టి. లక్ష్మీనారాయణ
ఆ ప్రాంత పాలకుడు తన భర్త. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాడు. ప్రజల పక్షాన భార్య ప్రశ్నించింది. భర్త అత్యంత హేయమైన షరతు విధించాడు. అమలు చేసి – విజయం సాధించి – నేడు ప్రతిమ రూపంలో సమాజానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆ సాహస మహిళ “లేడీ గోడివా”.
నేను కోవెంట్రీ (యు.కె.) పట్టణ సందర్శనకు వెళ్ళాను. నాతో పాటు మా ప్రశాంతి, మిత్రులు డా.జి. లక్ష్మీనారాయణ, ఆయన సతీమణి పుష్పాగారు ఉన్నారు. పట్టణం మధ్యలో ఉన్న మార్కెట్ సెంటర్ లో ఉన్న విగ్రహాన్ని మిత్రులు డా.జి.లక్ష్మీనారాయణగారు చూపెట్టారు. ఆ విగ్రహం యొక్క సంక్షిప్త చరిత్రను వివరించారు.
అది 11వ శతాబ్దం నాటి గాథ. నాటి కోవెంట్రీ ప్రాంతానికి రాజు లియోఫ్రిక్. ఆయన సతీమణి లేడీ గోడివా. లియోఫ్రిక్ ప్రజలపై అధిక పన్నుల భారం మోపారు. లేడీ గోడివా అధిక పన్నులను ప్రజలు భరించలేరని, ఉపసంహరించుకోమని భర్తను కోరింది. రాజు తిరస్కరించారు. ఆమె వత్తిడి చేసింది. లేడీ గోడివా నగ్నంగా కోవెంట్రీ వీధుల్లో తిరిగితే అధిక పన్నులను ఉపసంహరిస్తానని అత్యంత హేయమైన షరతును తన భార్య ముందు ఉంచాడట. ఆమె మతపరమైన సాంప్రదాయాలను పాటించే మహిళ కాబట్టి ఆ పని చేయలేదన్న బరోసాతో లియోఫ్రిక్ ఆ షరతుపెట్టారట.
లేడీ గోడివా భర్త విసిరిన ఆ సవాలును స్వీకరించి, విజ్ఞతను ప్రదర్శించి, ఊరిలోని పౌరులందరూ తలుపులు మూసుకొని, ఇళ్లలోనే ఉండాలని, తనను వీక్షించవద్దని విజ్ఞప్తి చేసి, పొడవాటి జుట్టు కలిగిన ఆమె నగ్నంగా కోవెంట్రీ వీధుల గుండా గుర్రంపై సంచరించిందట. ప్రజలందరూ ఆమె పిలుపుకు స్పందించి, అమలు చేశారట.
ఒక వ్యక్తి మాత్రం ఆమె విజ్ఞప్తిని నిరాకరించి, ఆ దృశ్యాన్ని చూశాడట. “పీపింగ్ టామ్” అనే మారుపేరుతో ఆ వ్యక్తిని కూడా గుర్తు చేసుకొంటూ, ఆ కోవకు చెందిన చిల్లరవేధవలను ప్రజలు అపహాస్యం చేస్తుంటారట.
“లేడీ గోడివా” చేసిన సాహసానికి తలవంచిన లియోఫ్రిక్ అధిక పన్నులను ఉపసంహరించారట.
ఆ చారిత్రక ఘటనను భావితరాలకు గుర్తుచేస్తూ కోవెంట్రీ సెంటర్ లో “గుర్రంపై నగ్నంగా సంచరిస్తున్న లేడీ గోడివా” ప్రతిమను ప్రతిష్టించారని తెలియజేశారు. ఆ సాహస గాథవిని ఆశ్చర్యపోయాను. సామాన్య ప్రజల బాగోగుల పట్ల లేడీ గోడివా ప్రదర్శించిన అంకితభావం, పోరాట పటిమ చిరస్మరణీయమైనది, స్ఫూర్తిదాయకమైనది.