అన్నమయ్య సామాజిక కవి : ప్రొ. సర్వోత్తమరావు

 

తిరుపతి, 2023 మార్చి 21

అన్నమయ్య సాహిత్యం విలక్షణమైందని, వారిని సామాజిక కవిగా, ఆలయకవిగా, అనుభూతి కవిగా పేర్కొనవచ్చని ఎస్వీయూ విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు అన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం ముగిశాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆచార్య సర్వోత్తమరావు అధ్యక్షత వహించారు . ఆయన మాట్లాడుతూ సమాజ వికాసానికి అన్నమయ్య కీర్తనలు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. తెలుగు కవులు ఎందరో అన్నమయ్య సాహిత్యం నుంచి స్ఫూర్తి పొందారన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా సాహిత్యాల్లో తగిన పరిజ్ఞానం కలిగి వైష్ణవ సంప్రదాయాలు తెలిస్తే గాని అన్నమయ్య సాహిత్యం అవగతం కాదన్నారు.

ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు శ్రీ దామోదర్ నాయుడు అన్నమయ్య వ్యక్తిత్వంపై ప్రసంగించారు. బాల్యం నుంచి శ్రీవారి పట్ల భక్తిని వెల్లడించిన భక్తుడు అన్నమయ్య అన్నారు. దైవానికి తప్ప మరెవ్వరికీ తలవంచని ధైర్యం అన్నమయ్య సొంతమని, అన్నమయ్య వ్యక్తిత్వంలోని వివిధ ఉత్తమ కోణాలను వివరించారు.

రాజమండ్రికి చెందిన ఆచార్య అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు అన్నమయ్య – ఆధ్యాత్మికత అనే అంశంపై ప్రసంగించారు . అన్నమాచార్యులు మోక్ష సాధన సామగ్రిలో భక్తిని ఉత్తమోత్తమంగా భావించారని తెలిపారు. భక్తిని, శరణాగతిని ఆలంబనగా చేసుకుని ఆధ్యాత్మికంగా పురోగమించడమే కాకుండా, తమ ఆధ్యాత్మిక కీర్తనలతో లోకానికి తరుణోపాయం చాటి చెప్పారని అన్నారు. నవవిధ భక్తిమార్గాలు, గీతాచార్యుని ఉపదేశాలను ప్రమాణంగా చేసుకుని ఆధ్యాత్మిక యానం సాగించారని తెలిపారు.

సాయంత్రం 6 గంటల నుండి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ రఘునాథ్ బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి ఆర్.బుల్లెమ్మ గాత్ర సంగీతం నిర్వహించారు.

మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుండి రాత్రి 7 విశాఖకు చెందిన శ్రీమతి పంతుల రమ బృందం గాత్ర సంగీతం నిర్వహించారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు అనంతపురానికి చెందిన శ్రీ పట్నం శివప్రసాద్ బృందం కూచిపూడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా. విభీష‌ణ శ‌ర్మ‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *