వనపర్తి ఒడిలో-24
-రాఘవ శర్మ
‘రాజా సాబ్ పై రాళ్ళ దాడి’
ఏనోట విన్నా అదే మాట! వనపర్తిలో పెద్ద సంచలనం. రాష్ట్రంలోనే పెద్ద కలకలం.
ఆ దాడి వెనుక నేపథ్యం ఇది.
మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ‘జై తెలంగాణ’ ఉద్యమం 1969లో వచ్చింది.
నాలుగు వందల ఉద్యమకారుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.
ఉద్యమం అదుపు తప్పింది.
అది కాస్తా లుంపెన్ చేతుల్లో కెళ్ళిపోయింది.
కోస్తా, రాయలసీమకు చెందిన చిరు ఉద్యోగులపై దాడులు జరిగాయి.
కొందరు మహిళలపై అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణ లొచ్చాయి.
ఏడాది చదువు చట్టుబండ లైంది.
కొంత కాలానికి ఉద్యమం చల్లారింది.
ప్రజల హృదయాల్లో ఆవేదన చల్లారలేదు.
జరిగిన అన్యాయం నీడలా వెన్నాడుతోంది.
నివురు కప్పిన నిప్పులానే ఉండిపోయింది.
మళ్ళీ అది ఎప్పుడు పురివిప్పుతుందో, జూలు విదిలిస్తుందో చరిత్రకే తెలియా లి.
ఆ సమయంలో రాజా రామేశ్వరరావు మౌనం దాల్చారు.
మౌనం అర్ధంగీకారమా! అర్ధ అనంగీకారమా?
ఉద్యమం జరిగినంత కాలం లండన్ లో ఉండిపోయారు.
ఉద్యమం చల్లారాక నిదానంగా వచ్చారు.
‘జై తెలంగాణ’ చల్లారి పోయింది.
ఆ తరువాత కోస్తాంధ్ర రాయలసీమలో వేడిపుట్టుకొచ్చింది.
‘ముల్కి ఉద్యమం 1952లో వచ్చింది.
ఆ తరువాత తెలంగాణా ‘ముల్కి’ ని సాధించింది.
తెలంగాణాలోని విద్య ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలనేది ‘ముల్కి’ నిబంధన.
‘ముల్కిని హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా సమర్థించాయి.
దీనికి వ్యతిరేకంగా 1972లో ‘జైఆంధ్ర’ ఉద్యమం తలెత్తింది.
తెలంణాకు అన్యాయం జరగడం కాదు, కోస్తా, రాయలసీమకే అన్యాయం జరిగిందన్న వాదనను లేవనెత్తారు.
హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి జరుగుతోందనేది వారి ఆవేదన.
నేను ఇంటర్ చదువుతున్నాను.
నాకు ‘డొమిసైల్’ (స్థానిక నివాసం) సర్టిఫికెట్ ఉంది.
అందు వల్ల నేను కూడా ‘ముల్కీ’ కిందే లెక్క!?
‘జై ఆంధ్ర’ ఉద్యమానికి తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, కాకాని వెంకటరత్నం, వెంకయ్య నాయుడు వంటి హేమాహేమీలు నాయకత్వం వహించారు.
‘జై ఆంధ్ర’ ఉద్యమంలో 1972 నవంబర్ 21న బందుకు పిలుపు నిచ్చారు.
ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు.
మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం డిసెంబర్ 25న గుండెపోటుతో మరణించారు.
వనపర్తి పాలిటెక్ని కిక్ లో ఉన్న కోస్తా ఉద్యోగులు చాలా ఆవేదన చెందారు.
కొందరు మాటల్లో రెచ్చిపోయారు.
మరికొందరు ఉత్తర కుమారులైపోయారు.
జైతెలంగాణాలో సమైక్యాన్ని కోరుకున్న వీరు, జైఆంధ్రలో స్వరం మారింది. మార్చారు
తెలంగాణా నుంచి విడివడాలని కోరుతున్నారు.
జై ఆంధ్ర ఉద్యమం కూడా చల్లారుతున్న సమయం ఆసన్నమైంది.
కాకాని వెంకటరత్నం మృతి చెందితే రాష్ట్రం అల్లక ల్లోలమై పోతుందని బాధపడ్డారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు.
జై ఆంధ్రతో చెన్నారెడ్డికి రాజకీయంగా ఉనికి సమస్య ఏర్పడింది.
లండన్ నుంచి తిరిగి వచ్చిన రాజా రామేశ్వరరావుకు కూడా రాజకీయంగా ఉనికి సమస్య. ఇప్పుడు ఏ స్వరాన్ని అందుకోవాలి!?
‘జై ఆంధ్ర’ ‘జైతెలంగాణా’ రెండూ బలమైన స్వరాలే!
ఇరు ప్రాంతాల వారినీ సంతృప్తి పరచవచ్చు.
అది 1973.
మా జూనియర్ కాలేజీ ప్రే గ్రౌండ్ లో పెద్ద ఎత్తున మీటింగ్ కు ఏర్పాట్లు చేశారు.
‘జై ఆంధ్ర’ ‘జైతెలంగాణా’ నినాదం.
జనం సుమారుగానే వచ్చారు.
మా జూనియర్ కాలేజీ మెయిన్ బిల్డిండ్ ముందున్న ప్లాట్ఫాం వేదిక.
ఆ వేదికపై మర్రి చెన్నారెడ్డి, రాజా రామేశ్వరరావు ఉన్నారు.
ముందు చెన్నారెడ్డి మాట్లాడారు.
తరువాత రామేశ్వరరావు మాట్లాడారు.
రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు.
వచ్చిన ప్రజలంతా వారి ఉపన్యాసాలను ఓపిగ్గా విన్నారు.
సాయంత్రం చీకటి పడే వేళైంది.
రాజాసాబ్ ఉపన్యాసం ముగియకముందే ప్రేక్షకుల నుంచి కొందరు లేచారు.
‘తెలంగాణా ఉద్యమం జరుగు తున్నప్పుడు నువ్వు ఏడున్నవు?’ అని అరిచారు.
”గప్పుడేం చేస్తున్నవు?”
‘400 మంది తెలంగాణా బిడ్డలు సచ్చిపోయిండ్రుగదా! అప్పుడేం చేస్తుంటివి?’
‘ఇప్పుడు మీకు సమైక్యం అవుసరమా?’
‘వాళ్ళు మంచిగుండాలె.
మీరు మంచి గుండాలె.
మధ్యలో మేము సావాలె’
జనం నుంచి ఇలా అనేక నిష్టూరం రా లే
ప్రేక్షకులు కోపోద్రిక్తులయ్యారు.
అటు చెన్నారెడ్డి కానీ, ఇటు రాజాసాబ్ కానీ సమాధానం చెప్పలేకపోయారు.
లేచి నిలుచున్నారు.
అంతే.. చెప్పులు, రాళ్ళు వచ్చి వేదికపైన పడుతున్నాయి.
కొందరు వారికి అడ్డుగా నిలబడ్డారు.
తలొంచుకుని, చేతులు తలకు అడ్డంగా పెట్టుకుని పరుగు లాంటి నడక.
కార్ల దగ్గరకువెళ్ళేవరకు జనం వెంబడించారు.
ఆ జనంలో నేనూ ఉన్నాను.
నా వయసు పదిహేడేళ్ళు.
ఆ జనాన్ని చూస్తే నాకూ కోపం వచ్చింది.
వాళ్ళతో పాటు నేనూ ఒక రాయి విసిరాను.
చెన్నారెడ్డిని కొట్టాలన్నది
ఉద్దేశ్యం.
ఆ రాయి ఆయన కారు డోర్కు తగిలింది.
రాయి రాజా సాబ్కు కాస్తలో తప్పిపోయింది.
జనం మధ్య నుంచి కార్లు వేగంగా కదిలాయి.
జనం కొంత దూరం వరకు కార్లను వెంబడించారు.
నాకు భయమేసింది.
‘అసలు నేను రాయి విసరడమేమిటి!?”
‘అంత సాహసం, అంత ధైర్యం నాకెక్కడి నుంచి వచ్చింది!’
‘చీకట్లో నన్నెవరూ చూడలేదుకదా!?
గుండె దడదడలాడింది.
అదే తొలిసారి, అదే చివరి సారి.
మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఇలా రాళ్ళు విసరలేదు.
ఇదొక మాస్ హిస్టీరియా.
రామేశ్వరరావు అభ్యుదయ వాది.
ముందు చూపున్న వాడు.
రాచరికం నుంచి రాజకీయాలను అందిపుచ్చుకున్న వాడు.
సంస్థానాల విలీనంతో ప్యూడల్ కుటుంబాలు ఆధునిక వ్యవస్థలో ఇమడలేక అనేక మానసిక సంఘర్షణలకు లోనవుతున్న కాలం.
తెలంగాణా ప్యూడల్ కుటుంబాల్లో ఉన్న ఆ సంఘర్షణను ‘పక్షులు’ అన్న నవలలో పసుపులే టి మల్లికార్జున్ చాలా చక్కగా చిత్రించారు.
అలాంటి మానసిన సంఘర్షణకు రాజా రామేశ్వరరావు లోనుకాలేదు.
ఎం.ఏ., చదువుకున్నాడు.
రాచరిక వ్యవస్థనుంచి ఆధునిక వ్యవస్థకు మారుతున్న సంధి దశ అది.
వ్యవసాయంలో ఆధునితను ప్రవేశ పెట్టాడు.
పరిశ్రమలనూ స్థాపించాడు.
తెలంగాణా స్పిన్నింగ్ మిల్లును స్థాపించాడు.
రీలింగ్ యూనిట్ ను స్థాపించాడు.
క్రిషి ఇంజన్లను స్థాపించాడు.
ఓరియంటల్ లాంగ్మన్ పబ్లిషింగ్ హౌస్ ను స్థాపించాడు.
కానీ ఏ ఒక్కటీ లాభదాయంగా నడపలేకపోయాడు.
చూపు ఆధనికం వైపు ఉన్నా, అడుగులు రాచరిక దర్పాన్ని విడిచిపెట్టలేదు..
తన మాటకు ఎదురుండకూడదు.
తన మాటే అందరూ వినాలనే తత్వం.
ఎంత మంచి వాడో , అంత ముక్కోపి.
నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజుల్లో ‘గోల్డ్ కోస్ట్’కు భారత హైకమిషనర్ గా పనిచేశాడు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధపోరాటానికి ఆర్థిక సాయం చేసిన సంస్థానాదీశుడు.
ఆరోజుల్లో ఇదొక గొప్ప సాహసం.
తెంగాణా క్రియాశీలక రాజకీయాల్లో చాలా మందిని పోగుచేశాడు.
కానీ వారెవ్వరూ ఆయన స్థాయిని అందుకోలేకపోయారు.
రాజా సాబ్పై రాయి విసిరనప్పుడే నేను చివరి సారిగా చూడడం. మళ్ళీచూడలేదు.
అదే ఏడాది జులై 25న వనపర్తి వదిలేసి తిరుపతి వచ్చేశాం. నేను పనిచేస్తున్న వార్తలోనే 2000లో మొదటి పేజీలో ఒక వార్త. ‘వనపర్తి చివరి సంస్థానాదీశుడు రామేశ్వరరావు కన్నుమూత’