దసరాలకే వనపర్తి రాజా సాబ్ దర్శనం

వనపర్తి ఒడిలో-23

-రాఘవ శర్మ

దసరా వచ్చిందంటే చాలు ఒకటే సందడి.
మా నాన్న పూజలు, మా అమ్మ పిండి వంటలు.
శమీ వృక్షం దగ్గరకెళ్ళి దాని ఆకులు కోసుకొచ్చే వాళ్ళం.
శమీ ఆకులను పెద్దల చేతిలో పెట్టి నమస్కారం చేసే వాళ్ళం.
బాగా చదువుకోమని దీవించేవారు.
ఆ దీవెనలు పొందిన వారిలో కొందరు బాగా చదువుకునే వారు.
మరి కొందరు చదువుకో లేకపోయేవారు.
పెద్దల దీవెనల ఫలితం అలా ఉండేది.
దసరా అనగానే వనపర్తి రాజాసాబే కనిపించేవారు.
ఆరోజుల్లో రాజా సాబ్ ను చూడడం ఒక ఆసక్తి.
రాజా రామేశ్వరరావు బహు అందగాడు.
ఎత్తుగా, సన్నగా, తెల్లగా, బలంగా ఉండే వాడు.
తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు.
ప్యాలెస్ లోనే బసచేసేవాడు.
దసరా పండుగ రోజు ప్యాలెస్ కు ఉత్తర దిక్కున ఉండే మెట్ల పైనుంచి రాజ దర్ పం తో కిందికి దిగుతూ వచ్చే వాడు.
మా ఇంటి వరండా నుంచి చూస్తే ఆ దృశ్యమంతా కనిపించేది.

వనపర్తి సంస్థానాధీశుడు రాజా రామేశ్వర రావు

రాజాసాబ్ మెట్లు దిగగానే ఎదురుగా ఉన్న గుడి పూజారులు ఎదురేగి, రాచ మర్యాదలతో ఆలయంలోకి తీసుకెళ్ళేవారు. ఆయన చుట్టూ కొంత మంది ముఖ్యులు ఉండే వారు.
ఆలయంలోకి వెళ్ళి పూజలు చేసేవాడు.
ఆయుధ పూజ కూడా జరిగేది.
రాచరిక పద్ధతుల ప్రకారం పాతకాలంనాటి యుద్ధంలో వాడే పెద్ద కత్తి తీసుకొచ్చేవారు.
ప్యాలెస్ నేల అంతుస్తులో ఉన్న మ్యూజియం నుంచి ఆ కత్తి వచ్చేది.
దానికి పూల దండ వేసి, పూజ చేసి రాజాసాబ్ కు బహూకరించేవారు.
ఆ కత్తితో యుద్ధం చేస్తే రాజు గెలుస్తాడని నమ్మకం.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దృశ్యాన్ని చూసేవాణ్ణి.
రాచరిక వ్యవస్థలో ప్రతి రాజ్యంలో ఇలాగే జరిగేది.
పూజ చేసిన కత్తితో చేసే యుద్ధంలో ఒకరాజు నేలకొరుగుతాడు.
మరొక రాజు విజేతగా నిలిచి, ఓడిన రాజ్యాన్ని ఆక్రమిస్తాడు.
పూజారులు కత్తికి చేసే పూజలు, రాజుకు అందించే ఆశీర్వచనాలు కొందరికి ఫలించేవి.
మరి కొందరికి ఫలించేవి కావు.
ప్యాలెస్ ఆవరణలో రాజాసాబ్ పూజలు చేసే ఆలయం మామూలు ఆలయంలా ఉండదు.
దానికి ద్వజస్తంభం, పైన గోపురాలు వంటివి ఏమీ లేవు.
నలుచదరంగా ఒక చిన్న భవనంలా ఉంటుంది.
కేవలం రాజరిక కుటుంబీకుల కోసం నిర్మించిన ఆలయం అది.
మా అక్క పెళ్ళి 1966 లో ఈ ఆలయంలోనే జరిగింది.

వనపర్తి సంస్థానాధీశు లు పూజలు చేసే ఆలయం.

వనపర్తి సంస్థానాదీశుల మూలాలు కడప జిల్లాలో ఉన్నాయి.
వీరి స్వగ్రామం కడప జిల్లా జెనుంపల్లి.
వీరి ఇంటి పేరు కూడా జెనుంపల్లి.
అది పదహారవ శతాబ్దం తొలి నాళ్ళు.
ఆగ్రామానికి చెందిన జెనుంపల్లి వీరకృష్ణా రెడ్డి అనే యువకుడు పరగణాధిపతి కావాలనుకున్నాడు.
తన ఊరి కరణాన్ని, పురోహితుణ్ణి, ఇద్దరు తమ్ముళ్ళను తీసుకుని బయలుదేరాడు.
అదృష్టాన్ని వెతుక్కుంటూ కృష్ణా నది దాటి పానుగంటి సీమకు వచ్చాడు.
అక్కడ పొలాలు కౌలుకు తీసుకుని పంటలు పండించాడు.
రైతులకు అప్పులిచ్చి తన పలుకుబడి పెంచుకుని నాయకుడైపోయాడు.
సూగూరులో కోట కట్టించి దాన్ని తన రాజధానిగా మలుచుకున్నాడు.
కులీ కుతుబ్షా(1512-1543) వల్ల సూగూరు పరిగణాలకు అధిపతయ్యాడు.
సూగూరుకు పశ్చిమ దిశగా ఉన్న జెనుంపల్లిని కూడా తన పరగణాలో కలుపుకున్నాడు.
వీర కృష్ణా రెడ్డి 1540లో మరణించడంతో అతని కుమారుడు బసిరెడ్డి సంస్థానాదీశుడయ్యాడు.
బసిరెడ్డి తరువాత ఇమ్మడి వెంకటరెడ్డి సంస్థానాదీశుడయ్యాడు.
కులీ కుతుబ్షాకి పదివేల సైన్యంతో తోడ్పడి, 1652లో ఉదయగిరి, నెల్లూరు ల పై విజయాన్ని చేకూర్చాడు.
తరువాత ఆయన కుమారుడు గోపాలరావు 1654లో రాజ్యానికొచ్చాడు.
గోపాలరావు శ్రీరంగాపురాన్ని కట్టించాడు.
పక్కన రంగసముద్రాన్ని తవ్వించాడు.
గోపాలరావు 1676లో శ్రీరంగనాథుని ఆలయాన్ని కూడా నిర్మింప చేశాడు.
గోపాల రావు కవులను పోషించడమే కాదు, స్వయంగా రచనలు చేశాడు.
గోపాల రావుకు పిల్లలు లేరు.
చిన్న పిల్లవాడైన మూడవ వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు.
రాజ్య భారాన్ని జానాంబకు అప్పగించాడు.
పానుగల్లు, గణపవరం రక్షణ భారాన్ని సుల్తాన్ అబ్దుల్లా కులీకుతుబ్ షా జానాంబపై మోపాడు.
గోలకొండ కోట 1687లో ఔరంగా జేబు వశమవడంతో జానమాంబ కొత్తకోటకు చేరింది.
మూడవ వెంకట రెడ్డి తన దత్తతండ్రి పేరున గోపాల పేటను కట్టించాడు.
దాని పాలనా భారాన్ని తన తమ్ముడు రంగారెడ్డికి అప్పగించాడు.
రంగా రెడ్డి వనపర్తిలో పాతకోటను కట్టించాడు.
మొగల్ పాదుషా ఇతని ప్రతిభకు మెచ్చి ‘సవై’ బిరుదునిచ్చాడు.
వెంకటరెడ్డిపైన దక్కను సుబేదారు ముబారి జుఖాను చెప్పుడు మాటలు విన్నాడు.
ఫలితంగా సుల్తాను సైన్యాలు 1711లో జానంపేట పైన దండెత్తాయి.
వెంకటరెడ్డ మేనల్లుడు తిరుమల రాయుడు శత్రుసైన్యాలను ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అపజయ భారం తో మూడవ వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెద్ద జానం పేట కాస్తా పాదుషా ఫరుక్ సయ్యద్ పేరిట పరుఖ్ నగర్ గా మారింది.
తరువాతి సంస్థానాదీశుడు మొదటి రామేశ్వరరావు.
బహుభాషా కోవిదుడు.
బ్రిటిష్ వారి మెప్పు కోసం మొదటి రామేశ్వరరావు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారికి సాయం చేశాడు.
ఫలితంగా ‘బలవంత్ బహద్దూర్’ అన్న బిరుదును కూడా పొందాడు.
నిజామ్ నవాబుకు మొదటి రామేశ్వరరావుకు పొత్తు పొసగలేదు.
నిజాం నవాబు రామేశ్వరరావును జైలులో బంధించాడు.
రామేశ్వరరావు జైలు నుంచి తప్పించుకుని వచ్చేశాడు.
అందుకునే ఇతన్ని దొంగ రామేశ్వరరావు అనేవారు.
ప్రస్తుతం ఉన్న వనపర్తి ప్యాలెస్ నిర్మాణానికి మొదటి రామేశ్వరరావు శ్రీకారం చుట్టాడు.
అది పూర్తి కాకుండానే ఆయన మరణించాడు.
రామేశ్వరరావు మరణానంతరం అతని భార్య రాణి శంకరమ్మ రాజ్య భారాన్ని స్వీకరించింది.

ప్యాలస్ కట్టిన సందర్భంగా రాయించిన శిలాశాసనం

ప్యాలెస్ నిర్మాణాన్ని శంకరమ్మ 1885లో పూర్తి చేయించింది.
దానికొక అందమైన రూపాన్నిచ్చింది.
ఈ ప్యాలెస్ పేరు రామసాగర్ బంగ్లా.
రాణి శంకరమ్మ 1911లో మరణించగా, రెండవ రామేశ్వరరావు సంస్థాన బాధ్యతలు స్వీకరించాడు. హైదరాబాదు నిజాం ఉస్మాన్అలీపాదుషా రెండవ రామేశ్వరరావుకు ‘మహారాజా’ బిరుదునిచ్చాడు.
రెండవ రామేశ్వరరావు 1922లో మరణించాడు.
ఆయన రెండవ కుమారుడు కృష్ణదేవరాయలు సంస్థాన బాధ్యతలు స్వీకరించాడు. రెండేళ్ళు గడవక ముందే 1924లో కృష్ణదేవరాయలు కన్నుమూశాడు.
తండ్రి మరణించే నాటికి తృతీయ రామేశ్వరరావు చిన్న పిల్లవాడు. రామేశ్వరరావు తల్లి సరళా దేవి సంస్థాన వ్యవహారాలు చూసేది. సంస్థానంపై ఇరవై ఏళ్ళు కోర్టులో కేసు నడిచింది.

బాల్యంలో వనపర్తి చివరి సంస్థానాధీశుడు రామేశ్వరరావు

చివరి సంస్థానాదీశుడు రామేశ్వరరావు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే దాన్ని ఇండియన్ యూనిన్లో విలీనం చేశాడు. (టూకీగా వనపర్తి సంస్థానాల చరిత్ర చొక్కపు నారాయణస్వామి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి రాసిన వ్యాసం ఆధారంగా తీసుకుంది. ) రామేశ్వరరావు తన తల్లి సరళా దేవి పేరుతో సరళాసాగర్ ప్రాజెక్టును కట్టించాడు.
దేశంలోనే సైఫన్ పద్ధతిలో కట్టించిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలిచిపోయింది.
తన తండ్రి కృష్ణదేవరాయలు పేరున తన ప్యాలెస్ లో పాలిటెక్నిక్ స్థాపించాడు.
తరువాత 1970లో అది ప్రభుత్వ పరమైంది.
రామేశ్వరరావు దత్త పుత్రుడు కృష్ణ దేవరాయ ప్రస్తుతం ఈ ట్రస్టు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.
రామేశ్వరరావుకు నమ్మకస్తులైన కొందరు ఆంతరంగికులు ఉన్నారు.
వారిలో చెవులెంటికల రామిరెడ్డి ముఖ్యులు.

చెవిలెంటికల రామిరెడ్డి

ఆయనకు చెవులపైన గుబురుగా వెట్రుకలు ఉంటాయి.
అందుకే ఆయనకాపేరు స్థిరపడింది.
ఆయన ఇంటి పేరును కలిపి రామిరెడ్డి అంటే ఎవరూ గుర్తు పట్టరు.
చెవిలెంటికల రామిరెడ్డి అంటేనే గుర్తుపడతారు.
ఒక గౌరవం కూడా.
చెవిలెంటికల రామిరెడ్డి రామేశ్వరరావుకు చాలా నమ్మకస్తుడు.
రామేశ్వరరావుకున్న భూములు, వాటిలో వ్యవసాయం చెవిలెంటికల రామిరెడ్డే చూసేవా డు.
రాజనగరం సమీపంలో ఉన్న వాసుదేవమ్మ తోటలోనే చెవులెంటికల రామిరెడ్డి నివాసం.
వనపర్తి ప్రాంతంలో చెరుకు పంట తెలియని రోజులవి.
చెవిలెంటికల రామిరెడ్డి చిత్తూరు జిల్లా వచ్చి, ఇక్కడి చెరుకు పంటను పరిశీలించా డు.
చిత్తూరు జిల్లా నుంచి కొందరు చెరుకు రైతులను కుటుంబాలతో వనపర్తి తీసుకొచ్చాడు. వాసుదేవమ్మ తోటలో మూడేళ్ళ పాటు వారిచేత చెరుకు పంట వేయించాడు. చెరుకు పంటలో ఉండే లోతుపాతులను అక్కడి రైతులు అలా తెలుసుకోగలిగారు. దాంతో వాసుదేవమ్మ తోటలో బెల్లం తయారీకూడా మొదలైంది.
వనపర్తి ప్రాంతంలో చెరుకు పంటకు, బెల్లం తయారీకి ఆద్యుడు చెవులెంటికల రామిరెడ్డే. విద్యావ్యవహారాలు చూడడానికి పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె. రామి రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రైవేటు పాలిటెక్నిక్ కు రెండవ ప్రిన్సిపాల్ ఆయన.
కేవలం 28 ఏళ్ళ వయసులో ప్రిన్సిపాల్ అయిన కె. రామిరెడ్డి ఈ కాలేజీకి రూపశిల్పి.
కె.రామిరెడ్డి పాలనా దక్షుడు.
సందర్భం నాకు గుర్తు లేదు.
‘బంగారు కడ్డి.. కె. రామిరెడ్డి’ అని విద్యార్థులు నినాదాలు చేశారు.
ఇది చాలా అరుదైన సంఘటన.
ఇంతకు మించిన గుర్తింపు ఏముంటుంది!?
రాజా రామేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీ పెట్టాలని ప్రయత్నించాడు.
కానీ , 1969లో జై తెలంగాణా ఉద్యమం వచ్చింది.
ఆ ఉద్యమ సమయంలో రామేశ్వరరావు దానికి దూరంగా ఉన్నా డు.
మరుసటి ఏడాది ప్యాలెస్ సహా పాలిటెక్నిక్ కాస్తా ప్రభుత్వ పరమైంది.
ఈ పరిణామాలన్నీ రామేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీ స్థాపించాలన్న కల సాకారం కాకుండా చేశాయి.

బర్రెల రామిరెడ్డి

రామేశ్వరరావు ఆంతరంగికుల్లో మరొకరు బర్రెల రామిరెడ్డి.
ప్యాలెస్ ప్రధాన ద్వారం దాటి బైటి కి రాగానే కుడి వైపున ఆయన నివాసం. ఆయనకు పెద్ద పెద్ద బర్రెలు ఉండేవి.
అందుకే ఆయనకు బర్రెల రామిరెడ్డి అన్న పేరు వచ్చేసింది.
ప్రిన్సిపాల్ కె. రామిరెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
మిగతా ఇద్దరు రామిరెడ్లు వనపర్తి పరిసర ప్రాంతానికి చెందిన వారే.
ఈ ముగ్గురు ఇప్పుడు లేరు.
వారి సేవలు మాత్రం వనపర్తి జ్ఞాపకాల్లో ఇలా నిక్షిప్తమై ఉన్నాయి.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్ . తిరుపతి. మొబైల్ నం. 9493226180)

2 thoughts on “దసరాలకే వనపర్తి రాజా సాబ్ దర్శనం

  1. Sir, This is truth, Barrela RamaReddy ki another name, Peddagudem Rama Reddy well-known, I’m a Student of Mech Engineer in 1979 completed

  2. I’m studied in this college and completed in the year 1979 , Mechanical engineer ing branch, that time ourMechanicalHead and In-Charge principal late Veerabhadrachary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *