న్యూసెన్స్ దృశ్యాలు కనపడలేదు! మరి మన దగ్గర…
టి. లక్ష్మీనారాయణ
1. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం సుంకాల ద్వారా 13.1 బిలియన్స్ పౌండ్స్ ఆదాయాన్ని యు.కె. ప్రభుత్వం అంచనా వేసుకొన్నట్లు చదివాను. ఈ మొత్తం యు.కె. ఆదాయంలో 1.2%గా ఉంటుందట. జీడిపిలో 0.5%కు సమానమట. ప్రతి కుటుంబం ఏడాదికి సగటున 465 పౌండ్లు వ్యయం చేస్తున్నట్లు ఆ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
2. యు.కె. శీతల దేశం. మద్యపానం ఇంగ్లీషు ప్రజల సంస్కృతిలో భాగం కావచ్చు. నిషేధం లేదు. స్వేఛ్చగా మద్యం సేవించవచ్చు. కానీ, ప్రజలు విచ్చలవిడితనం ప్రదర్శించడం లేదు. ఆరోగ్య సంరక్షణను పరిగణలోకి తీసుకొని రోజుకు పురుషులైతే ఎంత, మహిళలైతే ఎంత సేవించవచ్చో ప్రభుత్వం నిర్ధిష్టంగా సూచనలు చేసింది. వాటిని పౌరులు స్వచ్ఛందంగా పాటించాలి. వ్యసనపరులు వాటిని పాటించక పోవడంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, నేరాల సంఖ్య పెరుగుతున్నాయని యు.కె. ప్రభుత్వం, సమాజం ఆందోళన చెందుతున్నట్లు గణాంకాలతో సహా కొన్ని నివేదికలు వెల్లడించాయి.
3. మద్యం సేవించిన ఒక వ్యక్తి గ్లాస్కో పట్టణంలో ప్రక్కన నడుస్తున్న మరొక వ్యక్తిపై అకారణంగా చేయి చేసుకొన్న ఒక చిన్న ఘటనను చూశాము. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లలో విస్తృతంగా పర్యటించాము. తాగి తూలుతూ నడుస్తున్నవారు, రోడ్డు మీద మరియు ప్రక్కన పడిదొర్లుతున్నవారు, న్యూసెన్స్ సృష్టిస్తున్నవారు మరెక్కడా కంటపడలేదు.
4. ప్రత్యేక మద్యం షాపుల్లేవు. ఒక్క ఆక్స్ ఫర్డ్ లోనే కొన్ని షాపులు చూశాను. షాపింగ్ మాల్స్ లో మద్యం బాటిల్స్ ఉన్న చోట కూడా వినియోగదారులు పెద్దగా కనపడలేదు. హడావుడీ లేదు. ఇళ్ళల్లో, పబ్బుల్లో, రెస్టారెంట్లలో మద్యం సేవిస్తారట. కానీ, ఇతరులకు న్యూసెన్స్ కలిగించరని మిత్రులు చెప్పారు. నా పర్యటనలో అనుభవం కూడా అదే భావాన్ని కలిగించింది.
5. మన తెలుగునాట మద్యం ఏరులై పారుతున్నది. మంచి లాభసాటి వ్యాపారం. ప్రభుత్వాలు ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వ్యసనపరులను, తోపులాటలను నిత్యంచూస్తూనే ఉంటాం. మద్యం, సారాయి సేవించిన వారు చేసే అల్లర్లు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, కల్తీ మద్యం – నాటుసారా వల్ల మరణాలు, సమాజం – కుటుంబాలపై మద్యం దుష్ప్రభావం వర్ణనాతీతం.
6. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ప్రభుత్వం మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసి, రాజకీయ అస్త్రంగా వాడుకొన్నది. ఆచరణలో ఆదాయ వనరుగానే కొనసాగిస్తూ, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టిమరీ అప్పు చేసి, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచింది. మద్యం బానిసల కుటుంబాల సంక్షేమాన్ని, ప్రజల భవిష్యత్తును విస్మరించి, మద్యం వ్యసనపరుల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నది.