‘వనపర్తి ఒడి’ కి వీడ్కోలు!

 

వనపర్తి ఒడిలో-25

-రాఘవశర్మ

వనపర్తే మా ఊరు.. వనపర్తే మా లోకం.
పాలిటెక్నిక్ ఉద్యోగులందరిలో అదే భావన.
1969లో ‘జై తెలంగాణా’ మొదలయ్యే వరకే ఆ భావనే కొనసాగింది.
ఉద్యమం చేదు అనుభవాలను రుచి చూచాక అది ఇక నిలువలేదు.
తమతమ మూలాలు గుర్తుకొచ్చాయి.
పాలిటెక్నిక్ ను 1970లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
కోస్తా, రాయలసీమ ఉద్యోగుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి.
ట్రాన్స్వర్లు పెట్టుకుని స్వంత జిల్లాలకు వెళ్ళిపోవాలి.
నాకు ఊహ తెలిశాక ఒకటి రెండుసార్లు బందరు, బాపట్ల వెళ్ళివచ్చాం.
బాపట్ల, బందరు వెళితే ఏదో పరాయి ప్రాంతానికి వెళ్ళినట్టుండేది.
వనపర్తికి తిరిగొచ్చేసరికి ఎంత ఆనందమో!
పచ్చగా కళకళ లాడుతూ, ప్యాలెస్ పరిసరాలు ఎంతో సుందరంగా కనిపించేవి.
టెన్త్ పరీక్షలు రాశాక మా అక్క దగ్గరకు హైదరాబాదు వెళ్ళాను.
అది కూడా నాకొక కొత్త ప్రపంచ మే.
విశాలమైన రోడ్లు, వాహనాల రద్దీ, డబుల్ డెక్కర్లు. ఆకాశాన్ని తాకినట్టుండే పెద్ద పెద్ద భవనాలు!
తెలుగులో అడిగితే ఉర్దూలో సమాధానం.
సిటీ బస్సులు ఎక్కడం, దిగడం కుదిరేది కాదు.
ఎక్కకముందే కదిలేవి.
మా బావకున్న ర్యాలీ సైకిల్ తీసుకుని హైదరాబాదంతా తిరిగే వాణ్ణి.
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్టు.
హైదరాబాదు ట్రాఫిక్ లో సైకిల్ ఎలా తొక్కాలి!?
ఒక రిక్షా వెనకే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే వాణ్ణి.
మూసీపై ముచ్చటగా ఉన్న చాదర్ ఘట్ బ్రిడ్జి మీద వెళుతుంటే భలే తమాషా.
ఏ కారణం చేతనో ఎవరైనా ఓ వ్యక్తి మూసీలోకి తొంగిచూసే వాడు.
చాదర్ ఘటపైన ఉన్న ట్రాఫిక్ స్తంబించేది.
సైకిళ్ళు, రిక్షాలు ఆపేసి అంతా తొంగి చూసేవారు.
ఏమీ ఉండేది కాదు.
వనపర్తికి ‘దసరాబుల్లోడు’ రావాలంటే ఎన్నాళ్ళాగాలి!?
శాంతి థియేటర్లో దసరాబుల్లోడు చూశాను.
మా బాబాయి రమ్మంటే పబ్లిక్ గార్డెన్స్ కు వెళ్ళాను.
ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’ నాటకం వేయబోతున్నారు.
రంగాలంకరణ జరుగుతోంది.
ఇంకా చీకటి పడలేదు.
అర్ధచంద్రాకారంలో నాలుగైదు స్టేజీలు నిర్మిస్తున్నారు.
రంగాలంకరణ చేస్తున్న వారిలో ఏ. ఆర్. కృష్ణ కూడా ఉన్నారు.
ఆయనను చూడడం అదే మొదటి సారి.
నాటకాల్లో మా బాబాయి రాంగోపాల్ కు ఏ.ఆర్. కృష్ణ గురువు, మార్గదర్శకుడు.
నేను నిక్కర్లు వదిలేసి ప్యాంట్లు మొదలెట్టిన రోజులు.
ఏ.ఆర్. కృష్ణ, మా బాబాయిసహా నటులంతా కలిసి స్టేజిలు కడుతున్నారు.
నన్ను చూసి ‘ఒరే అబ్బాయ్ ఇట్రా’ అన్నాడు ఏ. ఆర్. కృష్ణ.
‘ఎవరబ్బాయివి నువ్వు’ అడిగాడు. ‘ఎందుకొచ్చావు’ అని అడిగాడు.
‘మా బాబాయి రాంగోపాల్, నాటకం చూట్టానికి వచ్చా’ అన్నాను.
‘నాతో పాటు వచ్చి స్టేజి కట్టు’ అన్నాడు.
‘నేను సైతం’ అంటూ ఓ చేయివేశాను.
ఏ. ఆర్. కృష్ణ ఒక స్టేజిపైన ప్రయోక్తగా నాటకం గురించి వివరిస్తున్నాడు.
ఏ స్టేజిలో ఏ అంకం జరుగుతుందో దానిపైనే లైట్లు వెలుగుతున్నాయి.

ప్రేక్షకులంతా ఆ స్టేజి వైపే తిరిగి నాటకం చూస్తున్నారు.
మిగతా స్టేజిలన్నీ కనపడకుండా చీకట్లో ఉండిపోయియి.
మా బాబాయి సంగదాసు పాత్ర వేశాడు.
భూస్వామి దగ్గర గుమాస్తా.
తక్కెళ్ళజగ్గడు తిరుగుబాటు వీరుడు.
సంగదాసును భూస్వామి కర్రతో కొడుతున్నాడు.
ఆ దెబ్బలకు పడిపోయి, అరిచే అరుపులకు ప్రేక్షకులంతా లేచేశారు.
నాలో కూడా ఒకటే ఉత్కంఠ.
రష్యాలో బోల్షివిక్ విప్లవ నేపథ్యంలో వచ్చిన నవల ‘మాలపల్లి’
గుంటూరుకు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మహత్తరమైన రచన.
ఆ నవలను నాటక రూపంలో సజీవంగా అలా చూపించడం ఏ.ఆర్. కృష్ణకే సాధ్యం.
‘తెలుగు నాటక రంగం చేసుకున్న అదృష్టం ఏ.ఆర్. కృష్ణ’ అని పత్రికలు ఊరికే రాయలేదు. విద్యుత్ సౌధలో తుగ్లక్ నాటకాన్ని చూశాను.
తమిళనాడులో చో రామ స్వామి రాసిన ‘తుగ్లక్ ‘ కు తెలుగు రూపం అది.
అది కూడా ఏ.ఆర్. కృష్ణ సృష్టే.
ఏ పాత్ర దారుడైనా సమయానికి రాకపోతే ఏ. ఆర్. కృష్ణ వెంటనే ఆ పాత్రలోకి దూరిపోయేవాడు.
ఒక సారి తక్కెళ్ళ జగ్గడి పాత్ర ధారి రాలేదు.
ఏ.ఆర్. కృష్ణ మేకప్ వేసుకుని తక్కెళ్ళ జగ్గడిలోకి పరకాయ ప్రవేశం చేశాడు.
నాటకం అయిపోయాక ‘ఒరేయ్ అబ్బాయ్ ఎలా ఉంది?’ అడిగాడు మా బాబాయిని.
‘గురువు గారు, చాలా బాగా వేశారు కానీ, ఒక్కటే లోపం’ అన్నాడు మా బాబాయి.
ఆ లోపం కాస్తా చేప్పేస్తే అంతా ఘో ల్లుమని నవ్వేశారు.
లోపం సస్పెన్స్!?
‘వేలాడే ఆ పొట్టేమిటి గురువుగారు’ అన్నాడు మా బాబాయ్.
తక్కెళ్ళ జగ్గడు వీరుడు, విప్లవ కారుడు.
ఏ.ఆర్. కృష్ణకు స్త్రీ నా, పురుషు డా , యువకుడా, వృద్దుడా అన్న తేడా లేదు.
ఆ పాత్ర ధారి రాకపోతే దానిలోకి దూరేస్తాడు.
రవీంద్ర భారతిలో ఎన్ని నాటకాలు చూశానో!
వనపర్తి తప్ప నాకు వేరే లోకం తెలియదు.
ఊహ తెలిసినప్పటి నుంచి వనపర్తే నా లోకం.
వనపర్తే నా ప్రపంచం.
నా ఇంటర్ ఫైనల్ పరీక్షలు అయిపోయాయి.
మా అక్క పురిటికి పుట్టింటికి వచ్చింది.
మాచిన్న మేన మామ సుభాస్ చంద్రబోస్ పాలిటెక్నిక్ పైనలియర్ కు వచ్చాడు.
మాతో పాటు వనపర్తి వచ్చిన మరో మేనమామ అక్కడే టీచర్ గా చేస్తున్నాడు.
వనపర్తి సమీపంలోనే పెళ్ళి చేసుకున్నాడు.
అక్కడే స్థిరపడిపోయాడు.
పొలం కొని వ్యవసాయం కూడా చేస్తున్నాడు.
టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో మా దూరపు బందువు ఒకరుండే వారు.
ఆయన పేరు అచ్యుతన సుబ్బారావు, అసిస్టెంట్ డైరెక్టర్.
సుబ్బారావు కూడా రవీంద్రభారతిలో నాటకాలు వేసేవాడు.
‘ఒరేయ్ సుబ్బారావు’ అని పి లిచేవాడు మా నాన్న.
‘చెప్పన్నయ్యా’ అనేవాడు సుబ్బారావు.
‘గుంటూరుకో, విజయవాడకో నాకు ట్రాన్స్వర్ చేయించాలి’ అడిగాడు మా నాన్న.
గుంటూరులో, విజయవాడలో ఖాళీలు లేవు.
తిరుపతికి ట్రాన్స్వర్ ఆర్డర్ వచ్చేసింది.
మా నాన్నకు ట్రాన్స్వర్ ఆర్డర్ వచ్చేవరకు నాకు తెలియదు.
తిరుపతి ఎలా ఉంటుంది?
ఎప్పుడో ఊహ తెలియనప్పుడు చూడడమే.
అసలు వనపర్తిని ఎలా వదిలి వెళ్పాలి?
ఊహ తెలిసినప్పటి నుంచి పెరిగిన ప్రాంతం.
ఈ మానవ లోకాన్ని ఇక్కడి నుంచే తొలి సారిగా చూశాను.
ఇక్కడి చెట్లను, పుట్టలను, గుట్టలను, దూకిన బావులను, తిరిగిన వీధులను ఎలా వదిలి వెళ్ళాలి?
ఇక్కడి మనుషులను, మనసులను, స్నేహాలను ఎలా వదిలి వెళ్ళాలి.
ప్యాలస్, దాని చుట్టూ గడిచిన బాల్యాన్ని, కౌమారాన్ని ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి.
తొలి యవ్వనపు రోజుల ను ఎలా వదిలేయాలి.
ఈ అనుబంధాలను ఎలా తెగతెంచుకుని వెళ్ళిపోవాలి!
వెళ్ళక తప్పదు.
కొన్ని రోజులపాటు ఒకటే ఉత్కంఠ, ఒకటే ఆవేదన.
రోజుకు కొన్ని వీధుల చొప్పున తిరిగాను.
తిరిగిన ప్రాంతాలనే తిరిగాను.
మా నాన్న వనపర్తిలో రిలీవ్ అయిపోయి, తిరుపతి వెళ్ళి చేరాడు.
వెంటనే మేం తిరుపతి వెళ్ళలేదు.
మా అక్క పురిటికి వచ్చింది.
1973 జూన్ 27 మా అక్క మగ పిల్లవాడు పుట్టాడు.
మంగలి దాయమ్మే పురుడుపోసింది.
ఆమె మా సైన్స్ టీచర్ తుల్జారాం సార్ తల్లి.
మా ప్రయాణం దగ్గర కొచ్చింది.
జులై 25ను వనపర్తిలో బయలుదేరాలి.
మానాన్న తిరుపతిలో ఇల్లు తీసుకుని, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు.
సామానంతా పార్శిల్ చేసేశాడు.
ఆరోజు సాయంత్రం వనపర్తి రోడ్డులో రైలెక్కాలి.

2 ఫోటో

మా ఇద్దరు మేనమామల ముఖాల్లో ఒకటే దుఃఖం.
మేమిక్కడ ఉన్నామనే వాళ్ళిద్దరూ వనపర్తి వచ్చారు.
ఇంకొక్క ఏడాది గడిస్తే చిన్న మేన మామకు చదువైపోతుంది.
తానూ వచ్చేస్తాడు.
మరొక మేనమామ ఆ ప్రాంతాన్ని వదిలి రాలేడు.
అక్కడే ఉద్యోగం, అక్కడే పెళ్ళి, అక్కడే పిల్లలు, కాస్త వ్యవసాయం.
ఆ ప్రాంతంతో జీవితం పెనవేసుకుపోయింది.
‘ఇక్కడ పెళ్ళి చేసుకోకపోతే, నేను కూడా ట్రాన్స్వర్ పెట్టుకుని వచ్చేసేవాణ్ణి’ అన్నాడు.
చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు.
మేం వచ్చేశాక, మేం ఉన్న ఇంటి దగ్గర కూర్చుని ఏడ్చేవాడు.
ఒంటరి వాడైపోయాడు.
ప్యాలెస్ ఆవరణలో తెలిసిన వారందరినీ పలకరించాం.
ఆ సాయంత్రం ప్యాలెస్ కు వీడ్కోలు.
సూర్యుడు పశ్చిమాన ప్యాలెస్ వెనుకకు వెళ్ళిపోతున్నాడు.
మేం కూడా సూర్యుడితోపాటు వనపర్తి రోడ్ కు బయలుదేరాం.
కొంత వరకు రాజనగరం జాతర వెళ్ళేరోడ్డు.
కొత్తకోట మీదుగా మదనాపురి.
అదే వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్.
మాకు వీడ్కోలు చెప్పడానికి మా చిన్న మేనమామ రైల్వే స్టేషన్ కు వచ్చాడు.
మరికొందరు కుటుంబ స్నేహితులు వచ్చారు.
రంగనాయకులు కొడుకు సత్యం కూడా స్టేషన్ కు వచ్చాడు.
చీకటి పడబోతోంది.
రైలు వచ్చేసింది.
సామాను లోపలపెట్టేసి కూర్చున్నాం.
నేను కిటికీ దగ్గర కూర్చున్నాను.
అది బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్ రైలు.
‘కళ్ళలో నిప్పురవ్వలు పడతాయి జాగ్రత్త ‘ అని మా అమ్మ హెచ్చరించింది.
మా అమ్మకు మాట పెగలటల్లేదు.
నా గుండెలు బరువెక్కాయి.
రైలుకూత పెట్టింది.
మా చిన్న మేనమామ ఏడుస్తూ చొక్కాతో కళ్ళు తుడుచుకుంటున్నాడు.
రైలు బయలుదేరింది.
కనుచూపు మేర వాళ్ళని చూస్తూనే ఉన్నా.
చీకటి పడిపోయింది.
చీకట్లో రైలు కూత పెడుతూ ముందుకు పరుగులు తీస్తోంది.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

6 thoughts on “‘వనపర్తి ఒడి’ కి వీడ్కోలు!

  1. వనపర్తి తరువాతకాలంలో జ్ఞాపకాలు కొనసాగించండి.

    1. A.R. కృష్ణ జువ్వలపాలెం workshop కు వచ్చారు.

      1. నిజమే రవి బాబు గారు.
        ఆ వర్క్స్ షాప్ లో ఆర్. కృష్ణ గారు ఒక నాటకాన్ని అక్కడి కక్కడే తయారు చేశారు. ఒక్కొక్కరినీ అడిగారు. నా వంతు వచ్చింది. నాటకం వేస్తావా అని అడిగారు.
        ‘నాటకం వేయను. ఉత్తమ ప్రేక్షకుడిగా ఉండి పోతాను’ అన్నాను.
        అందరూ నవ్వే శారు.
        ఏ.ఆర్ కృష్ణ గారు ఎంత ముచ్చట పడిపోయా రో!
        ‘నాటకం వేసేది ప్రేక్షకుల కోసమేగా. ప్రేక్షకులు లేకపోతే నాటకం ఎవరి కోసం వేస్తాము?
        రాఘవ శర్మ మొదటి ఉత్తమ ప్రేక్షకుడు అయితే, నేను రెండవ ఉత్తమ ప్రేక్షకుడి ని ‘ అన్నారు.
        జువ్వల పాలెం సాహిత్య పాఠశాలలో ఒక మధురమైన జ్ఞాపకం.

    2. తిరుపతి జ్ఞాపకాలు 64 భాగాలు ఇలాగే రాశా ను. వాటి నుంచి కొన్ని తీసి ‘తిరుమల దృశ్య కావ్యం ‘ గా తెచ్చా ను. అది పూర్తిగా trecking పైన.

  2. We studied in wanaparthy polytechnic college 92 batch civil engineering state for 1 year in hostel in those days used to attend the classes in the palace and we were very much proud of our Palace college building and beside our hostel there was a well it was ancient well in about

  3. ఒక ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి నాన్న ఉద్యోగం రీత్యా అయినా సరే వలసపోవడం ఇంత బాధాకరంగా, విషాదంగా ఉంటుందా… ఈ కాలంలో ఇలాంటి భావోద్వేగాలు ఊహించగలమా.. మీ వనపర్తి వలపోతలు, కలబోతలు ఆపాత మధుర జ్ఞాపకాలండి. వనపర్తి జ్ఞాపకాలు అప్పుడే అయిపోయాయా అనే అనుభూతి కలుగుతోంది. ఇదొక్కటి చాలు పాఠకులు మీ జ్ఞాపకాలతో ఎంతగా లీనమైపోయారో చెప్పడానికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *