షేక్స్పియర్ జన్మస్థలం సందర్శన

-టి.లక్ష్మీనారాయణ

1. స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్‌ కు జూన్ 25న వెళ్ళి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ ఆంగ్ల కవి, నాటక రచయిత మరియు నటుడు విలియం షేక్స్పియర్ (1564-1616) జన్మస్థలాన్ని సందర్శించడం ఒక అరుదైన అవకాశం, గొప్ప అనుభూతి. మనసుకు సంతృప్తి కలిగింది. 2018లో కూడా సందర్శించాను.

2. నాలుగు వందల సంవత్సరాలకుపైబడిన కాలం నాటి పురాతన భవనం. ఆ ఇంటిలో నాడున్న మౌలిక సదుపాయాలను కళ్ళ ముందు ప్రదర్శిస్తున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కట్టెలతో పొయ్యి మీద వంట చేసుకోవడంతో పాటు శీతల దేశం కాబట్టి ప్రతి గదిలో కట్టెలతో మంట మండించి తద్వారా చలి నుండి రక్షణ పొందే ఏర్పాట్లు నాడు చేసుకున్నారు. అలాగే, వాడిన దుస్తులు సందర్శకులు వీక్షించడానికి వీలుగా నిర్వాహకులు ఉంచారు.

 

3. శాస్త్ర, సాంకేతిక విప్లవం యొక్క సత్ఫలితాలను నేటి తరం అనుభవిస్తున్నది. విద్యుత్ లేదా గ్యాస్ ఆధారిత స్టవ్ లపై వంట వండుకొంటున్నారు. రూమ్ హీటర్స్ ను వినియోగించుకొంటున్నారు.

4. షేక్స్పియర్ పుట్టిన ఆ ఇంటిలోని నాటి మౌలిక సదుపాయాలను పరిశీలిస్తే, నాటి ఇంగ్లాండ్ సామాజిక – ఆర్థికాభివృద్ధి దశ, షేక్స్పియర్ కుటుంబం యొక్క సామాజిక – ఆర్థికంగా ఉన్నత స్థితిని కొంత మేరకు అవగాహన చేసుకోవచ్చు. షేక్స్పియర్ నాన్న స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్‌ కు మేయర్ గా బాధ్యతలు నిర్వహించారని షేక్స్పియర్ బర్త్ ప్లేస్ ట్రస్ట్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే, రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబమని దాన్నిబట్టి తెలుస్తుంది. షేక్స్పియర్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను లోకల్ ఇంగ్లీష్ గ్రామర్ స్కూల్ లో చేర్పించారని ప్రత్యేకంగా పేర్కొనడాన్ని బట్టి సంపన్న కుటుంబమన్న భావన కలుగుతున్నది. షేక్స్పియర్ యువకుడుగా లండన్ వెళ్ళి, కవి – నాటక రచయిత – నటుడుగా తనకున్న ప్రావీణ్యాన్ని, కళానైపుణ్యాన్ని ప్రదర్శించి, పేరు – ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో పాటు సంపన్నుడైన, స్ట్రాట్‌ఫోర్డ్ కు తిరిగొచ్చి మరొక పెద్ద భవనాన్ని కొన్నారట. తాను జన్మించిన భవనానికి, కాస్తా దూరంలో నూతన భవనం ఉన్నది. అంటే, ఆనాటికే స్ట్రాట్‌ఫోర్డ్ ఒక పట్టణంగా అభివృద్ధి చెందినట్లు భావించవచ్చు.

5. షేక్స్పియర్ జన్మస్థలమైన ఆ పురాతన భవనంలో పొయ్యిలను చూస్తున్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మా అమ్మ కట్టెల పొయ్యి మీద వంటచేసేది. మా గ్రామస్తులు సమీపంలోని అడవికి వెళ్ళి, ఎండిన కట్టెలను సేకరించుకొని, మోపుకట్టి, నెత్తి మీద మోసుకొచ్చేవారు. ఎడ్ల బండ్లపైన కూడా తెచ్చుకొని నిల్వ చేసుకునేవారు. అప్పుడప్పుడు సరదాగా నేను కూడా అడవిలోకి వెళ్ళేవాడిని. వంట వండుకోవడానికే కావలసిన కట్టెలకోసం మా గ్రామస్తులు ఆపసోపాలు పడేవారు కదా! మరి, శీతల దేశాల ప్రజలు వారికి కావలసిన కట్టెలను ఎలా సమకూర్చుకునేవారో! అన్న ఆలోచన తళుక్కుమన్నది.

6. నేడు పర్యావరణ సమస్యలు మానవాళికి పెనుప్రమాదంగా పరిణమిస్తున్నాయి. యు.కె.లో అడవులకు, చెట్లకు, పచ్చటి మైదానాలకు కొదవేలేదు. మనలాంటి దేశాల్లో అడవులు అంతరించిపోతున్నాయి. మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెట్లను నిర్దాక్షిణ్యంగా, బాధ్యతారహితంగా నరికేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది.

7. షేక్స్పియర్ ఇంటిలో నాడు ఆయన, ఆయన కుటుంబ సభ్యులు వాడిన బెడ్స్, డైనింగ్ టేబుల్, చేర్స్, వంట పాత్రలు, వగైరా వస్తువులను భద్రపరిచి, ప్రదర్శిస్తున్నారు. తల్లి బెడ్ తో పాటు చంటి బిడ్డకు ఒక చిన్న బెడ్ అనుబంధంగా ఉన్నది. దాన్ని పరిశీలిస్తే ఆనాటికే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి, చంటి బిడ్డల పట్ల తల్లిదండ్రులు తీసుకొన్న జాగ్రత్తలు అవగతమవుతాయి.

8. భారత జాతి ముద్దుబిడ్డ, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ (1861-1941) ప్రతిమ షేక్స్పియర్ జన్మస్థలం ప్రాంగణంలో ప్రతిష్టించబడి ఉన్నది. ఇది కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లభించిన అరుదైన గౌరవమే కాదు, భారత దేశానికి లభించిన గౌరవం.
1916లో షేక్‌స్పియర్ మూడవ శత వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన “ఇన్ హానర్ ఆఫ్ విలియం షేక్స్‌పియర్”అనే కవితను ఒక శిలాఫలకంపై ముద్రించి, రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ప్రక్కనే ఉంచారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *