ట్రంప్‌ కొంపకు ముర్డోక్‌ తిప్పలు?

పరువు నష్టం కేసులో మీడియా మొఘల్‌ వాంగ్మూలం

 

––అమరయ్య ఆకుల––

ఒకరిది రాజకీయం, మరోకరిది మీడియా సామ్రాజ్యం. ఉప్పు నిప్పు కలిస్తే ఏమవుతుందో తెలుసుగా.. ప్రజా తీర్పును పరిహాసం చేశారు. పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. చిత్రంగా ఇప్పుడా ఇద్దరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వాళ్లే డోనాల్డ్‌ ట్రంప్‌. రాఫర్ట్‌ ముర్డోక్‌. ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇంకొకరు మీడియా మొఘల్‌. ’మితిమీరిన అహంభావంలో కురుకుపోయిన ఖైదీ ట్రంప్‌’ అని ముర్డోక్‌ మీడియా అభివర్ణిస్తే ’పరువు నష్టం కేసుకే పారిపోతారా? అసత్యానికే వంతపాడతారా?’ అని ట్రంప్‌ ముఠా ఎదురుదాడికి దిగింది. ఈ మొత్తం వివాదానికి ముర్డోక్‌ ఇచ్చిన వాంగ్మూలం కారణమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న ట్రంప్‌ అవకాశాల్ని ఈ వాంగ్మూలం దెబ్బతీసేలా ఉంది.

ఈ కేసు కథా కమామిషు ఏమిటంటే?
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్‌ పోటీ పడ్డారు. బైడెన్‌ గెలిచినా ట్రంప్‌ ఓటమిని అంగీకరించలేదు. ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందని, ఎన్నికలకు కంప్యూటర్లు, ఓట్ల లెక్కింపు పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసిన డొమినీయన్‌ కంపెనీ అవకతవకలతో ట్రంప్‌ ఓడారని ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ ఊదరగొట్టింది.

ముర్డోక్

ఫాక్స్‌ న్యూస్‌ ఏమని ప్రసారం చేసిందంటే..
1. డొమినీయన్‌ కంపెనీ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లను తప్పుడు పద్ధతిన రిగ్గింగ్‌ చేసింది.
2.డొమినీయన్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్, అల్గరిథమ్స్‌ ఓట్ల లెక్కింపును తారుమారు చేశాయి.
3. వెనిజులా ఎన్నికల్లో డొమినీయన్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న సంస్థ ఆదేశ ’నియంత’ హూగో ఛావెజ్‌కి అనుకూలంగా పని చేసి ఓట్లను రిగ్గింగ్‌ చేసి గెలిపించింది.
4. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డొమినీయన్‌ కంపెనీ యంత్రాలు వాడేలా అధికారులకు ముడుపులు ముట్టజెప్పింది.
వీటన్నింటినీ డొమినియన్‌ కంపెనీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలతో 2021 జనవరి నుంచి ఇప్పటికి 16 వందల కోట్ల డాలర్ల మేర కొనుగోళ్లు పడిపోయాయని, ఈ మొత్తాన్ని ఇప్పించడంతో పాటు తమ పరువు ప్రతిష్టల్ని కాపాడాలని సుప్రీంకోర్టులో దావా వేసింది. ఇలా వేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు రెండు సార్లు వేసినా సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు కొట్టేసింది. ఈసారి పక్కా ఆధారాలు, సమగ్ర సమాచారం, మెయిళ్లు, ఫాక్స్‌లు, వీడియోలు, రాతప్రతులతో 182 పేజీల దావా వేసింది. ముర్డోక్‌ అధిపతిగా ఉన్న ఫాక్స్‌ న్యూస్‌ను, ఫాక్స్‌ న్యూస్‌ కార్పొరేషన్‌ను, మరికొందరు హోస్టుల్ని ఇందులో ప్రతివాదుల్ని చేసింది.

రిపోర్టర్‌ చెప్పినా వినకుండా…

రిగ్గింగ్, ఎలక్షన్‌ ఫ్రాడ్‌ జరిగిందనే దానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని ఫాక్స్‌ న్యూస్‌ చీఫ్‌ పొలిటికల్‌ రిపోర్టర్‌ నెత్తీనోరుకొట్టుకుని చెబుతున్నా ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్‌ యాజమాన్యం పట్టించుకోలేదని డొమినీయన్‌ చెబుతోంది. ఉద్దేశపూర్వకంగా తమ సంస్థ పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలన్నదే లక్ష్యంగా ఫాక్స్‌ న్యూస్‌ ఈ పని చేసినట్టు ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఈ దావా వేసింది. ఈ కేసులో ముర్డోక్‌ వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడీ వాంగ్మూల పత్రాలు బయటకు వచ్చాయి. ఈ కేసు జ్యూరీకి వెళ్లనుంది. వచ్చే ఏప్రిల్‌ మధ్యలో విచారణ జరగనుంది.

ముర్డోక్‌ ఏమి చెప్పారంటే…

’మాకు ఈ తరహా వ్యాజ్యాలు కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి మావాళ్లు తప్పులో కాలేసినట్టున్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి దొంగిలించారనే తప్పుడు ప్రచారానికి ఫాక్స్‌ న్యూస్‌ హోస్ట్‌లు, న్యూస్‌ ప్రజెంటర్లు ఊ కొట్టినట్టు కనిపిస్తోంది. నాకీ విషయం తెలిసినా ఆపలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు’ అని ఇటీవల బయటకు వచ్చిన వాంగ్మూలంలో ఉంది. దీంతో ఈ వ్యవహారంలో తమ బాధ్యతేమీ లేదని ఫాక్స్‌ న్యూస్‌ కార్పొరేషన్‌ చేస్తున్న వాదన విచారణకు నిలబడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ కార్పొరేషన్‌కూ ఛైర్మన్‌ ముర్డోకే. తన మీడియా సంస్థల వ్యవహారశైలిపై సమాధానం కోసం ముర్డోక్‌ను ముందు పిలిచారు. ‘మనం ముందు దాన్ని (ట్రంప్‌ ప్రచారాన్ని) ఖండించాలి. అదే సమయంలో మనం బలంగా ఉండాలి. అలా ఉండడానికే ఇష్టపడతాను‘ అని ముర్డోక్‌ చెప్పినట్టు ’న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం. ఈ పత్రిక కూడా ఆయనదే. ఓట్లను దొంగిలించారని రుజువు చేయడానికి ట్రంప్‌ పన్నిన ’పథకం’లో అందరికీ కీడు చేసే విషయాలే ఎక్కువున్నాయని ముర్డోక్‌ చెప్పినట్టు అమెరికన్‌ మీడియా కథనం. సిడ్నీ పావెల్, రూడీ గియుూనీ వంటి ట్రంప్‌ లాయర్లను ఫాక్స్‌ న్యూస్‌లో చర్చలకు పిలవొద్దని నెట్‌వర్క్‌ని తాను ఆదేశించవచునని అంగీకరిస్తూనే ‘నేను చేయగలను. కానీ నేను చేయలేదు’ అని ముర్డోక్‌ తన వాంగ్మూలంలో చెప్పాడు.

ఎవరీ ముర్డోక్, ఏమా కథ?

రూపెర్ట్‌ ముర్డోక్‌ ఓ మీడియా మొఘల్‌. ఫాక్స్‌ న్యూస్‌ ఛానల్, ఫాక్స్‌ న్యూస్‌ కార్పొరేషన్‌ సహా అనేక దేశాల్లోని మీడియా ఛానళ్లకు ఆయన యజమాని. మనదేశంలో ప్రసారమయ్యే స్టార్‌ ఛానళ్లూ ఆయన గడీలోవే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఇండియా సహా 56 దేశాల్లో వందలాది ఛానళ్లు, డజన్ల కొద్ది పత్రికలు, పదుల సంఖ్యలో మ్యాగజైన్లు ముర్డోక్‌ ఆధీనంలోనివే. పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో. బ్రిటన్‌ పౌరసత్వాన్ని కాదని అమెరికాలో స్థిరపడ్డారు. అసలు పేరు కీత్‌ రూపర్ట్‌ ముర్డోక్‌. 92 ఏళ్ల వయస్సు. 86 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి. నలుగురూ విడాకులు తీసుకున్నారు. ఆరుగురు పిల్లలు. ప్రతి సంతానానికీ ఏదోక మీడియా ఉంది. చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి కొరుకుడు పడని దేశాల్లో తప్ప మిగతా చోట్ల ఆయన మీడియాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలున్నాయి. అపార సంపద, పేరు ప్రతిష్టలతో పాటు కింగ్‌ మేకరన్న పేరుంది. ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఆయనకు ఎదురుండదని పేరు. కన్సర్వేటివ్‌ పాలిటిక్స్‌కు వెన్నుదన్ను. ఇంగ్లాండ్‌లో ఫోన్ల హ్యాకింగ్‌ కేసులో బ్రిటన్‌ పార్లమెంటు ముందు విచారణకు హాజరై క్షమాపణలు కోరిన పెద్ద మనిషి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెరపైకి వచ్చారు.

నిజంగానే ల్యాండ్‌ మార్క్‌ కేసా?

డొమినియన్‌ పరువు నష్టం దావాను ఓ ‘ల్యాండ్‌మార్క్‌ కేసు‘గా అభివర్ణిస్తున్నారు. హార్వర్డ్‌ న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌ ఇటీవల గార్డియన్‌ పత్రికతో మాట్లాడుతూ, ‘ప్రతివాది (ఫాక్స్‌ న్యూస్‌) తన వీక్షకుల సంఖ్యను, దాని ఆదాయాన్ని పెంచుకోవడానికి నకిలీ సమాచారాన్ని సృష్టించినట్టు రాతపూర్వకంగా అంగీకరించిన పెద్ద కేసిది. ఇంత సాక్ష్యాధారాలున్న కేసును నేనెప్పుడూ చూడలేదు‘ అన్నారు. డొమినీయన్‌ కంపెనీ లాయరైతే అమెరికాలో రాజకీయ ద్వేషాన్ని పెంపొందించడంలో ఫాక్స్‌ న్యూస్‌ అతి పెద్ద పాత్ర పోషించిందని విరుచుకుపడ్డారు. ’నేను ఎవర్నైనా సవాలు చేస్తాను, నేను చెప్పిన వ్యక్తినే ప్రెసిడెంట్‌గా నామినేట్‌ చేయమనే దానికంటే అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికే ఫాక్స్‌ న్యూస్‌ ఎక్కువ పని చేసిందని‘ ఆ లాయర్‌ వ్యాఖ్యానించారు.

ఫాక్స్‌ న్యూస్‌ వాదన ఇదీ!

డొమినియన్‌ వ్యాజ్యంలో ‘చట్టపరమైన అంశాలకన్నా ఇతరత్రా విషయాలే ఎక్కువగా ఉన్నాయని ఫాక్స్‌ న్యూస్‌ ప్రతినిధి వాదన. ‘జర్నలిస్టులను ప్రాథమిక రిపోర్టింగ్‌ నుంచి దూరం చేయడమే లక్ష్యంగా ఈ పరువు నష్టం కేసుంది. చట్టం ముందు ఇది నిలబడదు. న్యాయ మద్దతు లేని వైఖరిని ఆ కంపెనీ తీసుకుంది. అమెరికా సిట్టింగ్‌ ప్రెసిడెంట్‌ చేసిన ఆరోపణలను కవర్‌ చేయడానికి, వాటిపై వ్యాఖ్యానించడానికి వాళ్ల ముందస్తు అనుమతి తీసుకోవాలన్నట్టుగా వారి వాదన ఉంది. ఇది అమెరికా రాజ్యాంగ మొదటి సవరణ (పత్రికా స్వేచ్ఛ)ను ఘోరంగా ఉల్లంఘించడమే’నని వాదించారు. ఫాక్స్‌ న్యూస్‌ గతంలో చేసిన వాదనకు ఇప్పటికీ స్వరంలో తేడా వచ్చింది. డొమినియన్‌ కంపెనీ 2021 మార్చిలో, నవంబర్‌లో వేసిన రెండు దావాలలోనూ ఫాక్స్‌ న్యూస్, ఫాక్స్‌ న్యూస్‌ కార్పొరేషన్లు తమ కథనాలు రైటేనని వాదించాయి. ఫాక్స్‌ న్యూస్‌ కార్పొరేషన్‌తో ఫాక్స్‌ న్యూస్‌కి సంబంధం లేదని చెప్పాయి. అయితే ఈ రెండూ ముర్డోక్‌ ఆధ్వర్యంలోనే ఉండడంతో సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్ని ధృవీకరించకుండా ఆపడానికి అల్లర్లు, దేశ రాజధాని భవనంపై దాడికి ఒక రోజు ముందు అంటే 2020 జనవరి 5న నెట్‌వర్క్‌ కవరేజీ గురించి ఫాక్స్‌ న్యూస్‌ మీడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుజాన్‌ స్కాట్‌–మర్డోక్‌తో చర్చించినట్టు కోర్టుకు తెలిపారు. ’ట్రంప్‌ ఓటమిని ఒప్పుకోవాలి. బైడెన్‌ గెలిచినట్లు అంగీకరించాలి. పదే పదే చర్చలు పెట్టడం, వీక్షకులను విసిగించడం మంచిది కాదు‘ అని స్కాట్‌ చెప్పినట్టుగా బయటకు వచ్చింది. ఏమైనా, డొమినియన్, ఫాక్స్‌ న్యూస్‌ దావా ఏప్రిల్‌లో జ్యూరీ విచారణకు వెళ్లనుంది. ఇదే సమయంలో మరో వోటింగ్‌ టెక్‌ కంపెనీ– స్మార్ట్‌మాటిక్‌ కూడా ఫాక్స్‌పై దావా వేసింది.

ముర్డోక్‌ వాంగ్మూలంపై ట్రంప్‌ కస్సుబుస్సు

ముర్డోక్‌ వాంగ్మూలంపై మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఇంతెత్తున మండిపడ్డారు. ఈమేరకు తన ’ట్రూత్‌’ అనే సోషల్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల మోసాలపై నా వాదనలను మీడియా మొఘల్‌ ముర్డోక్‌ ఎలా తిరస్కరించగలరు? అవి తప్పుడవని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ‘2000 మ్యూల్స్‌’లో డ్రాప్‌ బాక్సుల్లో మిలియన్ల కొద్దీ ’స్టఫ్డ్‌ బ్యాలెట్‌లు’ ఉన్నాయని చూపినప్పుడు ఎన్నికల మోసం జరగలేదని రూపర్ట్‌ మర్డోక్‌ ఎలా చెప్పారని నిలదీశారు. (‘2000 మ్యూల్స్‌‘ అనేది టీవీ వ్యాఖ్యాత దినేష్‌ డిసౌజా చేసే షో. ఇదే పేరిట ఓ సినిమా కూడా తీశాడాయన. బ్యాలెట్‌ బాక్సుల అపహరణ, నకిలీ ఓట్లపై సినిమా అది). పనిలోపనిగా ట్రంప్‌ – ఎఫ్‌బీఐ, ఫేస్‌బుక్‌పైనా దాడి చేశారు. ఈ సంస్థలు చేసిన ఎన్నిక మోసం ముర్డోక్‌కి కనపడలేదా? అని రుసరుసలాడారు.

బ్రిటన్‌లో ఫోన్ల హ్యాకింగ్‌ కేసులోనూ…

న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌… బ్రిటన్‌లో ఒకానొక సమయంలో మర్డోక్‌ సామ్రాజ్యానికి ఎదురులేని ఫ్లాగ్‌షిప్‌ టాబ్లాయిడ్‌ పేపర్‌. 2011లో బ్రిటన్‌ ప్రజల ఫోన్‌లను హ్యాకింగ్‌ చేసినందుకు అది మూతపడింది. హ్యాకింగ్‌ కేసులో ముర్డోక్‌– బ్రిటిష్‌ పార్లమెంటరీ కమిటీ విచారణకు నిలబడ్డారు. అత్యంత వినయంతో ‘నా జీవితంలో ఇది అత్యంత విచారకరమైన రోజని‘ చెప్పి బయటపడ్డారు. ఆ తర్వాత సొంత గడ–ఆస్ట్రేలియాలో కూడా ఆయన, ఆయన కుమారుడు లాచ్‌లాన్‌ ముర్డోక్‌ పరువునష్టం దావాను ఎదుర్కొన్నారు. అనేక విమర్శల్నీ చవిచూశారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాజీ కెవిన్‌ రూడ్‌ లెక్కప్రకారం ముర్డోక్‌ ప్రజాస్వామ్యానికి ముప్పు. మరో మాజీ ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ ప్రకారం రాజకీయాల్లో ప్రత్యక్ష జోక్యం ముర్డోక్‌కు అలవాటు. ఇదిలా ఉంటే, అమెరికా కేసు ముందు తేలితే ముర్డోక్‌ కుమారుడు లాచ్‌లాన్‌ ఆస్ట్రేలియాలో ఎదుర్కొంటున్న మరో పరువు నష్టం దావాను ప్రభావితం చేయవచ్చునన్న ఆందోళనలో ముర్డోక్‌ వర్గం ఉంది. మరోపక్క ట్రంప్‌ అనుచరగణం ముర్డోక్‌ వాంగ్మూల పర్యావసానం ఎలా ఉంటుందనే దానిపై రిపబ్లికన్‌ పార్టీ మేధావులు, ఎన్నికల ప్రచార మేనేజర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.

(*అమరయ్య ఆకుల
జర్నలిస్టు, మొబైల్  9347921291)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *