మే 31 న సిద్ధేశ్వరం పై భారీ కార్యక్రమం

*రాయలసీమలో అన్ని రంగాల అభివృద్ధికి రాయలసీమ సాగునీటి సాధన సమితిని ఇన్స్టిట్యూట్ గా అభివృద్ధి

*ప్రజల విశ్వసనీయత, ఆదరణ, అభిమానాలే రాయలసీమ సాగునీటి సాధన సమితికి కొండంత అండ

నంద్యాల:

ప్రజల విశ్వసనీయత, నమ్మకమే రాయలసీమ సాగునీటి సాధన సమితికి బలమైన శక్తి అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితి పదకొండవ వార్షికోత్సవం నంద్యాలలో ఘనంగా జరిగింది.

స్థానిక త్రినేత్ర గెస్ట్ లైన్ నందలి శ్రీ పప్పూరి రామాచర్యుల ప్రాంగణంలో ఉపాద్యక్షులు వై.యన్.రెడ్డి అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సదస్సుకు రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…

2012 వ సంవత్సరంలో ఆవిర్భావమైన రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ సహజ వనరులు, హక్కులు, తదితర అంశాలపై సంపూర్ణ సమాచారం శోధించి, ఆ విషయాలపైన రాయలసీమ ప్రజలకు పలు రూపాల్లో, ప్రధానంగా ప్రత్యక్ష సమావేశాలలో, అవగాహన కల్పించి, వారిని చైతన్య దిశగా అడుగులు వేయించడంలో విజయవంతం అయిందని సగర్వంగా ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు.

చైతన్యవంతమైన రాయలసీమ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన గావించి, రాయలసీమకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సభ్యసమాజం ముందుంచడంలో విజయవంతమయ్యామని ఆయన అన్నారు.

సిద్దేశ్వరం అలుగు స్థాపన కార్యక్రమం రాయలసీమ లో మరిన్ని ఉద్యమాలకు బీజం పోసిందని, నిస్తేజంగా ఉన్న రాయలసీమ సమాజంలో చైతన్య స్ఫూర్తిని రగిల్చిందని ఆయన అన్నారు.

సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన స్ఫూర్తితో సాగునీటి సాధన సమితి రాయలసీమ చట్టబద్ద నీటి హక్కులకై ముందుకు సాగుతూ “తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలిగొండ, ముచ్చుమర్రి ఎత్తిపోతల, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలకు” హక్కులు సాధించడమే గాక, శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల కనీస నీటిమట్టంకై “రూల్ కర్వ్” విధానాన్ని సాధించామని ఆయన తెలిపారు.

రాయలసీమ ప్రాజెక్టుల రిజర్వాయర్లలో పూర్తిస్థాయి నీరు నిలువ ఉంచడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి చేయడానికి పాలకులపై గత దశాబ్దకాలంగా ఒత్తిడి పెంచి విజయం సాధించామని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ *పైన వద్దు…క్రింద ముద్దు..* అంటూ మద్యన వున్న రాయలసీమ ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదని ఆయన విమర్శించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత పాలకులు, ఇప్పటి పాలకులు శాసనసభ సాక్షిగా ప్రకటించిన హామీలు మాటల వరకే పరిమితమయ్యారే తప్ప రాయలసీమ పట్ల ఏనాడు చిత్తశుద్దిని చూపలేదని ఆయన విమర్శించారు.

ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితిని రాయలసీమలో అన్ని రంగాల అభివృద్ధికి కీలకమైన ఇన్స్టిట్యూట్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

వచ్చే మే 31 న సిద్దేశ్వర అలుగు శంఖుస్థాపన వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో భారీగా నిర్వహించనున్నామని దీనిపైన త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

రాయలసీమ సాగునీటి సాధన సమితిపై రాయలసీమ ప్రజలు ఇప్పటి వరకు చూపించిన ఆదరణ, అభిమానం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు అండగా నిలబడాలని దశరథరామిరెడ్డి ప్రజలను కోరారు.

సదస్సు ప్రారంభం ముందు రాయలసీమ సాగునీటి సాధన సమితి 2012 వ సంవర్సరము నుండి ఇప్పటి వరకు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉమ్మడి చిత్తూరు ప్రతినిధులు మాగంటి గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాము, కడప జిల్లా ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, గుర్రప్ప, వెంకటసుబ్బయ్య, ఏరువ రామచంద్రారెడ్డి, ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, M.C.కొండారెడ్డి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, న్యాయవాది,సామాజిక కార్యకర్త రామకృష్ణారెడ్డి, మరియు వివిధ మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *