శక్తికటారి వైపు సాహస యాత్ర

 

-రాఘవశర్మ

ఎన్ని నీటి గుండాలు!
ఎన్ని చిన్న చిన్న జలపాతాలు!
రెండు ఎత్తైన కొండల నడుమ నిత్యం పారే సెలఏర్లు! లోతైన నీటి గుండాల్లో కనిపించే గులకరాళ్ళు! అక్కడక్కడా రాళ్ళదిబ్బలు.
గులకరాళ్ళ కింద నుంచే ప్రవహిస్తున్న స్వచ్ఛమైన జలాలు.
నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన పెద్ద పెద్ద బండ రాళ్ళు. ఆకాశాన్ని తాకినట్టుండే ఎత్తైన కొండ అంచులు.
కొండ కొసల్లో చిన్న చిన్న మొక్కల్లా కనిపించే మహావృక్షాలు.
నీటి మడుగులకు ఇరువైపులా లోనికి చొచ్చుకుపోయిన కొండ రూపాలు.
ఎన్ని వింతలు! ఎన్ని విడ్డూరాలు ! ఎన్ని ప్రకృతి సోయగాలు!
కుమారధార నుంచి శక్తికటారికి వెళ్ళే దారంతా అందాలే!
రెండు కొండల నడుము ఆరు గంటలపాటు సాగిన సాహన యాత్ర!

వర్షాలు సరిగా పడడం లేదు.
శేషాచలం కొండల్లోని తీర్థాలన్నీ వెలవెలబోతున్నాయి.
ఆదివారం వచ్చింది కదా!
అయిననూ పోయిరావలె అడవికి
కుమారధార నుంచి శక్తి కటారి వైపు సాహస యాత్ర.

పసుపు ధార ముందు ప్రకృతి ప్రియులు

పదమూడు మంది సిద్ధమయ్యారు.
మాధవి అనే ఒక బ్యాంకు ఉద్యోగి కూడా వచ్చారు.
ఆరు, పన్నెండేళ్ళ వయసున్న ఇద్దరు ఆడబిడ్డల్ని వెంటబెటుటకొచ్చారు.
తెల్లవారుజామున 5 గంటలకు అలిపిరి నుంచి బయలు దేరాం.
ఆ చీకట్లోనే మా ద్విచక్ర వాహనాలు తూనీగల్లా దూసుకుపోతున్నాయి.
ఆరు గంటలకల్లా తిరుమల చేరాం
తిరుమల చేరేసరికి ఆకాశమంతా మబ్బులు కమ్మాయి.
శిలాతోరణం మీదుగా, వేదపాఠశాల వైపు సాగాం.
వేదపాఠశాలకు తిరుమల నుంచి నాలుగు కిలోమీటర్లు.
వేద పాఠశాలకు కుడివైపున ఈవలనే ఉన్న అడవిలోకి దారి తీశాం.
నన్నని తుంపర మొదలైంది.
ఎత్తైన వృక్షాల నడుము, ఎగుడు దిగుడు రాళ్ళతో నిండిన రహదారి.
ద్విచక్రవాహనాలు జారి పడుతున్నాయి.
చాలా నిదానంగా వెళ్ళాలి.
వేద పాఠశాల నుంచి కుమారధారకు అలా ఏడు కిలో మీటర్లు సాగాం.
ఎదురుగా పసుపుధార ఎండిపోయనట్టుంది.
కొంచెమే నీళ్ళున్నాయి.
పసుపుధారలో మోడువారిన చెట్లు
పసుపు ధార ప్రాజెక్టుపైకి వచ్చేశాం.
ఎడమవైపునకు వెళితే కుమారధార ప్రాజెక్టు.
కవలపిల్లల్లా అవి జంట ప్రాజెక్టులు.
పసుపు ధార ప్రాజెక్టు వద్ద వాహనాలను నిలిపేశాం.
ఎడమ వైపున లోయలోకి దిగుతున్నాం.
లోయలోకి తొలి దశ దిగేసరికి దారంతా ఎండిపోయిన ఏరు.
వర్షాకాలంలోనే అది ప్రవహిస్తుంది.
ఏరుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు కమ్మేశాయి.
రాళ్ళు ఎక్కుతూ దిగుతూ కుమారధారవైపు సాగాం.
లోయలోకి దిగడానికి తేలికగా అటవీశాఖ రెయిలింగ్ అమర్చింది.

కుమారధార లోకి దిగడానికి రెయిలింగ్

ఒకప్పుడు కుమార ధారలోకి దిగడం పెద్ద సాహసమే.
రెయిలింగ్ వల్ల ఇప్పుడు తేలికైపోయింది.
బలమైన ఇనుప నిచ్చెన కూడా నిర్మించారు.
నిచ్చెన లేని రోజుల్లో కుమార ధారలోకి తాళ్ళు కట్టుకుని దిగేవాళ్ళం.
తేలిగ్గా దిగేశాం.
ఇవేమీ పట్టనట్టు కుమార ధార ఒంటరిగా ప్రవహిస్తోంది.
ఆ ఏకాంతంలో ఎంత ప్రశాంతత!
అల్పాహారం ముగించుకుని, మా బ్యాగులు, మధ్యాహ్న భోజనం అక్కడే పెట్టేశాం.
కోతుల భయంతో వాటిపైన ప్లాస్టిక్ పట్టా కప్పేశాం.
కుమార ధార ప్రవహించే ఈశాన్య దిక్కుకు బయలు దేరాం.
కొండకు ఒక వైపు పలకలు పలకలుగా అంచులు.
సరదాగా దానిపైకి ఎక్కాం.

సరదాగా, కొండ అంచుల్లో

రెండు ఎత్తైన కొండల నడుమ నుంచి మా నడక.
పెద్ద పెద్ద బండ రాళ్ళు, మధ్య ప్రవహిస్తున్న ఏరు.
ఈ ఏరును దాటుకుంటూ, దాని పక్కనుంచే ఎటు వీలైతే అటు నడుస్తున్నాం.
మధ్యలో నీటి మడుగు అడ్డంగా వచ్చింది.
గాలి నింపిన ట్యూబుపై సెల్ఫోన్లు, కాస్త తినుబండారాలు పెట్టిన బ్యాగును లాక్కుని వెళ్ళాం.
నడుము లోతు నీటిలో దిగక తప్పలేదు.
నీళ్ళు జిల్లుమంటున్నాయి.
రెండు కొండల నడుమ చల్లని వాతావరణం.
మళ్ళీ రాళ్ళ పైనుంచి నడక.
కొండ అంచుల్లో చిన్న చిన్న గుహలు.
రెండు కొండల నడుము విశాలమైన ప్రాంతాలు.
కొట్టుకొచ్చిన రాళ్ళకింద నుంచే ప్రవహిస్తున్న ఏరు.

ఒక కొండ నుంచి మరొక కొండకు అడ్డంగా పొడవాటి చెట్టు కాండం పడి ఉంది. దాని కింద నుంచి దూరి వెళ్ళాం..

ప్రవాహానికి కొట్టుకు వచ్చిన చెట్టు.

అలా అనేక చెట్లు నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చి అడ్డంగా ఇరుక్కుపోయి ఉన్నాయి.
చెట్లే కాదు, పెద్ద పెద్ద ఇనుప నిచ్చెనలు కూడా కొట్టుకొచ్చాయి.
అవి కుమారధారలో దిగడానికి అమర్చిన ఇనుప నిచ్చెనలు.
ప్రతి ఏటా నిచ్చెనలు ఏర్పాటు చేయడం, అవి నీటి ప్రవాహానికి కొట్టుకు పోవడం.
గుండాల్లో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో!
అడుగున ఉన్న గులక రాళ్ళు సైతం కనిపిస్తున్నాయి.
కొన్ని నీటి గుండాలు లోతుగా ఉన్నాయి. ఈదుకుంటూ వాటిని దాటిపోక తప్పదు. ట్రెక్కింగ్ స్ఫూర్తితో ఒరికొకరు సాయం. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త.
ఏమిటి సాహసం ! ఏమిటీ ఆనందం!
ఒక తల్లి, ఇద్దరు చిన్న బిడ్డలు రావడం!

నీటి గుండం లోకి దిగుతున్న సాహసికులు.

అర్థ చంద్రాకారంలో ఉన్న రెండు కొండల నడుమనుంచి లోతైన గుండంలోకి పడుతున్న జలధార.
మెలికలు తిరిగిన రాతి అంచుల నుంచి వయ్యారంగా జాలువారుతున్న జలధార,
జారుడుబండలా ఆ వయ్యారపు జలధారతో పాటు గుండంలోకి జారుతున్న ప్రకృతి ప్రియులు!
జారుడు బండలో నీటిలోంచి ఇలా జారడం పిల్లలకు ఎంత నరదా!
అలా జారుతున్నప్పుడు కేరింతలు.
పెద్దలు కూడా పిల్లలైపోతున్నారు.
గుండంలో ఈత కొట్టుకుంటూ వచ్చినంత సేపూ బాగానే ఉంది.
లేచి నిలబడి గులరాళ్ళ పైనుంచి ఒడ్డుకు వస్తున్నప్పుడు పడిపోతున్నాం.
అలా ఎన్ని నీటి గుండాలో!
ఎన్ని నీటి జారుడు బండలో!
ఎన్ని ఆనందాలో!
ఒక్కొక్క నీటి గుండంలోకి దూకేటప్పుడు ఎంత సాహనం!
ముందు సాహసికులు దూకుతారు.
ఆ తరువాత ఒకరొకరు.

లోతయిన నీటి గుండం

జాలువారుతున్న జలధార పై నుంచి తాడు కట్టుకుని గుండంలోకి దిగాలి.
గుండంలోకి దూకడమే తప్ప మెల్లగా దిగడానికి వీలు కాదు.
అలా పన్నెండడుగుల గుండంలోకి డై కొట్టాను.
ఈదుకుంటూ ఆవలికివచ్చిన కాసేపటికి చూసుకుంటే, నా కళ్ళజోడు లేదు.
కళ్ళ జోడుతో ఈదుకుంటూ వచ్చినా ఎప్పుడూ జారిపోలేదు.
కానీ తలకిందుల దూకే సరికి కళ్ళ జోడు కాస్తా నీళ్ళలో పడిపోయింది.
పన్నెండడుగుల నీటి గుండంలో నా కళ్ళ జోడు ఎక్కడపడిపోయిందో!
అడుగున ఉన్న గులకరాళ్ళు కనిపిస్తున్నాయి.
నేను దూకుతున్నప్పుడు తీసిన వీడియోను నిదానంగా ప్లే చేసి చూశారు.
ఎక్కడ పడిందో గమనించారు.
నా కళ్ళజోడు కోసం చాలా సేపు వెతికారు.
నేనైతే ఆశలు వదులుకున్నాను.
ఇంట్లో ఇంకో కళ్ళజోడు ఉంది వదిలేయండన్నాను.
కానీ వాళ్ళు వదలలేదు.
పన్నెండడుగుల లోతులో గులకరాళ్ళపైన నా కళ్ళజోడును కనిపెట్టారు.
మునిగి పట్టుకొచ్చారు.
నేనైతే అంత సాహసం చేయలేకపోయేవాణ్ణి.
మా ట్రెక్కింగ్ గ్రూపులో గజఈత గాళ్ళున్నారు.
మునిగిపోయిన మనుషులనైనా పైకి లాక్కొస్తారు.
గుండంలో ఈదడానికి ముందు ట్రెక్కింగ్ హ్యాండ్ స్టిక్కు అవతలి ఒడ్డుకు విసిరేశాను.
అలా విసిరేస్తుంటే, అడుగునున్న కింద భాగం ఊడి నీళ్ళలో పడిపోయింది.
పై భాగం తేలుతోంది.
ఆ నీటి గుండంలో దాన్ని కూడా అలాగే వెతికి పట్టుకొచ్చారు.
కిందటి తడవ ఇలాగే వచ్చినప్పుడు తాళ్ళు తీసుకు రాలేదు.
దాంతో ఇంత దూరం వెళ్ళలేకపోయాం.
ఈ తడవ తాళ్ళు తీసుకొచ్చారు కనుక మరికొంత దూరం వెళ్ళగలిగాం.

నీటి గుండాల ను ఇలా ఈదుకుని దాటు తూ..

పై నున్న నీటి గుండం లోపల ఉన్న పెద్ద బండరాయికి తాడు కట్టారు.
ఒక నీటి గుండం నిండి కింద నున్న నీటి గుండంలోకి జల ధార పడుతోంది.
తాడు కట్టడానికి ఎక్కడా అవకాశం లేదు.
పై నున్న నీటి గుండంలోకి మునిగి లోపలున్న పెద్ద బండరాయికి తాడు కట్టి పైకి తెచ్చారు.
ఆ తాడును కింద నున్న నీటి గుండంలోకి వదిలారు.
ఆ తాడు పట్టుకునే కింద నున్న నీటి గుండంలోకి దిగగలిగాం.
ట్రెక్కింగ్ సాహసంలో అన్నీ సరి కొత్త అన్వేషణలే!
తెచ్చింది ప్లాస్టిక్ తాడు. అది జారిపోతోంది.
నూలు తాడు తెచ్చినట్టయితే మంచి పట్టు ఉండేది.
ఇదొక అనుభవం.
చూస్తే ముందున్నది మరింత లోతైన నీటి గుండం.
మరింత ఎత్తునుంచి దూకాలి.
స్త్రీలు, పిల్లలు ఉన్నారు.
వారిని మధ్యలోనే మరొకరి కాపలాతో ఉంచి వచ్చాం.
ఇంతకు మించిన సాహసం చేయకూడదు.
నూలు తాడు తెచ్చినట్టయితే మరింత ముందుకు వెళ్ళవచ్చు.
ఉదయం ఎనిమిదిన్నరకు కుమార ధార నుంచి ఈ సాహసయాత్ర మొదలైంది.

గుండాల్లో ఈది ఈది దుస్తులన్నీ తడిసి ముద్దయ్యాయి.
ఎండొస్తే ఎంత బాగుంటుంది!
రెండు కొండల నడుము చలి చంపేస్తోంది.
కుమార ధారకు తిరిగివెళ్ళక తప్పదు.
వెను తిరిగాం.

ఒక్కొక్కరూ పైకి ఎక్కి వస్తున్న వైనం

దిగడం తేలికే కానీ, ఎక్కడం చాలా కష్టం.
జలధారకు ఎదురుగా తాడు పట్టుకుని ఎక్కుతుంటే జారిపోతోంది.
పాకుడుతో నిండి ఉన్న బండ దగ్గర పట్టు దొరకడం లేదు.
కింద నున్న యువకులు మోటిస్తే తప్ప పైకి ఎక్కలేని పరిస్థితి.
ఎక్కుతున్నప్పుడు తాడు కూడా జారిపోతోంది.
ఎక్కే టప్పుడు ఒంగి మోచేతులు, మోకాళ్ళు బండపై పెట్టుకుని ఎక్కుతున్నాం.
అయినా జారిపోతోంది.
మోచేతులు గీక్కుపోయాయి.
‘మోకాలి గార్డు’లుండడం వల్ల మోకాళ్ళు భద్రంగా ఉన్నాయి.
పై నున్న వాళ్ళు చేతులు అందిస్తున్నారు.
వెళ్ళేటప్పుడు ఈదిన నీటి గుండాలన్నీ మళ్ళీ ఇదుకుంటూ వచ్చాం.
దూకిన నీటి గుండాలన్నీ మళ్ళీ ఎక్కాం.
చూసిన ప్రకృతి సోయగాలను మళ్ళీ చూశాం.
వెళ్ళేటప్పటి కంటే తిరిగి వచ్చేటప్పుడే ఎక్కువ సాహసాలు.
మా సాహస యాత్రలో ఒక్కొక్క నీటి గుండం ఒక్కొక్క మైలురాయి.
ఒక్కో నీటి గుండం దాటుతుంటే, ఒక్కో గండం దాటినట్టనిపించింది.
దారి పొడవునా ఎన్ని మాటలో! ఎన్ని కబుర్లో!
పిల్లల మాటలు అలువును కనిపించకుండా చేశాయి.
హమ్మయ్యా.. అదిగో చివరి నీటి గుండం!
అది దాటితే, ఆ కొండ రాళ్ళ పైనుంచి నడిస్తే, అదిగో అదే కుమార ధార.

ఇదే కుమార ధార

మధ్యాహ్నం రెండున్నరైంది.
భోజనాలు ముగించుకుని వచ్చిన దారినే తిరుగు ప్రయాణం.
ఇంటిముఖం పట్టిన ఎద్దుల్లా పరుగో పరుగు.
తెల్లవారు జామున 5 గంటలకు బయలు దేరిన వాళ్ళం సాయంత్రం 5 గంటలకల్లా తిరుపతి చేరాం.
చాలాకాలం తరువాత మళ్ళీ ఈ సాహస యాత్ర.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం.9493226180

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *