*సిద్దేశ్వరం జల జాగరణ దీక్ష
*మే 31 సాయంత్రం 6 గంటల నుండి జూన్ 1, 2023 ఉదయం 10 గంటల వరకు
వేదిక : సంగమేశ్వరం, కొత్తపల్లి మండలం, నంద్యాల జిల్లా.
రాయలసీమ ఉద్యమ చరిత్రలో మే 31, 2016 న నిర్వహించిన సిద్దేశ్వరం అలుగు సాధన ఉద్యమం చారిత్రాత్మకమైంది. ఏ రాజకీయ పార్టీ అండా దండా లేకుండా 30 వేల మందికి పైగా రాయలసీమ ప్రజానీకం స్వచ్ఛందంగా, తమ వాహనాలతో, తమ ఆహారంతో, తమ నీటితో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సిద్దేశ్వరం అలుగు ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని, పాలకులు మరియు అనేక శక్తులు శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా రాయలసీమ ప్రజానీకం మొక్కవోని దీక్షతో అత్యంత శాంతియుతంగా ఉద్యమాన్ని విజయవంతం చేసారు. భారత దేశ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతంగా సాగిన ఈ సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని నింపింది.
పాలకుల నిర్లక్ష్యంతో, ప్రతిపక్ష పార్టీల నిరాదరణతో “వెనుకబడిన” మరింత నిక్కచ్చిగా చెప్పాలంటే “వెనుక పడవేయబడిన” రాయలసీమ సమాజం, సిద్దేశ్వరం ఉద్యమ స్ఫూర్తితో గొంతు సవరించుకుంటూ తన హక్కుల సాధన దిశగా గత ఏడు సంవత్సరాలుగా ముందుకు నడుస్తున్నది.
ఈ నేపథ్యంలో సిద్దేశ్వరం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన అనేక ఉద్యమాల, కార్యక్రమాల ఫలితంగా సీమ సమాజంలో కొంతైనా ముందడుగు వేయగలిగాం.
# వెలుగోడు, గోరుకల్లు, పులికనుమ, అవుకు, గండికోట రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు నిలపడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తయ్యాయి.
# హంద్రీనీవా క్రింద అనేక చెరువులలో నీరు నింపే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది
# రాయలసీమ ప్రాజెక్టులు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర మరియు సిద్దాపురం ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు సాధించడం జరిగింది.
# శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలాగా రూల్ కర్వ్ రూపొందించడంలో విజయం సాధించింది.
# గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, హంద్రీ నీవా కాలువ సామర్థ్యం పెంపు తదితర అంశాలపై పాలనా పరమైన అనుమతులను సాధించాం.
# శాసనసభ సాక్షిగా రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడికను ప్రభుత్వం గుర్తించింది.
అనేక పాలన అనుమతులను సాధించినా, వాటి అమలు దిశగా రాయలసీమ సమాజం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాయలసీమ సమాజం తమకు ఏమి కావాలో స్పష్టంగా అడిగే దిశగా ఎదగడానికి సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన స్ఫూర్తితో మరొక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం మరింత ఉంది.
అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధించడంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలది అత్యంత కీలకమైన పాత్ర అని మనందరికి తెలుసు. కానీ ఎందుకో ” ఏ భావజాలానికి లోనయ్యో ” , ” ఏ శక్తులకు వశమయ్యో ” రాజకీయ పార్టీలన్నీ రాయలసీమ అంశాలను తమ అజెండాగా చేర్చుకోవడానికి వెనకంజ వేస్తున్నాయి. ఈ దశలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన అంశాలను కూడా రాజకీయ పార్టీలు తమ అజెండాలో చేర్చుకునేలాగా ఒత్తిడి పెంచే కార్యక్రమాలతో యావత్తు రాయలసీమ సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తూనే మనకు స్ఫూర్తినిచ్చిన సిద్దేశ్వరం ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుందాం. రాజకీయ పార్టీలన్ని సహకరించేలాగా ఒత్తిడి పెంచుదాం. రాయలసీమ అభివృద్ధికి బాటలు వేద్దాం.
సిద్దేశ్వరం జల జాగరణ దీక్షలో రాయలసీమ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వేలాదిగా పాల్గొని ఏడవ వార్షికోత్సవంను విజయవంతం చెయ్య వలసిందిగా విజ్ఞప్తి.
# సిద్దేశ్వరం అలుగు సాధన
# సీమ సాగునీటి స్థిరీకరణ (చట్టబద్ధ హక్కులున్న కే సి కెనాల్, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు, ఎస్ ఆర్ బి సి, బి టి పి, జి డి పి ప్రాజెక్టులకు సక్రమంగా నీరు లభించడానికి చేపట్టాల్సిన రిజర్వాయర్లు, కాలువలు తదితర నిర్మాణాలు) ప్రాజక్టులు
# రాష్ట్ర విభజన చట్టంలో సాగునీటి ప్రాజెక్టులకు సాధించిన హక్కుల అమలు, నిర్మాణాలు పూర్తి
# రాయలసీమలో చెరువుల అభివృద్ధి
# కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు
# పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లో సమాన అవకాశాలతో రాయలసీమ సమాజ సమగ్రాభివృద్ది సాధన
తదితర అంశాల సాదన కోసం మే 31 సాయంత్రం 6 గంటల నుండి జూన్ 1, 2023 ఉదయం 10 గంటల వరకు సంగమేశ్వరం, కొత్తపల్లి మండలం, నంద్యాల జిల్లాలో చేస్తున్న “సిద్దేశ్వరం జల జాగరణ దీక్ష”లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
*రాయలసీమ సాగునీటి సాధన సమితి
(రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థ)
25/510బి, శ్రీనివాస నగర్,
నంద్యాల – 518 501
94402 90524, 98498 44776, 94934 58940
f; Rayalseema.jac
rjac1913@gmail.com