*అప్పర్ భద్రను వ్యతిరేకించటమే మన పోరాటమా!*
*రాయలసీమ కు ఏమి కావాలో పాలకులను నిలదీయలేమా!
*కృష్ణానదిపై తీగల వంతనే సరే… సిద్దేశ్వరం అలుగు మాటేమిటి?
*గుండ్రేవుల పై గురి పెట్టరెందుకు!
*చట్టబద్ధ నీటి హక్కులు ఉన్న ప్రాజెక్టుల పూర్తి కొరకై పోరాడరెందుకు?
రాయలసీమ పై పార్టీల అవకాశవాద వైఖరిని ఎండ కడదాం..
గత కొద్ది రోజులుగా టీవీల్లో వార్తాపత్రికల్లో రాజకీయ నాయకుల ఆవేశ భరిత ఉపన్యాసాల్లో రాయలసీమ ఎడారి కాబోతుంది అని వార్తలు వింటున్నాం. ఇందుకు కర్ణాటకలోని తుంగభద్రా నదిపై అప్పర్ భద్ర ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని కారణంగా చెబుతున్నారు. రాయలసీమకు రావాల్సిన తుంగభద్ర జలాలు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించి అడ్డుకొనకపోతే సీమ ఎడారి అయిపోతుందని కొందరు నేతలు అపార సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం…
*అప్పర్ భద్ర ప్రాజెక్టు వల్ల సీమ ఎడారి అవుతుందనే ఆరోపణల్లో వాస్తవం ఎంత?
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తుంగభద్ర జలాలు కృష్ణా నదిలో కి చేరాల్సింది 21.5 టీఎంసీలు మాత్రమే. కానీ కర్నూలు జిల్లా మల్యాల దగ్గర కృష్ణా నదిలో కలిసే తుంగభద్ర జలాలు గత 32 సంవత్సరాలుగా సగటున సంవత్సరానికి 150 టీఎంసీలకు పైగానే ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. 2017 -18 నుండి లెక్క తీస్తే వివరాలు ఇలా ఉన్నాయి. 2017 -18 లలో 60 టీఎంసీలు, 2018-19 లో 176, 2019-20 లో 288.86, 2020-21లో 228.4, 2021-22 లో 260.86, 2022- 23 లో 599 టీఎంసీల తుంగభద్ర జలాలు కృష్ణా నదిలో కలిశాయి. ఈ గణాంకాలను బట్టి సగటున వందలాది టీఎంసీలు తుంగభద్ర జలాలు కృష్ణానదిలో కలుస్తున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి పేరా ఈ నీటిని తోడైయడంతో నాగార్జున సాగర్ గుండా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ లెక్కలు అన్ని రాష్ట్రాలకు తెలుసు. కాబట్టి శ్రీశైలం ఎగువన ఉన్న రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలు వాటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ మన పాలకులు రాయలసీమ మీద వివక్షతతో ఈ జలాలను ఒడిసిపట్టే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టరు. ఎగువున ఉన్న తెలంగాణ, కర్ణాటకలో ప్రాజెక్టులు కట్టుకుంటుంటే గోల చేస్తారు. వాస్తవాలను వక్రీకరించి రాయలసీమ ప్రజల్లో అపోహలు సృష్టించి, తమ తప్పిదాలను అన్యాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు.
ఎగువ రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి వల్ల ప్రయోజనం ఏమిటి?
అప్పర్ భద్ర ఎత్తిపోతల మొదలైతే తుంగభద్ర జలాశయానికి ప్రవాహం తగ్గిపోయి సీమ కున్న కేటాయింపులు తగ్గిపోతాయి అన్న వాదన పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సరైనదేనా ఆలోచించండి. ఎగువ రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితో మనకు వనగూరే ప్రయోజనం ఏమిటి? మనకున్న చట్టబద్ధ నీటి హక్కులను సైతం వినియోగించుకోలేని అసమర్థ పాలకులు మన వాళ్ళు … ఎగువ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు అందిస్తే … అది చట్టబద్ధంగా కేంద్రం అనుమతులు సాధించి.. బడ్జెట్ కేటాయింపులతో కట్టుకుంటుంటే మన ప్రభుత్వానికి ఏడుపు ఎందుకు? ఆ ఎరుక మనకు లేనందుకు సిగ్గుపడవలసిందిపోయి…
అప్పర్ భద్ర కు అనుమతులు ఎట్లా వచ్చాయి?
కర్ణాటకలోని చిక్కుమంగుళూర్, చిత్రదుర్గ, తుంకూరు, దేవనగిరి జిల్లాలు మన అనంతపురం ఆదోని పత్తి కొండ లాంటి కరువు ప్రాంతాలు. అక్కడ దాదాపు 2,25,515 హెక్టార్ల భూమికి మైక్రో ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించటానికి అప్పర్ భద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు రూపొందించారు. ఇందుకు వారు నీటి కేటాయింపుల కోసం విజయనగర కాలువల ఆధునీకరణ ద్వారా 11.5 టిఎంసిలు, ఏపి లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 2.5 టీఎంసీలు, కే -8, కే -9, బేసిన్ ల నుండి మరో 6 టీఎంసీలు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (65 శాతం డిపెండెబిలిటీ ఆధారంగా) కర్ణాటకకు కేటాయించిన 10 టీఎంసీలను కలుపుకొని మొత్తం 30 టీఎంసీలకు 2008లో ప్రాజెక్ట్ రిపోర్టును కేంద్రంకు సమర్పించారు. 2010లో అనుమతులు పొందారు. దశాబ్దం క్రిందటే అనుమతులు పొందినప్పుడు రాష్ట్రంలోని పాలకులు, రాజకీయ పార్టీలు గొంతు విప్పలేదు. పదేళ్ల తర్వాత 2021 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం, డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్పర్ భద్ర పై అభ్యంతరాలు తెలిపాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర బడ్జెట్ లో 5300 కోట్ల నిధులు ప్రకటించగానే ఇంక సీమ ఎడారవుతుందని పాలకులు, రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా సీమ ప్రయోజనాలు పట్టని పాలక పార్టీల నేతలు నేడు చేస్తున్న విన్యాసాలు చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడేలా ఉంటున్నది .
కర్ణాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు అనుమతి కోసం రూపొందించిన డిపిఆర్ లో 10 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ కర్ణాటక కు కేటాయించినట్లు అందులో తెలిపింది. వాస్తవానికి బ్రిజేష్ కుమార్ అవార్డు నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఇది ఉండగా ఎట్లా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక బచవత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు లోబడి అంతర్గత నీటి సర్దుబాట్లు చేసుకుందని కేంద్ర జన వనరుల శాఖ ఏపీకి 2022లో రిపోర్టు పంపింది. ఆ తర్వాతే ఫిబ్రవరి 15, 2022న అప్పర్ భద్రత భద్రకు జాతీయ హోదా ఇచ్చింది.
కర్ణాటకతో సంప్రదింపులు సీమకు ప్రయోజనకరం
అప్పర్ భద్ర పై వ్యతిరేకతను వ్యక్తం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లడం కంటే రాయలసీమలో అనంతపురం జిల్లాకు సాగునీరు అందించే తుంగభద్ర ఎగువ సమాంతర కాలువకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదించేటట్లు జగన్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఉంటే హెచ్.ఎల్.సికి 32.5 టీఎంసీల నికర జలాలు తీసుకొచ్చి కరువు సీమ రైతు కడగండ్లు తీర్చే వాళ్ళు. కానీ ఆ చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని మరోసారి రుజువయింది.
ఏపి లో పాలకుల తప్పిదాలు
కేసీ కెనాల్ స్థిరీకరణకు 2013లోనే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం అంచనాల తయారీకి జీవో జారీ చేశారు. ఒక ప్రైవేటు సంస్థ టెండర్ దక్కించుకొని 2,890 కోట్లకు అంచనా కూడా తయారు చేసింది. ఆ ప్రభుత్వం పోయి తిరిగి 2019లో చంద్రబాబు వచ్చాక గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. టెండర్ ప్రక్రియ కూడా జరిగింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. గుండ్రేవుల గురించి ఇంత వ్యవహారం జరిగితే ఏపీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ నికరజలాల కేటాయింపు గల గుండ్రేవుల పథకం కొత్తదని కృష్ణ బోర్డుకు లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని బట్టి వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతున్నది. చంద్రబాబు కూడా తాను టెండర్లు పిలిచిన గుండ్రేవుల ప్రాజెక్టు కోసం ప్రతిపక్షనేతగా ఎందుకు ఈ నాలుగేళ్లలో ఉద్యమం చేయలేదు. ఆఖరికి విభన చట్టంలో గాలేరు -నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు గాని, జగన్ గాని ఆ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంలోని బీజేపీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు. వాటికి నిధులు అనుమతులు ఎందుకు సాధించలేదు. కృష్ణా రివర్ బోర్డు ఈ ప్రాజెక్టులకు అనుమతులేనివిగా నోటిఫై చేస్తే కూడా పట్టించుకోని అద్వాన్నపు ప్రభుత్వం ఇది. తిరిగి రాయలసీమ ఉద్యమకారులు ఆందోళన చేస్తే అప్పుడు కృష్ణ బోర్డు కు ఈ ప్రాజెక్టులు విభజన చట్టంలో అనుమతించిన ప్రాజెక్టులుగా నివేదించారు. తిరిగి సవరణ నోటిఫికేషన్ కు బోర్డుకు ప్రతిపాదించారు. దీన్ని బట్టి పాలకులు రాయలసీమ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో స్పష్టమవుతున్నది. రాష్ట్రంలోని వైసీపీ, టిడిపి రెండు పార్టీలు కేంద్రంలోని బిజెపితో జి హుజూర్ గా ఉంటున్నాయి. పోటీలు పడి రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభలలో బీజేపీ పెట్టే ప్రజా వ్యతిరేక బిల్లులకు కూడా మద్దతు ఇచ్చాయి. కానీ ఏపి, రాయలసీమల కు కేంద్రం చేసే అన్యాయాల్ని ప్రశ్నించలేని అసమర్థులు వీరు…
బీజేపీ చిత్తశుద్ధి ఏపాటిది!
బీజేపీ రాయలసీమకు తామే న్యాయం చేసే పార్టీ అని కర్నూల్ డిక్లరేషన్ ప్రకటించింది. సిద్దేశ్వరం అలుగు డిమాండ్ ను సమర్థించింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే లో భాగంగా కృష్ణా నదిపై అదే సిద్దేశ్వరం దగ్గర తీగల వంతెనకు నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టబోతుంటే … తీగల వంతెనతో పాటు సిద్దేశ్వరం అలుగు నిర్మించమని రాష్ట్ర ప్రభుత్వంపై, కేంద్రంపై ఒత్తిడి పెంచే ఉద్యమం తీసుకోదు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ విశాఖపట్నం లో పెడుతుంటే రాయలసీమ లో పెట్టమని మాట్లాడదు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రం రాయలసీమకు బుందేల్ఖండ్ ప్యాకేజీని ఎందుకు ఇవ్వదని ఏపీ బీజేపీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలవద్ద గొంతు విప్పదు. కడప పై ఉద్యమించదు.. పైగా సిగ్గు లేకుండా విశాఖ ఉక్కును కేంద్రంలో ని తమ ప్రభుత్వం అమ్ముతానంటే మాగతేంటని ప్రశ్నించరు. ఇలాంటి బీజేపీ నేనే రాయలసీమ కు న్యాయం చేయగల పార్టీ అని డబ్బాకొడుతువుంటుంది.
సీమ సాధించుకోవాల్సినవి ..
రాయలసీమపై ఎప్పటికప్పుడు పాలక పార్టీలు అవలంభిస్తున్న అవకాశవాద వైఖరిని సీమ ప్రజలు ఉద్యమం ద్వారానే ఎండ కట్టాలి. ఓట్లడగను వచ్చే నేతల చొక్కాలు పట్టుకొని నిలదీయాలి. చట్టబద్ద హక్కులున్న రాయలసీమ ప్రాజెక్టుల పూర్తి కొరకు మొదట పోరాడాలి.. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం… గుండ్రేవుల ప్రాజెక్టు లతో పాటు వేదవతి, ఆర్డీఎస్ లకై నినదించాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణం… అలగనూరు , అన్నమయ్య ప్రాజెక్టును లను పునరుద్ధరించాలి… రాయలసీమ కు విభజన చట్టం లోని భుందేల్ ఖండ్ ప్యాకేజీ తో పాటు.. సెయిల్ ఆధ్వర్యంలో కడప లో ఉక్కు ఫ్యాక్టరీ.. గుంతకల్లు లో రైల్వే జోన్ .. కర్నూలులో హైకోర్టు సాధించే వరకు సీమ ఉద్యమంలో అలుపెరగక ముందుకు సాగాలి. స్వచ్చందంగా భాగస్వాములు కావాలి..
-రాయలసీమ విద్యావంతుల వేదిక, రాష్ట్ర కమిటీ