చారిత్రక సమృద్ధ ప్రదేశం చేర్యాల గ్రామంలోని పాటిగడ్డ
చారిత్రక పురావస్తు సంపన్నతను గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు వేముగంటి మురళీకృష్ణ, మామిడి పూర్ణ చందర్ రావు, మామిండ్ల లక్ష్మారెడ్డి, మీసా వెంకటేశ్వర్లు మరియు నిహాల్ రాజ్, అహోబిలం కరుణాకర్, ఎండి. నసీర్, ఎండి. అన్వర్, కొరివి గోపాల్, కొలిపాక శ్రీనివాస్, వకుళాభరణం సనోజ్, అహోబిలం భువన, ఆకృతి, కళ్యాణ్ లు చేర్యాలలోని చతురస్రాకారపు దిబ్బవంటి పాటిగడ్డమీద క్షేత్రపరిశీలనలో పలు సాతవాహన, ఇక్ష్వాకుల కాలాలకు చెందిన అమ్మదేవత, యక్షిణి, బొమ్మపాదం, టెర్రకోట బొమ్మలు, టెర్రకోట పూసలు, చిత్తుడు బిల్లలు, అద్భుతమైన డిజైన్లున్న పెదకాగుల పెంకులు, లెక్కలేనన్ని పగిలిన కంచుళ్ళు, ఒక దంపుడురాయి, 14 X 12 X 4 అంగుళాల కొలతలున్న పెద్ద ఇటుకలను గుర్తించారు.
పాటిగడ్డమీద కొత్తరాతియుగానికి చెందిన మూడు రాతిగొడ్డండ్లు కూడా దొరికాయి. టెర్రకోట పూసలు పదులకొద్ది లభించాయి. ఒక ఎమెరాల్డ్ వన్నె ఆకుపచ్చని పెద్ద రాతిపూస కూడా దొరికిన పూసలలో ఒకటి.
సాతవాహనకాలంనాటి ప్రజల ఆభరణాలలో పలురంగు రాతిపూసలు, టెర్రకోటపూసలు వుండేవి. టెర్రకోట బొమ్మలలో విరిగిన బొమ్మపాదం, పగిలిపోయిన యక్షిణి తల, తల లేని అమ్మదేవతలున్నాయి. ఈ బొమ్మలు ఇక్ష్వాకులశైలికి చెందినవి.
పాటిగడ్డలో పెద్దఇటుకల నిర్మాణమున్నట్లు తెలుస్తున్నది. సాతవాహనులకాలంనాటి కొలతలతో దొరుకుతున్న ఇటుకలు ఇక్కడొక ప్రాచీన నిర్మాణముందని అనుకోవడానికి అవకాశమిస్తున్నాయి. బహుశః బౌద్ధస్తూపముండవచ్చని సందేహంగా వుంది.
ఈ పాటిగడ్డమీదనే కొ.తె.చ.బృందానికి సాతవాహనుల కాలంనాటి నాణెం లభించింది. నాణెంమీద ఉజ్జయిని చిహ్నముంది. రెండోవైపు బ్రాహ్మీలిపి అక్షరాలు చెదిరి కనిపిస్తున్నాయి. చేర్యాల పాటిగడ్డ సమృద్ధమైన చారిత్రక సంపదగల ప్రదేశం. అన్నివిధాల పురావస్తు తవ్వకాలకు ఎంపికచేయతగిన ప్రదేశం. తెలంగాణ వారసత్వశాఖ ఈ ప్రదేశం ప్రత్యేక శ్రద్ధ చూపి, మట్టిలో ఉన్న చరిత్రను తవ్వి బయటికి తీయాలని కొ.తె.చ.బృం. కోరుతున్నది.
క్షేత్ర పరిశోధన : వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, కొలిపాక శ్రీనివాస్ మిత్రబృందం
విషయ రచన: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం