హైదరాబాదులో ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తున్నా, అమరావతి నుండి ఏ కార్యాలయాన్ని తరలించడానికి వీలులేదు అన్న హైకోర్టు మద్యంతర ఉత్తర్వులుకు లోబడి ఈ కార్యాలయాన్ని కూడా తరలించడానికి వీలులేదనే భావజాలాన్ని కొన్ని శక్తులు మీడియా ద్వారా సమాజానికి ఎక్కిస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.
బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు ఏప్రిల్ 25, 2023 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ, ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఈ కార్యాలయాన్ని కర్నూలుకు మారస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ సాగునీటి సాధన సమితి స్వాగతించిందని ఆయన గుర్తు చేసారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల స్పందనే కనపడలేదని ముఖ్యంగా రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఇది తమకు సంబంధం లేని విషయంగా పరిగణించినట్లుగా కనపడుతున్నదని ఆయన విమర్శించారు.
ఇదే సందర్భంలో విద్యుత్ నియంత్రణా మండలి కార్యాలయంను విశాఖపట్నం లో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సుమారు ఐదు కోట్ల రూపాయలు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా దిన పత్రికలలో వార్తలు వస్తున్న నేపథ్యంలో మన సీమ ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు.
మరొక వైపు కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఉండాలన్న భావన కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ లాగానే, విద్యుత్ నియంత్రణ మండలి బోర్డు చైర్మన్ గారు భావిస్తున్నట్లు దినపత్రికలో వార్తలు వస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఇంతకూ విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తారా లేక రాయలసీమ వాసులను ఆశల పల్లకిలో ఊరేగిస్తూనే ఉంటారా ? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొన్ని శక్తులు రాయలసీమలో ఏ కార్యాలయం రాకుండా ఒకవైపు అడ్డుపడుతుంటే, మరొకవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు మహా నగరాలలో కాకుండా రాయలసీమ లాంటి వెనుక బడిన ప్రాంతాల్లో కొలువు చేయడానికి ఇష్టపడడం లేనట్లుగా కనిపిస్తోందని, వారి అభిప్రాయం మేరకే ప్రభుత్వాలు పని చేస్తున్నాయా ? లేక ప్రభుత్వమే రాయలసీమ సమాజాన్ని మభ్య పరచాలను కుంటున్నాదా ?, అందులో భాగంగానే రాయలసీమ ప్రజా నాయకులు మౌనంగా ఉంటూ రాయలసీమ సమాజాన్ని మభ్య పరుస్తున్నారా ? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ నియంత్రణ మండలి, KRMB లను కర్నూలులో ఏర్పాటు విషయంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవైపు పాలకపక్షం, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడబలుక్కుని రాయలసీమ పట్ల వివక్ష చూపుతుంటే దీనిని ప్రశ్నించలేని మన ప్రజా ప్రతినిధులు మౌనంగా వుండటాన్ని ప్రజలంతా గమనించాలనీ, రాయలసీమ సమాజం గురించి ఎవరూ ఆలోచించరని, ఇకనైనా రాయలసీమ ప్రజలు వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నమైనా చేయాలని, ఆ దిశగా రాయలసీమ సమాజము మేలుకొని చైతన్యవంతులు కావాలని దశరథరామిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.