వెల్కటూరులో బయల్పడ్డ మరకమ్మ విగ్రహం

వెల్కటూరులో కాకతీయుల కాలం నాటి మరకమ్మ విగ్రహం, భూలక్ష్మి కాదు 

 

కొత్త తెలంగాణ చరిత్ర బృందం యువపరిశోధకుడు,సభ్యుడు కొలిపాక శ్రీనివాస్, శాసనంతో ఉన్న  ఈ మారకమ్మశిల్పాన్ని గుర్తించాడు.
సిద్ధిపేట జిల్లా, సిద్ధిపేట అర్బన్ మండలంలోని వెల్కటూరు గ్రామంలో సిద్ధిపేటరోడ్డులో శిథిలమైన భూలక్ష్మిదేవి గుడిస్థలంలో తిరిగి గుడికట్టడానికి గ్రామస్తులు తవ్వుతున్నపుడు మట్టిలో కూరుకునిపోయిన విగ్రహం బయటపడ్డది.

దాన్ని పరిశీలించిన యువచరిత్ర పరిశోధకుడు కోలిపాక శ్రీనివాస్ విగ్రహ పీఠం మీద శాసనాన్ని గుర్తించాడు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మారకమ్మ విగ్రహపీఠంపై ఉన్న శాసనాన్ని చదివి, చారిత్రకతను వివరించాడు. ఈ విగ్రహం పాదపీఠిక మీద 13వ శతాబ్దపు తెలుగులిపిలో, తెలుగుభాషలో 3 పంక్తుల శాసనం ఉన్నది. ఈ శాసనం ఆ దేవతాశిల్పం(విగ్రహం) ప్రతిష్టాపనకు సంబంధించింది.
వెల్కటూరు మారకమ్మ శాసనం:
1. స్వస్తిశ్రీమతు పార్థివ సంవత్సర ఆషాఢ
2. శుద్ధ సప్తమి శనివారమున మారకమ్మ
3. ప్రతిష్ట శక వర్షములు 1147
శిల్పం కింద పీఠం మీద ఉన్న శాసనంలో క్రీ.శ.1225 జూన్ 14వ తేది, పార్థివ సం. ఆషాఢ శుద్ధ సప్తమి శనివారం నాడు మారకమ్మ ప్రతిష్ట చేయబడిందని ఉంది.

చతుర్భుజియైన దేవత పర(వెనక)హస్తాలలో ఢమరురకం, త్రిశూలాలు, నిజ(ముందరి)హస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలున్నాయి. దేవత తలపై కరండమకుటం వుంది. చెవులకు పెద్దకుండలాలున్నాయి. మెడలో హారాలున్నాయి. దండలకు సర్పభూషణాలున్నాయి. రెండు ముడిచిన మోకాళ్ళ కింద రెండు దానవుల శిరస్సులున్నాయి. దేవత వాహనంగా వరాహం చెక్కబడింది.

ఈ దేవత చాముండి రూపంలో వున్న మారకమ్మనే కాని భూలక్ష్మి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *