కొత్త పార్లమెంటు భవన్ ఎలా ఉందంటే…?

*నేడు ప్రారంభించే కొత్త పార్లమెంటు భవన్ జర్మనీ క్రోల్ ఓపెరా హౌస్ వలె ఫాసిస్టు రాజ్య వ్యవస్థకి ప్రాతినిధ్యం వహిస్తుందా?

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

కొత్త పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ పేరిట దేశ ప్రజల దృష్టిని వారు ఎదుర్కొంటున్న ప్రాథమిక, ప్రధాన సమస్యల నుండి మోదీ ప్రభుత్వం దారి మళ్లించగలిగింది.

పాత పార్లమెంటు భవనాన్ని స్పానిష్ ఫ్లూ కాలంలో బ్రిటీష్ వలస ప్రభుత్వం నిర్మించింది. వలస పాలకుల నుండి రాజదండపు రాజభక్తిని ప్రదర్శించే మోదీ సర్కార్ కొత్త పార్లమెంటు భవన్ ని కోవిడ్ కాలంలో నిర్మాణం చేసింది. పైన పేర్కొన్న రెండు సందర్భాల్లో కూడా కాకతాళీయంగానైనా, ప్రపంచ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని భీతావహ స్థితిలో బ్రతికే కాలాల్లో నిర్మించినవే కావడం గమనార్హం!

కొత్త పార్లమెంటు భవన్ ప్రారంభోత్సవ వేడుకకు న్యాయబద్ధత, రాజ్యాంగ బద్దత, నైతిక, రాజకీయ ప్రమాణాల వంటి పలు అంశాలపై నేడు విస్తృత చర్చ జరుగుతోంది. అది అవసరమైనదే. మోదీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రమాణాల్ని నగ్నంగా ఉల్లంఘిస్తున్న తీరును బట్టబయలు చేయాల్సి ఉంది. తద్వారా ప్రజల్ని చైతన్యపరిచే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీరాల్సిందే. అదో ముఖ్య పార్శ్వమే. దాంతో పాటు మరో ప్రాధాన్యత గల పార్శ్వం కూడా ఉంది. మోదీ సర్కార్ రహస్య రాజకీయ ఎజెండా పై; ముఖ్యంగా ఫాసిస్టు శక్తుల రహస్య రాజకీయ ఎజెండా పై కూడా చర్చ జరగాల్సి ఉంది.

ఆర్.ఎస్.ఎస్. ఏర్పడి మరో రెండేళ్లలో నూరేళ్లు! పార్లమెంట్ ఎన్నికలకి గల గడువు మరో ఏడాది! ఆ దృష్ట్యా ఆర్.ఎస్.ఎస్. ఎదుట సాధించాల్సిన కొన్ని ముఖ్య లక్ష్యాలు వున్నాయి. వాటిలో ఒకటి ప్రస్తుత రాజ్యాంగాన్ని సమూలంగా రద్దు చేయడం! దాని స్థానంలో కొత్తగా ఫాసిస్టు రాజ్యాంగ చట్టాన్ని తేవడం! పాత రాజ్యాంగానికి కర్మకాండని ఏ పార్లమెంటు భవనంలో జరిపినా, కొత్త చట్టాన్ని కొత్త పార్లమెంటు భవన్ లో ఆమోదింపజేయడం ఆర్.ఎస్.ఎస్. జీవితాశగా వుండడం సహజమే.

తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఘోరఓటమి జరిగి కైజర్ ప్రభుత్వం పతనం చెందింది. ఆ తర్వాత వీమర్ రిపబ్లిక్ ఏర్పడింది. అదో రాజ్యాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అది స్థూలంగా సాంప్రదాయ జర్మన్ పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల్ని పరిరక్షించే పార్లమెంటరీ ప్రజాతంత్ర రాజ్యాంగం. సాంప్రదాయ జర్మన్ బూర్జువా వర్గ గర్భంలో పుట్టిపెరిగిన ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం లోని ఒక శిఖరాగ్ర ముఠా క్రమంగా జర్మన్ ఆర్ధిక వ్యవస్థను శాసించే స్థితికి ఎదిగింది. (అది ఇక్కడ ఇప్పటి అంబానీ, ఆదానీ కతో కూడిన కాపీటలిస్టు ముఠా వంటిది) ఆ ముఠా ప్రయోజనాలకు వీమర్ రాజ్యాంగం ఆటంకంగా మారింది. అది హిట్లర్ నీ, నాజీ పార్టీని పుట్టించి ప్రబల రాజకీయ శక్తిగా రూపొందించింది. జర్మనీ పార్లమెంటరీ పరిపాలనా వ్యవస్థ అస్థిర పరిస్థితికి గురైన ప్రత్యేక నేపథ్యంలో ఓ కీలకమైన పరిణామం జరిగింది. ఆనాటి జర్మనీ దేశాధ్యక్షుడు హిండెన్ బర్గ్ తో 20 మంది గుత్త పెట్టుబడిదార్లు (ఇక్కడి అంబానీ, ఆదానీ వంటి) రహస్య బేటీ అయ్యారు. తర్వాత 30-1-1933న హిండెన్ బర్గ్ హిట్లర్ ని జర్మన్ ఛాన్సలర్ గా ఎన్నిక చేసాడు. తర్వాత గత వీమర్ రాజ్యాంగం రద్దు చేసి కొత్త రాజ్యాంగ రచన నాజీ పార్టీకి తక్షణ కర్తవ్యంగా మారింది. ఆ సందర్భంలో జర్మనీలో జరిగిన రెండు కీలకమైన పరిణామాల్ని భారత్ లో తాజా పరిణామాలతో పోల్చి పరిశీలించవచ్చా?

జర్మనీ పార్లమెంట్ ని రీచ్ స్టాగ్ అంటారు. ఆర్థిక రంగంలో పెట్టుబడిదారీ వర్గానికి అది ప్రాతినిధ్యం వహించింది. రాజకీయ రంగంలో జర్మన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ దానికి ప్రాతినిధ్యం వహించింది. దానికి కారణాలు ఏమిటో మనం మరో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. జర్మనీ ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం వికృత రూపంలో ఎదిగే క్రమంలో దాని నుండి ఒక శిఖరాగ్ర ముఠా తలెత్తింది. దాని ప్రయోజనాలకి గత రాజ్యాంగం ఆటంకంగా మారింది. దాంతో పాటు దాని కార్యస్థానమైన పాత పార్లమెంటు భవన్ (రీచ్ స్టాగ్) పై కూడా హిట్లర్ లో సంకేతాత్మక (సింబాలిక్) వ్యతిరేకత పెరిగింది. అది చరిత్ర చెప్పిన ఒక చేదు నిజం!

నాటి పార్లమెంట్ (రీచ్ స్టాగ్) భవన్ వీమర్ రిపబ్లిక్ కి రాజకీయ ప్రతీక (సింబల్) గా పేరొందింది. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ గా ఎన్నికయ్యాక నెల కూడా తిరక్కుండానే పార్లమెంట్ ఎన్నికలకి హిట్లర్ ఆదేశించాడు. బడా కార్పోరేట్ వర్గాల డైరెక్షన్ తో పాటు వారి చెప్పుచేతుల్లోని మీడియా అండతో గత రాజ్యాంగం పట్ల వ్యతిరేకతను ప్రజల్లో మానసికంగా ప్రచారం చేయడమైనది. తాను రాజకీయంగానే రద్దు చేయాల్సిన రాజ్యాంగం తో పాటు ఇన్నాళ్లూ దానికి కార్యస్థానంగా వున్న పార్లమెంట్ (రీచ్ స్టాగ్) భవన్ ని కూడా ఓ రాత్రి హిట్లర్ మూకలు తగలబెట్టాయి. 1933 మార్చి 5న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 27 రాత్రి తగలబెట్టడం గమనార్హం! ఆరు రోజుల్లో పోలింగ్ జరగనుండగా తామే దగ్ధం చేసి, తెల్లారే లోపు దేశవ్యాప్తంగా పది వేల కమ్యూనిస్టులు, కార్మిక నేతల్ని హిట్లర్ అరెస్టు చేయించాడు. తెల్లారాక 28-2-1933న ఉదయం హిండెన్ బర్గ్ చేత *రీచ్ స్టాగ్ ఫైర్ డిక్రీ* జారీ చేయించాడు. అది పౌర హక్కుల కాలరాతకు ఉద్దేశించింది. నిజానికి ఆ *డిక్రీ* ప్రకారం అరెస్టు చేయాల్సిన వేలమందిని డిక్రీ జారీకి కొన్ని గంటల ముందే నిర్బంధించి, డిక్రీ ప్రకారం అరెస్టు చేసినట్లు చూపాడు. ఎన్నికలకు ఆరు రోజుల ముందు ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టు అభ్యర్థులు, నాయకులు లేరు. ఐనా హిట్లర్ పార్టీకి ఆశించిన మెజార్టీ రాలేదు. రహస్య ఎజెండా అమలుకు అవసరమైన రాజ్యాంగ సంస్కరణలకు, ఫాసిస్టు నిరంకుశ పాలనకు ఆ డిక్రీ సరిపోలేదు. మరో రెండు వారాలకే కాపీటలిస్టుల వత్తిడితో హిండెన్ బర్గ్ ద్వారా 23-3-1933న THE ENABLILING ACT ని తెచ్చింది. అది నాటి జర్మన్ రాజకీయ స్వరూపాన్ని మార్చింది. అదే జర్మనీని ఫాసిస్టు రాజ్యంగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.

పై చట్టాన్ని ఆమోదించిన పార్లమెంటు భవన్ పాతది కాదు. దానికి ఎదురుగా ఉన్న THE CROLL OPERA HOUSE కావడం గమనార్హం!

27-2-1933 రాత్రి పాత పార్లమెంట్ భవన్ ని నాజీలే దగ్ధం చేసారు. ఆ నేరాన్ని తన ప్రత్యర్థులకు హిట్లర్ అంటగట్టాడు. ఆ ప్రపంచ ప్రసిద్ధి చెందిన STAGE COUPలో దెబ్బ తిన్న పార్లమెంట్ భవన్ రిపేర్ కి నిజానికి వారం కూడా పట్టదు. రిపేరు చేసి తిరిగి అందులోనే పార్లమెంటు సెషన్ ని నడపవచ్చు. ఐనా వీమర్ రిపబ్లిక్ రాజ్యాంగ విధికి కార్యస్థానంగా పేరొందిన పార్లమెంట్ (రీచ్ స్టాగ్) భవన్ వినియోగానికి హిట్లర్ మానసికంగా అంగీకరించలేదు.

కొత్త భవనంలో జరిగిన మొదటి పార్లమెంట్ చట్టసభలో THE ENABILING ACT పేరిట ఫాసిస్టు చట్టాన్ని ఆమోదింపజేసిన తీరుని గుర్తు చేసుకుందాం.

23-3-1933న కొత్త పార్లమెంట్ భవన్ చుట్టూ జర్మన్ సాయుధ పోలీసు దళాలతో పాటు, ప్రైవేటు నాజీ సాయుధ మూకలు మోహరించాయి. ప్రజల చేత ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశానికి హాజరు కావడానికి స్వేచ్ఛ లేదు. ప్రైవేటు మూకల గస్తీ పాయింట్ల వద్ద చెక్ చేయించుకుంటూ లోనికి ప్రవేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లంపేన్ రౌడీ ముఠాల వద్ద తాము నిరాయుదులమని పార్లమెంట్ సభ్యులు నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ సభే ఫాసిస్టు చట్టమైన THE ENABILING ACT ని ఆమోదించింది.

జర్మన్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన 80 మంది పైగా పార్లమెంట్ సభ్యులు జైళ్ళలో లేదా అజ్ఞాత జీవితంలో వున్నందున ఆరోజు సభకు హాజరు కాలేదు. జర్మనీ సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకి నాజీ పార్టీ అనుమతి ఇచ్చింది. ఆ 94 మంది THE ENABLING ACT కి వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. ఐతే కక్కలేక, మింగలేక 109 మంది నాన్ ఓటింగ్ పాత్రను పోషించారు. స్వంతంగా నాజీ పార్టీ సీట్ల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో 444 ఓట్లు పొంది ఫాసిస్టు చట్టాన్ని ఆమోదింప జేయించాడు. జర్మనీ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవమే చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా నిలిచి పోయింది.

జర్మనీ కొత్త పార్లమెంట్ భవన్ లో ఆఖరిసారి ఎన్నికలు 1933 నవంబర్ లో జరిగాయి. దానితో జర్మనీలో ఏకపార్టీ వ్యవస్థ చట్టబద్ధంగానే ఏర్పడింది. అధికారికంగానే ఏకపార్టీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ఫాసిస్టు రాజ్య నిర్మాణానికి ఉత్ప్రేరకంగా నాటి కొత్త పార్లమెంట్ భవన్ ఉపకరించింది. చరిత్రలో కొత్త పార్లమెంట్ భవన్ ఫాసిజానికి ఒక రాజకీయ సింబల్ గానే నిలిచిపోయింది. భారత్ లో తాజా కొత్త పార్లమెంట్ భవనాన్ని ఏ రాజకీయ పరమార్థం కోసం మోడీ ప్రభుత్వం నిర్మిస్తున్నది? దీని వెనక మోడీ సర్కార్ రహస్య రాజకీయ ఎజెండా ఏమిటి? జర్మనీ పరిణామాలు ఇక్కడ కూడా పునరావృతం అవుతాయా?

కొత్త పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవ వేడుకకు సావర్కార్ జయంతిని ముహూర్తంగా ఎంపిక చేసుకోడం యాదృచ్చికం కాదు. పెట్టుబడి కేంద్రంగా గల కార్పోరేట్ వర్గాల సేవ కోసం ఫాసిస్టు రాజ్యాంగా భారత్ ని మార్చాలంటే, ఫాసిస్టు చట్టాల్ని కూడా తేవాలి. దానికి ముందు ఇప్పుడున్న రాజ్యాంగాన్ని అడ్డు తొలగించుకోవాలి. ఇది పాత వైదిక హిందూ మత రాజ్య పునరుద్ధరణ యధావిధిగా జరిగితే కార్పోరేట్ పెట్టుబడికి లాభం జరగదు. పైగా నష్టం కూడా జరిగే స్థితి ఏర్పడుతుంది. కార్పోరేట్ వర్గ ప్రయోజనాల కోసం సావర్కార్ వాస్తవమైన స్ఫూర్తిదాత అవుతాడు.

గత వైదిక సంస్కృతిని చిత్తశుద్ధితో నమ్మే శక్తులు పెట్టుబడికి అక్కర్లేదు. ఆ స్కూల్స్ లో శిక్షణ పొంది ఎదిగిన ఉగ్ర హిందుత్వ శక్తుల కంటే, సావర్కార్ నూరురెట్లు పెట్టుబడికి ఉపకరిస్తారు. దానికి కూడా కారణం ఉంది.

ఈస్టిండియా పాలనపై 1776 లో గంగ బెల్ట్ లో హిందూ సన్యాసుల సాయుధ తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాతే బంకిం చంద్రుని కలం నుండి ఆనందమఠo నవల పెట్టుబడి వలస పాలనకు అనుకూల సందేశంతో వెలువడింది. దేశంలో పలు సాయుధ రైతాంగ తిరుగుబాట్లు తలెత్తడానికి తెర వెనుక వైదిక సంస్కృతి కూడా ప్రేరణ శక్తిగా పని చేసే స్థితిని వలస పాలకులు గుర్తించే క్రమంలో స్వామి వివేకానంద రూపొందిన పరిణామం జరిగింది. ఆ ఇద్దరూ ఆధ్యాత్మిక రంగం వరకే పరిమితం. పైగా అది పాత పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగే కాలం కావడం గమనార్హం! ఐతే 20వ శతాబ్ది ప్రారంభం సామ్రాజవాద యుగంగా మారింది. ముఖ్యంగా 1917 లో సోవియట్ రష్యాలో సోషలిస్టు విప్లవంతో శ్రామికవర్గ విప్లవాల కాలంగా మారింది. దీంతో పరిస్థితి గుణాత్మకంగా మారింది. ఆధ్యాత్మిక రంగంలో పాత పెట్టుబడి సృష్టించుకున్న బంకిం, వివేకానందలు ఆధునిక పెట్టుబడి ప్రయోజనాలకి సరిపోరు. సామ్రాజ్యవాద యుగంలో పెట్టుబడి ప్రయోజనాలకి అనుకూలంగా హిందూ మతాన్ని మార్చడానికి కొత్త రకం దార్శనికుల అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని గుర్తించిన బ్రిటీష్ వలస పాలకులు రాజకీయ రంగంలో కూడా ఆధునిక పెట్టుబడికి సేవ చేస్తూ హిందూ మతానికి రాజకీయ దిశానిర్దేశం చేసే శక్తుల్ని సృష్టించే పనికి పూనుకున్నారు. అందుకే ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో బంకిం చంద్ర, వివేకానందల్లా రాజకీయ రంగంలో సైతం రాజకీయ దార్శనికుల్ని తక్షణమే సృష్టించుకోవాల్సిన నిర్దిష్ట చారిత్రిక అవసరం బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకులకి ఏర్పడింది. ముఖ్యంగా బాధిత ప్రపంచ ముస్లిం ప్రజలకి సంఘీభావంగా హిందువుల సమీకరణకి గాంధీ ఖిలపత్ ఉద్యమం ప్రారంభించడం, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం బ్రిటీష్ వలస పాలకుల అవసరాన్ని తీవ్రతరం చేసింది. ఆ పరిస్థితుల్లో బ్రిటీష్ సామ్రాజ్యవాదం తమదైన బాణీలో గొప్ప రాజకీయ మేధావిని సృష్టించుకున్నది. అతడే సావర్కార్!

బంకిం, వివేకానందల నుండి గోల్వల్కర్, హెడ్గేవార్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దత్తో పంత్ తెంగ్డే, బాలసాహేబ్ దెవరస్, సుదర్శన్ వరకు హిందుత్వ పాఠశాలల్లో శిక్షణపొంది ఎదిగిన వారే! అంతెందుకు, వాజపేయి, అద్వానీ, సుష్మాస్వరాజ్ నుండి మోడీ, అమిత్ షా, వరకూ ABVP లేదా RSS శిక్షణా శిబిరాల్లో చదివి ఆ తర్వాత రాజకీయ రంగం లో ప్రవేశించిన వాళ్లే! కానీ సావర్కార్ వారి కోవలోకి రాడు. బ్రిటీష్ వలస పాలకుల రాజకీయ శిక్షణా శిబిరంలో ఎదిగి RSS కి అప్పగించబడ్డ రాజకీయ మేధావి సావర్కార్!

ఒక విప్లవకారుడు, దేశభక్తుడు, భౌతికవాది, లౌకికవాది, గణతంత్ర భావుకుడు, సామాజిక చింతనా పరునిగా ప్రసిద్ధి కెక్కిన వీర సావర్కార్ వ్యక్తిగత బలహీనతతో క్రూరమైన అండమాన్ జైల్లో బీర సావర్కార్ గా మారాడు. ఆ వ్యక్తిగత లొంగుబాటు దారుణ్ణి వ్యూహాత్మక దృష్టితో వైదిక ఆధ్యాత్మిక భావం గల హిందూ మతతత్వ శక్తులకు దిశానిర్దేశం చేయడానికి ఓ సరుకుగా బ్రిటీష్ సామ్రాజ్యవాదం అందించింది. సదా స్వదేశీ జపం చేసే హిందుత్వ మత శక్తులకు విదేశీ సామ్రాజ్యవాదుల చేత సప్లై చేయబడ్డ రాజకీయ తత్వవేత్త సావర్కార్! దేశభక్తుడైన మన వాణ్ణి బ్రిటీష్ వలస పాలకులు తమ రాజకీయ ఆత్మగా మార్చుకొని, దేశవాళీ హుందుత్వ సంస్థ RSS స్థాపకునిగా అందించిన వాస్తవం బోధపడుతుంది. ఇదే RSS పుట్టుక వెనక వాస్తవ నేపథ్య కథ!

నాటి వేద పాఠశాలల నుండి నేటి సరస్వతి పాఠశాలల వరకి హిందూ మత స్కూళ్ళలో బోధించే ఫ్యూడల్, రాచరిక మత విద్య, రాజనీతి శిక్షణతో తర్ఫీదు పొందిన దేశవాళీ హిందుత్వ శక్తుల కంటే కార్పోరేట్ వర్గాల సేవకి అనుగుణంగా హిందూ మతాన్ని మార్చిన విదేశీ సామ్రాజ్యవాద సేవకుడు సావర్కార్ కి తాజా కొత్త పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవ వేడుకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం! విదేశీ కుట్రకు సావర్కార్ ఓ నిజమైన రాజకీయ ప్రతినిధి! ఆ సావర్కార్ జయంతి రోజు నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం మన దేశ భవిష్యత్ గమనాన్ని సూచిస్తుంది.

మనది గణతంత్ర లౌకిక రాజ్యాంగం ఉనికిలో ఉన్న దేశం. లౌకిక సాంప్రదాయ పద్దతిని విడనాడి రెండు రకాల హిందుత్వ వాదాల మిశ్రమ రాజకీయ వ్యవస్థ గా హిందూ మతాన్ని నేటి కాపీటలిస్టువర్గం తెలివిగా రూపొందిస్తోంది. దానికి నేటి పార్లమెంటు ప్రారంభ వేడుక ఓ నిదర్శనం! వేద హిందూత్వ శరీరానికి, కార్పోరేట్ హిందూత్వంతో కూడిన మెదణ్ణి జోడించి, రూపొందించే రాజకీయ వ్యవస్థ రేపటి ఫాసిజాన్ని తేవడానికి ఓ సాధనంగా మార్చే లక్ష్యం వుండొచ్చు. తాజా కొత్త పార్లమెంట్ భవన్ ప్రారంభ వేడుక అందుకోక నిదర్శనం.

పైన పేర్కొన్న ఫాసిస్టు వ్యవస్థను మన దేశంలో తేవడానికి అవసరమైన విలక్షణ మిశ్రమ రాజకీయ వ్యవస్థకు విదేశీ బ్రిటీష్ వలస పాలకుల స్కూల్ లో రాజకీయ తర్ఫీదు పొందిన సావర్కార్ ని ఒక రాజకీయ ఆత్మగా ఉంటే, వైదిక విద్యా సంస్థలలో తర్ఫీదు పొందే లక్షలాది కార్యకర్తలు, నాయకులు శక్తివంతమైన శరీరంలా ఓ వాహకపాత్ర పోషిస్తారు. ఆ మిశ్రమ పొందికతో రేపటి ఫాసిస్టు రాజ్య నిర్మాణం చేయడం క్రోనీ కార్పోరేట్ వర్గాల లక్ష్యం! అందుకు అనుగుణంగానే కొత్త పార్లమెంట్ భవన్ లో రేపటి ఫాసిస్టు రాజ్యాంగ రచన చేయించడం వారి తక్షణ కర్తవ్యం కాబోలు! దేశంలో ఫాసిజాన్ని స్థాపించే లక్ష్యం గల కాపీటలిస్టు వర్గాలు చెప్పినట్లు చేయడం RSS నేతృత్వంలోని మోడీ సర్కార్ తక్షణ లక్ష్యం! మానవజాతిని మరణోణ్ముఖ దారిలో నడిపించే ఫాసిజం తొలుత సాధారణ జనాన్ని ఆకర్షిస్తుంది. ఈ దశలో పార్లమెంట్ భవన్ వేడుకను మోడీ సర్కార్ వినియోగించుకోవడం గమనార్హం! దాని రేపటి అంతిమ లక్ష్యం స్పష్టం. ఐతే దేశ ప్రజలు దానిని త్రిప్పికొట్టి ఓడించే లక్ష్య సాధన దారిలో నడిపిస్తే, వారి లక్ష్యాలు భ్రమగా మిగిలిపోక తప్పదు.

మళ్లీ జర్మనీకి వెళదాం. హిట్లర్ నేతృత్వంలో పాత, కొత్త పార్లమెంట్ భవనాల విషాద చరిత్ర మన దేశంలో కూడా పునరావృతం చేసే రహస్య ఎజెండా వారికి ఉందా? గత విధ్వంసకర నాజీ పాలన నుండి లభించే చారిత్రక పాఠాల వెలుగులో పార్లమెంటు భవన్ ప్రారంభ సంఘటన వెనక రహస్య రాజకీయ ఎజెండాను పరిశీలిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *