ఎవరి ప్రయోజనాల కోసం?
-అరుణ్
రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను,ఆకాంక్షలను గుర్తించిన కొందరు ప్రజాస్వామిక వాదులు సీమలో డిమాండ్ల ఉద్యమం జగన్ వచ్చాక చల్లబడిందని, ఉద్యమకారుల మధ్య ఐక్యత లోపించిందని వాపోతున్నారు. అదేసమయంలో అటు ఉద్యమకారుల అనైక్యత, ఇటు రాజకీయనాయకుల నిర్లక్ష్య వైఖరితో సీమ ఎడారిగా మారుతుందనే నిరాశను వ్యక్తం జేస్తున్నారు. అయితే, వారి కేంద్రీకరణoతా అంతో, ఇంతో తమ శక్తిమేరకు ఉద్యమాలు నిర్వహిస్తూ, రాయలసీమను రాజకీయపార్టీల అజెండాలోకి (గతం ఏ పార్టీ ఊసెత్తని శ్రీబాగ్ ఒప్పందం) తెచ్చిన ఉద్యమకారులపైనే ఉన్నట్టు తోస్తుంది. అంతేగాకా, రాజకీయపార్టీలు, ముఖ్యంగా ఇప్పటి ప్రతిపక్షపార్టీలు, ఇంకా స్పష్టంగా జెప్పాలంటే తెలుగుదేశంపార్టీ రాయలసీమ సమస్యలపై పోరాటం చేయకపోవడానికి జగన్ కారణమనడం, ప్రతిపక్షాలు ప్రశ్నిoచె కొద్దీ ముఖ్యమంత్రి మరీ కొండెక్కుతారు అనే అభిప్రాయం వ్యక్తం జేయడం హాస్యాస్పదంగా వుంది. కొండెక్కిన అధికార పార్టని దిoచెందుకే గదా ప్రతిపక్షాలు ఉద్యమాలను నిర్వహించేది.
చంద్రబాబు నాయుని ప్రభుత్వ కాలంలో రాయలసీమలో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయని, అందులో వైసిపి సానుభూతిపరులు ఎక్కువుగా పాల్గోన్నారనే వాస్తవాన్ని రాస్తూ, వారిప్పుడు ఆందోళనలలో పాల్గొనడం లేదని, కొంతమంది ఇప్పుడు పదవులు పురస్కారాలూ పొందారంటారు. అదే సమయం లో రాయలసీమకు జగన్ కన్నా చంద్రబాబు ఎక్కువ నిధులు కేటాయించారని పాటకులకు గుర్తుజేస్తారు. నిజమే, పై రెండు అభిప్రాయాలు కాదనలేనివే. అయితే అన్ని ఉద్యమాలలో ప్రజల ప్రయోజనాలను తమకనుకూలంగా మార్చుకొనే మేధావులు ఉండనే ఉంటారు. వారిని ముందుగా గుర్తుపట్టలేము, గుర్తించినా వారిని వుద్యమాలనుండి నిషేధించాలేముగా!. స్వాతంత్రోద్యమకాలం నుండి అన్ని ఉద్యమాలలో అవకాశవాదులు ఉండనే వున్నారు. అంతెందుకు మొన్నటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ విజయం తర్వాత ప్రజలకన్నా, గతంలో విప్లవాదులనిపించుకున్న మేధావులు, రచయితలూ ఎక్కువ లబ్దిపొందారు. పొతే వారు లక్ష్య సాధన (ప్రత్యేక తెలంగాణా) తర్వాత లబ్ది పొందుతే, మన వాళ్ళు సీమ ప్రయోజనాలను తుంగలో తొక్కి పదవులూ, పురష్కారాలు పొందారు.
సీమ ఉద్యమంవల్ల చంద్రబాబు సీమ ప్రాంతంలో దెబ్బతిన్నాడనే వాస్తవాన్ని సీమ ఉద్యమకారుల్లో ఐక్యత కోరురుతున్న మేధావులు సరిగానే గుర్తించారు. మరి, చంద్రబాబు, ఆయన అనుమాయులు సీమ డిమాండ్లపై యిప్పుడు ఎందుకు ఆందోళనజేయడం లేదు? అనేది వేయి డాలర్ల ప్రశ్న. అమరావతి రాజధానిని సీమ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిసీ, తెలుదేశం పార్టీ, సీమలో కూడా అమరావతినే ఎందుకు జపం జేస్తున్నది? కనీసం హైకోర్ట్ సీమలో ఏర్పాటు జేయాలనే డిమాండ్ ఎందుకు తేవడం లేదు? గత ఎన్నికల ముందు తానే మంజూరుజేసిన గుండ్రేవుల రిజర్వాయర్ మాట ఎందుకు ఎత్తడం లేదు? ఇక విభజన చట్టంలోని హామీల గురించి ఏ ప్రతిపక్షపార్టీ నోరిప్పక పోవడం ఎందుకో?. ఒకరు అమరావతీ, పోలవరం జపం, మరొకరు విశాఖ జపం జేస్తున్నారు తప్ప రాయలసీమ సమస్యలపై ఏ రాజకీయ పార్టీ నోరెత్తడం లేదు కదా! వారి ఈ వివక్షతను బహిరంగ పరచి, ఎండగట్టె భాద్యత ఉద్యంకారులకే గాక, ఈ ప్రజాపక్షం వహించే రచయితలకు, పాత్రికేయుల లేదా?
మనం ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా చంద్రబాబు పట్ల సీమ ప్రాంతంలో పేరుకపోయిన వ్యతిరేకత వుంది. ముఖ్యంగా, మధ్యతరగతి బుద్ధిజీవులకు. జీవో 69 తో మొదలైన ఈ వ్యతిరేకత, రాష్ట్ర విభజన తర్వాత, సీమప్రాంత మహిళలకు చెందాల్సిన పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లను నిభందనలకు వ్యతిరేకంగా కోస్తా ప్రాంత విధ్యార్తినులకు కట్టబెట్టడమే గాక, ఆ నిర్ణయాన్ని హైకోర్ట్ కొట్టివేస్తే అంతటితో ఆగక సుప్రీం కోర్ట్ కు వెళ్ళడం ఆయనకు సీమ పట్లగల వివక్షత, కోస్తా ప్రాంతం పట్ల గల అపారమైన అభిమానం వుందని ఇక్కడి ప్రజలకు అర్థం కాదనుకున్నారా? ఇక AIMS తరలిoపు లాంటివి తెలుగుదేశం పార్టీ పట్ల మరింత వ్యతిరేకతను పెంచాయి. ఆగమేఘాల మీద పట్టిసీమను కట్టినా, తానూ హామీ ఇచ్చిన ఆమిగులు జలాల సీమకు కేటాయించలేదు. హంద్రీ నీవా (ఫీడర్ కేనాల్స్ త్రవ్వవద్దని ఆదేశాలు), గాలేరు-నగరి నగరి మాటేమిటి – ఓడిపోయాకయినా, సీమను పట్టించుకున్నాడా అంటే అదీలేదు. అన్నీ అమరావతీ లోనే. దీంతో సీమప్రజలకు చంద్రబాబు పట్ల విశ్వాసం పోయింది. మరోవైపు, గుర్తింపుకోసం తహతహ లాడుతున్న సీమ ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి బుద్ధిజీవులకు శ్రీబాగ్ అంటూ, మూడు రాజదానులని, హైకోర్ట్ అని ఆశలు పెంచాడు జగన్. జగన్ వేసిన ఈ ఉచ్చు కొంతమంది ఉద్యమకారులకు అర్థమయినా, చంద్రబాబు కన్నా జగనే మేలని భావించేవారున్నారు. ఇది చేదు వాస్తం. ఏమైనా జగన్ ఎత్తుగడలముందు అపరచాణుక్యుడని పిలువబడే చంద్రన్న ఓటమిని ముఖ్యంగా రాయలసీమలో, చవిచూడక తప్పదనిపిస్తుంది. ఈ లోగా జగన్ కుటిల ఎత్తుగడలు ప్రజలు గ్రహిస్తే పరిస్తితి మారొచ్చు. కానీ గుర్తింపు ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయంటే, హైకోర్ట్ ఏర్పాటు రాష్ట్రప్రభుత్వ అధికార పరిధిలో లేదని తెలిసిన లాయర్లూ కర్నూల్లో హైకోర్ట్ ఏర్పాటు జేస్తామనగానే జగన్ ఫొటోకు పాలాభిషేకం జేశారు. సీమప్రజల అమాయకత్వానికి, అల్పసంతృప్తులనడానికి ఇంతకన్నా నిదర్శనం గావాలా? అయితే, ఏ పార్టీ వచ్చినా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతే తప్ప తమ ప్రాంతానికి విముక్తి ఉండదనే భావన ప్రజలలో క్రమంగా బలపడుతున్నదనే వాస్తావాన్ని పాలకులు గమనించడం లేదు.
అన్ని రాజకీయపార్టీలు ప్రజలకు జేసే వాగ్దానాలు ఓట్లకోసమేనని, అవి అమలుకావని ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యిది. అందుకే భవిష్యత్తును స్వర్గాధామం జేస్తామనే వాగ్దానాలకన్న, తక్షణం తమకేమి ముట్టుతుoదనేదే వారి ఆలోచన. విద్యావంతులనుకునేవాళ్ళు ప్రజలనందుకు నిందిస్తారే గాని, సమాజంలోని ప్రతి సెక్షన్ కు తమవైన కోరికలుంటాయి. అవీ వారి డిమాండ్లు. హైకోర్ట్ డిమాండ్ ప్రజల డిమాండ్ గా గాక కేవలం లాయర్ల డిమాండ్ గా ఎందుకు కనపడుతున్నది? జగన్ కు ఈ రహస్యం తెలుసు గనుక సాధారణ ప్రజలకు ఎన్నో పథకాల (అవి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావని అందరికీ తెలుసు) ద్వారా తక్షణ లబ్ది చేకూరుస్తున్నాడు. అదేవిధంగా వలంటీర్ల వ్యవస్థ. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. మండుటెండలో దాహంవేస్తున్నవాడు ఫిల్టర్ నీళ్ళకై ఆగడు. నీడకై ఏ చెట్టునో ఆశ్రయిస్తాడు తప్ప, ఎయిర్ కండిషన్ గదికై చూడడు. ఇదీ అంతే.
రాయలసీమది, ముఖ్యంగా నోరున్న బుద్ధిజీవులది గుర్తింపు సమస్య. అది గ్రహించక రాయలసీమను రాష్ట్రంలో ఒక ప్రాంతంగా గుర్తించ నిరాకరించిన చంద్రబాబు & కో సీమలో ఓట్లు సీట్లు రాబట్టుకోవడం కష్టం. ప్రతిపక్షంలో వున్న నేడైనా సీమ నీటి పథకాలపై నోరెత్తక, అమరావతీ అని కలువరిస్తే ఎలా? బాబ్లీ ప్రాజెక్టు ఎత్తుపెంచడం పై, నానా యాగీ చేసిన చంద్రన్న అప్పర్ భద్రపై మౌనంవహించడం దేనికి సంకేతం.
సీమలో జగన్ వచ్చాక ఉద్యమాలు లేవనడం అసత్యం. వాటికి మన ప్రసార సాధనాలు తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదనేది వాస్తవం. మొదట కోవిడ్ కారణంగా ఉద్యమాలు నిర్వహించే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత ప్రతి సమస్యపై ఉద్యమాలు జరిగాయి. హైకోర్ట్ కై 2019 అక్టోబర్ 22న జాతీయ రహదారి బంద్, నవంబర్ 16 న శ్రీబాగ్ ఒప్పంద అమలుకై అనoతపురంలో నాలుగు జిల్లాలను వచ్చిన ఉద్యమకారులతో ప్రదర్శన, బహిరంగ సభ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ కర్నూల్ లో ఏర్పాటు జేయాలంటూ సీమ జిల్లాలలో నిరశన ప్రదర్శనలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆందోళనలు. వివరాలకై “రాయలసీమ ప్రజా ఉద్యమాలు-ఒక విశ్లేషణ” అనే పుస్తకం చదవొచ్చు.
అయితే ఉద్యమాల్లో గతంలో ఉన్నంత ఉధృతి లేకపోవడానికి జగన్ అనునాయులు ఆoదోలనలనుండి తప్పుకోవడం, కొందరు మేధావులు జగన్ పంచన జేరడం కొంతమేరకు కారణాలే.. అది సరేగానీ, చంద్రన్న, ఇతర రాజకీయపార్టీల అనునాయుల మాటేమిటి? గతంలో, జగన్ అనునాయులు ఆoదోలనలలో పాల్గోని జగన్ కు లబ్దిచేకూర్చారని చెబుతున్నారు కదా. మరిప్పుడు తెలుగుదేశం, ఇతరపార్టీలు, మరీ ముఖ్యంగా “రాయలసీమ డిక్లరేషన్” అంటూ మాజీ ఉద్యమకారున్ని తమపార్టీ రాయలసీమ ప్రతినిధిగా ప్రకటించిన బిజెపి సీమ సమస్యలపై ఎందుకు ఆందోళనలు జేయడం లేదు? ఇక ఉద్యమ పార్టీలుగా చేప్పుకుంటున్న పార్టీలూ సీమ విషయంలో ప్రకటనలకే పరిమితమవ్వడమేమిటి? తుంగభద్రా ఎగువ సమాంతర కాలువ, గుండ్రేవుల, సిద్దేశ్వరం అలుగు, హైకోర్టు , కడప ఉక్కుపరిశ్రమ, కేఆర్ఎంబి లాంటివి వారికి సమస్యలుగా కనిపించడం లేదా? అమరావతీ తప్ప వేరే ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోనివారి గురించి సీమ ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి? బహుశా వీరు అంతర్గతంగా రాయలసీమ జగన్ జాగీరు అనుకుంటున్నారేమో? ఏo జేసినా తమకు ఓట్లు పడవనే నిస్పృహతో రాయలసీమ ప్రాంతాన్ని గాలికి వదిలేసారనుకుంటా. ఇక జగన్ కు తనకు బలమైన సామాజికవర్గ అండదండలున్నాయనీ, సీమకు ఏం జేయకపోయినా తన ఓటు బ్యాంక్ పదిలమనే విశ్వాసమున్నట్టుంది. ఈ రెండు అభిప్రాయాలను తుత్తునియలు చేయాలంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమమే ఏకైక మార్గంగా కనపడుతున్నది.
ఇక ఉద్యమకారుల మధ్య ఐక్యత గురించి మాట్లాడుదాo. ముందుగా చెప్పాల్సింది, గత దశాబ్దం పైగా సీమ ప్రజల డిమాండ్లకై, ముఖ్యంగా నీటి పథకాలకై పోరాడుతున్న అనేక సంఘాలు,” రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక” ఏర్పాటుజేసుకొని, ఆ గొడుగు కిందనే అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ వుండటం నేడు ఐక్యతారాగం ఎత్తుకున్న పెద్దలకు తెలియంది కాదు. మరి ఉద్యమకారుల ఐక్యత అన్నప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నారో వారికే తెలియాలి.
ఇక ఉద్యమ సంఘాల ఐక్యత అనేది, ఏ ప్రాతిపదిక పైన జరగాలి? ఎవరితో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి? ప్రజలను సజీవమైన మనుషులుగా చూడక, కేవలం ఎన్నికలలో తమను గద్దెనెక్కించే మెట్లుగా భావించే మహోద్యమకారులతో ఐక్య సంఘటన కట్టాలా? నిజమే, ఉద్యమ విజయానికి ఉద్యమకారుల మధ్య ఐక్యత అవసరమే. అది, నాయకులు క్విడ్ ప్రో క్యూ కింద రాజకీయపార్టీలు ఎన్నికలకై జతగట్టె ఐక్య సంఘటన కాకూడదు. ఉద్యమ నాయకుల మధ్య ఐక్యత ఉద్యమాలలో పాల్గోoటున్న ప్రజల చైతన్యపు ఒత్తిడివల్ల వస్తుంది. ప్రస్తుతం రాయలసీమలో ఆ పరిస్థితి లేదు. సీమ ప్రజలపై భూస్వామ్య సంస్కృతీ పట్టు బలంగా వుంది. వ్యక్తీ పూజ వుంది. ఇక కులాలవారి విభజన చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమనాయకుని వల్లే సమస్యలు పరిష్కారమవుతాయని అనుకొనే దుస్థితి. అలాంటి నాయకుల అండదండలు లేకుండా సమస్యలు అంత సులభంగా ఇప్పుడున్న పరిస్థితులలో పరిష్కారంగావని వేరే చెప్పాలా? రాయలసీమ ప్రజల డిమాండ్లపై ఎవరు ఆందోళనలు చేపట్టినా ఆహ్వానించాల్సిందే. అయితే ఆ ఉద్యమ నాయకత్వపు చిత్తశుద్ది, గత చరిత్రను జాగ్రత్తగా బేరీజు వేసి, దానికి మద్దతు నివ్వాల్సి వుంటుంది.
ప్రజలు ఈ అవకాశవాద నాయకత్వ కబంద హస్తాలనుండే విముక్తి అయినపుడే నిజమైన ఉద్యమాలు బలపడుతాయి. విజయవంతమయితాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. చైతన్యవంతులైన ప్రజలు, ఉద్యమ నాయకులకు ఐక్యత అవసరాన్ని తెలియజేస్తారు. అలాగాకుండా, భిన్న బావాలు, భిన్న ప్రయోజనాలనాశించే నాయకుల మధ్య అవకాశవాద ఐక్యత ప్రజల ఆకాంక్షలను బలితీసుకుంటుంది. నిజాయితీ, చిత్తశుద్ధి గల ఉద్యమకారులు ప్రజలకు నిర్భయంగా వాస్తవస్థితి తెల్పుతూ వారి చైతన్యవంతమైన పాత్ర అవసరo పై వారిని ఎడ్యుకేట్ చేయాలి. ఇదెంత కాలo పట్టినా తప్పనిసరి షరతు.
( *అరుణ్,రాయలసీమ విద్యావంతుల వేదిక,కర్నూలు )