తెలుగు నాట బిజెపి ఎత్తులపై ఎత్తులు..

ఎం. కృష్ణమూర్తి
జూలై 8 న మోదీ మరోవరస ప్రచారానికి వరంగల్లుకి వస్తున్నారు..రెయిల్వే వేగన్ వర్క్ షాప్ వంటి అనేక వాగ్దానాలతో, కోట్లాది ప్రభుత్వ ఖర్చుతో.. లక్షలాదిమందిని తరలించే భారీసభలో ప్రసంగిస్తారు. కొత్త వ్యూహాలతో, పాత వ్యూహాల్లో నిర్మాణ పరమైన మార్పులతో, నినాదాల సర్దుబాట్లతో వస్తున్నారు.  తెలుగురాష్ట్రాల్లో ఎలాగైనా పాగావేయాలని  బీజేపీ సామదాన భేద, దండోపాయాల్ని ప్రయోగిస్తున్నది. కేంద్రమంత్రులూ, ఇతరరాష్ట్రాల ప్రభుత్వనేతలూ అనేకవ్యూహాలతో నానాటికీ పెద్ద స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు.  మోదీ, షా, ఆదిత్యనాథ్ వగైరాలు అనేకసార్లు పర్యటించినా తెలుగు రాష్ట్రాల్లొ బీజేపీ ఇప్పటిదాకా గెలవలేదు. ఇలాటిస్థితిని..దానిలో తెలుగు రాష్ట్రాల నేతల ఆచరణని గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చూద్దాం.

హిందుత్వ రాజకీయాలుమోడీ చరిస్మా సరిపోవు’ : ఆరెస్సెస్

తొమ్మిదేళ్ల బీజేపీ పాలన గురించి చెప్పుకొని,  2024లో మూడోసారి మోదీని  ప్రధానిగా చేయాలని  బీజేపీ ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.  ఏ పార్టీకైనా  అది సహజమే. అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం తప్పేమీ కాదు అన్న సత్యాతీత (పోస్ట్ ట్రూత్) సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే పార్టీల్లో ఒకటి  బీజేపీ. ఉదా.కి  మోదీ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లేనిదిగా బుకాయిస్తున్నారు. రఫేల్ కుంభకోణం వంటివి సుప్రీం కోర్టుదాకా వచ్చాయి.  కర్ణాటకలో “40 శాతం కమిషన్” పుచ్చుకునే ప్రభుత్వంగా ‘కుఖ్యాతి’ గాంచి ఓడిపోయిన పార్టీ అది. స్వయంగా ఆర్ ఎస్ ఎస్ పత్రిక ’ఆర్గనైజరు’ (మే 23, 2023 ) సంపాదకీయంలో- సమీక్షలో- దీన్ని ప్రస్తావించారు: ‘మోదీ  అధికారంలోకి వచ్చాక తమ పార్టీ పాలనలోని రాష్ట్రంలో అవినీతి గురించి డిఫెన్స్ లో పడి చెప్పుకోవాల్సి రావటం గమనార్హం ’ అని వ్యాఖ్యానించారు.  కర్ణాటక ఎన్నికల సమీక్షలో భాగంగా  ‘ఎన్నికల్లో గెలవాలంటే హిందుత్వ రాజకీయాలు, మోడీ చరిస్మా సరిపోవు’ అని సూటిగా  రాసారంటే ‘పరివార్’లో ఎలాటి గ్రహింపు వచ్చిందో అర్థంచేసుకోవచ్చును.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అవినీతిమయం అయినాయని   బీజేపీవారు ఆరోపి స్తున్నారు.  ఏ పార్టీ ప్రభుత్వమైనా నానాటికీ  అవినీతిలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయన్నది నిజం. 1990ల్లో బోఫోర్సు (కొన్ని వందలకోట్ల కుంభకోణం)వల్ల రాజీవ్ గాంధీ ప్రభుత్వం పడిపోయింది.  ఇవాళ రాష్ట్రాలలోనే వేలు, లక్షల కోట్ల అవినీతి ఆరోపణలున్నాయి. జైలుకి వెళ్లి వచ్చిన నేతల,పార్టీల గెలుపు సర్వసాధారణమైంది.  రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంలో వేలాదికోట్ల అవినీతి కేసు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఐనా మోదీ ప్రభుత్వం ‘హ్యాట్రిక్’ని ఆశిస్తున్నది.

ఓటర్లనే కాక ,ఆపరేషన్ కమల్’ పేరిట ఇతరపార్టీలనూ, వారి శాసన సభ్యులనూ గంపగుత్తగా కొనటంలో ఇతరుల రికార్డుల్ని అధిగమించిన-దానికై ఏకంగా  చేరికల  కమిటీనే వేసిన –  బీజేపీ సిధ్ధాంతాలు, అవినీతి అంటూ వల్లించటం చూస్తు న్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యూడల్  కుటుంబాల వారసులను ప్రతిరాష్ట్రంలోనూ  చేర్చుకొని, పదవులు కట్టబెడుతున్నబీజేపీ ఇతరపార్టీల్లో  వంశపారంపర్యతను విమర్శిస్తున్నది!  తాజాగా మహారాష్ట్రలో అజిత్ పవార్ 70వేలకోట్ల ఇరిగేషను కుంభకోణంలో మునిగి ఉన్నారని స్వయంగా ప్రధాని ఆరోపించిన కొద్ది రోజులకే పవార్ కుటుంబ వారసుణ్ణి  ఉపముఖ్యమంత్రిగా చేసారు; మరో ఐదుగురిపై కూడా  అవినీతికేసులూ, ఈడీ ఒత్తిడులూ ఉన్నాయి;  వారంతా ఇవాళ మంత్రులై, ‘త్రిపుల్’ ఇంజను సర్కారులో భాగమయ్యారు. లోగడ దేవెగౌడ వారసుణ్ణీ ఆకర్షించి, కర్నాటక ముఖ్యమంత్రిని చేసారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే.

జూన్ 11న విశాఖపట్నంలో అమిత్ షా ప్రచారమూ ‘సత్యాతీతమే’- అసత్యాలతో, అర్థ సత్యాలతో కూడినదే. మీరు ఎన్నికల ప్రచారంలో ఇలా చెప్పారు కదా, అలా వాగ్దానాలు చేశారు కదా అని లోగడ ఒకసారి ప్రశ్నించినప్పుడు ‘వహ్ జుమ్లా  హై’ అని  షా నిర్మొహమాటంగా జవాబు చెప్పారు. తేట తెలుగులో చెప్పాలంటే ‘ఎన్నికల కోసం ఏదో కోతలు కోస్తుంటాం అంతే’ అని దాని అర్థం. ఇది కొందరు ప్రశంసిస్తున్న ఆ ‘చాణక్యుడికి’ మామూలే :  రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉంటూ, రైతు సంక్షేమం గురించి చెప్పుకోడం విడ్డూరంగా ఉంది అన్నారు షా. అంతకుముందు తెలంగాణ గురించీ ఆపార్టీవారు ఇలాగే  చెప్పారు.  రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని బీజేపీ నేత లక్ష్మణ్, తెలంగాణలో 2017-19ల మధ్య 2000 రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని ఆర్థికమంత్రి నిర్మల, తెలంగాణలో 10వేలమంది రైతుల ఆత్మహత్యలని బండి సంజయ్ ఆరోపించారు.

వాటిని  తెలంగాణ మంత్రులు ఖండించారు కానీ, బీజేపీ వ్యతిరేక కూటమికై జరిగిన పాట్నా సమావేశానికి దూరంగా బిఆర్ ఎస్  వారు ఉన్నారన్నది గమనార్హం. కొంతకాలంపాటు బీజేపీపై ఘాటు విమర్శలు చేసినా తాజాగా  తాము బీజేపీకీ కాంగ్రెసుకీ సమదూరం పాటిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరించారు.  ఆవిధంగా తమ ప్రధాన లక్ష్యం  బీజేపీ కాదని -ఢిల్లీవెళ్లి మరీ – చెప్పారు. అల్లూరి 125వ జయంతి సభలో కేసీఆర్ గవర్నరుతో వేదికని పంచుకోటమే కాక, కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డినీ – ఆయన అదేరోజున తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబద్దారు- ఈ సభ నిర్వహించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో  మరోరకం విచిత్ర పపరిస్థితి : అధికార పార్టీకి శాసన సభలో పూర్తిబలంఉన్నా, మొదటిరోజునుంచే తెదేపా అనుసరిస్తున్న శత్రువైఖరి వల్ల- బీజేపీ ( మోదీ ప్రభుత్వం) పట్ల జగన్ పార్టీది మెతక వైఖరిగా ఉన్నట్టు కన్పిస్తూనే ఉన్నది. తాజాగా జూలై 5న ఢిల్లీకి వెళ్లి , మోదీ షా నిర్మలమ్మలను కలిసి, చర్చలూ మంతనాలూ జరిపారు. కాగా ప్రతిపక్ష తెదేపా మళ్లీ నేరుగా బీజేపీతో చేయికలపాలని చూస్తున్నది; దానికై చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి  బీజేపీ అగ్రనేతల్ని కలిసారు కూడా.రాష్ట్రాల హక్కులగురించి లోగడ వల్లించిన  ‘తెలుగు’దేశం మరోతెలుగువాడైన జగన్ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలనే దాకా వెళ్లింది. ఈడీ తదితర కేంద్రసంస్థలు ‘ఇంకా దాడి చేయట్లేదేమి’ అని అడుగుతున్నది!

కేసిఆర్ చంద్రబాబు జగన్- ముగ్గురి పార్టీలూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని కీలక సమయాల్లోనూ బలపరిచాయి. ఈ ముగ్గురూ గుడులు, మఠాలు, స్వాములచుట్టూ తిరగటంలో పూర్వపు రాజుల్ని మించిపోయారు.  అలావారు  ‘హిందుత్వ’ –  బీజేపీచుట్టూ తిరుగుతున్నా, వామపక్షాలు చంద్రబాబు, కేసిఆర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. జనసేన సరేసరి, అధికారికంగానే బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ, తెదేపాతో చేతులు కలిపి ఉన్నది.
చివరికి కేంద్రం ప్రధాన బాధ్యతైన పెట్రోలు డీసెల్ ధరలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలపై నిందలే తప్ప  కేంద్రానికి వ్యతిరేకంగా గట్టిగా గొంతెత్తటానికి ఎవ్వరూ  సిధ్ధంగా లేనట్టు కన్పిస్తున్నది.

రాజకీయాల్లో పోలరైజేషను వల్ల  నిజానిజాలతో సంబంధంలేకుండా ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయాపార్టీల ప్రయోజనాలు ఎలా ఉన్నా, బీజేపీపై, వారి జాతీయోన్మాదం, హిందుత్వలపట్ల స్పష్టతతో ప్రజలూ, తెలుగుమీడియా వ్యవహరించాల్సి   ఉన్నది. కానీ పరిస్తితి అలాలేదు.  దానికొక ముఖ్యకారణం – మీడియాలో అత్యధికభాగం స్వతంత్రంగా లేవు; ఆయా పార్టీలకు పక్క తాళం వేస్తున్నాయి.

రైతుల ఆత్మహత్యలు

ఉదా.కి పైన ప్రస్తావించిన  రైతుల ఆత్మహత్యల గురించే కొంత వివరంగా చూద్దాం. ఆత్మహత్యలు నిజం. ఏ పార్టీ పాలన అన్నది అంత ముఖ్యంగా ఉండటం లేదు; ఎందుకంటే అందరి విధానాలూ  మౌలికంగా ఒకటే రకం – భూస్వాములకూ, దళారీలకూ అనుకూలమైనవి. వెనుకబడిన రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో కన్నా వ్యవసాయరంగంలో వ్యాపారీకరణ పెరిగినచోట్ల, పత్తివంటి వ్యాపార పంటలు వేసేప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. చాలినంత భూమి, పెట్టుబడి, బ్యాంకుల నుండి రుణసదుపాయం లేని రైతులూ, ముఖ్యంగా కౌలుదార్లూ ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. లక్షల  వ్యవసాయ అప్పుల్లో కూరుకుపోయి ఉండటం తీవ్ర సమస్య; ఏ పార్టీప్రభుత్వమైనా, ప్రభుత్వ యంత్రాంగం అవినీతిమయమై ఆ దోపిడీవర్గాలకే అండగా ఉంటున్నది. బాధితులపట్ల సకాలంలో స్పందించటం లేదు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి; మార్కెటులో ఆటుపోట్లు  ఒక ముఖ్య కారణం. దానికి తోడు దేనికీ గ్యారంటీలేని నిరాశామయమైన వాతావరణం.

దేశమంతటా లక్షలాది రైతుల ఆత్మహత్యలు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నా, అరకొరగా కన్నీటి తుడుపు చర్యలే తప్ప, మౌలిక పరిష్కారాలకై కేంద్రమూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ – అన్ని అధికారపార్టీలూ – పట్టించుకోటంలేదన్నది  ఒక నిజం.  పియం కిసాన్ యోజన, రాష్ట్రాల స్థాయి ‘భరోసా’లు, రైతుబంధులు వంటి ఉపశమన  స్కీములు ఎన్నిఉన్నా , అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని మౌలికంగా పరిష్కరించటంలో విఫలమైనాయి.కాగా భూస్వామ్యవర్గాలు ప్రధానంగా వాటివల్ల లాభపడుతున్నారు. వాటిల్లోనూ అవినీతి, మధ్యదళారులూ మామూలే. పి.సాయినాథ్ వంటి జర్నలిస్టులు తప్ప, మీడియాలోనూ వీటిపై హైలైటు చేయటం  లేదు. సినిమా, క్రికెట్, సంచలన,వినోద విషయాలూ, ఎన్నికల పార్టీల వార్తలకే వాటిల్లో ప్రధాన స్థానం.

1995 నుంచి 2018 దాకా సుమారు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నట్టుగా  ప్రభుత్వ లెక్కలు చూపెడుతున్నాయి. ఆ తర్వాత మూడేళ్లలో 2021 వరకు 16854 మంది అని పార్లమెంటులో (7-2-2023) చెప్పారు. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో 12 వేలమంది అని అంచనా. అంటే 1995 నుంచి  నేటివరకు మొత్తం 4.3 లక్షల మంది.1947 నుంచి నేటివరకు మరణించిన సైనికుల సంఖ్య అందులో పదోవంతుమంది కూడా లేరు. వారిలోనూ అత్యధికులు బతుకుతెరవు కోసం సైన్యంలో చేరిన గ్రామీణ పేదలే. జై జవాన్ జై కిసాన్ అంటున్నా, దేశానికి అన్నం పెట్టేవాడని మాటల్లో చెప్పినా, రైతుల శ్రమకూ ప్రాణాలకూ ( మీడియాలోనూ)  ఏపాటి విలువనిస్తున్నారో ఈ లెక్కలు సూచిస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైన కేంద్రం తన బాధ్యతను విస్మరించి,  తెలుగురాష్ట్రాలగురించి నిందా రాజకీయం చేస్తున్నది. అందులో సైతం  షా అర్థసత్యాల్ని ఎలా చెప్పారో చూద్దాం. ఆత్మహత్యల్లో మొదటి రెండు స్థానాలు ఎవరివి అన్న ప్రశ్న సహజమే కానీ ఎవరూ ఆయన్ని అడగలేదు. రాష్ట్రప్రభుత్వ
మూ గట్టిగా నిర్దిష్టంగా ప్రశ్నించలేదు.  మీడియాలోనూ దీనిపై పెద్దగా చర్చకానీ, స్వతంత్ర పరిశీలనలు కానీ లేవు.  ఈ ఏడు ఫిబ్రవరి 7న లోక్సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం:
1. మహారాష్ట్రది మొదటి స్థానం. అక్కడ రైతుల  ఆత్మహత్యల సంఖ్యలెక్కలు ఇ చ్చారు : 2019లో 2680, 2020 లో 2567,  2021 లో 2640. మూడేళ్ల మొత్తం 7887.
2. అదేకాలంలో కర్ణాటక రెండవ స్థానంలో ఉంది:  2019లో 1331,  2020 లో 1072,  2021 లో 1170. మూడేళ్ల మొత్తం 3573.
3. ఆ తర్వాతి స్థానం ఏపీది: 628, 564, 481 మొత్తం 1673.
4.తెలంగాణలో 2019లో 491, 2020లో 466, 2021లో 352. మొత్తం 1309.
2022 లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు.
మహారాష్ట్రలో సుదీర్ఘకాలం – ప్రస్తుతం కూడా- బీజేపీ శివసేనతో  కలిసి అధికారంలో ఉన్నది. అలాగే పూర్తి మెజారిటీతో ఒక్కసారీ ఎన్నికల్లో గెలవకపోయినా, కర్ణాటకలోనూ  బీజేపీ- గత మూడేళ్లు కూడా – అధికారంలో ఉంటూ వచ్చింది. అంతేకాక కేంద్రంలోనూ అధికారంలో ఉంది. డబల్ ఇంజన్ సర్కారున్న మహారాష్ట్ర, కర్ణాటకల అగ్రస్థానం గురించి చెప్పకుండా,  మూడు నాల్గు స్థానాలంటూ తెలుగు రాష్ట్రాల గురించి చెప్పటం విడ్డూరమే కానీ, బీజేపీకి, అమిత్ షాకి ఇలాటి అర్థసత్యాలు  మామూలే.

ఎన్నికలప్పుడు కోతలుకోస్తుంటాం కదా అని చెప్పిన ఆ పార్టీ నాయకుడు షా, ఇతరులూ  ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలను గెలిపించాలని చెప్పారు!  అంతకుముందే ‘దేశానికి మొదటి తమిళ ప్రధాని వచ్చే రోజు సమీప భవిష్యత్తులో ఉంద’నీ ఆయనే తమిళనాడులో చెప్పారు! అంటే మోదీ కాదా అని స్టాలిన్ అన్నారు. కేడర్లని ఉత్సాహపరచటానికే అయినా, మరీ అంతటి కోతలని వారూ నమ్మలేరు కదా! లోగడ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సహకారం అందించినా, ఏపీలో  బీజేపీకి ఒక్క శాతం ఓటు కూడా లేదు.  పెళ్లిలో 116 చదివించి, ‘ధన కనక వాహనాదులకు’ అని పురోహితుడు మైక్ లో చెప్పటం పెళ్లిళ్ల సీజన్లో మామూలే. ఎన్నికల సీజన్లో అలాంటిదే ఇదీ.

రేషన్ బియ్యం బస్తాపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్టిక్కర్ వేస్తున్నారు అని బీజేపీవారు ఆక్షేపిస్తున్నారు.  ధాన్యం ఉత్పత్తిలో, సేకరణలో కూడా ఏపీ తెలంగాణ ముందు వరసలో ఉన్న రాష్ట్రాలన్నది అందరికీ తెలిసినదే. బస్తా, లోడింగు, రవాణా చార్జీలు కూడా ప్రభుత్వమే భరిస్తూ, ఐదువేల కోట్ల రూ. ఈ జనవరిలో (ఏపీ) రాష్ట్రం చెల్లించింది. దానికి మోదీ స్టిక్కర్ వేయరు కదా?

మోదీ, షాలు ఎన్ని కోతలుకోసినా మతోన్మాదంతో, అబద్ధాలతో గెలవటంకష్టం అని కర్ణాటకలో రుజువైంది. ఆ ఓటమి  అనుభవంతో, దక్షిణాదిలోఇంకా ఏం ఎత్తుగడలు వేయాలో అని చర్చించటానికి  ప్రత్యేక సమావేశం త్వరలో జరుపుతున్నారు. నేరుగా మతోన్మాదం కన్నా ‘సాంస్కృతిక’ విషయాల్ని తడమాలనీ, అభివృధ్ధి జపం పఠించాలనీ ఇప్పటికే నిర్ణయించినట్టుగా తమిళ్నాడు బీజేపి నేత అన్నామలై సూచించారు.

స్వంత బలంపెంచుకోటానికి కృషి చేస్తూనే, రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఇక్కడి ప్రాంతీయ పార్టీలతో తగవులు పెట్టుకొని, మరీదూరం పోవద్దన్న ఆలోచనలు మొదలైనాయి. పురందేశ్వరిని, కిషన్ రెడ్డిని రంగంలోకి తేవటం దానికే సూచన అంటున్నారు. లోగడ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ సహకారం అందించినా, ఏపీలో ప్రస్తుతం  బీజేపీకి ఒక్క శాతం ఓటు కూడా లేదు. అయినా ( బీజేపీ షా)  ఏపీ లో 25 మంది ఎంపీల కలకంటున్నారు! మోదీ పాలనలో అనేక ప్రాథమిక హక్కులకి భంగం కలిగిందని ఆరోపణలున్నాయి కానీ, కలలుకలే హక్కుని కాల రాశారు అని ఆరోపణ రాలేదు కదా!

క్రికెట్లో దేశాలమధ్య టెస్టు మ్యాచీలు తగ్గి, వేలంపాటలో ఆటగాళ్లని కొనే ఐపియల్ వచ్చి నట్టుగా రాజకీయాల్లోనూ   మార్పులొచ్చాయి: తమగతంతో  సిధ్ధాంతాలతో సంబంధం లేకుండా నేతలు
రానురాను సునాయాసంగా పార్టీలు మారుస్తున్నారు; బీజేపి సహా అన్నిపార్టీలూ ఈ పధ్ధతిని అనుమతిస్తున్నాయి.

బీజేపీని అడుగుపెట్టనివ్వద్దని వడ్డే శోభనాద్రేశ్వర రావు వంటి సీనియర్ మిత్రులు చెప్తున్నావినకుండా, చంద్రబాబు వారితో  కూటమికై చేయి చాస్తున్నారు. ఆ భయంతో జగన్ మెతక వైఖరి అనుసరిస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి  ‘రెండు పిల్లులూ కోతికథ’గా ఉన్నదిది. బీజేపీకి, మోదీ షాలకు  ఇంక కావల్సిందేముంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *