పుస్తక వారధి ‘బుక్ స్టాల్ మణి’కి నివాళి

-రాఘవ శర్మ

పదమూడేళ్ళ కుర్రవాడు.
బతుకును వెతుక్కుంటూ కేరళ నుంచి వచ్చాడు.
మళయాళం మాతృభాష, తెలుగు నేర్చుకున్నాడు.
తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకుని గుణించుకుని గుణించుకుని చదవడం నేర్చుకున్నాడు.
సమాజాన్ని మార్చాలన్న ఉద్దేశ్యంతో లెక్కలేనన్ని పుస్తకాలు చదివాడు.
లెక్కలేనంత మందితో వాటిని చదివించాడు. వాటి గురించి చర్చించాడు.
వాటినే అమ్మాడు.
నెల్లూరు సండే మార్కెట్లో 16 ఏళ్ళ పాటు మణి బుక్ స్టాల్ నిర్వహించిన టి.పీ మణి తన 93వ ఏట అనంతపురం జిల్లాలోని కొనేకల్లో జూన్ 16వ తేదీన శ్వాస విడిచాడు.
నెల్లూరుచరిత్ర పుటల్లో ఇలా నిలిచిపోయాడు.
నటరాజన్ అనే పదేళ్ళ కుర్రవాడు తమిళనాడు నుంచి పొట్టచేతపట్టుకుని తెనాలి వచ్చాడు.
హెూటల్ కార్మికుడిగా చేస్తూనే తెలుగు నేర్చుకున్నాడు.
‘శారద’ అన్న పేరుతో లెక్కలేనన్ని తెలుగు కథలు రాశాడు, మూడు నవలలు శాడు.
రచయితగా గొప్ప పేరు సంపాదించినా, హెూటల్ వర్క ర్గానే మరణించాడు.
తన తోటి హెూటల్ కార్మికుల్లో కొందరిని చదివించి రచయితలను చేశాడు.
శారద స్ఫూర్తితోనే కొందరు హెూటల్ వర్కర్లు చదువుకుని రచయితలయ్యారు.
అలాంటి వారిలో ఆలూరు భుజంగరావు ఒకరు.
ఒక శారద, ఒక టి.పి. మణి లాంటి వారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఇంతా అంతా కాదు. శారద మంచి రచయిత అయితే, టి.పి. మణి మంచి పుస్తకాలను పాఠకులకు అందించడంలో పుస్తక వారధి లా పనిచేశాడు.
మణి జీవితం అనేక మలుపులు తిరిగింది.
ఎక్కడో కేరళలోని కొల్లాం జిల్లాలో ఉన్న దక్షిణపు పరవూరులో 1930లో మణి జన్మించాడు.
పుట్టినప్పుడు పంకజాక్షి అని పేరు పెట్టారు.
స్కూల్లో చేర్చినప్పుడు తాడేపల్లి బాపు మణి అని పేరు రాశారు.
అదే టి.పి. మణిగా స్థిరపడింది.
మణి నాల్గవ తరగతి వరకు చదువుకున్నాడు.
పదమూడేళ్ళ వయసులో బతుకు తెరువు కోసం తెలుగు ప్రాంతంలోకి వచ్చాడు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఖాదీ బోర్డులో పనిచేశాడు.
అక్కడ అవినీతిని చూసి సహించలేకపోయాడు.
ఆ అవినీతిపై 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖలు రాసి, ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

నెల్లూరు వచ్చి సైకిల్ పై బీడీ, సిగరెట్లు బడ్డీ షాపులకు వేసేవాడు.
నిరాడంబరంగా జీవించాడు.
పాత బట్టలే వేసుకునే వాడు.
మణి చిన్నప్పటి నుంచి మహాభక్తుడు.
దేవుడి దగ్గర గంటలుకొట్టేవాడు, హారతి ఇచ్చేవాడు.
రాత్రి పూట తూర్పు తిరిగి దణ్ణం పెట్టి ఏవేవో శ్లోకాలుచదివేవాడు.
తను నమ్మిన విషయాన్ని చిత్త శుద్దిగా ఆచరించేవాడు.
భార్య వరమ్మ చేత, కుమారుడు దుర్గేష్ చేత కూడా వాటిని బలవంతంగా పాటింప చేసేవాడు.
కేరళకు చెందిన ప్రముఖ హేతువాద ఉద్యమ నాయకుడు ఏ.టి. కోవూర్ 1977లో నెల్లూరు వచ్చాడు.
ఆయన ప్రదర్శనలు, ప్రసంగంతో మణి తీవ్రంగా ప్రభావితుడయ్యాడు.
భగవంతుడు మానవ కల్పితమని అతనికి అర్థమైపోయింది.
భగవంతుడనే భావన చుట్టూ అల్లుకున్న ఆశాస్త్రీయ విషయాలను అర్థం చేసుకున్నాడు.
భగవంతుణ్ణి తాను నమ్మినప్పుడు ఎంత చిత్తశుద్ధితో కొలిచాడో, హేతువాదాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని ఇప్పుడు నమ్మినప్పుడు కూడా అంతే చిత్త శుద్ధితో వాటిని ఆచరించాడు.

ఆ సమయంలోనే సండేమార్కెట్ లో బంకు పెట్టి బీడీలు, సిగరెట్లతో పాటు పుస్తకాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. 1980లో బీడీ సిగరెట్లు తీసేసి పూర్తిగా పుస్తకాలు అమ్మడం మొదలు పెట్టాడు. తొలుత భక్తి సాహిత్యం అమ్మే మణి, హేతువాద సాహిత్యం అమ్మడం మొదలు పెట్టాడు.
తొలుత ప్రొగ్రెసివ్ బుక్ స్టాల్ అని పేరు పెట్టాడు.
తరువాత దాన్ని మణి బుక్ఎల్గా పేరు మార్చాడు.

నెల్లూరులో హేతువాద ఉద్యమం 1979లో మొదలైంది.
అది 1984 వరకు బాగా ఊపందుకుంది.
సైకిల్ తొక్కుతూ బీడీలు, సిగరెట్ల డబ్బాలు కట్టుకుని షాపులకు వేసే మణి,

వాటితో పాటు హేతువాద పుస్తకాలు కూడా అమ్మేవాడు.
ఆ రోజుల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇచ్చేవారు.
చర్చలు జరిపేవారు.
వీటిలో మణి చురుకైన పాత్ర నిర్వహించాడు.

మూఢనమ్మకాలు పారదోలడానికి మణి మ్యాజిక్ లు కూడా నేర్చుకున్నాడు.
మ్యాజిక్ వెనుక ఉన్న రహస్యాలను విప్పి చెప్పేవాడు. మణి మ్యాజిక్ షోను స్కూలు పిల్లలు చాలా ఆసక్తిగా చూసేవారు.
పిల్లల్లో శాస్త్రీయ జ్ఞానం కలిగించడానికే మ్యాజిక్ షో చేసేవాడు.
అక్షరాల అమరిక వల్ల వాటిని గుర్తుపట్టడం నేర్చుకుని పుస్తకాలు చదివే స్థాయికి ఎదిగాడు.

అమ్మకానికి పెట్టిన పుస్తకాల్లో ప్రతి ఒక్కటీ చదివేవాడు.
చదవకుండా అమ్మేవాడు కాదు.
పుస్తకాలు చదవడం ప్రవృత్తిగా చేసుకున్నాడు.
తరువాత అదే వృత్తిగా మారింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు పుస్తకాలు పంపితే, వాటిని పూర్తిగా చదివాక గానీ

అమ్మకానికి పెట్టేవాడు కాదు.

మణి ఎక్కడుంటే అక్కడ చర్చలు జరిగేవి.
మణి ఎక్కడుంటే అక్కడ వాద వివాదాలు జరిగేవి.
ఏవిషయం చెప్పినా నిష్కర్షగా చెప్పేవాడు.
ఏ ఆలోచననైతే నమ్మాడో దిశగా అంతే నిబద్ధతతో పనిచేశాడు.
మనుషులతో నిరంతరం మాట్లాడేవాడు.
మాట్లాడడం ఆయన ఊపిరి.
ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పిన వ్యక్తి.
ఆయన బుస్టాల్ ఎప్పుడూ చర్చాకేంద్రమయ్యేది.

ఒక వైజ్ఞానిక ప్రదర్శనలో మణి

రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు కొందరు దుండగులు సండేమార్కెట్ ను తగులబెట్టారు.
సండే మార్కెట్ ను పునర్నిర్మించడానికి మణి అవిరళ కృషి చేశాడు.
సండే మార్కెట్ ను నిలబెట్టడానికి కూడా మణి చేసిన కృషి ఇంతా అంతా కాదు.
మణి తన కొడుకు దుర్గేష్ ను మెడిసిన్ చదివించాడు.
దాంట్లో కూడా చిన్న పిల్లల వైద్యనిపుణు డిని చేశాడు. అనంతపురం జిల్లా కనేకల్ లో దుర్గేష్ వైద్యవృత్తిలో స్థిరపడ్డాడు.

పాతికేళ్ళ క్రితం,1998లో వయో భారం వల్ల విశ్రాంత జీవితం

గడపడానికి కొడుకు దగ్గరకు కనేకల్ వెళ్ళిపోవాల్సి వచ్చింది.

అయినప్పటికీ నెల్లూరును వదలలేదు.
వయోభారం వల్ల జూన్ 16వ తేదీన ఏకైక కుమారుడు దుర్గేష్ వద్దనే చివరి శ్వాస విడిచాడు.
నెల్లూరులో మణి లేడు, మణి బుక్ స్టాల్ మాత్రం ఉంది.
ఆయన జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం. 9493226180)

2 thoughts on “పుస్తక వారధి ‘బుక్ స్టాల్ మణి’కి నివాళి

  1. మా సత్యం
    ‘బుక్ స్టాల్ మణి’ అరుదైన విశిష్ట వ్యక్తి నిరంతర అధ్యయనశీలిని పరిచయం చేసిన రాఘవ శర్మ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ..
    ‘బుక్ స్టాల్ మణి’ కి కన్నీటి నివాళులు తెలుపుతూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *