ప్రముఖ కథా రచయిత రాయలసీమ కథారత్నం ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం (22మే2023) పొద్దున ఐదు గంటలకు ఒంగోలులోఆసుపత్రిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. తెలుగు సాహిత్యంలో ఇప్పుడున్నవాళ్ళలో కురువృద్దులు రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. కేతు విశ్వ నాథరెడ్డి కడపజిల్లా,కమలాపురం తాలూ కా(యర్రగుంట్లమండలం) రంగశాయిపురంలో 10.7.1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు.
జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో
“కడప జిల్లా గ్రామ నామాలు” అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేటు పొందిన విశ్వనాథ రెడ్డి, పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి అనంతరం ఉపన్యాసకునిగా కడప, తిరుపతి, హైదరాబాదు, ల్లో పనిచేసి డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ గా ఉద్యోగ విరమణ చేశారు.
పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యపుస్తకాల రచనలకు సంపాదకత్వం వహించిన ఈయన ప్రవృత్తిగా కథా రచనతో అనేక కథలు రాశారు,
1963లో వీరు రాసిన తొలి కథ “అనాదివాళ్లు” సవ్యసాచి పత్రికలో ప్రచురించబడింది, ఈయన కథలు జప్తు, ఇచ్ఛాగ్ని ,కేతు విశ్వనాథరెడ్డి కథలు, పేర్లతో సంపుటాలుగా వెలుపడ్డాయి. దృష్టి ,దారి దీపాలు, పరిచయం, మొదలైన వ్యాస సంపుటాలు , వేర్లు, బోధి, అనే నవలలు కూడా రాసిన కేతు గారి అనేక రచనలు హింది, కన్నడ, మలయాళం, బెంగాలి,మరాఠి,ఆంగ్లం, రష్యన్, భాషల్లోకి అనువాదం అయ్యాయి.
వీరి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు(1986) లభించాయి. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్ఆర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది .
సీమ సాహితీ కేతనం..కేతు విశ్వనాథరెడ్డి గారికి నివాళి
రాయలసీమ జనజీవితాన్ని, సంక్లిష్టతలను కథలుగా మలిచి కొత్తతరానికి మార్గదర్శిగా నిలిచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు మనల్ని విడచి వెళ్ళడం సీమ సమాజానికి తీరని లోటు.
కడప జిల్లా గ్రామనామాలపై పరిశోధన, మాండలికలు, ఆధునిక తెలుగు వచనం, పత్రికలభాష, పాఠ్యపుస్తకాల నిర్మాణం ఇలా భాషాశాస్త్ర పరంగా వీరు చేసిన కృషి ఎంతో విలువైంది. సార్వత్రిక విద్యా వికాసానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు.
రాయలసీమలో విమర్శక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్నో విశ్లేషణలు, సమీక్షలు, సంపాదకత్వాలు, ముందుమాటలు రాసారు. అనేక ప్రసంగాలు చేసారు.
అన్నింటికంటే మించి కొత్తతరం ఎదుగుదలలో ఎంతో ఆనందపడేవారు. ప్రోత్సహించేవారు. తారతమ్యాలు లేకుండా ఆత్మీయత వెదజల్లేవారు.
రాయలసీమ మలితరం అంటే 1970 ల నుండి సీమ కథా సాహిత్యంలోను, సీమ సమాజంలో ఆధునిక ప్రగతిశీల భావాల వ్యాప్తికి, సీమ సాహిత్య, ఉద్యమ కార్యాచరణలోను ఇతోధికంగా కృషిచేసిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారికి ఘననివాళి అర్పిస్తున్నాం. వారి స్ఫూర్తిని కొనసాగిద్దాం.
– డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక, అనంతపురము.
గురుతుల్యులు డా.కేతు విశ్వనాథరెడ్డిగారికి జోహార్లు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత అభ్యుదయ రచయిత, అరసం సీనియర్ నాయకులు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, డా.బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం , పూర్వ సంచాలకులు, నాకు అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి డా.కేతు విశ్వనాథరెడ్డి(84)గారి ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం. రచయిత, మిత్రులు విశ్వప్రసాద్ గారు ఫేస్ బుక్ ద్వారా తేలియజేసిన వార్త చదివి దిగ్భ్రాంతి చెందాను. చాలా దురదృష్టకరం. డా.కేతు విశ్వనాథరెడ్డిగారితో దశాబ్దాల అనుబంధం ఉన్నది.
అమరజీవులు రాచమల్లు రామచంద్రారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, వై.సి.వి.రెడ్డి, సొదుం జయరాంకు డా. కేతు విశ్వనాథరెడ్డిగారు సమకాలికులు. ఒంగోలులో నివాసం ఉన్న పెద్ద కుమార్తె ఇంటికి వచ్చిన విశ్వనాథరెడ్డిగారు గుండెపోటుతో మరణించారు. విజయవాడ నుండి ఒంగోలుకు వెళ్ళి, ఒక ప్రయివేటు ఆసుపత్రి వద్ద నేను, కా.జి.ఓబులేసు, అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, శివప్రసాద్, శరత్, తదితర నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రద్ధాంజలి ఘటించాము. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో కడప నుండి వచ్చిన విశ్వప్రసాద్, ప్రభాకర్ రెడ్డి లు ఉన్నారు. కేతు విశ్వనాథరెడ్డి పెద్ద కుమార్తె, పెద్ద అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలియజేశాము.
-టి. లక్ష్మీనారాయణ