-బొజ్జా దశరథరామిరెడ్డి.రాయలసీమ సాగునీటి సాధన సమితి
చారిత్రాత్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య, రాజకీయం రంగాలలో రాయలసీమ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది.
అభివృద్ధికి కావలసిన అనేక వనరులు; అటవీ సంపద, భూగర్భ సంపద, అన్ని పంటలు పండే సారవంతమైన నేలలు, వాతావరణం, అన్ని రకాల పంటలతో పాటు జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు అవసరమైన విత్తనాలను ఉత్పత్తి చేయగలిగిన మానవ వనరులు రాయలసీమలో ఉన్నాయి.
ఈ ప్రాంతంలో వర్షపాతం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా, వాటి ఉపనదులైన తుంగభద్ర, వేదవతి, హంద్రీ నదులు మరియు పెన్నా, దాని ఉపనదులైన చిత్రావతి, బహుద, కుందూ తదితర నదుల పరవల్లతో ఈ ప్రాంతం పునీతం అవుతూనే ఉంది.
అనేక మంది ముఖ్య మంత్రులకు, ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు రాయలసీమే జన్మస్థలం.
ఇదంతా వింటుంటే ఒళ్లంతా పులకరిస్తుంది. ఈ పుణ్యభూమిలో పుట్టడం ఎంత అదృష్టమో కదా అన్న భావన కలుగుతుంది.
అన్ని అనుకూలమైన అంశాలే ఉన్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన పాలక, ప్రతిపక్ష పార్టీల నిర్లిప్తతతో రాయలసీమ నిత్యం కరువు, వలసలతో కొట్టుమిట్టాడుతుంది.
ఒక వైపు రాజకీయ, సామాజిక వ్యవస్థలు, రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను తమ అజెండాలో చేర్చుకొని పోరాటాలు చేపట్టడంలో అచేతనంగా ఉన్నాయి.
మరొక వైపు కొన్ని శక్తులు రాయలసీమలో నీరు లేదు, నీటి హక్కులు లేవు, ఎలా బతుకుతుందో అని మొసలి కన్నీరు కారుస్తూనే రాయలసీమ సమాజాన్ని నైరాస్యానికి గురి చేసే భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన “సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం” పురస్కరించుకుని “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష” కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడమైనది. రాయలసీమ సమాజాన్ని మానసికంగా బలహీన పరిచి, సమాజాన్ని అచేతనం చేయతలపెట్టిన కుటిల శక్తుల, కపట చేష్టలను అర్థం చేసుకొని, దాన్ని పటాపంచలు చేస్తూ, రాయలసీమ హక్కుల భావజాలాన్ని విస్తృత పరిచి, పాలకులపై ఒత్తిడి తీసుకొని వచ్చి రాయలసీమ అభివృద్ధికి బాటలు వేసే లక్ష్యం తో “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష” నిర్వహిస్తున్నాము. జాగారణతో “రాయలసీమ సమాజంలోని అనంతమైన శక్తిని జాగృతం” చేసే దిశగా అడుగులు వేద్దాం.
రాయలసీమ సమాజలోనికి కొన్ని శక్తులు జొప్పిస్తున్న విష భావజాలాన్ని ఎండగట్టే దిశగా మరియు రాయలసీమ వనరులు, హక్కులపై అవగాహన కలుగ చేసే దిశగా జాగారణ దీక్ష సన్నాహక కార్యక్రమాలు మే 1, 2023 నుండి చేపట్టడమైనది. మే 31, 2023 సాయింత్రం 6 గంటల నుండి జూన్ 1, 2023 ఉదయం 10 గంటల వరకు నిర్వహించే “సిద్దేశ్వరం జల జాగారణ దీక్ష” లో పెద్ద ఎత్తున పాల్గొందాం, మన లక్ష్యాన్ని సాధించుకుందాం.