రణరంగంగా ప్యాలెస్ ఆవరణ!

 

(వనపర్తి ఒడిలో-14)

– రాఘవ శర్మ

ప్యాలెస్ ముందు విద్యార్థులు.
ప్రధాన ద్వారానికి ఆవల పోలీసులు.
ఖాకీ నిక్కర్లేసుకుని, ఇనుప టోపీలు పెట్టుకున్న రిజర్వ్ పోలీసులు.
ప్యాలెస్ ఆవరణ నుంచి విద్యార్థులు ప్రధాన ద్వారం దాట గానే పోలీసులు లాఠీలతో విరుచుకు పడ్డారు.
విద్యార్థులు వెనక్కి వచ్చేశారు.
ప్యాలెస్ పోర్టికో పై నుంచి ప్రిన్సిపాల్ కె. రామి రెడ్డి చూస్తూనే ఉన్నారు.
విద్యార్థులు ప్రధాన ద్వారం దాటటం, పోలీసులు లాఠీలతో తరమడం.
జుగల్ బందీలా చాలా సార్లు ఇలా సాగింది.
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదాలు మిన్నం టాయి.
వనపర్తి ప్యాలెస్ ఆవరణ రణరంగంగా మారింది.
పోలీసులపై విద్యార్థులు రాళ్ళు విసిరారు.
రిజర్వు పోలీసులు ముఖానికి ఇనుప టోపీలు అడ్డం పెట్టుకుని లాఠీలతో ముందుకు వచ్చారు.
ప్రధాన ద్వారంవద్ద ప్రిన్సిపాల్ లక్ష్మణ రేఖ గీశారు.
పోలీసులు ఆ గీతను దాటి లోనికి రావడానికి వీలులేదు.
పోలీసులపైన రాళ్ళ వర్షం కురుస్తోంది.
భాష్పవాయుగోళాలు వదిలారు.
అవి ప్యాలెస్ ఆవరణలోకొచ్చి పడ్డాయి.
విపరీతమైన పొగ.
కొందరు విద్యార్థులు పడిపోతున్నారు.
పడిపోయిన వారిని హాస్టల్ కు ఎత్తుకెళుతున్నారు.
విద్యార్థులు ముఖానికి రుమాలు అడ్డం పెట్టుకుని వెనక్కి పరుగులు తీశారు.
కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చారు.
వాళ్ళ చేతిలో హాస్టల్ నుంచి తెచ్చుకున్న ఉల్లిపాయలున్నాయి.
భాష్పవాయుగోళాలకు భయపడడం లేదు.
అవి వచ్చిపడినప్పుడు కోసిన ఉల్లిపాయలు వాసన చూస్తున్నారు.
పోలీసులు గాలిలోకి వదిలిన భాష్పవాయుగోళాలు ప్యాలెస్ ముందొచ్చి పడుతున్నాయి.
ప్యాలెస్ ఆవరణలోని మా ఇంటి నుంచి చూస్తూనే ఉన్నాం.
అది 1966వ సంవత్సరం.
అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాను.
ఈ సంఘటన జరగడానికి ముందు స్కూల్ కు స్ట్రైక్ వాళ్ళొచ్చి పడ్డారు.
స్కూల్ బెల్ గణగణా మోగింది.
పుస్తకాలు తీసుకుని ఇంటికి పరుగు.
‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’
గోడల నిండా రాతలు.
ఎవరి నోట విన్నా అదే నినాదం.
ఏ సమూహంలో చూసినా అదే చర్చ.
నేను చూసిన తొలి ఉద్యమం.
నేను కళ్ళారా చూసిన తొలి లాఠీ చార్జి.
భాష్పవాయు గోళాల గురించి తొలిసారిగా వినడమూ అదే, చూడడమూ అదే.
‘జై తెలంగాణా’ కంటే మూడేళ్ళ ముందు మాట అది.
విద్యార్థుల్లో ఒక చైతన్యం.
వీధుల్లోకి రావడం, నినాదాలు చేయడం, బస్సులను నిలిపేయడం, తగలబెట్టం.
వారిలో ఒక ధర్మాగ్రహం.
ఉక్కు ఉద్యమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా చురుగ్గా పాల్గొన్నారు.
వాళ్ళు పాలిటెక్నిక్ కు పరిమితం కాలేదు.
జిల్లా అంతా తిరిగి ఉద్యమానికి ఊపిరి పోశారు.
ఆ తరువాత విశాఖ ఉక్కును సాధించుకున్నారు.
ఎన్ని లాఠీ దెబ్బలో!
ఎన్ని భాష్పవాయు గోళాలో! గాలిలో కలిసి పోయినవి ఎన్ని ప్రాణాలో!
ఎంత ఉక్కు ఉత్పత్తి!
ఎంత మందికి ఉపాధి!
ఎందరి ప్రాణ త్యాగంతో సాధించుకున్నదో!
ఒక వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు అర్ధ శతాబ్దం తరువాత ఏమైందిప్పుడు!?
ప్రాణ త్యాగాలను వెక్కిరి స్తూ, నడి వీధిలో తుక్కు
లా అమ్మకానికి సిద్ధమైంది.
ఆనాడు లెక్క చేయని లాఠీ గాయాలు, ఈ నాడు మళ్ళీ గుర్తుకొచ్చి బాధిస్తున్నాయి.
ఆ జ్ఞాపకాలు కలుక్కుమంటున్నాయి.
దీనికి కారణం ఎవరు!?
దీనికి బాధ్యులెవరు!?
ప్యాలెస్ చరిత్రలో వీరోచిత పోరాటాలు, విషాదాలే కాదు, వినోదాలూ ఉన్నాయి.

శరత్ కాలం వస్తోందంటే చాలు ఒకటే సంబరం.
నడుస్తూ, నడుస్తూ ఆకాశం కేసి చూసే వాళ్ళం.
మెల్లగా కదులుతున్న మేఘాలు.
ఆ మేఘాల ముందు నాట్యం చేస్తున్న రంగురంగుల పతంగులు.
అటు ఇటు ఊగుగూ, పక్క చూపులు చూస్తూ, ఎంత వయ్యారాలు ఒలకబోసేవో!
ఈ పతంగులు ఆకాశంలో ఎలా క్యాట్ వాక్ చేస్తున్నాయో!
వాటిని చూస్తూ ఉంటే కాలం మంచులా కరిగిపోయేది.
పక్షుల్లాగా స్వేచ్ఛగా ఎంత చక్కగా ఎగురుతాయో!
పతంగులకు ప్రాణం లేదు.

దుకాణాల లో రంగు రంగుల పతంగులు

అయినా అవి స్వేచ్ఛకు సంకేతాలు.
ఒకదాన్ని చూస్తే మరొకదానికి ఈర్ష్య.
ఒక దానిపై మరొకటి పోటీ.
దాని మాంజా తెంపాలని ఇది, దీని మాంజా తెంపాలని అది.
పతంగులను ఎగరే సే వీరులు తమ మాంజానే మరొక దానిపై పడాలని ఎంత ప్రయత్నం!
తమ దే పై చేయి కావాలని ఆరాటం.
ఒక పతంగి మాంజాపై మరొక మాంజా పడిందే అనుకో, యుద్ధం మొదలైనట్టే లెక్క.
ఇద్దరు వీరులూ వేగంగా మాంజాను ఒదులుతూనే ఉంటారు.
పక్కనున్న వాడి చేతిలో చెరఖా గిర్రున తిరుగుతునే ఉంటుంది.
మాంజా అయిపోయి చరఖా ఎప్పుడు ఆగిపోతుందో, ఆ పతంగి కూడా ఆగిపోతుంది.

స్వేచ్ఛకు ప్రతి రూపం ఈ గాలిపటాలు

పక్కనున్న సహాయ కుడు ఒకరు ‘ కీన్ చ్ భై కీన్ చ్’ అని అరుస్తూ ఉంటాడు.
కనీసం మాంజా అన్నా మిగులు తుంది.
దాని ఆయువు తీరిపోతుంది.
ఎవరి మాంజా గట్టిదో అది నిలబడుతుంది.
పోటీ పడలేక ఒకటి తెగిపోతుంది.
ఎండిన ఆకుల్లాగా అల్లల్లాడి తేలిపోతుంది.
తెగిపోయి గాలిలో తేలాడుతూ, ఎటెటో వెళ్ళిపోయి, ఏ చెట్టుకో తగులుకుంటుంది.
రాలిపోయిన ఎండుటాకుల్లాగా నిదానంగా పతంగి వాలిపోతుంది.
నేలకు వాలి పోతో కూడా ఎన్ని వయ్యా రాలు పోతుందో!
చెట్ల నిండా తెగిన రంగురంగుల పతంగులే!
చెట్లకు పూసిన పువ్వులు లా ఉంటాయి.
వెదురుబొంగుకు ముళ్లు కట్టి తెగిపోయిన పంతంగుల వెంట పరుగులు తీసే యువకులు. పట్టుకోవాలని ఆశ.
ఒక్కొక్క సారి దొరుకుతాయి, ఒక్కోసారి నిరాశపరుస్తాయి.
పతంగులకు కళ్ళుంటాయి.
కొన్నిటికి తోకలుంటాయి.
కొన్నిటికి కుచ్చులుంటాయి.
రంగు రంగుల పతంగులు దుకాణాల్లో వేలాడదీసి ఉంటాయి.మాం జాల చరఖాలు కూడా వేలాడదీస్తారు. అవి చాలా ఖరీదు.

పతంగులు ఎగరేయాలని కోరిక.
చేతిలో డబ్బులుండేవి కాదు.
రంగు రంగుల కాగితాలు కొనుక్కొచ్చి తయారుచేసి ఎగరేసే వాళ్ళం.
మేం తయారు చేసిన పతంగులు అంత గొప్పగా కాకపోయినా, మొత్తానికి ఎగిరేవి.
‘ఏమీ లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం’
అప్పటికదే సంతృప్తి.
బాల్యం లో డబ్బులు లేవు.
చేతికి డబ్బులొచ్చేసరికి బాల్యం వెళ్ళిపోయింది.
తెగిన పతంగిలా ఎటో ఎగిరిపోయింది.

పతంగుల పండుగ లాగానే హెూలీ.
మార్చిలో వచ్చే హెూలీ మహదానందాన్ని తెచ్చేది.
రంగులు చల్లుకునే వారు.
నల్లని కందెనలు పూసుకునే వారు.
వనపర్తి ప్యాలెస్ లో హెూలీ మహాజోరుగా సాగేది.
ఉదయం లేవగానే అంతా పాతబట్టలువేసుకునే వారు.
కాలేజీ విద్యార్థులు గుంపులుగుంపులుగా వచ్చేవారు. మూడు హాస్టళ్ళు మహా సందడిగా ఉండేవి.
రంగులు చల్లుకుంటూ ప్యాలెస్ ముందుకు వచ్చేవారు.
నవ్వులు, తుళ్ళింతలు, కేరింతలు.
ప్యాలెస్ ముందర ఉండే ఫౌంటెన్ నిండా నీళ్ళు నింపేవారు.
ఫౌంటెన్ నీళ్ళలో రంగు కలిపే వారు.
ఒక్కొక్క అధ్యాపకుడి ఇంటికి వెళ్ళి బైటికి పిలిచేవారు.
అంతే.. పెద్ద చిన్న తేడా లేదు.
రంగులు పూసి కేరింతలు కొట్టేవారు.
తమతో రమ్మని పిలిచేవారు.

ఈ ఫౌంటెన్ లోనే హోలీ రంగులు కలిపి ముంచేది.

వారిని తీసుకొచ్చి ఫౌంటెన్లోని రంగునీళ్ళలో ముంచే వారు.
బండి ఇరుసుకు రాసే కందెనను ముఖానికి పులిమే వారు. మధ్యాహ్నం పదకొండున్నర వరకు హెూలీ.
అది అయిపోగానే స్నానాలు.
రంగుల గుడ్డలు ఎందుకూ పనికిరావు.
సబ్బుతో రుద్దుకుంటే రంగులు పోయేవి.
కందెన పోయేది కాదు.
చాలా సేపు కిరసనాయిలు పెట్టి రుద్దితే గానీ పోయేది కాదు.
తరువాత కిరసనాయిలు వాసన.
కొబ్బరి నూనె పూసి సబ్బు తో మళ్ళీ స్నానం చేస్తే వాసన పోయేది.
స్నానాలు ముగించుకునే సరికి మధ్యాహ్న మయ్యేది.
ఆవురావురు మంటూ భోజనాలు.
మధ్యాహ్నం దాటిందంటే రంగుల జోలికి వెళ్ళే వారు కాదు.
పతంగులు, హెులీ ఉత్తర భారతీయ పండుగలు.
దక్షిణాదిన పెద్దగా కనిపించవు.
అటు ఉత్తరాదికి, ఇటు దక్షిణాదికి తెలంగాణా వారధిలా ఉండేది.
అన్ని పండుగలూ అక్కడ కనిపించేవి.
ప్రాచీన భారతీయ సమాజంలో వసంతోత్సవం చేసేవారు.
దాని ఆధునిక రూపమే హోలీ.
వనపర్తి వదిలేశాక హెూలీ ఆడిందీ లేదు, పతంగులు ఎగరేసిందీ లేదు.
బాల్యంతోనే ఆ రెండు పండుగలు వెళ్ళిపోయాయి.
జ్ఞాపకాల్లో ఇలా మిగిలిపోయాయి.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *