-రాఘవ శర్మ
అటొక కొండల వరుస, ఇటొక కొండల వరుస.
పచ్చదనం పరుచుకున్న ఎత్తైన రెండు కొండల నడుమ నుంచి దుముకుతున్న జలపాతం.
ఏటవాలుగా జాలువారుతూ లోతైన లోయలోకి ప్రవహిస్తోంది.
పడమర నుంచి తూర్పుకు సాగిపోతోంది.
ఇది శేషాచలం కొండలలోని వైకుంఠ తీర్థం.
వైకుంఠ తీర్థానాకి పెద్దగా ఎవ్వరూ వెళ్ళరు.
వెళ్ళినా ఆ జలపాతం కింద స్నానం చేయరు.
దాని దరిచేరరు. దూరం నుంచే దాని అందాలను వీక్షించాలి.
తిరుమలలోని డ్రైనేజి నీళ్ళు ఈ వైకుంఠ తీర్థంలోకి వచ్చి కలుస్తున్నాయి.వర్షాకాలంలో ఉదృతంగా దుమికే ఈ జలపాతం, డ్రైనేజీ నీటి వల్ల ఏడాది పొడవునా ఇలా సాగుతోంది.
‘అయిననూ వీక్షించి రావలె వైకుంఠ తీర్థమున్’ అన్నాడు మధు.
ఆదివారం ఉదయమే పన్నెండు మందిమి కలసి తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరాం.
ద్విచక్రవాహనాల్లో తిరుమల చేరే సరికి ఆరైంది.
గోగర్భం డ్యాం దాటి, కుడి వైపున బయలు దేరాం.
నిజానికి అది శేషతీర్థం వెళ్ళే దారి.
ఆ దారికి ఈవలనే ఎడమ వైపున అటవీ గేటులోంచి లోనికి ప్రవేశించాం.
అంతా అకేషియా చెట్లు.
ఆ చెట్ల మధ్య దశాబ్దం క్రితం వేసిన మట్టి రోడ్డు.
రోడ్డంతా ఎగుడు దిగుడుగా ఉంది.
రాళ్ళు రప్పల పైనుంచి మా వాహనాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
ఎక్కడ పడిపోతాయో నన్న భయం. అతి కష్టం పైన రెండు కిలోమీటర్లు సాగాం.
ఇక వాహనాలు ముందుకు కదలవు.
అక్కడ నుంచి నడక మొదలైంది. దారి ఏటవాలుగా ఉంది.
అడవిలో మా నడక వేగంగా సాగుతోంది.
దారి పొడవునా రకరకాల చెట్లు.
ఏ చెట్టు ఏ ఉపయోగమో ఎవరికి తెలిసిన కబుర్లు వారు చెపుతున్నారు.
ఓ మొక్క పీకి, దాన్ని ‘ వేంపల్లి చెట్టు’ అని కార్తీక్ చెప్పాడు.
ఈ మొక్క వేరుతో పళ్ళు తోముకుంటే పళ్ళు ఊడవనే భరోసా ఇచ్చాడు. పూర్వకాలంలో ఆ వేరుతోనే పళ్ళు తోముకునే వారని, అందుకునే వారి పళ్ళు గట్టిగా ఉండేవని అన్నాడు.
ఇహ అంతే, మధు వెంటనే ఆ వేరుతో పళ్ళ తోముకోవడం మొదలు పెట్టాడు.
‘ఈ వేరుతో పళ్ళుతోముకుంటే పళ్ళు గట్టిగా ఉంటాయని రుజువైతే, జనమంతా శేషాచలం కొండలపైన పడతారు. టూత్ పేస్టు కంపెనీలన్నీ మూతపడతాయి’ అన్నాను.
అందరిలో నవ్వుల పువ్వులు విరిశాయి.
ఇలా కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే అలుపు సొలుపేముంటుంది!
మాతో వచ్చిన జై బాలాజీ ముచ్చట్లు.
అడవి అందాలను పరికిస్తూ సాగిపోతున్నాం.
దాదాపు గంట పైగా నడిచాం. రెండు వైపులా కొండలు. కొండ అంచులకు రాతి పేటు కనిపిస్తోంది.
కాస్త ఏటవాలుగా ఉన్న దారి కాస్తా లోయలోకి దిగేలా దారి తీసింది.
దట్టమైన చెట్ల మధ్య నుంచి లోయలోకి దిగుతున్నాం.
దారి సరిగా లేదు. దారి చేసుకుంటూ దిగుతున్నాం.
లోయలోకి దిగుతున్న కొద్దీ సెల ఏటి శబ్దాలు.
వాటితో పాటే దుర్వాసన మొదలైంది.
దారి పొడవునా ముళ్ళచెట్లు.
లోయలోకి దిగేశాం.
పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తున్న సెల ఏరు.
దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తున్న గాలి.
ఆ గాలితో పాటు మురుగు వాసన కూడా కలిసి మా ముక్కుపుటాలను అదరగొట్టింది.
సెల ఏటితోపాటు మురుగు కలిసి తూర్పుకు సాగుతోంది.
అతికష్టం పైన మురుగు సెల ఏటిని దాటాం. ఆవలి వైపు కొండ ఎక్కాం.
దక్షిణం నుంచి ఉత్తరానికి గాలి వీస్తోంది.
దక్షిణ దిశకు వచ్చేసరికి మురుగు వాసన కాస్తా పోయింది.
కొండ ఎక్కి, సెలఏరు ప్రవహించే తూర్పుకు సాగాం.
ఉత్తరాన మేం దిగి వచ్చిన కొండకు ఆవల దాటితే శేషతీర్థం వెళ్ళడానికి దిగే లోయ.
మేం ఎక్కిన దక్షిణ దిక్కు కొండకు ఆవల అవ్వాచారి కోన.
ఆ కోన ఆవల తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్డు ఉంటుంది.
అక్కడి నుంచి అవేమీ కనిపించవు.
మేం ఎక్కిన కొండ అంచుకు చేరాం.
దూరంగా రెండు కొండల నడుమ దుముకుతున్న
జలపాతం.
ఒకటే హెూరు.
దూరం నుంచే దాని అందాలను వీక్షించాం.
కొండ చివరకు వెళితే లోతైన పచ్చని లోయ.
మురుగు కలవకపోతే ఆ జలపాతం కిందకు వెళ్ళే వాళ్ళం.
ఆ అవకాశం లేకుండా పోయింది.
ఎంత లోతైనదీ లోయ.
తూర్పుకు ప్రవహిస్తున్న ఈ జలపాతం నీరు కరకంబాడి వేపు వెళుతుంది.
మాలో కొందరు జలపాతం దుమికే దగ్గరకు వెళ్ళారు.
వెళ్ళేటప్పుడు దుర్వాసన లేదు.
దాని దరి చేరేసరికి చెప్పనలవి కాని దుర్వాసన.
ఎక్కువ సేపు ఉండలేక తిరిగి వచ్చేశారు.
ఆ జలపాతాన్ని దూరం నుంచి ఆస్వాదించాల్సిందే!
కొండ అంచున కూర్చుని పచ్చని లోయను ఆస్వాదించాం.
ఆవ్వాచారి కోన వైపు నుంచి కొండ అంచున కూర్చుంటే, చల్లని స్వచ్ఛమైన గాలి తప్ప దుర్వాసన లేదు.
ఎంత సేపని కూర్చుంటాం!
తిరుగు ప్రయాణమయ్యాం.
జాగ్రత్తగా లోయ దిగాం.
మళ్ళీ దుర్వాసన మైదలైంది.
అతి కష్టం పైన మురుగు సెల ఏటిని దాటాం.
దాటే సమయంలో ఏమాత్రం అదుపు త ప్పామా, ఆ మురుగు ప్రవాహంలో పడిపోతాం.
మురుగు ప్రవాహాన్ని నెల ఏరనడం కూడా సరికాదేమో!?
మళ్ళీ కొండ ఎక్కాం.
దార్వాసన లేదు. మళ్ళీమామూలు గాలే.
ఏటావాలుగా ఉంది కనుక, దిగేటప్పుడు పెద్ద అలుపు అనిపించలేదు.
ఎక్కడం కనుక కాస్త కష్టపడాల్సి వచ్చింది.
మా వాహనాల దగ్గరకు చేరాం.
అవి ముందుకు కదలడానికి మొరాయించాయి.
ఒక్కో వాహనం పైన ఒక్కరే ఎక్కిసాగాం.
కొంత దూరం వరకు కొందరు నడుచుకుంటూ వచ్చారు.
మళ్ళీ రోడ్డుకు చేరాం.
మధ్యాహ్నం పన్నెండవుతోంది.
నామాల గవి, గంటామండపం వెళదాం అన్నాడు మధు.
నాకు శక్తి చాలడం లేదన్నాను.
అయినా బయలుదేరాం.
తిరుమల దిగే దారిలో కాలి నడక భక్తులు రోడ్లోకి వచ్చే దగ్గర నుంచి కుడి వైపున మా వాహనాలు అడవిలోకి కదిలాయి.
అక్కడా అకేషియా చెట్లు.
దారి పొడవునా పనస చెట్లు.
చెట్టు నిండా వేలాడుతున్న పనస కాయలు.
వాటి మధ్య నుంచి మా వాహనాలు నామాల గవి వైపునకు కదిలాయి.
కొంత దూరం వెళ్ళాక వాహనాలను నిలిపేసి, కొండ పైకి నడక మొదలు పెట్టారు.
నేను, మరొకరు వాహనాల దగ్గర ఉండిపోయాం.
వెళ్ళిన పదిమందీ గంటామండపం, నామాల గవి చూసుకుని గంటలో తిరిగి వచ్చేశారు.
వీటిని అంతకు ముందే నాలుగైదుసార్లు చూసిన అనుభవం.
అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుగు ప్రయాణమయ్యాం.
ఈ ఆదివారం ఇలా పన్నెండు మందిమి ప్రకృతితో మమేకమయ్యాం.