ్ల్యూసికి నివేదించింది. అటుపై అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు అదే వైఖరిని కొనసాగించాయి.
గాలేరు – నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులకు పర్యావరణ మరియు అటవీ శాఖల నుండి చాలా వరకు అనుమతులు లభించాయి. మూడున్నర దశాబ్దాలు గడచిపోయినా ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. రాష్ట్రం రెండు ముక్కలయ్యింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, ఈ ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించింది. ఆ ప్రాజెక్టుల సమగ్ర అధ్యయన నివేదిక(డిపిఆర్)ల ప్రకారం వాటిని యుద్ధ ప్రాతపదికన నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది.
గాలేరు – నగరి సుజల స్రవంతి నిర్మాణాన్ని రెండు దశలుగా విడగొట్టారు. మొదటి దశలో గండికోట ప్రధాన జలాశయం, వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్స్ నిర్మాణం మరియు 35,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి పంట కాలువల వ్యవస్థ నిర్మాణం. రెండవ దశలో కడప, ప్రస్తుత అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,20,000 ఎకరాలకు, తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల పరిధిలో 1,05,000 ఎకరాలకు సాగునీరు, ఆ ప్రాంతాల ప్రజలకు త్రాగునీరు అందించాలి. ఇది ప్రాజెక్టు యొక్క నిర్దేశిత లక్ష్యం. మరి జరిగిందేమిటి? మొదటి దశ నిర్మాణం చేసి, రెండవ దశ నిర్మాణాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. ఇది దారుణం కదా!
అంతకంటే దారుణమైన విషయమేమంటే, గాలేరు – నగరి సుజల స్రవంతి, హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల అనుసంధాన పథకమంటూ ఒక అసంబద్ధమైన పథకాన్ని రూపొందించి, నిర్మాణానికి పూనుకోవడం. దాని ద్వారా గాలేరు – నగరి సుజల స్రవంతిలో అంతర్భాగంగా నిర్మించబడిన గండికోట ప్రధాన జలాశయానికి చేరిన కృష్ణా నది మిగులు జలాలను దొడ్డిదారిన తరలించే దుష్టఆలోచన సమర్థనీయమా! ఆ పథకాన్ని అడ్డదారిలో చేపట్టి, గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని అటకెక్కించారు. నాకు గుర్తున్న మేరకు దాన్ని మీ ప్రభుత్వం రూపొందించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పథకాన్ని మరింత విస్తరించింది. అక్రమార్జనకు చక్కటి పథకంగా కూడా మార్చుకొన్నదేమో!
ఎన్టీఆర్ ప్రభుత్వం రూపొందించిన హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు క్రింద నిర్దేశించిన ఆయకట్టు చివరి భూములకు కూడా నీరందించాలి. ఎలా? శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా నది మిగులు/వరద జలాలను వడిసి పట్టుకొని, హంద్రీ – నీవా ప్రధాన కాలువను 3850 నుండి 6500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి విస్తరించి, నీటిని తరలించడం ద్వారా చిత్తూరు జిల్లాలోని చివరి ఆయకట్టుకు కూడా నీరందించాలి.
గాలేరు – నగరి ప్రాజెక్టు ఆయకట్టు అవసరాల కోసం శ్రీశైలం జలాశయం నుండి తరలించి, గండికోట జలాశయంలో నిల్వ చేసే నీటిని గాలేరు – నగరి, హంద్రీ – నీవా అనుసంధాన పథకం ద్వారా అడ్డదారిలో హంద్రీ – నీవా ఆయకట్టు ప్రాంతానికి నీటిని తరలించాలని తలపెట్టడం దుర్మార్గం కదా!
గాలేరు – నగరి సుజల స్రవంతి ద్వారా చిత్తూరు జిల్లాలోని నగరి వరకు ఉన్న ఆయకట్టుకు గండికోట నుండి నీరురానిస్తారా! అన్న సందేహాన్ని మూడు దశాబ్దాల క్రితం మీరే వ్యక్తం చేసినట్లు నాకు గుర్తు. రెండవ దశ నిర్మాణాన్ని అటకెక్కించి, గాలేరు – నగరి మరియు హంద్రీ – నీవా అనుసంధాన పథకం రూపంలో ఆ ప్రమాదం ఇప్పుడు ముచ్చుకొచ్చింది కదా! ఈ దుస్థితికి మీరు కూడా బాధ్యతవహించాలి. సరిదిద్దే బాధ్యత తీసుకోవాలి.
మందులకు “ఎక్స్ పైరీ డేట్” ఉన్నట్లే, ఈ ప్రభుత్వానికి కూడా త్వరలోనే గడువు ముగుస్తుంది. ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు నూతన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారు. మీరే అధికారంలోకివస్తే! గాలేరు – నగరి సుజల స్రవంతి మరియు హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుల అనుసంధాన పథకాన్ని భేషరతుగా రద్దు చేసి, గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతారో! లేదో! తెల్చిచెప్పండి? ఈ పథకం నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై మీరు చేసిన ఆరోపణలను నిగ్గుతేల్చి, అవినీతి సొమ్మును రాబట్టి, ప్రభుత్వ ఖజానాకు చేరుస్తారా? అవినీతికి పాల్పడిన నిర్మాణ సంస్థను “బ్లాక్ లిస్ట్”లో పెట్టి, బాధ్యులను శిక్షిస్తారా?
(టి. లక్ష్మీనారాయణ,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)