తుంగభద్రను కాపాడుకోవడం కోసం సోషల్ మీడియా వేదికగా పోరాటం: విద్యార్థుల సదస్సులో పురుషోత్తమ రెడ్డి పిలుపు.
కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మింస్తున్న కారణంగా రాయలసీమకు నష్టం జరుతుందని, రాయలసీమకు కీలకమైన తుంగభద్రను కాపాడుకోవడం కోసం విద్యార్థులు సోషల్ మీడియా కేంద్రంగా పోరాటం చేయాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి పిలుపునిచ్చారు.
నేడు SV ఇంజనీరింగ్ కళాశాలలో ‘తుంగభద్రను కాపాడుకుందాము – సిద్దేశ్వరం అలుగుతో మనసీమను సస్యశ్యామలం చేసుకుందాము’ అన్న అంశంపై జరిగిన సదస్సులో పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఈ పిలుపునిచ్చారు.
ఆయన ప్రసంగం క్లుప్తంగా
రాయలసీమలో కృష్ణా , తుంగభద్ర , కుందూ నదుల ద్వారా అపార నీటి లభ్యత ఉన్నా వాటిని రాయలసీమ ప్రాంతానికి అందించేలా ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోవడం వల్ల సీమ కరువుతో అల్లాడుతుంది.క్రిష్ణా నదిలో లభించే నీటిని భాగస్వామ్య రాష్టాలకు పంపిణి చేయడం , వరద ప్రవాహం తగ్గిన పరిస్థితులలో పుష్కలంగా నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర రాయలసీమకు జీవం లాంటిది. అలాంటి తుంగభద్రను ఎగువ రాష్ట్రం అయిన కర్ణాటక ప్రభుత్వం బచావత్ నీటి కేటాయింపులు లేకపోయినా , సుప్రీంకోర్టులో స్టే ఉన్నా కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ఎగువన ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమకు అన్యాయం చేస్తూ కర్ణాటకలో అనుమతులు లేని ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు మంజూరు చేయడం అన్యాయం. అదే తుంగభద్ర పై నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించరు.
తుంగభద్ర నుంచి కృష్ణకు కేటాయించిన నీళ్లు 31 TMC లు మాత్రమే కానీ సగటున 150 – 200 TMC ల నీరు వస్తున్నది. ఈ ఏడాది 630 TMC ల నీటి ప్రవాహం నమోదు అయినది. అందుకే తుంగభద్ర రాయలసీమకు జీవం లాంటిది. కృష్ణ నీటికి పరిమితులు ఏర్పడిన నేపథ్యంలో తుంగభద్ర నీరే సీమ నీటి సమస్య పరిష్కారానికి అవకాశం. ఎగువ భద్ర పూర్తి అయితే ఆ అవకాశాన్ని రాయలసీమ కోల్పోతుంది. శాశ్వతంగా నీటి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎగువ భద్రతో సీమ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున దానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపు ఇచ్చారు.
సిద్దేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిలో భాగంగా తీగల వంతెన నిర్మాణ ప్రతిపాదన చేస్తుంది. శ్రీశైలం పూడిక మరియు నిబంధనలకు భిన్నంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ పరిస్థితులలో పోతిరెడ్డిపాడుకు నీరు అందడం క్లిష్టంగా మారుతుంది. రాయలసీమ ప్రాజెక్టులయిన గాలేరు నగరి , హంద్రీనీవా , తెలుగుగంగ , SRBC లకు నీరు సరఫరా చేసేందుకు విలుగా తీగల వంతెన స్థానంలో అలుగు నిర్మాణం చేయాలి.
సోషల్ మీడియా వేదికగా పోరాటం
తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా పోరాడటంతోబాటు తుంగభద్ర నీటిని రాయలసీమకు వినియోగించే విధంగా గుండ్రేవుల ప్రాజెక్టును , HLC – LLC లకు సమాంతర కాల్వ , జాతీయ రహదారిపై సిద్దేశ్వరం వద్ద నిర్మించే తీగల వంతెన స్థానంలో అలుగు నిర్మాణం చేయాలని కోరారు. నదీ జలాలు , వివాదాలు సాధారణ ప్రజలకు అర్థం కావు ఇలాంటి పరిస్థితుల్లో మేధావులు , విద్యార్థుల పాత్ర కీలకం. ఎగువ భద్రను వ్యతిరేకిస్తూనే తుంగభద్ర పై రాయలసీమలో నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పోరాడాలి. సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని సదస్సు తీర్మానించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తిసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సదస్సు డిమాండ్ చేసింది. శోషల్ మీడియా వేదిక ఈ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆచార్య జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు నీటి సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తు లో ఆహారభద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక , పాకిస్తాన్ లో జరుతున్న పరిణామాలు రాయలసీమలో కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఏర్పడుతుంది విద్యార్థులు , అధ్యాపకులు రాయలసీమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో ఆచార్య సుబ్రమన్యాచార్య ఆచార్య నరేన్ కుమార్ లు మరియు విద్యార్థుని విద్యార్థులు పాల్గొన్నారు.