A Story of a ’Bottle Shock’
––అమరయ్య ఆకుల
మెతుకు విలువ తెలిసినోడికే బతుకు విలువ తెలిసినట్టు వైన్ తాగినోడికే దాని విలువ, వయసు తెలుస్తుందట. అందుకేనేమో ఒమర్ ఖయ్యాం మొదలు హరివంశ రాయ్ వరకు మహామహులెందరో ఈ మదిరపై మనసు పారేసుకున్నారు. పానశాలలు, మధుశాలలు, రుబాయత్లు, గజళ్లు, కవాలీల వంటివెన్నో అల్లారు. ’ముసలోడి మరణం’ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే అయితే .. తన జీవితంలో ఎక్కువ వైన్ తాగలేకపోయానే అని తెగ బాధ పడిపోయాడు. (మై ఓన్లీ రిగ్రెట్ ఇన్ మై లేఫ్ ఈజ్ దట్ ఐ డిడ్ నాట్ డ్రింక్ మోర్ వైన్).
ఇప్పుడీ సారా వేదాంతం ఎందనేగా మీ డౌట్? నేనీ మధ్య ప్రపంచ ప్రఖ్యాత వైన్ తయారీ కేంద్రం నాపా వ్యాలీ వెళ్లా. రంగు, రుచి తప్ప దానికో లెక్కుందని అదో పెద్ద శాస్త్రమని తెలియదు. రకరకాల వైన్లు, వాటి టేస్టర్లు, కట్టర్లు, టీచర్లు, మాస్టర్లు, పేస్టర్లు, బాట్లర్లుంటారని ఈ వ్యాలీ చూసిన తర్వాతే తెలిసింది. మనుషులు దాక్షరసం లాంటి వాళ్లంటే ఇదా అని అప్పుడు జ్ఞానోదయమైంది. సమాజంపై వైన్ చూపినంత ప్రభావం మరే మద్యమూ చూపలేదట.
నాపా వ్యాలీకి స్వాగతం…
స్కాచ్కి స్కాట్లాండ్, విస్కీకి హైలాండ్, బ్రాందీకి ఐర్లాండ్, వోడ్కాకి రష్యా ఎంత ఫేమస్సో ఫ్రాన్స్ వైన్‌కి అంత పేరుంది. ఫ్రాన్స్ తర్వాతి ప్లేస్ నాపాదే. ప్రపంచ ప్రధాన వైన్ తయారీ కేంద్రాలలో ఒకటి. చూడచక్కని లోయ. ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు. తాక్కుండానే మత్తెక్కించే మంచి వాతావరణం. వేలాది ఎకరాల దాక్ష తోటలు. 165 ఏళ్ల చరిత్ర, 450కి పైగా వైన్ తయారీ కేంద్రాలు ఈ వ్యాలీ సొంతం.
ఇప్పుడిదో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. ఏటా 45 లక్షల మంది దాకా రాకపోకలు, కోట్లాది డాలర్ల వ్యాపారం. మన హ్యాపీ లెవెల్స్ ఎలా ఉన్నా బోలెడన్ని అనుభవాల్ని, అనుభూతుల్ని మూటగట్టుకు రావొచ్చు.
మేము చూసిన ’ప్రేమకోట’ ఇదే…
నాపా వ్యాలీ ఓ వైన్ కంట్రీ.
అమెరికన్ విటికల్చరల్ (ద్రాక్ష సాగు) ఏరియా. కాలిఫోర్నియాకు ఉత్తరాన ఉంది. ఆ రాష్ట్ర ఒకప్పటి రాజ«ధాని శాన్ ఫ్రాన్సిస్కోకు 50, ప్రస్తుత రాజధాని శాక్రమెంటోకు 60 మైళ్ల దూరం. మేము కార్లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలు దేరాం. చక్కటి రోడ్డు. సిటీ దాటంగానే పల్లె సోయగం. మనలాగా కాకుండా అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు విసిరేసినట్టుంటాయి. పాతిక మైళ్ల దూరం నుంచే నాపా వ్యాలీకి వెళ్లే బోర్డులు, మ్యాపులున్నాయి. రోడ్డు కిరువైపులా కంచెలున్న విశాలమైన ద్రాక్షతోటల పందిళ్లు, వైన్ నిల్వ చేసే చెక్క పీపాల తయారీ ఫ్యాక్టరీలు, సీసాలు, మూతలు, వాటిని తీసే క్లార్క్‌లు, వడపోత జల్లెళ్ల తయారీ సెంటర్లు కన్పిస్తాయి. ఇవి చూట్టంతోనే మనం నాపా వ్యాలీకి దగ్గరవుతున్నామని తెలుసుద్ది. డిస్టిలరీలకి ముందే నాపా వ్యాలీ డౌన్ టౌన్. అక్కడి నుంచి వైన్ రైలూ ఉంది. రెండు, మూడు గంటల్లో ఈ రైలు నాపా వ్యాలీని చుట్టి వస్తుంది. రైల్లోనే వైన్‌ను టేస్ట్ చేయవచ్చు. డబ్బులుంటే కొనుక్కుని తాగవచ్చు. బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఖరీదైన వ్యవహరమే. ఒక్కో మనిషికి టిక్కెట్టే 165 డాలర్లు. ఇది మనవల్ల కాదులెమ్మనుకున్నాం.
ఎంట్రన్స్ టిక్కెట్ 50 డాలర్లు..
4045, నార్త్ హెలీనా హైవే కాలిస్టోంగా, నాపా వ్యాలీ.. ఈ అడ్రసులోనే క్యాజిల్ డి అమోరోస (ప్రేమాభిమానాల కోట) డిస్టిలరీ. అక్కడికి వెళ్లాం. అమెరికాలో ఏదీ ఉచితం కాదు. ముందే బుక్ చేసుకున్నోళ్లు నేరుగా లోనికి వెళుతున్నారు. అలా చేయని వాళ్లు ఖాళీ ఉందా అని అడిగి కౌంటర్లో టిక్కెట్లు కొనాలి. మనంతట మనమే చూడదల్చుకుంటే ఒక్కొక్కరికి 50 డాలర్లు. టూరిస్ట్ గైడ్ కావాలనుకుంటే మరో పది డాలర్లు అదనం. ఎంట్రన్స్ టిక్కెట్లు కొన్న తర్వాత ఓ పావుగంటకి వాళ్ల మనిషి వచ్చి లోనికి తీసుకెళ్లారు. ఈ డిస్టిలరీని ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. హైదరాబాద్‌లోని అమృత క్యాజిల్ మాదిరి ఇటాలియన్ కోటలా ఉంది. 30 ఏళ్లు శ్రమపడి కట్టారు. ద్వి క్వెస్ట్ అనే ఇంగ్లీషు సినిమా సహా నాలుగైదు తీశారిక్కడ. భూమి కింద నాలుగు, పైన నాలుగంతస్తులు. 171 ఎకరాల కైవారం, 30 ఎకరాల దాక్షతోటలు. వీళ్లు తయారు చేసే వైన్లను వ్యాపారులకి అమ్మరు. కోటకొచ్చే వినియోగదారులకే అమ్ముతారు. మేము వెళ్లింది ఆకురాలు కాలం. దాక్షతోటల్లేవు. పందిళ్లున్నాయి. మోళ్లు కనిపిస్తున్నాయి. వైన్ యార్డు మొదట్లో గొలుసులతో కట్టి ఉంచిన ఓ పెద్ద వైన్ సీసా స్వాగతం పలుకుతుంది. 3 ఎకరాల విస్తీర్ణమంత గదులు, శత్రు దుర్భేద్యమైన ఐదు కోట గుమ్మాలు, ఇటలీ నుంచి తెప్పించిన తలుపులు, వైన్ తయారీ, నిల్వ కోసమే 95 గదులు. సెల్ఫ్ గైడెడ్ టూర్ ప్రకారం కిందున్న నాలుగు ఫోర్లు చూసి పైకి వచ్చాం. కోట మధ్యలో విశాలమైన మైదానం ఉంది.
వైన్ ఎలా తయారు చేస్తారంటే..
వేల సంవత్సరాల చరిత్రున్న ద్రాక్ష సారా తయారీ ఓ కళే కాదు శాస్త్రం కూడా. ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం మటాష్. మేమోచ్చిన మైదానికి ఆనుకుని దాక్ష కాయల్ని నలగ్గొట్టే గది ఉంది. దీనికి ఓవైపు వైన్ ఎడ్యుకేషన్ గది, దాని పక్కనే వైన్ తయారీ వీడియో రూం. మరోవైపు రెడ్, వైట్ వైన్ నిల్వ చేసే గదులు, పులియబెట్టే గది, వైన్ రుచి చూసే లాబీ ఉంది. నా చూపంతా ద్రాక్ష సారా తయారీపైన్నే ఉంది.
ఒక్కమాటలో చెప్పాలంటే వైన్ తయారీ దశలు ఐదు. అవి– కాయకోత, కాయల్ని నలగ్గొట్టి రసం తీయడం, పులియబెట్టడం, ఏది ఏ రకమో వేరు చేయడం, పీపాల్లో నిల్వ, నిల్వ చేసే కాలాన్ని బట్టి సీసాల్లో నింపడం. వీటిల్లో ప్రతి దశా ఇంపార్టెంటే. అందుకే అడుగడుగునా నిపుణులుంటారు. మనిషి వేలు పెట్టకుండా కంప్యూటర్లతోనే సాగిపోతోంది. తోటల్లో కాయలు పక్వానికి వచ్చాయని నిపుణుడు తేల్చిన తర్వాత ఏ గెలకాగెలను కట్టర్లతో తెంపి బుట్టల్లో నింపి ట్రాక్టర్ ట్రాలీలో పోస్తారు. ఆ ట్రాలీ గెలల్ని తెచ్చి క్రష్షింగ్ మెషిన్ జల్లెడపైపై పోస్తుంది. ఆకులు, తొడాలు లేకుండా జల్లెడ పట్టిన తర్వాత నేరుగా క్రషింగ్ మెషిన్‌లోకి వెళతాయి. (గతంలోనైతే కాళ్లతోనే తొక్కేవారు). ఇందులో నుంచి వచ్చే రసం ఏ రకం వైన్‌కి ఉపయోగించాలో నిపుణులు చెబుతారు. గింజలు, తొక్కలుండే రసాన్ని రెడ్ వైన్‌కి, అవి లేని వాటిని తెల్ల వైన్‌కి ఉపయోగిస్తారు. అలా వేరు చేసిన తర్వాత రెండింటినీ వేర్వేరుగా పులియబెట్టే (ఫర్మెంటేషన్) పెద్ద స్టీల్ డ్రమ్ములోకి పంపుతారు. వైన్ తయారీలో అతి ముఖ్యమైందిదే. రసంలోని తీపి, పులుపంతా సారాగా మారేంత వరకు ఇక్కడ పులియబెడతారు. కొందరు ఈస్ట్‌ను (పెరుగును నిల్వ ఉంచితే ఓ రకమైన బూజు వస్తుందే అలాంటిది)ను కూడా కలుపుతారు. దీనంతటికీ వారం నుంచి నెల రోజులైనా పడుతుంది. తీపి వైన్కైతే పులియబెట్టే ప్రక్రియను మధ్యలోనే ఆపు చేస్తారు. ఇకనిప్పుడు మరోసారి వడకడతారు. ఇందు కోసం ఫిల్టర్స్‌ను వాడతారు. నలక కూడా లేకుండా వైన్ వస్తుంది. ఇంకా బాగా శుద్ధి చేయాలనుకునే వారు ఓ రకమైన మట్టిని మూటగట్టి బ్యారల్లో వేస్తారు. ఇంకేమైనా చిన్నా చితకా నలకలున్నా వాటిని అది పీల్చి బ్యారల్ అడుక్కి చేరుస్తుందట. ఇప్పుడు అసలు సిసలైన వైన్ బయటకు వస్తుంది. దాన్ని ఓక్ చెట్టు బెరడుతో తయారు చేసిన బ్యారల్స్లోనో, సీసాల్లోనో నింపి నిల్వ చేస్తారు. నిల్వ చేసే టైమ్‌ను బట్టి ధరను నిర్ణయిస్తారు. అన్నట్టు వైన్ సీసాలకు మూతలు పెట్టడం, తీయడం కూడా ఓ పెద్ద ఆర్టే.
టన్ను కాయకి 600 సీసాల వైన్
వెన్యార్డుల్లో ఎకరానికి 2,3 టన్నుల మధ్య దిగుబడి ఉంటుంది. ఒక ఎకరం పంటకు 1,440 సీసాల వరకు వైన్ వస్తుంది. సగటున టన్ను ద్రాక్షకాయలకు 600 సీసాల వరకు వైన్ వస్తుందని అంచనా. ఒక సీసా వైన్‌కి 1.75 కిలోల ద్రాక్ష కావాల్సి వస్తుందట.వైన్ కోసం పండించే ద్రాక్ష తినడానికి పనికి రాదు. ∙
ఇక నాపా వ్యాలీ చరిత్ర ఏంటంటే…
ఇది 1858ల నాటి మాట. ఇక్కడి భూమి ద్రాక్ష తోటల పెంపకానికి అనువైందని మొదట గుర్తించిన రైతు జాన్ ప్యాట్చెట్ అయినా తొలిసారి తోట వేసింది మాత్రం జార్జ్ సి. యౌంట్ అనే భూస్వామి. ఆయన తన మనమరాలికి వేయి ఎకరాల భూమిని కానుకగా ఇస్తే ఆమెను చేసుకున్న థామస్ రూధర్పోర్డు ఏకంగా వైన్ యార్డ్‌ను పెట్టారు. ఆ తర్వాత ఎందరెందరో వచ్చారు. ఆనాటి వైన్ తయారీ కేంద్రాలైన– బ్యూలీయు, బెరింగర్, చార్లెస్ క్రుగ్, చాటేయు మోంటెలీనా, ఫార్ నియెంటె, మయకామాస్, మార్కమ్ వైన్యార్డ్స్, రూథర్ పోర్డ్, ష్రామ్స్బర్గ్ వైన్యార్డ్ వంటివి ఇప్పటికీ ఉన్నాయి. 1889లోనే ఇక్కడి వైన్ పారిస్ వరల్డ్ ఫెయిర్‌లో బంగారు పతకాన్ని గెలిచింది.
ఫైలోక్సెరా తెగులుతో కుదేలు
అయితే 19వ శతాబ్దం చివర్లో 20వ శతాబ్దం ఆరంభంలో నాపాలో దాక్షసాగు కుదేలైంది. ఫైలోక్సెరా అనే కాండం తొలిచే తెగులు ద్రాక్ష తోటల్ని సర్వ నాశనం చేసింది. మరోపక్క మద్య నిషేధం, గ్రేట్ డిప్రెషన్ వంటివి వైన్ పరిశ్రమను కకావికలు చేశాయి. తిరిగి కోలుకోవడానికి 50 ఏళ్లకుపైన్నే పట్టింది. 1976 నాటి పారిస్ వైన్ టేస్టింగ్ ఫలితాలతో నాపా వైన్ నసీబ్ మారిపోయింది. దీని ఆధారంగా వచ్చిందే ’బాటిల్ షాక్’ హాలీవుడ్ సినిమా. 2008లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసుల్ని బద్ధలు కొట్టింది. వ్యాపారం మళ్లీ మూడు పువ్వులు ఆరు కాయలైంది. మద్య నిషేధకాలంలో ద్రాక్ష రైతుల పక్షాన నిలిచి రికార్డుల్లోకి ఎక్కిన వారు క్రిస్టియన్ తిమోతీ బ్రదర్సైతే ఆధునిక కాలంలో వైన్ తయారీకి నాంది పలికిన వాడు ఆండ్రే ట్చెలిస్టె్చఫ్గా చెప్తారు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం తరువాత నాపా వైన్ పరిశ్రమకు ఎదురులేకుండా పోయింది.
కాబెర్నెట్ సావిగ్నాన్ రకం నాపా ప్రత్యేకత..
వైన్ తయారీ గొప్ప కాదట. దాన్ని నిల్వ చేసే చెక్క డ్రమ్ములు, కాలాన్ని బట్టి విలువ పెరుగుతుందట. ఏ రకం చెక్కను ఎంత కాల్చాలో అంత కాల్చి వాటితో డ్రమ్ముల్ని (బ్యారల్స్)ను తయారు చేసి వాటిల్లో రసాన్ని నిల్వబెడతారు. ఈ ప్రాంతంలో పండే ద్రాక్ష రకం కాబెర్నెట్ సావిగ్నాన్. గతంలో ఫ్రాన్స్‌కి పరిమితమైన ఈ కాయ ఇప్పుడు నాపాలో సాగవుతుంది. ఇదే ఇక్కడి ప్రత్యేకతట. ద్రాక్షతోటల్లో షికారు చేస్తూ వైన్ తయారీదార్లతో మాట్లాడుతుంటే మనకు నిజంగానే కిక్క్ ఎక్కుతుంది. ఎంత శ్రద్ధగా వైన్ ముచ్చట్లు చెబుతారో! ఏ వైన్‌ను ఏ గ్లాస్లో ఎలా తాగాలో, ఏమి నంజుకోవాలో చెబుతారు. చాక్లెట్‌తో చెర్రీతో వైన్ తాగితే బాగుంటుందట.
ఇక అంతిమ ఘట్టం– వైన్ టేస్టింగ్!
ఈ కోటనంతా గాలించే సరికి మధ్యాహ్నం మూడు దాటింది. సన్నటి తుంపర పడి ఆగింది. ఇక అంతిమ ఘట్టానికి చేరాం. అదే.. వైన్ రుచిచూడడం. పైగా కొనుక్కునేది కాదు. టిక్కెట్లో భాగమే. (18 ఏళ్ల లోపువాళ్లకివ్వరు). టేబుల్‌పై కూర్చోగానే తలా ఒక పెన్నూ పేపరు ఇచ్చి వాటిల్లో ఏవైనా ఐదింటికి టిక్కు పెట్టమన్నారు. ఈ వైనరీలో వైట్, రోజ్, రెడ్, స్వీట్ వైన్లు, మత్తు లేని దాక్ష రసం తయారవుతుంది. వీటిల్లో ఐదింటిని రుచి చూడవచ్చు. ఒక్కో రకానికి ఓ పెద్ద ఉగ్గిన్నడంత ఇస్తారు. అది చాలనివాళ్లు అక్కడే కొనుక్కుని తాగొచ్చు. మేమైతే వాళ్లిచ్చిందే రుచి చూసి ఓ సెల్ఫీ దిగి… దువ్వూరి వారి పానశాలలోని..
పొలములపూలగాలి వలపుల్ కలబోయుచువీచె; గాజు గి
న్నెల జిఱుచేదుపానకమునింపుము; నశ్వరమైన ఈస్థితిం, దెలియుమ యీక్షణం బెరవుదెచ్చిన సొమ్మని; జాఱబుచ్చినంగలికి, మఱెప్పుడిట్టితఱి క్రమ్మఱరాదు; నిజమ్ము; నమ్ముమా!
…అనుకుంటూ మధురాసవంబు దమినానగ ఇంటిముఖం పట్టాం.
(అమరయ్య ఆకుల,
జర్నలిస్టు, మొబైల్: 9347921291)