ఎగువభద్రపై ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటంతో బాటు రాజకీయ పోరాటం చేయాలి: రాయలసీమ మేధావుల ఫోరం.
బచావత్ నీటి కేటాయింపులు లేకుండా , సుప్రీంకోర్టు స్టే ఉన్నా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వివరాలు:
కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఎగువ భద్ర ఎత్తిపోతల పధకం వల్ల రాయలసీమ నీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికల ప్రయోజనాల కోసం జాతీయ హోదా ఇచ్చినందున ప్రతిగా ఏపీ ప్రభుత్వం రాజకీయ పోరాటానికి సిద్ధపడాలి. రాష్ట్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 9 – 2 – 23న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మంచిదే కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగానే పోరాటం చేయాలి. కర్ణాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి సాంకేతికంగా కొన్ని పరిమితులు ఉన్నాయన్న వాస్తవాన్ని కూడా ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.
ఎగువ భద్రను నిలుపుదల చేయడంతో బాటు గండ్రేవుల , సిద్దేశ్వరం అలుగు లను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం అన్న నినాదంతో ఏపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలి. ఎగువ భద్రకు అయ్యే ఖర్చు కన్నా రాయలసీమలోని గండ్రేవుల , సిద్దేశ్వరం అలుగుకు తక్కువ ఖర్చు అవుతుంది. కేంద్రం మన ప్రతిపాదనకు అంగీకారాన్ని తెలపకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి సిద్ధం కావాలి. రాయలసీమ ప్రజలను ఛైతన్య పరచడంతో బాటు రాజకీయ పార్టీలు , రాయలసీమ ఉద్యమ సంస్థలతో అఖిలపక్షం వెంటనే నిర్వహించాలి.
మేము సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసాము మా పని అంతే అంటే అది రాయలసీమకు ఏపీ ప్రభుత్వం నష్టం చేసినట్లే. ఎగువ భద్రపై సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం తదుపరి ఎగువ భద్రను నిలుపుదల చేయడం రాయలసీమ నీటి ప్రయోజనాలను కాపాడటం కోసం తన కార్యాచరణ ఏమిటో రాయలసీమ ప్రజలకు తెలపకపోవడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎగువభద్ర విషయంలో తదుపరి తన కార్యాచరణ ఏమిటి అన్నదానిపై సావధాన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండు చేస్తుంది.